ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రపంచ ఆరోగ్య వాగ్దానాన్ని పునరుద్ఘాటించిన భారత్
‘ఆయుష్మాన్ భారత్’ సంపూర్ణ ఆరోగ్యసంరక్షణ సేవల్ని విస్తరించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, ఆధునిక చికిత్సలకు ఆర్థిక సహాయాన్ని సమకూర్చి, ఆరోగ్య రంగంలో డిజిటల్ మాధ్యమ ఆధారిత సేవల అమలును వేగవంతం చేసింది... ‘అందరికీ ఆరోగ్య సేవల’కు బాటవేసిన పథకమిది: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
ట్రకోమ (కొయ్యకండల వ్యాధి) జాడే లేని దేశంగా ఇండియాను ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... క్షయ, కుష్ఠు, లింఫాటిక్ ఫైలేరియాసిస్, మశూచి, రూబెల్లా, కాలా-అజార్ వంటి వ్యాధుల నిర్మూలనకు కట్టుబడి ఉన్న భారత్
వైద్యపరంగా తీసుకోవాల్సిన ప్రతిచర్యలు అన్ని దేశాలకు సమానంగా అందేటట్టు, సమాచారంతోపాటు వ్యాధికారకాల గురించి వివరాలు సరైన సమయంలో, పారదర్శకంగా వెల్లడించేలా ప్యాండమిక్ అగ్రిమెంటు పూచీపడాలి... సాంకేతికతను పంచుకోవడంతోపాటు సామర్థ్యాల పెంపును ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రోత్సహించాలి
Posted On:
21 MAY 2025 2:31PM by PIB Hyderabad
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78వ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి భారత్ ఈ రోజు ప్రసంగించింది. ‘‘వన్ వరల్డ్ ఫర్ హెల్త్’’ ఇతివృత్తంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సమానత్వానికి తన నిబద్ధతను ఇండియా పునరుద్ఘాటించింది. భారత ప్రతినిధి వర్గం పక్షాన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులకు అభినందనలు తెలపడంతోపాటు అర్ధవంతమైన అంతర్జాతీయ స్థాయి సంభాషణ, సహకారాలకు ఒక వేదికను సమకూర్చడాన్ని స్వాగతించారు.
ప్రపంచంలో అందరి ఆరోగ్యాన్నీ సంరక్షించాలనే అంశానికి భారత్ కట్టుబడి ఉందని శ్రీమతి శ్రీవాస్తవ చెబుతూ... ఆయుష్మాన్ భారత్ వంటి ప్రధాన కార్యక్రమాలను అమలులోకి తీసుకు రావడం ద్వారా గణనీయ మార్పుల దిశలో అడుగులు వేసినట్లు స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ సంపూర్ణ ఆరోగ్యసంరక్షణ లభ్యత పరిధిని ఎంతో విస్తరించిందని ఆమె చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం సంపూర్ణ ఆరోగ్యసంరక్షణని విస్తరించింది. ఆధునిక వైద్యచికిత్సలకు ఆర్థిక సాయాన్ని అందించింది. ఆరోగ్య రంగంలో డిజిటల్ మాధ్యమ ఆధారిత సేవల వినియోగాన్ని వేగవంతం చేసింది. అందరికీ ఆరోగ్య సేవల లక్ష్య సాధనకు ఇది బాటను వేసింది’’ అని ఆమె వివరించారు.
ప్రసూతి కాల ఆరోగ్యసంరక్షణ, కుటుంబ నియంత్రణ, శిశు మరణాలు, మృతశిశు జననాల తగ్గింపు.. ఈ అంశాల్లో భారత్ నడుం బిగించి చేస్తున్న కృషిని ఐక్య రాజ్య సమితి పాప్యులేషన్ ఫండ్, యూఎన్ ఇంటర్-ఏజెన్సీ గ్రూపులు సహా ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తించాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘భారత్ ట్రకోమా జాడ లేని దేశం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల ధ్రువీకరించింది. మా దేశం క్షయ, కుష్ఠు, లింఫాటిక్ ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) , మశూచి, రూబెలా (జర్మన్ మీజిల్స్ లేదా పొంగు), కాలా-అజార్ (విషపాండు జ్వరం) వంటి వ్యాధుల నిర్మూలనకు కట్టుబడి ఉంది’’ అని ఆమె వెల్లడించారు.
భారత్ ఒక ప్రధాన విధాన నిర్ణయాన్ని తీసుకొని, దేశంలో 70 ఏళ్ల వయస్సు పైబడిన పౌరులందరికీ వారి ఆర్థిక స్థితి ఎలాంటిదయినప్పటికీ ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’లో భాగంగా వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆమె తెలిపారు. ‘‘భవిష్యత్తు కాలంలో ఆరోగ్యసంరక్షణ రంగ వృత్తినిపుణులు కాబోయేవారికి తగ్గ శిక్షణను ఇవ్వడానికి మేం గత పదేళ్లలో వైద్య కళాశాలల సంఖ్యను రెట్టింపు చేసి, 387 నుంచి 780కి చేర్చాం’’ అని ఆమె చెప్పారు.
దేశాల సార్వభౌమత్వాన్ని, సామర్థ్యాలను గౌరవిస్తూనే ప్రపంచ స్థాయిలో సహకారాన్ని పెంపొందించే చట్టబద్ధ, విధాన రూపకల్పనను భారత్ గట్టిగా సమర్ధిస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పునరుద్ఘాటించారు. ‘‘వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్ని దేశాలకూ సమానంగా అందేటట్టు, సమాచారంతో పాటు వ్యాధికారకాల గురించి వివరాల్ని సరైన సమయంలో, పారదర్శకంగా వెల్లడించేలా ప్యాండమిక్ అగ్రిమెంటు పూచీపడాలి... సాంకేతికతను పంచుకోవడంతో పాటు సామర్థ్యాల పెంపును ముఖ్యంగా గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో) ప్రోత్సహించాలి’’ అని ఆమె అన్నారు.
ప్యాండమిక్ ట్రీటీ (మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంపై ఒప్పందం) త్వరలోనే ఖాయం అయ్యే దిశగా చరిత్రాత్మక పురోగతిని నమోదు చేసినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, సభ్య దేశాలకు ఆమె అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో ఆరోగ్య రంగానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికీ, ఈ క్రమంలో ఎవరినీ వదలివేయకుండా చూడాలన్న నిబద్ధతను కొనసాగించాల్సి ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు.
***
(Release ID: 2130387)