రాష్ట్రపతి సచివాలయం
58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి
Posted On:
16 MAY 2025 6:30PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (మే 16, 2025) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు 58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
జగద్గురు రామభద్రాచార్యులను ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందించారు. జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయిన గుల్జార్ ను కూడా ఆమె అభినందించారు. గుల్జార్ త్వరగా కోలుకోవాలనీ, సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన- కళలు, సాహిత్యం, సమాజం, దేశానికి చురుగ్గా తన వంతు సహకారం అందించాలని ఆమె ఆకాంక్షించారు.
సాహిత్యం సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాగృత పరుస్తుందని రాష్ట్రపతి అన్నారు. 19వ శతాబ్దం నాటి సామాజిక మేల్కొలుపు నుంచి 20వ శతాబ్దంలో జరిగిన మన స్వాతంత్ర్య పోరాటం వరకూ... కవులు, రచయితలు ప్రజలను ఏకం చేయడంలో గొప్ప పాత్ర పోషించారని పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ రచించిన ‘వందే మాతరం’ గీతం దాదాపు 150 ఏళ్లుగా భరతమాత బిడ్డల్ని మేల్కొలుపుతూ వస్తోంది. ఇకముందు కూడా మేలుకొలుపుతూనే ఉంటుంది. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల రచనల ద్వారా సజీవ భారతాన్ని చూస్తామన్నారు. అదే భారతీయమని రాష్ట్రపతి అన్నారు.
1965 నుంచి నుండి వివిధ భారతీయ భాషలలో విశిష్ట సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేస్తూ వస్తున్న భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్ ను రాష్ట్రపతి ప్రశంసించారు. భారతీయ భాషల్లో విశిష్ట సాహితీవేత్తలకు పురస్కారాలు అందించే ప్రక్రియలో భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు కోసం అత్యుత్తమ సాహితీవేత్తలను ఎంపిక చేసి ఈ అవార్డు విలువను, గౌరవాన్ని నిలుపుతూ వచ్చారని రాష్ట్రపతి అన్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మహిళా రచయితలు ఆశాపూర్ణాదేవి, అమృత ప్రీతమ్, మహాదేవి వర్మ, ఖుర్రాతుల్-ఐన్-హైదర్, మహాశ్వేతాదేవి, ఇందిరా గోస్వామి, కృష్ణ సోబ్తి, ప్రతిభా రాయ్ వంటి వారు భారతీయ సంప్రదాయాన్ని, సమాజాన్ని ప్రత్యేక సున్నితత్వంతో పరిశీలించి, అనుభవించి మన సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని రాష్ట్రపతి అన్నారు. ఈ గొప్ప మహిళా రచయితలను స్ఫూర్తిగా తీసుకుని, మన సోదరీమణులు, కుమార్తెలు సాహిత్య సృష్టిలో చురుకుగా పాల్గొనాలని, తద్వారా మన సమాజపు ఆలోచనలను గొప్పగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు.
శ్రీ రామభద్రాచార్య గురించి చెబుతూ... ప్రతిభకు ఆయన స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారని రాష్ట్రపతి అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, శారీరకంగా వికలాంగుడైనప్పటికీ తన అంతర్ దృష్టితో సాహిత్యానికి, సమాజానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. శ్రీ రామభద్రాచార్యులు సాహిత్యపరంగానూ, సామాజిక సేవ పరంగానూ రెండింటిలోనూ విస్తృతంగా సేవలందించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆయన మహోన్నత జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని భావి తరాలు సాహిత్య రంగం, సమాజ నిర్మాణం, జాతి నిర్మాణంలో సరైన మార్గంలో ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
Please click here to see the President's Speech-
****
(Release ID: 2129303)