గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆర్ఓఆర్‌లతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను రాష్ట్రాలు పూర్తి చేయాలి: కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని
* కచ్చితంగా లేని, పాత భూమి రికార్డులే వివాదాలకు కారణమవుతున్నాయి: శ్రీ పెమ్మసాని
* కేంద్రీకృత సమన్వయంతో, సాంకేతికతపై ఆధారపడే భూ సర్వే, రీసర్వేలను చేపట్టనున్న కేంద్ర ప్రభుత్వం
* అయిదు దశల్లో దీని అమలు... 3 లక్షల చ.కి.మీ. గ్రామీణ వ్యవసాయ భూమితో మొదలవనున్న ప్రక్రియ
* డీఐఎల్ఆర్ఎంపీలో భాగంగా సర్వే, రీసర్వేపై జాతీయ కార్యశాల
Posted On:
15 MAY 2025 2:22PM by PIB Hyderabad
రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)- ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర పెమ్మసాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇది భూమి యాజమాన్య హక్కుకు డిజిటల్ గుర్తింపును ప్రసాదించే, తప్పుడు గుర్తింపునకు స్వస్తి పలికే, అగ్రిస్టాక్ (Agristack), పీఎం-కిసాన్ (PM-KISAN), పంట బీమా వంటి ప్రయోజనాలను నిజమైన లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయకారిగా నిలిచే ఓ ముఖ్య సంస్కరణగా ఈ అనుసంధాన ప్రక్రియ ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల ఆధునికీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో సర్వే, రీసర్వే అంశంపై రెండు రోజుల జాతీయ కార్యశాలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రీసర్వే, డిజిటలీకరణ, కాగిత రహిత కార్యాలయాలు, న్యాయస్థానాల్లో కేసుల నిర్వహణ, ఆధార్ అనుసంధానం వంటి సంస్కరణలు ఒక సమగ్రమైన, పారదర్శకమైన భూ పరిపాలన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆవిష్కరించనుంది. రికార్డులు సరిగా ఉన్నప్పుడు, సరైన సర్వేలను నిర్వహించే ప్రక్రియ భూమి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందని, బ్యాంకులు రుణాలను నమ్మకంగా ఇవ్వగలుగుతాయని, వ్యాపారులు నిశ్చింతగా పెట్టుబడి పెట్టేందుకు వీలు ఉంటుందని, రైతులు వ్యావసాయిక సహాయాన్ని అందుకోగలుగుతారని మంత్రి వివరించారు.
స్పష్టమైన, నిర్ణయాత్మకమైన, ప్రస్తుత భూ రికార్డులను అందుబాటులోకి తీసుకు రావాలన్న దీర్ఘకాలంగా ఉంది. ఈ పనిని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. డిజిటలీకరణ, అనుసంధానం, సాంకేతికత.. ఆధారంగా ఆధునికీకరణ చేయడం ద్వారా భూ యాజమాన్య నిర్వహణలో మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించామని ఆయన వివరించారు.
‘‘వేగవంతమైన హైవేలు, స్మార్ట్ నగరాలు, భద్రమైన గృహనిర్మాణం, దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే వ్యవసాయం.. వీటిని మనం కోరుకుంటున్నట్లయితే ఈ ప్రయత్నాలను మొదలుపెట్టవలసి ఉంటుంది’’ అని మంత్రి ప్రధానంగా చెప్పారు.
డీఐఎల్ఆర్ఎంపీలో భాగంగా తగినంత ప్రగతి చోటుచేసుకొందని, అయితే సర్వే, రీసర్వే ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఎందుకంటే ఈ పని ఒక విస్తృత పాలనపరమైన, సాంకేతికత ప్రధానమైన, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కసరత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌లో భూమి అంటే అది ఒక్క భౌతిక ఆస్తి మాత్రమే కాదని శ్రీ చంద్రశేఖర్ అన్నారు. అది గుర్తింపు, భద్రత, ఆత్మగౌరవాల ప్రతీక అని ఆయన అభివర్ణించారు. మన దేశ పౌరుల్లో సుమారు 90 శాతం మందికి భూమి అన్నా, స్థిరాస్తి అన్నా వారి దృష్టిలో మిగిలిన అన్నింటి కన్నా చాలా విలువైన ఆస్తి అని మంత్రి అన్నారు. అయినప్పటికీ, కచ్చితంగా లేని, లేదా పాత భూమి రికార్డులు దీర్ఘకాలంగా విస్తృతమైన వివాదాల్లో చిక్కుబడిపోవడానికి, అభివృద్ధిలో జాప్యానికి గురవడానికి, లేదంటే న్యాయం జరగని స్థితికి లోను కావడానికి కారణమయ్యాయని తెలిపారు. మన న్యాయ సంబంధ గణాంకాలను బట్టి చూస్తే, కింది కోర్టుల్లో ప్రతి వందలో 66కు పైగా సివిల్ కేసులు భూమి-స్థిరాస్తి వివాదాలతో ముడిపడ్డవే. చివరకు సర్వోన్నత న్యాయస్థానంలోనూ, పెండింగు పడ్డ వివాదాల్లో నాలుగింట ఒక వంతు భూసంబంధమైనవే. అందువల్ల ఇది అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు చేరవేయాలనే భావనకు ఒక సవాలును విసురుతోందని మంత్రి అన్నారు.
మన పాత సర్వేలు 100 సంవత్సరాల కిందటివి. అవి 1880 మొదలు 1915 మధ్య కాలంలో నిర్వహించినవి. అప్పట్లో గొలుసులు, క్రాస్-స్టాఫ్స్ వంటి పరికరాలను ఉపయోగించారని మంత్రి చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను విధించే విషయమై స్థిరాస్తి ఎల్లలు, స్థిరాస్తి విలువ, స్థిరాస్తిపై యాజమాన్య హక్కులు.. వీటికి సంబంధించిన సిసలైన సర్వేలు ఎప్పటికీ పూర్తి కాలేదని కూడా ఆయన వివరించారు. సర్వే చేయడానికి ప్రయత్నాలు చేసిన రాష్ట్రాలు ఈ ప్రక్రియలో క్షేత్ర వాస్తవికత, ముసాయిదా మ్యాపుల ప్రచురణ, అభ్యంతరాల పరిష్కారం, తుది నోటిఫికేషన్.. వీటికి చాలా పెద్ద సంఖ్యలో మనుషులను రంగంలోకి దించవలసి వస్తుందని గ్రహించాయని మంత్రి చెప్పారు.
‘‘చాలా రాష్ట్రాలు మ్యాప్ ఆధారిత సబ్‌డివిజన్లను పూర్తి చేయడం గాని, లేదా స్థాన సంబంధిత రికార్డులను సమన్వయపరచలేదు. దీంతో పన్ను విధించే విషయంలో ఇప్పటి స్థిరాస్తి హద్దులు, విలువ, యాజమాన్య హక్కులకు సంబంధించిన రిజిస్టర్లలోని మ్యాపులు ఉపయోగించడానికి తగనివిగా ఉండిపోయాయి. రాజకీయ సంకల్పం, బలమైన సమన్వయం లేనిదే సర్వేల వేగం మందగిస్తుందని, అవి అసంపూర్తిగా మిగిలిపోతాయని మాకు అనుభవంలోకి వచ్చింది. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర స్థాయి సమన్వయ కసరత్తుకు పూనుకోవాలని సంకల్పించింది. ఇది భూమి రికార్డులను 21వ శతాబ్దంలోకి తీసుకుపోనుంది’’ అని శ్రీ చంద్రశేఖర్ వివరించారు.
కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం సాంకేతికతపై ఆధారపడిందిగా ఉంటుందని మంత్రి వివరించారు. దీనిలో డ్రోన్లు, విమానాల ద్వారా గగనతల సర్వేల మాధ్యమ ప్రయోజనాలను అందుకుంటారని, సాంప్రదాయక పద్ధతుల్లో అయ్యే ఖర్చులో 10 శాతం ఖర్చు మాత్రమే అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఏఐ), జీఐఎస్‌లతో పాటు ఉన్నత కచ్చితత్వాన్ని ప్రదర్శించే పరికరాలను ఉపయోగిస్తారన్నారు. ఇది రాష్ట్రాలతో కలిసి క్షేత్ర వాస్తవాన్ని తెలియజేస్తుందని, విషయాల సక్రమతను ప్రకటిస్తుందని, కేంద్రం తన వంతుగా విధాన రూపకల్పన, ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు సాంకేతిక దన్నును సమకూరుస్తుందన్నారు. కార్యక్రమాన్ని అయిదు దశల్లో అమలుచేస్తారని, దీనిని 3 లక్షల చదరపు కిలోమీటర్ల గ్రామీణ వ్యవసాయ భూమి పరిధిలో మొదలుపెడతారని తెలిపారు. ఒకటో దశలో 2 సంవత్సరాలకు రూ.3,000 కోట్లు ఖర్చుపెడతారని మంత్రి చెప్పారు.
అర్బన్, పెరి-అర్బన్ భూ రికార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శక కార్యక్రమం ‘నక్షా’ను కూడా చేపడుతోంది అని మంత్రి తెలిపారు. దీనిని 150కి పైగా పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడం, ఎత్తయిన భవనాలను నిర్మిస్తూ ఉండడంతో వివాదాలు, తరచుగా అసాంప్రదాయక పరిష్కారాలు చోటు చేసుకొంటూ ఉండడం పెచ్చుమీరుతున్నాయన్నారు. ఈ కారణంగా, పట్టణ ప్రణాళిక, తక్కువ ఖర్చులో గృహ నిర్మాణం, నగరపాలక సంస్థల రెవెన్యూ.. వీటి కోసం సరి అయిన రికార్డులు అనేవి ఎంతయినా కీలకంగా మారుతున్నాయి అని మంత్రి శ్రీ చంద్రశేఖర్ వివరించారు.
రాష్ట్రాలు వాటి రిజిస్ట్రేషన్ వ్యవస్థలతోపాటు రెవెన్యూ కోర్ట్ కేస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (ఆర్‌సీసీఎంఎస్)లను ఆన్‌లైన్ మాధ్యమంలో కి మళ్లిస్తూ, కాగితాలను ఉపయోగించని స్థితికి చేర్చేటట్లు భూ వనరుల విభాగం (డీఓఎల్ఆర్) ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో పద్ధతుల్ని అవలంబించే విధంగా, పౌరులతోపాటు అధికారులకు ఎక్కడైనా సరే అందుబాటు సాధ్యపడేటట్లు చూడాలంటోందని కూడా ఆయన అన్నారు. దీనితో భూమికి సంబంధించిన కోర్టు కేసులను ఆరా తీయడం, వాటిని నిర్వహించడం, జవాబుదారుతనాన్ని ఖరారు చేయడం, జాప్యాలను తగ్గించడంలో సాయం అందగలదని ఆయన చెప్పారు.
కచ్చితమైన సర్వేలు మనలోని అత్యంత బలహీన వర్గాలకు సాయపడతాయని మంత్రి అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, గిరిజన సముదాయాలు, గ్రామీణ మహిళలు.. వీరికి స్పష్టమైన భూమి హక్కులు విలాసాలేమీ కాదని, వారు దోపిడీ బారిన పడకుండా అవి తప్పక కాపాడతాయని ఆయన స్పష్టం చేశారు. భూమి రికార్డులతో ముడిపడి ఉండి, దీర్ఘకాలంగా పెండింగు పడ్డ దేశ ప్రజల పనిని పూర్తి చేయడానికి కేంద్రంతో కలిసి పనిచేయాల్సిందిగా రాష్ట్రాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. భూమి అనేది ఇక మీదట గందరగోళానికి, సంఘర్షణకూ కాక నమ్మకానికి, భద్రతకు, సమృద్ధికి ఒక మూలంగా మారే దేశాన్ని మనమందరం కలిసి నిర్మిద్దామని ఆయన అన్నారు. ‘భూ-వివాదాల’ నుంచి ‘భూ-విశ్వాసం’ దిశగా ముందడుగు వేయాల్సిన సమయం వచ్చేసింది అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ, రిజిస్ట్రేషన్-స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, భూ పరిపాలన ప్రధాన కమిషనరు జి. జయలక్ష్మి, కార్యదర్శి శ్రీ మనోజ్ జోషీ జీ, భారత ప్రభుత్వ భూ వనరుల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ కుణాల్ సత్యార్థి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, నిపుణులు, ఫీల్డ్ ప్రాక్టీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 2128939)