ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

వైమానిక యోధులు, సైనికులతో మాట్లాడాను.. దేశ రక్షణలో వారి ధైర్యసాహసాలు, నైపుణ్యం ప్రశంసనీయం

‘భారత్ మాతాకీ జై’ అన్నది ఓ నినాదం మాత్రమే కాదు.. దేశ గౌరవ ప్రతిష్ఠల కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడి శపథమిది

· భారత విధానం, లక్ష్యం, నిర్ణయాత్మక సామర్థ్యాల సమ్మేళనమే ఆపరేషన్ సిందూర్

· మన అక్కాచెల్లెళ్ల సిందూరాన్ని తుడిచిపెట్టిన ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే అణచివేశాం

· భారత్‌ వైపు కన్నెత్తితే మిగిలేది విధ్వంసమేనని ఉగ్రవాద సూత్రధారులకు తెలిసొచ్చింది

· పాకిస్తాన్‌లోని ఉగ్రవాద, వైమానిక స్థావరాలే కాదు.. వారి దురుద్దేశాలు, తెంపరితనాన్నీ మీరు తిప్పికొట్టారు

· ఉగ్రవాదంపై భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు స్పష్టంగా ఉంది.. మరోసారి ఉగ్ర దాడి జరిగితే, భారత్ దీటుగా బదులిస్తుంది... మన స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది

· ఆపరేషన్ సిందూర్‌లో ప్రతీ క్షణం భారత సాయుధ బలగాల శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది

· పాకిస్తాన్ మరేదైనా ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైనిక దురాక్రమణకు పాల్పడితే మేం నిర్ణయాత్మకంగా బదులిస్తాం.. మాదైన

Posted On: 13 MAY 2025 5:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదంపూర్‌లోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో సంభాషించారు. వారితో మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసిందన్నారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథమని వ్యాఖ్యానించారు. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక అని స్పష్టం చేశారు. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుందన్నారు. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ అంటూ భారత సైనిక పాటవాన్ని కొనియాడారు. భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేయగల సమర్థత మన దేశానికి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ప్రకటించారు.

 

లక్షలాది భారతీయ హృదయాలను గర్వంతో నింపిన భారత సాయుధ దళాల ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ.. వారి అసమాన ధైర్యం, చారిత్రాత్మక విజయాలు ప్రతీ భారతీయుడినీ నేడు తలెత్తుకుని నిలిచేలా చేశాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వీరులను కలుసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇకనుంచి దశాబ్దాలపాటు దేశం ఈ వీరత్వాన్ని కీర్తిస్తుందని, ఈ మిషన్‌లో ముందున్న సైనికులు గొప్పవారిగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరానికే కాకుండా, భవిష్యత్ తరాలకూ వారు ప్రేరణగా నిలిచారని వ్యాఖ్యానించారు. సాహసికులైన యోధుల గడ్డపైనుంచి సాయుధ దళాలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. పరాక్రమవంతులైన వైమానిక, నావికా దళాలు, సైన్యం, సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) సిబ్బందికి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందంటూ వారి వీరోచిత కృషిని ప్రశంసించారు. ప్రార్థనలు చేస్తూ, తిరుగులేని విధంగా మద్దతిస్తూ ప్రతి భారతీయుడూ ఈ ఆపరేషన్ సమయంలో సైనికులతో దృఢంగా నిలిచాడని ప్రధానమంత్రి చెప్పారు. సైనికుల త్యాగాలను కీర్తిస్తూ.. దేశ సైనికులు, వారి కుటుంబాలకు యావద్దేశం తరఫున మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“ఆపరేషన్ సింధూర్ సాధారణ సైనిక కార్యక్రమం కాదు. భారత విధానం, లక్ష్యం, నిర్ణయాత్మక సామర్థ్యాల సమ్మేళనం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బుద్ధుడూ, గురు గోవింద్ సింగ్ ఇద్దరికీ భారత్ నిలయమని పేర్కొన్నారు. ‘‘ఒక యోధుడు 125,000 మందితో పోరాడేలా నేను తయారు చేస్తాను, డేగలను ఓడించేలా పిచ్చుకలను తీర్చిదిద్దుతాను.. అప్పుడే నన్ను గురు గోవింద్ సింగ్ అని పిలవండి’’ అన్న గురుగోవింద్ సింగ్ ప్రకటనను శ్రీ మోదీ గుర్తు చేశారు. ధర్మస్థాపన కోసం అన్యాయానికి వ్యతిరేకంగా ఆయుధాన్ని ప్రయోగించడం భారత సంప్రదాయమని వ్యాఖ్యానించారు. భరతమాత బిడ్డలపై దాడి చేసి, హాని తలపెట్ట సాహసించిన ఉగ్రవాదులను భారత బలగాలు వారి స్థావరాల్లోనే అణచివేశాయన్నారు. పరాక్రమశీలురైన భారత సాయుధ బలగాలను సవాలు చేస్తున్న విషయం మరిచి.. ముష్కరులు పిరికితనంతో రహస్యంగా దాడికి వచ్చారని ఆయన తెలిపారు. నేరుగా ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసి నేలమట్టం చేశారంటూ భారత సైనికుల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమవగా, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతులయ్యారు. భారత్‌ను రెచ్చగొడితే ఫలితంగా పూర్తి విధ్వంసమే మిగులుతుందన్న విషయం ఉగ్రవాద సూత్రధారులకు ఇప్పుడు అర్థమైందన్నారు. దేశంలో అమాయకుల రక్తం చిందించే ఎలాంటి ప్రయత్నం చేసినా, అది వారి వినాశనానికే దారితీస్తుందని చెప్తూ.. ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నిర్ణయాత్మకంగా ఓడించాయని స్పష్టం చేశారు. ‘‘భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపాయి - ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామమేదీ లేదు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వారి సొంత భూభాగంలోనే భారత్ వారిపై దాడి చేస్తుందని, తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వబోదని స్పష్టం చేశారు. భారత డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్‌లో భయం నింపాయని, వాటి గురించి ఆలోచిస్తేనే పాకిస్తాన్‌కు రోజుల తరబడి నిద్ర పట్టదని చెప్పారు. మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాసిన పంక్తులను ప్రస్తావిస్తూ.. ఈ మాటలు ఇప్పుడు భారత అధునాతన ఆయుధ సంపత్తికి సరిగ్గా సరిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.

“ఆపరేషన్ సిందూర్ విజయం దేశ సంకల్పాన్ని బలోపేతం చేసింది, దేశాన్ని ఏకం చేసింది, భారత సరిహద్దులను కాపాడింది, దేశ ప్రతిష్ఠను శిఖరాగ్రానికి చేర్చింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల కృషి అపూర్వం, అనూహ్యం, అద్భుతం అని అభివర్ణిస్తూ.. వారి అసాధారణ కృషిని ప్రశంసించారు. ఎంత కచ్చితత్వంతో భారత వైమానిక దళం దాడులు చేసిందో వివరిస్తూ.. పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని విజయం సాధించారని వ్యాఖ్యానించారు. కేవలం 20-25 నిమిషాల్లోనే భారత దళాలు సరిహద్దులు దాటి పూర్తి కచ్చితత్వంతో దాడులు చేశాయని, నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధునికమైన, సాంకేతికంగా సన్నద్ధంగా ఉన్న, అత్యంత వృత్తి నైపుణ్యం కలిగిన దళం మాత్రమే అటువంటి కార్యకలాపాలను నిర్వహించగలదని స్పష్టం చేశారు. భారత సైన్యం వేగం, కచ్చితత్వాన్ని ప్రశంసించారు. వారి నిర్ణయాత్మక చర్యలు శత్రువును పూర్తిగా నివ్వెరపరిచాయని ఆయన వ్యాఖ్యానించారు. తమ బలమైన కోటలు రాళ్లూరప్పలుగా ఎప్పుడు మారాయో కూడా ప్రత్యర్థులకు తెలియలేదన్నారు.

 

పాకిస్తాన్ లోపలి భాగంలో ఉన్న ఉగ్రవాద ప్రధాన కేంద్రాలపై దాడి చేసి, ముఖ్యులైన ఉగ్రవాద కార్యకర్తల నిర్మూలనే లక్ష్యంగా భారత్ ముందుకెళ్లిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్ పౌర విమానాలను రక్షణగా ఉపయోగించుకుని తన కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేసినప్పటీకీ భారత దళాలు అత్యంత జాగ్రత్తగా, కచ్చితత్వంతో స్పందించాయని తెలిపారు. అప్రమత్తతతో, బాధ్యతతో మెలుగుతూ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. భారత సైనికులు తమ లక్ష్యాలను పూర్తి కచ్చితత్వంతో, దృఢ సంకల్పంతో నెరవేర్చారని ఆయన సగర్వంగా ప్రకటించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద, వైమానిక స్థావరాలే కాదు.. వారి దురుద్దేశాలు, తెంపరితనాన్నీ కూడా ఈ ఆపరేషన్ అణచివేసిందని వ్యాఖ్యానించారు.  

 

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ తీవ్రమైన నిరాశతో, భారత వైమానిక స్థావరాలే లక్ష్యంగా పలుమార్లు దాడులకు విఫల యత్నం చేసిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. అయితే, పాకిస్తాన్ చేసిన అన్ని దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, యూఏవీలు, విమానాలు, క్షిపణులు అన్నీ శక్తిమంతమైన భారత గగనతల రక్షణ వ్యవస్థ ముందు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. భారత సన్నద్ధత, సాంకేతిక బలం శత్రు దాడులను పూర్తిగా అణిచివేశాయన్నారు. దేశ వైమానిక స్థావరాల రక్షణ కోసం పనిచేసిన మన వైమానిక దళ సిబ్బందిని ప్రశంసించిన ప్రధానమంత్రి, దేశాన్ని రక్షించడంలో వారి అద్భుతమైన పనితీరు, అచంచలమైన అంకితభావాన్ని కొనియాడారు.

ఉగ్రవాదం పట్ల భారత వైఖరి ఇప్పుడు విస్పష్టంగా ఉందన్న ప్రధానమంత్రి, మరోమారు భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే, దేశం నిర్ణయాత్మకంగా, పూర్తి బలంతో గట్టిగా ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు. గతంలో సర్జికల్ దాడులు, వైమానిక దాడుల సమయంలో భారత్ తీసుకున్న దృఢమైన చర్యలను గుర్తుచేసిన ప్రధానమంత్రి, దాడులను ఎదుర్కోవడంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు దేశానికి సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించిందన్నారు. నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ప్రస్తావించిన మూడు కీలక సూత్రాలను ఆయన పునరుద్ఘాటించారు. మొదటిది, భారత్‌పై ఉగ్రవాదానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పేలా గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ తన సొంత మార్గంలో, స్వీయ నిబంధనల ప్రకారం స్పందిస్తుంది. ఉగ్రవాద మూలాలు బయటపడే ప్రతిచోట కఠిన చర్యలు ఉంటాయి. రెండోది, అణుబాంబు బెదిరింపుల్ని భారత్ ఏమాత్రం సహించదు. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడులు కొనసాగిస్తుంది. మూడోది ఉగ్రవాద తండాలను, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని భారత్ విడివిడిగా చూడదు. "ప్రపంచం ఇప్పుడు ఈ సరికొత్త, దృఢ నిశ్చయంతో ఉన్న భారత్‌ను చూస్తోంది. జాతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలన పట్ల మన దృఢమైన విధానానికి అనుగుణంగా ముందుకుసాగుతోందని ప్రధానమంత్రి వివరించారు.

 

"ఆపరేషన్ సిందూర్ భారత సాయుధ దళాల బలం, సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు, సైన్యం, నావికాదళం, వైమానిక దళం అసాధారణ సమన్వయంతో పనిచేశాయని ప్రశంసించారు. వారి సమష్టితత్వం అద్భుతమైనదని పేర్కొన్నారు. సముద్రాలపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన నావికా దళం, సరిహద్దులను బలోపేతం చేసిన సైన్యం అలాగే దాడులు చేయడం.. వైమానిక స్థావరాల రక్షణ వంటి రెండు విధుల్లోనూ రాణించిన భారత వైమానిక దళాల పనితీరు అద్భుతమని ప్రధానమంత్రి కితాబిచ్చారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఇతర భద్రతా దళాలు అత్యుత్తమ పనితీరు కనబరిచాయని ఆయన ప్రశంసించారు. భారత సమగ్ర గగనతల, సరిహద్దు రక్షణ వ్యవస్థల ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి... ఈ స్థాయి సమష్టిత్వం నేడు భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందని ప్రకటించారు.

 

ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం, అధునాతన సైనిక సాంకేతికతల మధ్య సమన్వయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ... అనేక యుద్ధాల్లో సత్తా చాటిన భారత సంప్రదాయ గగనతల రక్షణ వ్యవస్థలు నేడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్.. ఎస్-400 వంటి ఆధునిక, శక్తిమంతమైన వ్యవస్థలతో మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. భారత దృఢమైన రక్షణ కవచం మన బలాన్ని చాటిచెప్పిందన్నారు. పాకిస్తాన్ పదే పదే దాడులకు ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత వైమానిక స్థావరాలు, కీలకమైన రక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. సరిహద్దుల్లో మోహరించి ఉన్న ప్రతి సైనికుడి అంకితభావం, పరాక్రమం అలాగే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నిబద్ధత కారణంగానే ఈ విజయం సాధ్యమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. తిరుగులేని భారత జాతీయ భద్రతకు వారి నిబద్ధతే మూలమని ఆయన వ్యాఖ్యానించారు.

 

పాకిస్తాన్‌తో పోల్చడానికి కూడా వీలులేనంత గొప్ప అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్ వద్ద ఉందని స్పష్టం చేసిన శ్రీ నరేంద్ర మోదీ... గత దశాబ్దంలో భారత వైమానిక దళం, ఇతర సైనిక విభాగాలు ప్రపంచంలోని అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను పొందాయన్నారు. కొత్త సాంకేతికతతో గణనీయమైన సవాళ్లు వస్తాయనీ, ఈ సంక్లిష్టమైన, అధునాతన వ్యవస్థలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అపారమైన నైపుణ్యంతో పాటు కచ్చితత్వం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక నైపుణ్యంతో సాంకేతికతను సజావుగా అనుసంధానించి ఆధునిక యుద్ధంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ... భారత వైమానిక దళం ఇప్పుడు ఆయుధాలతోనే కాకుండా డేటా, డ్రోన్‌లతో కూడా ప్రత్యర్థుల భరతం పట్టే కళలో ప్రావీణ్యం సంపాదించిందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు భారత్ తన సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేసిందని పేర్కొంటూ, పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలు.. రెచ్చగొట్టే సైనిక చర్యలకు పాల్పడితే, భారత్ పూర్తి బలంతో ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ ప్రతిస్పందన పూర్తిగా తన సొంత నిబంధనల ప్రకారమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాత్మక వైఖరికి దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమం, అప్రమత్తతే కారణమన్నారు. సైనికులు తమ అచంచలమైన సంకల్పం, ఉత్సాహం, సన్నద్ధతను కొనసాగించాలని కోరుతూ, అన్ని సమయాల్లో అప్రమత్తంగా, సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఇది నవ భారతం – ఈ భారత్ శాంతినే కోరుకుంటుంది కానీ మానవాళికి ముప్పు వాటిల్లితే శత్రువులను అణిచివేయడానికి ఏ మాత్రం వెనుకాడదు అని వ్యాఖ్యానిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.


(Release ID: 2128546)