ఉప రాష్ట్రపతి సచివాలయం
వ్యక్తులకు అండదండగా నిలిచినప్పుడే సిసలైన సాధికారత సాధ్యం: ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్
మహిళలు ముందుకు వచ్చినప్పుడు సంతులిత అభివృద్ధితోపాటు సామాజిక వృద్ధి కూడా నమోదవుతుంది: శ్రీ ధన్‌ఖడ్
ఈశాన్య ప్రాంతం మనకు ఆభరణమంటూ అభివర్ణించిన ఉపరాష్ట్రపతి
మన గిరిజన సంస్కృతి ఆహ్లాదభరితం... మన ఆదివాసీ సంస్కృతే మన సంపద అని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
అధికారులు సరైన దిశలో సాగేందుకు దార్శనిక నాయకత్వం ప్రేరణనిస్తుందని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి
మేఘాలయకు చెందిన స్వయంసహాయ బృందాల సభ్యులతో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సంభాషణ
Posted On:
13 MAY 2025 2:26PM by PIB Hyderabad
"ఒక వ్యక్తి జేబులను ఉచితాలతోనూ, ఇతరత్రా కానుకలతోనూ నింపడం నిజమైన సాధికారత కాదు. సిసలైన సాధికారత అంటే అతడు గాని లేదా ఆమె గాని స్వీయ సాధికారతను సాధించుకొనేటట్లు ఆ వ్యక్తికి మీరు చేదోడుగా నిలవడం. అది ఆ మనిషికి సంతోషాన్ని, సంతృప్తిని, అంతశ్శక్తిని ఇవ్వడమే కాకుండా మీ కుటుంబాలు మిమ్మల్ని చూసి గర్వపడేటట్లు కూడా చేస్తుంది’’ అని ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఈ రోజు అన్నారు.
మేఘాలయలో గారో హిల్స్, ఖాసీ హిల్స్, జైంతియా హిల్స్ ప్రాంతాలకు చెందిన స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను ఉద్దేశించి శ్రీ ధన్‌ఖడ్ న్యూఢిల్లీలో ఈ రోజు మాట్లాడారు. ‘‘మన దేశంలోని ఈశాన్య ప్రాంతం మనకు ఓ నగ లాంటిది. 90వ దశాబ్దంలో, అంటే ఇప్పటికి ముప్ఫయ్ ఏళ్ల కిందటి సంగతి... భారత ప్రభుత్వం ఒక విధానాన్ని అమలుపరిచింది. ఆ విధానమే ‘లుక్ ఈస్ట్’. ఈ విధానానికి ‘యాక్ట్ ఈస్ట్’ అనే ఒక అదనపు పార్శ్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోడించారు. మరి ఆ కోణం చాలా ప్రభావవంతంగా అమరింది. పర్యాటకులకు మేఘాలయ స్వర్గధామం అనే సంగతిని మీకు నేను చెప్పదలచుకున్నాను. ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప కానుక’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా జరిగిన ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రధానంగా వివరిస్తూ, మేఘాలయకు పర్యటన, గనుల తవ్వకం, ఐటీ, సేవల రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఆర్థిక అభివృద్ధి, మహిళలకు సాధికారత కల్పన.. ఈ అంశాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. దీనికి ఖ్యాతిని ఇవ్వాల్సింది కేంద్రంతో పాటు రాష్ట్ర స్థాయిలో దార్శనికత కనబరుస్తున్న నాయకత్వానికేనన్నారు.
పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన అభివృద్ధిని, పాలన సంస్కరణలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి ఇంకా ఇలా అన్నారు..‘‘అధికారులు సరి అయిన దిశలో పనిచేసేటట్లుగా వారికి దార్శనిక నాయకత్వం ప్రేరణనిస్తుంది. అదృష్టవశాత్తు మన దేశంలో గత పదేళ్లుగా జరుగుతోంది ఇదే. మరి మీ రాష్ట్రంలోనూ ఇదే జరుగుతోంది. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో ఆర్థిక రంగం, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికత, మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత వంటి రంగాలలో గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు ప్రపంచానికి అసూయ కలిగిస్తున్నాయి. మన గిరిజన సంస్కృతి ఆహ్లాదభరితంగా ఉంది. మన ఆదివాసీ సంస్కృతి మన సంపద.’’
రాష్ట్రం సాధించిన ఆర్థిక పురోగతిని ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ ఇలా అన్నారు..‘‘ఒక రాష్ట్రం ఆర్థికవ్యవస్థను జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్)తో నిర్ధారిస్తారు. మరి ఈ విషయంలో మేఘాలయ రాష్ట్రం 13 శాతం అభివృద్ధిని సాధించింది. ఏటికేడాది 13 శాతం ఉన్నతి అంటే అది చాలా చాలా ప్రశంసనీయం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచాలని గొప్ప నిబద్ధతను కనబరచిన ముఖ్యమంత్రికి అభినందనలు. ప్రస్తుతానికి, ఇది రూ.66,000 కోట్లకు పైబడుతుందన్న అంచనా ఉంది. మేఘాలయ మనస్సు విషయానికి వస్తే ఒక పెద్ద రాష్ట్రం. అయితే భౌగోళికంగా అంత పెద్దదేంకాదు. కానీ మీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం చక్కగా ఉంది. మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 2028 కల్లా రాష్ట్రం 10 బిలియన్ డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా మారాలి అనేది మీ లక్ష్యంగా ఉంది.’’
వృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించడం ముఖ్యమని ఉపరాష్ట్రపతి చెబుతూ, ‘‘రాష్ట్రంలో ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు... పర్యటన రంగం, ఐటీ, సేవ... ఇలా పలు రంగాల్లో అనంత అవకాశాలు ఉన్నాయి. అయితే అంతకంటే ముఖ్యమైంది మానవ శక్తిని తీర్చిదిద్దుకోవడం. మానవ వనరులు స్వతంత్రంగా ఉండితీరాలి. ఈ కేటగిరీలో కూడా, సామాజిక ప్రగతి, ఆర్థిక అభివృద్ధి.. ఇవి ఎప్పుడు సమతుల్యంగా ఉంటాయంటే, అది... మహిళలు ముందుకు వచ్చినప్పుడే. రివాల్వింగ్ ఫండ్ పరంగా చూసినా, సంఖ్య పరంగా చూసినా ఈ రెండు కోణాల్లో పదింతల పెరుగుదల చోటుచేసుకోవడాన్ని గమనిస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను’’ అన్నారు.
ఈ సమావేశంలో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్‌రాడ్ సంగ్మాతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2128441)