సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025: ప్రతి సృజనకారుడినీ స్టార్ గా తీర్చిదిద్దే ప్రజా ఉద్యమం విజయవంతమైన వేవ్స్‌బజార్
3 రోజుల్లోనే 3000లకు పైగా బీ2బీ సమావేశాలతో రూ. 1328 కోట్లకు పైగా విలువైన వ్యాపార లావాదేవీలు
మీడియా-వినోద రంగంలో రూ. 8000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
గ్లోబల్ మీడియా డైలాగ్‌లో వేవ్స్ డిక్లరేషన్‌ను ఆమోదించిన సభ్య దేశాలు
వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్‌లో భాగంగా త్వరలోనే రానున్న రూ. 50 కోట్ల విలువైన పెట్టుబడులు
క్రియేటివ్ ఎకానమీ సామర్థ్య నిర్మాణంలో కీలక మైలురాయిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ)
భారత్‌లో సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహానికి భరోసా ఇచ్చిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్
వేవ్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నాలెడ్జ్ రిపోర్ట్స్ ఆవిష్కరణ – సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో భారత్ భారీ ముందడుగు
Posted On:
04 MAY 2025 7:48PM
|
Location:
PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్- వేవ్స్ 2025 ప్రీమియర్ ఎడిషన్ ఈరోజు ముంబయిలో అద్భుత ప్రదర్శనతో ముగిసింది. ఎగ్జిబిటర్లు, పరిశ్రమ ప్రముఖులు, అంకురసంస్థలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, సాధారణ ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సమ్మిట్ మీడియా-వినోద రంగంలో కీలకమైన సమ్మేళన కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రముఖ కళాకారులు, ప్రభావవంతమైన కంటెంట్ క్రియేటర్ల నుంచి టెక్ ఇన్నోవేటర్లు, కార్పొరేట్ నాయకుల వరకు పరిశ్రమలోని ప్రతి విభాగానికి చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, బీ2బీ సహకారాల శక్తివంతమైన సమ్మేళనంతో కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. మీడియా-వినోద రంగంలో ప్రపంచ శక్తి కేంద్రంగా ఎదుగుతున్న భారత స్థానాన్ని ఇది పునరుద్ఘాటించింది.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనేక మంది తారల సమక్షంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా సృజనాత్మకత, సాంకేతిక, కథలు చెప్పే నైపుణ్యాల వేడుకగా తొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. తన ప్రారంభ ప్రసంగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ... వేవ్స్ కేవలం పదాల సంక్షిప్త రూపం కాదని, ఇది సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధానాల తరంగమని వ్యాఖ్యానించారు. చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, ప్రత్యక్ష కచేరీలకు ప్రపంచ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త క్రియేటర్లు పెద్ద కలలు కని వారి కథలను చెప్పాలనీ, పెట్టుబడిదారుల వేదికలపైనే కాకుండా ప్రజల్లోనూ పెట్టుబడి పెట్టాలని కోరారు. భారతీయ యువత ఇప్పటి వరకు వెల్లడించని వారి బిలియన్ కథలను ప్రపంచానికి చెప్పాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారత ఆరెంజ్ ఎకానమీ వృద్ధికి వేవ్స్ గొప్ప ఆరంభమని ప్రకటిస్తూ, ఈ సృజనాత్మక ఉత్తుంగ తరంగాలకు నాయకత్వం వహిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా మార్చాలని ఆయన యువతను కోరారు.
హై ఇంపాక్ట్ నాలెడ్జ్ సెషన్స్
ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్లే వేవ్స్ 2025, గత నాలుగు రోజులుగా ఉన్నత స్థాయి ఆలోచనలు, నైపుణ్యాలు, ఆయా రంగాల్లో విజయం సాధించిన ప్రముఖుల అర్థవంతమైన ఆలోచనలు పంచుకునే వేదికగా పనిచేసింది. వేవ్స్ 2025 కాన్ఫరెన్స్ ట్రాక్, ప్రపంచవ్యాప్త మేధావులు, పరిశ్రమ మార్గదర్శకులు, విధాన రూపకర్తలు, నిపుణులను ఒకచోట చేర్చి సంభాషణలు, సహకారాల కోసం ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. అత్యంత జాగ్రత్తగా రూపొందించి నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు, బ్రేక్ అవుట్ చర్చలు, మాస్టర్ క్లాసుల ద్వారా, ఈ సమ్మిట్ మీడియా-వినోద రంగ భవిష్యత్తును రూపొందించే తాజా ఆవిష్కరణలు, అధునాతన వ్యూహాలను అన్వేషించింది. ఈ సమావేశాలు విభిన్న రంగాలు, స్పెషలైజేషన్స్‌కు అతీతంగా అర్థవంతమైన ఆలోచనలను పంచుకునేందుకు వీలు కల్పించాయి.
వేవ్స్ తొలి ఎడిషన్ హై ఇంపాక్ట్ నాలెడ్జ్ సమావేశాలు, బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్మెంట్, ఏవీజీసీ-ఎక్స్ఆర్, డిజిటల్ మీడియా, చలనచిత్రాలు సహా విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేసే ప్రసంగాలతో సాగింది. మూడు ప్రధాన హాళ్లు (ఒక్కొక్కటి 1,000 కంటే ఎక్కువ మందికి అనువుగా ఉండేది), అదనంగా 75 నుంచి 150 మంది సామర్థ్యం గల మరో ఐదు హాళ్లలో నిర్వహించిన 140కి పైగా సమావేశాల్లో 100కు పైగా అంతర్జాతీయ వక్తలు పాల్గొన్న ఈ సమ్మిట్ కోసం ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో చాలా సమావేశాలు నిండుగా ఆహూతులతో కళకళలాడాయి.
ఈ ప్లీనరీ సమావేశాల్లో ముఖేష్ అంబానీ, టెడ్ సరండోస్, కిరణ్ మజుందార్-షా, నీల్ మోహన్, శంతను నారాయణ్, మార్క్ రీడ్, ఆడమ్ మోసేరి, నీతా అంబానీ వంటి ప్రముఖులు 50కి పైగా కీలక ప్రసంగాలు చేశారు. వారి ఆలోచనలు అభివృద్ధి చెందుతున్న వినోద పరిశ్రమ, ప్రకటనల రంగం, డిజిటల్ పరివర్తన గురించి బలమైన దృక్పథాలను అందించాయి. చిరంజీవి, మోహన్ లాల్, హేమ మాలిని, అక్షయ్ కుమార్, నాగార్జున, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, అల్లు అర్జున్, శేఖర్ కపూర్ వంటి చలనచిత్ర దిగ్గజాలు.. వీరిలో చాలా మంది వేవ్స్ సలహా మండలి సభ్యులు కూడా. వర్చువల్ ప్రొడక్షన్, కృత్రిమ మేధ యుగంలో సినిమా భవిష్యత్తు, కంటెంట్ క్రియేషన్ గురించిన ఆలోచింపజేసే సంభాషణల్లో పాల్గొన్నారు.
వేవ్స్ 2025లో భాగంగా ఆచరణాత్మక అభ్యాసం, సృజనాత్మక అన్వేషణను అందించడానికి 40 మాస్టర్‌క్లాసులు రూపొందించారు. ఆమిర్ ఖాన్ ద్వారా నటనలో మెళకువలు, ఫర్హాన్ అక్తర్ ద్వారా దర్శకత్వంలో మెళకువలూ, మైఖేల్ లేమాన్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ అంశాలపై సమావేశాలను నిర్వహించి, ఆహూతులకు పరిశ్రమ పద్ధతుల గురించి ప్రత్యక్ష అవగాహన కలిగించారు. అమేజాన్ ప్రైమ్ ద్వారా పంచాయత్ చిత్రీకరణ అంశాలను వివరించారు. ఏఆర్ లెన్స్‌లను రూపొందించడం, ఏఐ అవతార్‌లను సృష్టించడం, జనరేటివ్ ఏఐని ఉపయోగించి గేమ్‌లను అభివృద్ధి చేయడం వంటి తెరవెనుక కథనాలను గురించి వివరించడం ద్వారా ఇతర సమావేశాలూ ప్రజలకు అవగాహన కలిగించాయి. ఈ సమావేశాల ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మాకాధారిత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన కార్యాచరణ, ఇతర సాధనాల గురించి ప్రొఫెషనల్స్, ఔత్సాహిక సృజనకారులకు వివరించారు.
వేవ్స్‌లో 55 బ్రేక్ అవుట్ సమావేశాలు కూడా జరిగాయి. ఇవి బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ మీడియా, ఓటీటీ, ఏఐ, సంగీతం, వార్తలు, లైవ్ ఈవెంట్లు, యానిమేషన్, గేమింగ్, వర్చువల్ ప్రొడక్షన్, కామిక్స్, ఫిల్మ్ మేకింగ్ వంటి స్పెషలైజ్డ్ థీమ్స్ గురించిన సమగ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. ఈ ఇంటరాక్టివ్ సమావేశాలు మెటా, గూగుల్, అమేజాన్, ఎక్స్, స్నాప్, స్పాటిఫై, డిఎన్ఈజీ, నెట్‌ఫ్లిక్స్, ఎన్విడియా వంటి ప్రముఖ కంపెనీల సీనియర్ నిపుణులు, ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ), సీఐఐ, ఐఎమ్ఐ వంటి పరిశ్రమ సంస్థల ప్రతినిధులను ఒకేచోటుకు చేర్చాయి. ఆయా రంగాలకు సంబంధించిన నిర్ధిష్ట ఆలోచనలు, సహకారాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ఈ చర్చలు క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించాయి. వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త దిశను చూపించాయి.
వ్యాపార ఒప్పందాల ద్వారా రూ.1328 కోట్లు రాబట్టిన వేవ్స్ బజార్: మీడియా, వినోద రంగాల్లో రూ.8 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
వేవ్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన వేవ్స్ బజార్ తొలి ఎడిషన్ గొప్ప విజయాన్ని సాధించింది. సృజనాత్మక రంగాలలో అంతర్జాతీయ వ్యాపార సహకారానికి ఇది ఒక ప్రముఖ వేదికగా నిలిచింది. ఈ మార్కెట్ విభాగంలో సినిమా, సంగీతం, రేడియో, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాల్లో మొత్తం రూ.1328 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందాలు లేదా లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం అంచనా రాబడిలో రూ.971 కోట్లు కేవలం బి2బి సమావేశాల ద్వారానే సమకూరాయి. వేవ్స్ బజార్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొనుగోలుదారులు- అమ్మకందారుల మార్కెట్ లో 3,000కి పైగా బి2బి సమావేశాలు జరిగాయి. అంతర్జాతీయ సహకారంలో ఇది ఒక పెద్ద విజయంగా నిలవగా, ఫిల్మ్ ఇండియా స్క్రీన్ కలెక్టివ్, న్యూజిలాండ్‌కు చెందిన స్క్రీన్ కాంటర్బరీ ఎన్జెడ్ కలిసి సంయుక్తంగా న్యూజిలాండ్‌లో తొలి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. భారత్, రష్యాలలో విభిన్న సాంస్కృతిక ఉత్సవాలు, నిర్వహించడం పైన, అలాగే కామెడీ, సంగీత ప్రదర్శనలను సంయుక్తంగా నిర్మించడంపైన అవగాహన ఒప్పందంపై చర్చలు ప్రారంభమయినట్లు ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ- సీఈఓ తుషార్ కుమార్, రష్యా సంస్థ - గాజ్‌ప్రోమ్ మీడియా సీఈఓ అలెగ్జాండర్ జారోవ్ ప్రకటించడం మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది.
ప్రైమ్ వీడియో, సిజె ఇఎన్ఎమ్ మధ్య బహుళ సంవత్సరాల సహకార ఒప్పందాన్ని ప్రకటించడం కూడా వేవ్స్ బజార్‌లో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ప్రీమియం కొరియన్ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఇతర ముఖ్యమైన విజయాల్లో , భారత్, బ్రిటన్ మధ్య మొదటి అధికారిక సంయుక్త నిర్మాణంగా ‘దేవీ చౌదురాణి’ సినిమా ప్రకటన ఒకటి. అలాగే యూకేకు యుకేకు చెందిన ఫ్యూషన్ ఫ్లిక్స్, జెవిడి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ‘వయొలేటెడ్’ సినిమా ప్రకటన కూడా ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.
ఐఎంఎఫ్ లో రూ.8,000 కోట్ల విలువైన ఎంవోయూలపై సంతకాలు చేయడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం సదస్సుకు వ్యాపార విలువను జోడించింది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో చెరో రూ.1,500 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకోగా, రాష్ట్ర పరిశ్రమల శాఖ- ప్రైమ్ ఫోకస్, గోద్రెజ్ సంస్థలతో వరుసగా రూ.3,000 కోట్లు, రూ.2,000 కోట్ల విలువైన ఎంవోయూలపై సంతకాలు చేసింది.
గ్లోబల్ మీడియా డైలాగ్ 2025లో 'వేవ్స్ డిక్లరేషన్'ను ఆమోదించిన సభ్య దేశాలు
ముంబయిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) సందర్భంగా జరిగిన గ్లోబల్ మీడియా డైలాగ్ 2025 ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా నిలిచింది. 77 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనడం ప్రపంచ మీడియా, వినోద రంగంలో భారతదేశ కీలకపాత్రను ధ్రువీకరించింది.
ఈ చర్చలో సాంస్కృతిక సునిశితత్వాన్ని గౌరవిస్తూనే సృజనాత్మకతను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సహకారాల శక్తిని చాటి చెప్పారు. సభ్య దేశాలన్నీ కలసి వేవ్స్ డిక్లరేషన్ ను ఆమోదించాయి. ఇందులో డిజిటల్ అంతరాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను, ప్రపంచ శాంతి, ఐక్యత కోసం మీడియాను ఉపయోగించవలసిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
విభిన్న సంస్కృతులను ఏకం చేయడంలో చలనచిత్రాల కీలక పాత్రను, సాంకేతిక పురోగతితో విస్తరించిన సృజనాధారిత ఆర్థికవ్యవస్థలో వ్యక్తిగత కథల పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సదస్సులో మాట్లాడుతూ- సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయం మధ్య సమన్వయం అవసరమని, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా యువత సాధికారతను సాధించాలని సూచించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కంటెంట్ సృష్టిపై మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని ప్రస్తావించారు. స్థానిక కంటెంట్ ను ప్రోత్సహించడం, సహ-నిర్మాణ ఒప్పందాలు, సమష్టిగా నిధులను పొందడం ఎంత ముఖ్యమో ఆయన ప్రత్యేకంగా వివరించారు. 700 మందికి పైగా ప్రపంచ సృజనకారులను విజయవంతంగా గుర్తించిన భారతదేశ "క్రియేట్ ఇన్ ఇండియా" ఛాలెంజ్ లను ప్రదర్శించారు. వచ్చే ఎడిషన్ లో వాటిని 25 భాషలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఈ సదస్సు మీడియా, వినోద రంగాలలో భవిష్యత్ ప్రపంచ సహకారానికి బలమైన పునాదిని వేసింది. సృజనాత్మక నైపుణ్యం, నైతిక విలువలు కలిగిన కంటెంట్ సృష్టికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చింది.
వేవ్ఎక్స్ : మీడియా, వినోద రంగంలో ఔత్సాహిక స్టార్టప్ ల కోసం యాక్సిలరేటర్
వేవ్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ 30 మీడియా, వినోద స్టార్టప్ లను ఎంపిక చేసి తమ ప్రత్యేక ఆలోచనలను నేరుగా లుమికై, జియో, సిఎబిఐఎల్, వార్మప్ వెంచర్స్ వంటి భారీ పెట్టుబడిదారులకు అందించడానికి అవకాశం కల్పించింది.1000కి పైగా రిజిస్ట్రేషన్లతో ఈ కార్యక్రమం, రూ. 50 కోట్ల విలువైన పెట్టుబడుల చర్చలను ప్రారంభించింది. ఇవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. దానితో పాటు, 100కి పైగా స్టార్టప్స్ తమ ఆలోచనలు, ఉత్పత్తులను ప్రత్యేక స్టార్టప్ పెవిలియన్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న ఇన్వెస్టర్ల ఎదుట ప్రదర్శించాయి. మీడియా, వినోద రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏంజెల్ ఇన్వెస్టర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం ద్వారా స్టార్టప్ లు వృద్ధి చెందడానికి, ఎదగడానికి ఒక స్పష్టమైన పెట్టుబడి వ్యవస్థను సృష్టించడం వేవ్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. టైర్ 1, టైర్ 2కు చెందిన స్టార్టప్ లు వేవ్ ఎక్స్ లో మెరిశాయి. వాటి వ్యవస్థాపకులు కేంద్ర బిందువుగా మారారు. ఇలాంటి సృజనకారులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వేవ్ఎక్స్ ప్రత్యేక మార్గదర్శకులతో ఇంక్యుబేటర్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేయనుంది. వేవ్ఎక్స్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఇంకా స్పష్టమైన ఉత్పత్తిని కలిగిలేకున్నా, గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆలోచనలకు మద్దతు అందిస్తుంది.
వేవ్స్ 2025లో విడుదల చేసిన కీలక విజ్ఞాన నివేదికలు
వేవ్స్ శిఖరాగ్ర సదస్సు 2025లో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఐదు కీలక నివేదికలను విడుదల చేశారు. ఈ నివేదికలు అభివృద్ధి చెందుతున్న భారత మీడియా, వినోద రంగాలపై సమగ్ర అవలోకనాన్ని అందిస్తాయి. ఇందులో కంటెంట్ ఉత్పత్తి, విధాన పద్ధతులు, లైవ్ ఈవెంట్లు వంటి ముఖ్యాంశాలను పొందుపరిచారు.
మీడియా, వినోద రంగాలపై స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ 2024-25: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ భారతదేశ మీడియా రంగం గురించి విలువైన డేటా ఆధారిత అవగాహనలను అందిస్తుంది. ఇది బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ మీడియా, ఫిల్మ్ సర్టిఫికేషన్లు, పబ్లిక్ మీడియా సేవలలో పురోగతి ధోరణులను తెలియచేస్తుంది. అనుభవపూర్వక ఆధారాల ఆధారంగా భవిష్యత్ విధాన రూపకల్పన, పరిశ్రమ వ్యూహాలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
కంటెంట్ నుంచి వాణిజ్యం వరకు - బీసీజీ:, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక భారతదేశ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ లో వేగవంతమయిన వృద్ధిని వివరిస్తుంది. ఇందులో 2 నుండి 2.5 మిలియన్ల క్రియాశీల డిజిటల్ సృష్టికర్తలను అంచనా వేసింది. ఈ సృష్టికర్తలు వార్షిక వ్యయంలో 350 బిలియన్ డాలర్లకు పైగా ప్రభావాన్ని చూపుతారు. ఇది 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఇది సృష్టికర్తలతో వ్యాపార లావాదేవీల కంటే దీర్ఘకాలిక, ప్రామాణిక భాగస్వామ్యాలను నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తుంది.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ రూపొందించిన 'ఎ స్టూడియో కాల్డ్ ఇండియా: భాషా వైవిధ్యం, గొప్ప సంస్కృతి, సాంకేతిక నైపుణ్యం దృష్ట్యా భారతదేశాన్ని ప్రపంచ కంటెంట్ హబ్ గా ఎర్నెస్ట్ అండ్ యంగ్స్ నివేదిక అభివర్ణించింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సేవల్లో భారత్ 40 నుంచి 60 శాతం వ్యయ ప్రయోజనాన్ని, భారతీయ ఓటీటీ కంటెంట్ కు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ ను ఇది ప్రముఖంగా సూచిస్తుంది. ప్రపంచ సాంస్కృతిక దౌత్యంలో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తుంది.
లీగల్ కరెంట్స్, ప్రత్యక్ష ఈవెంట్స్ ఇండస్ట్రీ నివేదికలు: ఖైతాన్ కంపెనీ లీగల్ హ్యాండ్ బుక్ ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కాంప్లయిన్స్ నిబంధనలు వంటి కీలక అంశాలను కవర్ చేస్తూ, మీడియా వాటాదారులను భారతదేశ నియంత్రణల వ్యవస్థను సమర్థవంతంగా నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. భారతదేశ లైవ్ (ప్రత్యక్ష) కార్యక్రమాల విభాగంపై శ్వేతపత్రం ఈ రంగం 15% వృద్ధి రేటును చూపుతున్నది. అభివృద్ధి చెందుతున్న ఈ రంగానికి మద్దతు ఇవ్వడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు, సరళమైన లైసెన్సింగ్ ప్రక్రియల అవసరాన్ని సూచిస్తుంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ: జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ముంబయిలో జాతీయ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పాటు చేస్తోన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ) సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించటంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌లపై పనిచేయనున్న ఈ సంస్థను వేవ్స్ 2025 మూడో రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఐఐసీటీని మీడియా, వినోద రంగంలో ప్రపంచ స్థాయి సంస్థగా మార్చేందుకు పారిశ్రామిక సంఘాలతో వేవ్స్ వేదికగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలను లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. మీడియా, వినోద రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకత్వ స్థాయికి భారత్‌కు ఎదిగే సామర్థ్యం ఉందని ప్రధానంగా ప్రస్తావించారు. సాంకేతిక, మేనేజ్ మెంటు విద్యలో ఐఐటీలు, ఐఐఎంలు ఎలా మైలురాళ్లుగా ఉన్నాయో.. ఐఐసీటీ కూడా తన రంగంలో ఒక ప్రధాన సంస్థగా మారనుందని అన్నారు. జియోస్టార్, అడోబ్, గూగుల్, యూట్యూబ్, మెటా, వయాకామ్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీలు దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం ముందుకు వచ్చాయి.
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్, క్రియేటోస్పియర్: సృజనాత్మక నైపుణ్యాల విషయంలో ప్రపంచ స్థాయి కార్యక్రమం
వేవ్స్ 2025కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) సీజన్ 1 ఒకటి. దీనికి గొప్ప ఆదరణ లభించింది. 60కి పైగా దేశాల నుంచి దాదాపు లక్ష రిజిస్ట్రేషన్లు వచ్చాయి. యానిమేషన్, ఎక్స్ఆర్, గేమింగ్, ఏఐ, చిత్ర నిర్మాణం, డిజిటల్ మ్యూజిక్ తదితర విభాగాల్లోని క్రియేటర్లను సీఐసీ ఏకతాటిపైకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రియేటర్ స్టార్‌గా మారిపోయారు.
భవిష్యత్తులో తలెత్తే అంశాలు, ఊహాత్మక విషయాలకు సంబంధించిన 32 ఛాలెంజ్‌లను నిర్వహించారు. వీటి నుంచి 750కు పైగా తుదిపోటీదారులను ఎంపికచేశారు. ఈ ఛాలెంజ్‌లలో 1100కు పైగా అంతర్జాతీయ పోటీదారులు పాల్గొనటం విశేషం. వేవ్స్‌లో సృజనాత్మకతను ప్రదర్శించేందుకు కేటాయించిన ప్రత్యేకమైన క్రియటోస్పియర్‌లో ఈ తుదిపోటీదారులు తమ ప్రాజెక్టులను వీక్షకుల ముందుంచారు. పరిశ్రమల ప్రతినిధులతో అనుసంధానమ్యే అవకాశం కూడా క్రియటోస్పియర్ వారికి కల్పించింది.
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ కేవలం పోటీగా మాత్రమే కాకుండా.. సంప్రదాయం, సాంకేతికత కేంద్రంగా వైవిధ్యం, యువజన శక్తి, కథాకథనాలను వేడుకగా జరుపుకునే ఉద్యమంగా మారింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12 నుంచి 66 ఏళ్ల మధ్య వయస్కులు పాల్గొనటంతో ఈ కార్యక్రమం సమగ్రతను, ఆకాంక్షకు ప్రతిరూపంగా మారింది. రేపటి సృజనాత్మక భారత్‌ను అద్దం పట్టేలా క్షేత్రస్థాయి ఆవిష్కరణలు, డ్రోన్ స్టోరీటెల్లింగ్, భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న కంటెంట్‌లకు ఇది ఒక ఆవిష్కరణ వేదికగా తయారైంది. సీఐసీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నట్లుగా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి వాటితో ఈ జోరు మరింత ఊపందుకోనుంది.
8వ జాతీయ సామాజిక రేడియో సదస్సు, సీఆర్లకు జాతీయ అవార్డులు
వేవ్స్‌లో భాగంగా నిర్వహించిన 8వ జాతీయ సామాజిక రేడియో సదస్సులో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ 12 అత్యుత్తమ స్టేషన్లను జాతీయ సామాజిక రేడియో అవార్డులతో సత్కరించారు. విజేతలను అభినందించిన ఆయన.. ఆవిష్కరణ, సమ్మిళితత్వం, ప్రభావం ద్వారా భారత్‌లో సామాజిక మీడియా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ జాతీయ సదస్సు లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా సామాజిక రేడియో (సీఆర్) స్టేషన్ల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ సదస్సు.. భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు, చర్చలు జరిపేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 531 సీఆర్ స్టేషన్లు ఉన్నాయి.
భారత్ పెవిలియన్ - కళ నుంచి కోడ్ వరకు భారత్ ప్రయాణం
భారతదేశ స్టోరీ టెల్లింగ్ సంప్రదాయాల గుండా తీసుకెళ్లే ఇమ్మర్సివ్ వ్యూ జోన్ అయిన భారత్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి ఘన స్వాగతం, స్పందన లభించింది. "కళ నుంచి కోడ్ వరకు" అనే ఇతివృత్తం కింద ఈ పెవిలియన్ మౌఖిక, దృశ్య సంప్రదాయాల నుంచి అత్యాధునిక డిజిటల్ ఆవిష్కరణల వరకు మీడియా, వినోద రంగంలో భారత్ ప్రయాణాన్ని తెలియజేసింది.
ఈ పెవిలియన్ దేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, జరుగుతోన్న సాంకేతిక పురోగతిని సమతుల్యం చేస్తూ భారతదేశ ఆత్మను వీక్షకుల ముందుంచింది. వేవ్స్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పెవిలియన్‌ను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, అనేక మంది ప్రముఖులు భారత్ పెవిలియన్‌ను సందర్శించి.. కథలను చెప్పడంలో దాని పాత్రను ప్రశంసించారు. పెవిలియన్‌కు భారీగా సందర్శకులు వచ్చారు. మన దేశానికి చెందిన అనేక విషయాలను తెలుసుకొని వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
భారత్ సృజనాత్మక ప్రయాణాన్ని వేడుక చేసుకునే భారత్ పెవిలియన్ కేవలం కంటెంట్ ప్రదర్శన వేదికగా మాత్రమే కాకుండా ఒక క్రియేటర్‍గా భారత్‌కు ఉన్న శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించే కేంద్రంగా నిలిచింది. ప్రపంచ స్టోరీ టెల్లింగ్‌లో భారతదేశ సంస్కృతి, కళాత్మక ఔన్నత్యాన్ని తెలియజేసింది.
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తూ ముగిసిన వేవ్స్
సృజనాత్మకత, వాణిజ్యం, భాగస్వామ్యాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రపంచ స్థాయి వేదికగా వేవ్స్ 2025 ఒక ప్రామాణికతను ఏర్పాటు చేసింది. దార్శనిక విధాన ప్రకటనలు, చారిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి బలమైన వ్యాపార ఒప్పందాలు, అద్భుతమైన అంకుర పెట్టుబడుల వరకు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయి నాయకత్వ స్థానానికి ఎదుగుతోన్న భారత్ ఖ్యాతిని ఈ సదస్సు ప్రధానంగా వ్యక్తపరిచింది. 77 భాగస్వామ్య దేశాలు వేవ్స్ డిక్లరేషన్‌ను ఆమోదించడం.. వేవ్ బజార్, వేవ్ఎక్స్ యాక్సిలరేటర్ విజయం సాధించటం అనేవి సమష్టి సృజనాత్మకత, సమ్మిళితత్వం, అంతర్జాతీయ భాగస్వామ్యాల మేళవింపుతో కూడిన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి. తెరపడుతోన్న ఈ చారిత్రాత్మక మొదటి విడత వేవ్స్ భారతదేశ సృజనాత్మక శక్తిని ప్రదర్శించడమే కాకుండా సుస్థిర ప్రపంచ గమనాన్ని ప్రేరేపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు స్ఫూర్తినివ్వటం, వారిపై పెట్టుబడులు పెట్టటం, వారిని ఉన్నత స్థాయిని తీసుకెళ్లటంలో పనిచేయటాన్ని కొనసాగిస్తునే ఉంటుంది.
అధికారిక తాజా సమాచారం కోసం మమ్మల్ని ఇక్కడ అనుసరించండి:
ఎక్స్ :
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్‌స్టాగ్రామ్:
https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
***
Release ID:
(Release ID: 2126953)
| Visitor Counter:
8