సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రపంచ మేధోసంపత్తి (ఐపీ) అనుబంధ విస్తారిత వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది: డబ్ల్యూఐపీఓ డైరెక్టర్ జనరల్ డరేన్ ట్యాంగ్...
* ‘అన్ని దేశాల్లో ఉద్యోగకల్పనకు, అభివృద్ధికి, నవకల్పనకు ఐపీ ప్రేరకంగా పనిచేస్తుంది’
* ‘‘ఆడియో-విజువల్ కళాకారులు, కంటెంట్ క్రియేటర్ల విషయంలో ఐపీతో పాటు కాపీరైట్ పోషించే పాత్ర’’ అంశంపై వేవ్స్ 2025లో కార్యక్రమం... లోతైన అవగాహన నిచ్చిన సంభాషణ
Posted On:
01 MAY 2025 8:06PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలో జియో వరల్డ్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’)లో భాగంగా ‘‘ఆడియో-విజువల్ కళాకారులు, కంటెంట్ క్రియేటర్ల విషయంలో ఐపీతో పాటు కాపీరైట్ పోషించే పాత్ర’’పై బృంద చర్చను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగం, లీగల్ రంగం, సృజనాత్మక పరిశ్రమ.. ఈ మూడు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని డిజిటల్ యుగంలో సృజనకారులకు సాధికారత కల్పించడంలో మేధోసంపత్తి (ఐపీ) హక్కుల పాత్రపై తమ తమ ఆలోచనలను పంచుకున్నారు.
చట్ట జగతిలో సరికొత్తగా చోటు చేసుకుంటున్న మార్పులపై బృంద సభ్యులు చర్చించారు. మేధోసంపత్తి హక్కుల పట్ల ఇప్పటి కంటే ఎక్కువ చైతన్యాన్ని, సురక్షను పెంపొందించాల్సిన అవసరం ఎంతయినా ఉందని, ప్రత్యేకించి కళాకారులు, కంటెంట్ క్రియేటర్ల విషయంలో ఇది తక్షణావసరమని, ఎందుకంటే వారి కృషిని అనధికారిక ఉపయోగిస్తూ, ఒక విధంగా దోచుకొంటున్న సందర్భాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చర్చలో పాల్గొన్న వారు అన్నారు.
నిపుణులు, సృజనాత్మక కళాకారులతో కూడిన లబ్ధప్రతిష్ఠ బృందం పరస్పరం హుషారైన చర్చాకార్యక్రమాన్ని సీనియర్ న్యాయవాది శ్రీ అమీత్ దత్తా సమన్వయపరిచారు. ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) డైరెక్టర్ జనరల్ శ్రీ డరేన్ ట్యాంగ్ కూడా ప్యానలిస్టులలో ఒకరుగా ఉండి, ప్రపంచమంతటా కళాకారులకు దృఢమైన కవచంగా మారడంలో డబ్ల్యూఐపీఓ చేస్తున్న కృషిని, విధానపరమైన నియమ నిబంధనలను తెలియజేశారు. మేధోసంపత్తి హక్కుల రక్షణ దిశగా గత 50 సంవత్సరాల్లో భారత్ వేసిన అడుగులు ప్రశంసాపాత్రంగా ఉన్నాయని, దేశంలో సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థ (క్రియేటివ్ ఎకానమీ) భారీ స్థాయికి చేరుకొందని ఆయన అన్నారు. ప్రపంచ ఐపీ అనుబంధ విస్తారిత వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఐపీ అన్ని దేశాలలోనూ ఉద్యోగకల్పన, అభివృద్ధి, నవకల్పనలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని ఆయన వివరించారు. డబ్ల్యూఐపీఓ చెబుతున్న సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థ డేటా నమూనాను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఇది క్రియేటివ్ ఎకానమీ విస్తృతిని కొలవడానికి మెరుగైన కొలబద్దలను వెతకడంలో తన సభ్యదేశాల విధాన రూపకర్తలకు, ఆర్థికవేత్తలకు, సృజనకారులకు సాయపడుతోందని ఆయన చెప్పారు.
సృజనాత్మక కృతులను పదిలపరచడంలో ఎదురవుతున్న సవాళ్లపై శ్రీ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈయన ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు. రంగస్థల ప్రదర్శనలకు దశాబ్దాల తరబడి తోడ్పాటును అందించిన అనుభవం ఈయన సొంతం. మేధోసంపత్తి మానవ ఆత్మగౌరవానికి సంబంధించింది, కళాకారుల శ్రమను గౌరవించడాన్ని సమాజం ముందుగా నేర్చుకోవాలి అంటూ శ్రీ ఖాన్ హితవు పలికారు.
దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో కథను చెప్పే కళలో పెడుతున్న పెట్టుబడులను సంరక్షించడంలో కాపీరైట్‌కున్న ప్రాధాన్యాన్ని గురించి, ప్రపంచ వ్యాప్తంగా ప్రమాణికీకరించిన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గురించి ప్రముఖ చలనచిత్ర, టీవీ నిర్మాత శ్రీ స్టీవ్ క్రోన్ ప్రధానంగా వివరించారు. కాపీరైట్ కేవలం డబ్బు గురించి కాక, సృజనశీలురి ఆవిష్కారాలను శ్రమదోపిడీ బారి నుంచి కాపాడడానికి కూడా ఉద్దేశించిందని ఆయన అన్నారు.
తల పండిన చిత్రానువాద రచయిత శ్రీ అంజుమ్ రాజాబలి మాట్లాడుతూ, సృజనాత్మక ప్రక్రియ లోతుపాతుల గురించి వివరించారు. నానాటికీ జటిలంగా మారిపోతున్న కంటెంట్ ప్రధాన ఆర్థిక వ్యవస్థ సూక్ష్మాలను రచయితలు, రచయిత్రులు ఆకళింపు చేసుకోవాల్సిన అవసరంతోపాటు వారు తమ హక్కుల కోసం నిలదీసి మరీ వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కనువిప్పు కలిగించారు.
కాపీరైట్‌ను కలిగి ఉండటం, లైసెన్సింగ్, నైతిక హక్కులు , కృత్రిమ మేధ (ఏఐ) రాకతో పడే ప్రభావం, శరవేగంగా డిజిటలీకరణకు లోనవుతున్న ప్రపంచంలో విస్తృతికి, సంరక్షణకు మధ్య సమతౌల్యాన్ని సాధించడం .. ఇలా అనేక అంశాలపై బృంద చర్చలో పాల్గొన్నవారంతా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ముగింపు దశకు చేరుకున్నంత వరకు వివిధ అంశాలపై క్షుణ్నంగా చర్చించారు.
***
Release ID:
(Release ID: 2126091)
| Visitor Counter:
11