సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సంస్కృతి అనేది బ్రాండ్లు తమ ప్రేక్షకులను అర్థం చేసుకోవడానికి, వారి ఆఫర్లను వ్యక్తిగతం చేయడానికి, అర్థవంతమైన
సంబంధాలను పెంపొందించడానికి దోహదపడే శక్తిమంతమైన కోణం: వేవ్స్ లో ప్రేమ్ నారాయణ్, ఒగిల్వి
సంస్కృతి బ్రాండ్ నిర్మాణానికి ఇంధనం – వేవ్స్ లో ఆలోచనలు రేకెత్తించిన ప్రేమ్ నారాయణ్, ఒగిల్వీ మాస్టర్‌క్లాస్
Posted On:
01 MAY 2025 6:02PM
|
Location:
PIB Hyderabad
వేవ్స్ తొలి రోజున ఒగిల్వీకి చెందిన చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీ ప్రేమ్ నారాయణ్ బ్రాండ్ నిర్మాణంపై నిర్వహించిన ఆసక్తికరమైన మాస్టర్‌క్లాస్‌లో... భారత వినియోగదారుని ఆకట్టుకునే బ్రాండ్లను నిర్మించేందుకు సంస్కృతిని శక్తిమంతంగా వినియోగించుకోవడంపై సమగ్ర అవగాహనను అందించారు.
"బ్రాండ్ లను నిర్మించడానికి ఇంధనంగా సంస్కృతి" అనే అంశంపై జరిగిన సెషన్ లో, బ్రాండ్ కథనాలను రూపొందించడంలోనూ, వినియోగదారుల ధోరణులను ప్రభావితం చేయడంలోనూ సంస్కృతి పోషించే కీలకపాత్రను శ్రీ నారాయణ్ వివరించారు. భారతీయ వాణిజ్య ప్రకటనలు సాంస్కృతిక సంప్రదాయాలలో మూలాలను స్థిరపరుచుకుని ఎలా అభివృద్ధి చెందాయో, అలాగే సాంస్కృతిక విలువలతో సమన్వయం సాధించిన బ్రాండ్లు ఎలా దీర్ఘకాల వినియోగదారుల నిబద్ధతను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందో శ్రీ నారాయణ్ ప్రదర్శించారు.
క్యాడ్‌బరీ ప్రకటనల ప్రయాణాన్ని ఒక ఉదాహరణగా చూపుతూ... శ్రీ నారాయణ్ చాక్లెట్‌ను లోతుగా పాతుకుపోయిన సంప్రదాయానికి ఆధునిక వ్యక్తీకరణగా నిలపడం ద్వారా, ఈ బ్రాండ్ విజయవంతంగా భారతీయ 'మీఠా' (తీపి) సంప్రదాయంలో తనను తాను ఎలా పొందుపరచుకుందో వివరించారు. ఈ సాంస్కృతిక సమన్వయం ద్వారా క్యాడ్ బరీ భారతీయ కుటుంబాల్లో ఒక ప్రత్యేకమైన, దీర్ఘకాలిక స్థానం ఏర్పరుచుకుంది. ఇది ఉత్సవాలకే కాకుండా, దైనందిన జీవితంలోని చిన్న చిన్న క్షణాలను కూడా మధురంగా మార్చింది.
ఈ సెషన్‌లో మరో విశేషాంశంగా, సాంస్కృతిక అవగాహనను వినియోగించి బ్రాండ్ ప్రయోజనాలను సమర్థవంతంగా చాటిన ఇతర ప్రచారాల గురించి కూడా ప్రస్తావించారు. ఉదాహరణకు, సియెట్ టైర్లతో సురక్షిత డ్రైవింగ్‌పై ఇచ్చిన సందేశాలు, ఫెవికాల్ హాస్యభరితమే అయినా సాంస్కృతికంగా అనుసంధానమైన కథనాలతో బ్రాండ్ గుర్తింపు, భావోద్వేగ అనుబంధాన్ని గణనీయంగా పెంచాయి.
“బ్రాండ్ లవ్” అనే భావన కేవలం ఒక ఉత్పత్తి లక్షణాలకే పరిమితం కాదని, దాన్ని సాంస్కృతిక పరంగా పొందుపరచ వలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఉదాహరణకి, భారతీయ అతిథి సత్కారానికి ప్రతీకగా ఉన్న టీ అనే సాధారణ ఆలోచనను అనేక బ్రాండ్లు సృజనాత్మకంగా వినియోగించి, ఐక్యతా భావనను, ప్రాచుర్యాన్ని బ్రాండ్ అనుభవాన్ని మరింత హృదయాన్ని తాకేలా అనుభూతిని అందించాయి. అంతేకాక, భారతదేశంలోని విస్తృతమైన భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాంతీయ భావాలకి అనుగుణంగా కమ్యూనికేషన్‌ను తీర్చిదిద్దడం ఎంతగానో ముఖ్యమని శ్రీ నారాయణ్ తెలిపారు. బ్రాండింగ్‌లో ప్రాంతీయీకరణ కేవలం ప్రభావవంతమైనదే కాదు... అది అవసరమని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ మాస్టర్‌క్లాస్‌లో సాంస్కృతిక సందర్భాలు, డిజిటల్ సాంకేతికతల కలయిక వ్యాపార అభివృద్ధికి కొత్త దారులు ఎలా తెరుస్తుందో వివరంగా చర్చించారు. ప్రత్యేకంగా షారుఖ్ ఖాన్‌తో నిర్వహించిన క్యాడ్ బరీ ‘మై యాడ్‘ ప్రచారాన్ని ఉదాహరణగా చూపుతూ... డిజిటల్ సాధనాల సహాయంతో వ్యక్తిగత స్థాయిలో ప్రేక్షకులను చేరుకోవడంతో పాటు, సాంప్రదాయకంగా భాగస్వామ్యం చేసుకునే సాంస్కృతిక క్షణాలపై దృష్టి సారించే హైపర్-పర్సనలైజ్డ్ ప్రకటనలకు ఇది మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు.
డిజిటల్, సామాజిక వేదికలు సాంస్కృతిక సంకేతాలతో నిండి ఉన్నాయని, వాటిని లోతైన, సందర్భానుగుణమైన కథనాల కోసం సమర్థవంతంగా వినియోగించవచ్చని శ్రీ నారాయణ్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ట్రక్కర్ల కోసం రూపొందించిన ఐ టెస్ట్ మెనూ ప్రచారాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఇది కేవలం ఒక నిర్దిష్ట ప్రేక్షకులకు అనుగుణంగా సందేశాన్ని వ్యక్తిగతీకరించడమే కాకుండా, ఇప్పటివరకు 42,000 మందికి పైగా ట్రక్కర్లకు లాభం చేకూర్చడం ద్వారా మానవతావాద దృక్కోణాన్ని కూడా చాటింది.
సెషన్‌న్ను ముగిస్తూ, శ్రీ నారాయణ్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. సంస్కృతి అనేది బ్రాండ్లు తమ వినియోగదారులను అర్థం చేసుకోవడంలో, వారి ఆఫర్లను వ్యక్తిగతీకరించడంలో, భావోద్వేగ బంధాలను ఏర్పరచడంలో ఉపయోగపడే శక్తిమంతమైన దృశ్యకోణం అని ఆయన స్పష్టం చేశారు. భారత మార్కెట్‌లో ఎదగాలనుకునే బ్రాండ్లకు ఈ సెషన్ మార్గసూచిగా నిలిచింది. భారతదేశంతో కలసి ఎదగాలంటే, ప్రజల భాషను, సంప్రదాయాలను ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ వాటిని గౌరవించడమే మార్గమని చాటి చెప్పింది.
***
Release ID:
(Release ID: 2126002)
| Visitor Counter:
12