ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ముంబయిలో పెట్టుబడిదారులతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశం: ఈశాన్య రాష్ట్రాలపై అంబానీ, బిర్లా, టాటా సంస్థల ఆసక్తి
Posted On:
01 MAY 2025 9:06AM by PIB Hyderabad
- ఈశాన్య భారత్‌లోని 8 రాష్ట్రాలను కలుపుకొంటూ ఈ ప్రాంతాన్ని దేశాభివృద్ధిలో కీలకంగా మార్చడమే లక్ష్యం’’: కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
- ఎన్ఈఆర్‌పై పారిశ్రామిక దిగ్గజాల ఆసక్తి
- మే 23, 24 తేదీల్లో భారత్ మండపంలో రైజింగ్ నార్త్ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2025 నిర్వహణ
ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక దిగ్గజాలతో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా అధ్యక్షతన సమావేశం జరిగింది.
పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కుమార్ మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్), ఎన్.చంద్రశేఖరన్ (టాటా సన్స్)తో ముంబయిలో వరుస సమావేశాలను కేంద్ర మంత్రి నిర్వహించారు. ఇవి బుధవారం (2025, ఏప్రిల్ 30) జరిగాయి. ఈ సమావేశాలను మే నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ‘‘రైజింగ్ నార్త్‌ఈస్ట్ సమ్మిట్ 2025’’ పెట్టుబడుల సదస్సులో భాగంగా నిర్వహించారు.
దేశాభివృద్ధికి సరికొత్త ఇంజినుగా ఈశాన్య ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న భారత ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యాన్ని కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘‘ఈ ఎనిమిది రాష్ట్రాలను ఏకం చేసి భారత వృద్ధిలో కీలకంగా మార్చడమే లక్ష్యం’’ అని తెలిపారు. ఈ ప్రాంతంలో వేగంగా సుస్థిరాభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు పోషించే పాత్రను ఆయన వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను పారిశ్రామికవేత్తలతో మంత్రి చర్చించారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్, ప్రతి రాష్ట్రంలోనూ పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీ (ఐసీఏ)ల ఏర్పాటుతో సహా ఇతర ముఖ్యమైన కార్యక్రమాల గురించి వివరించారు.
ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన పెట్టుబడులు అవకాశాల గురించి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంక సలహాదారు శ్రీ ధర్మవీర్ ఝా వివరించారు.
ఈ ప్రాంతానికి సంబంధించి వృద్ధి సాధించేందుకు అవకాశమున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జౌళి, పర్యాటక రంగాల గురించి ప్రధానంగా చర్చలు కొనసాగాయి.
ఈ ప్రాంతంలోని ఆర్థిక సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు సంబంధిత వర్గాలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ 2025 ఒక వేదిక మీదకు తీసుకొస్తుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో మే 23, 24 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది.
***
(Release ID: 2125732)