పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
గగనతల ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం, భద్రత, నిబంధనల అమలు కోసం-
తక్షణం చర్యలు తీసుకోవాలంటూ విమానయాన సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం
Posted On:
26 APR 2025 1:04PM by PIB Hyderabad
ఇటీవల అంతర్జాతీయ గగనతల మూసివేతలు, విమాన మార్గాలపై ఆంక్షల నేపథ్యంలో, అనేక విమాన మార్గాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ప్రయాణ కాలం పెరగడంతోపాటు ఇంధన అవసరాల కోసం విమానాలను మధ్యలో ఆపాల్సిన అవసరం పెరిగింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత నియంత్రణల అమలును కొనసాగించడానికి మెరుగైన ప్రయాణికుల నిర్వహణ చర్యలను తక్షణమే తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అన్ని విమానయాన సంస్థల్ని ఆదేశించింది.
ప్రధానమైన చర్యలు
స్పష్టమైన సమాచారం: మారిన మార్గాలు, పొడిగించిన ప్రయాణ కాలం, ప్రయాణ సమయంలో సంభవించే సాంకేతిక అంతరాయాల గురించి ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారాన్ని చెక్-ఇన్, బోర్డింగ్ సమయంలో డిజిటల్ అలర్ట్‌ల ద్వారా అందించాలి.
విమానంలో మెరుగైన సేవలు: విమానయాన సంస్థలు అసలు బ్లాక్ టైమ్‌ను ఆధారంగా చేసుకుని క్యాటరింగ్ సేవలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం, మొత్తానికి సరిపడా ఆహారం, తాగునీరు, ప్రత్యేక భోజనాలను సిద్ధంగా ఉంచాలి. సాంకేతిక కారణాలతో నిలిపివేత చోటుచేసుకున్నప్పటికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి.
వైద్య సిద్ధత: ఎయిర్‌లైన్స్ తమ విమానాల్లో తగినంత వైద్య సహాయ సరంజామాను సిద్ధంగా ఉంచాలి. అకస్మాత్తుగా ఆపవలసివస్తే ఆయా విమానాశ్రయాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించాలి.
కస్టమర్ సపోర్ట్ సంసిద్ధత: ఆలస్యాలు, మిస్ అయిన కనెక్షన్లు వంటి సమస్యలను సమర్థంగా నిర్వహించేందుకు కాల్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ బృందాలు సిద్ధంగా ఉండాలి. వర్తించే నిబంధనల ప్రకారం అవసరమైన సహాయం లేదా నష్టపరిహారం అందించాలి.
నిర్వహణ సమన్వయం: విమాన కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇన్ ఫ్లైట్ సేవలు, వైద్య భాగస్వాముల మధ్య అంతరాయం లేని సమన్వయం అవసరం.
ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా అన్ని ఎయిర్‌లైన్స్‌కు సూచించారు. దీనిని పాటించడంలో విఫలమైతే వర్తించే పౌర విమానయాన ఆవశ్యకతల (సిఎఆర్) కింద నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయి.
***
(Release ID: 2124782)
Visitor Counter : 22