బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశంలో భూగర్భ గని తవ్వకాలకు ఊతమిచ్చేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
24 APR 2025 11:05AM by PIB Hyderabad
భారతీయ బొగ్గు రంగాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా- భూగర్భ బొగ్గు తవ్వకాలను పెంచే లక్ష్యంతో బొగ్గు మంత్రిత్వ శాఖ నూతన విధానాలను పరిచయం చేసింది. అధిక మూలధన పెట్టుబడి, గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకొనే ప్రయాణంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఈ సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవి సుస్థిరాభివృద్ధి సాధించాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు రంగాన్ని ఆధునికీకరించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి.
భూగర్భ బొగ్గు తవ్వకాల్లో వృద్ధిని/కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ప్రోత్సాహకాలను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది:
1. ఫ్లోర్ ఆదాయ వాటా తగ్గింపు: భూగర్భ బొగ్గు గనుల్లో వచ్చే ఆదాయ వాటాలో ఫ్లోర్ శాతాన్ని 4 నుంచి 2 శాతానికి తగ్గించింది. ఈ లక్ష్య తగ్గింపు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే భూగర్బ ప్రాజెక్టుల ఆర్థిక శక్తిని సైతం పెంపొందిస్తుంది.
2. ముందస్తు చెల్లింపుల మాఫీ: భూగర్భ తవ్వకాలు చేపట్టే సంస్థలకు ముందస్తు చెల్లింపులు తప్పనిసరిగా చేయాలన్న నిబంధనను పూర్తిగా తొలగించారు. ఈ చర్య ఆర్థిక అవరోధాన్ని తొలగించి, ప్రైవేటు రంగ భాగస్వామ్యం విస్తరించేలా ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసే అవకాశం ఇస్తుంది.
భూగర్భ బొగ్గు బ్లాకుల్లో సురక్షితమైన కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అందిస్తున్న 50 శాతం రిబేటుకు ఈ ప్రోత్సహాకాలు అదనం. ఇవి సమష్టిగా ప్రాజెక్టు అమలును సులభతరం చేస్తాయి.
ఈ సంస్కరణల ఆధారిత విధానం భవిష్యత్తు అవసరాలను తీర్చే, పెట్టుబడి అనుకూలమైన, ఆవిష్కరణల ఆధారంగా నడిచే బొగ్గు రంగాన్ని ప్రోత్సహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. అలాగే భూగర్భ గనుల తవ్వకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రభుత్వం పెంపొందిస్తుంది. అదేవిధంగా, ఈ రంగాన్ని అత్యధిక సామర్థ్యం, భద్రత, ఉపాధి కల్పన దిశగా నడిపిస్తోంది.
భూగర్భ బొగ్గు మైనింగ్ పర్యావరణ అనుకూలం. ఓపెన్ కాస్ట్ కార్యకలాపాలతో పోలిస్తే ఉపరితల భూభాగానికి చాలా తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విధాన చర్యలు పర్యావరణ సమతుల్యాన్ని సంరక్షించే కంటిన్యుయస్ మైనర్లు, లాంగ్ వాల్ వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్ పరికరాలు, ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థలు, తదితర అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించేలా ప్రోత్సహిస్తాయి.
పర్యావరణహితమైన, సుస్థిరమైన బొగ్గు వెలికితీసే పద్ధతులను అనుసరించే దిశగా తీసుకున్న వ్యూహాత్మక చర్యగా ఈ పురోగతి ఆధారిత సంస్కరణలను వర్ణించవచ్చు. భూగర్భ మైనింగ్‌లో భారత్ సామర్థ్యాన్ని వెలికితీయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, కార్భన్ ఉద్గారాలను తగ్గించడానికి, జాతీయ ఇంధన భద్రత, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాల సాధనకు సహకారం అందించడమే వీటి లక్ష్యం.
***
(Release ID: 2124034)
Visitor Counter : 10