WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేదికలో పాల్గొనేందుకు అర్హత ప్రమాణాలను విస్తరించిన వేవెక్స్-2025, దరఖాస్తుల తుది గడువు ఏప్రిల్ 21 వరకు పొడిగింపు


మీడియా-టెక్ అంకుర పరిశ్రమల ప్రతిష్ఠాత్మక వేదికలో భాగమయ్యేందుకు పాత పరిశ్రమలకు అవకాశం.. పోటీ పట్ల పెరిగిన ఆసక్తి

 Posted On: 16 APR 2025 5:47PM |   Location: PIB Hyderabad

మీడియా, వినోద రంగ సాంకేతికతల్లో అంకుర పరిశ్రమలకు దిక్సూచి వంటి వేవెక్స్-2025లో పాల్గొనేందుకు రెండు కీలక తాజా సమాచారాలను ప్రకటించారు. వేదికలో భాగస్వామ్యాన్ని, తద్వారా వెలికివచ్చే సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఎంఐబీ), మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఎఐ) వేవెక్స్ అర్హత ప్రమాణాలను విస్తరించి,  దరఖాస్తులు చేసుకునే తుది గడువును ఏప్రిల్ 21 వరకు పొడిగించారు.  

తొలుత 2020, అటు తరువాత స్థాపించిన అంకుర పరిశ్రమలకు మాత్రమే ప్రవేశార్హత కల్పించినప్పటికీ, ఇప్పుడు 2016, లేదా అటుపై ప్రారంభించిన అంకుర పరిశ్రమలకు కూడా వేవెక్స్-2025 వేదికలో భాగ్యమయ్యే అవకాశాన్ని అందిస్తున్నారు. దృఢత్వం, అభివృద్ధి, మీడియా-టెక్ రంగంపై గట్టి ప్రభావాన్ని చూపిన భాగస్వాములు ఈ చర్య వల్ల వేదిక వైపు ఆకర్షితులు కాగలరని  భావిస్తున్నారు.

వేదిక పట్ల పారిశ్రామికవేత్తలు కనపరుస్తున్న ఆసక్తి, వారి నుంచి అందిన అభ్యర్థనల దృష్ట్యా, నమోదు తుది గడువును ఏప్రిల్ 21 వరకు పొడిగించారు. పొడిగింపు వల్ల మీడియా-టెక్ రంగ ఔత్సాహిక సృజనకారులు తమ ప్రతిపాదనలను అందించేందుకు మరింత సమయం లభించడమే కాక, జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్ని  దక్కించుకుంటారు.

ముంబయిలో జరిగే వేవ్స్-2025లో భాగంగా మే 2, 3 తేదీల్లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వేవెక్స్ పెట్టుబడి  ప్రతిపాదనల కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోద రంగ సదస్సు (వేవ్స్)లో కీలక భాగమైన వేవెక్స్, గేమింగ్, యానిమేషన్, ఎక్స్ ఆర్, మెటావర్స్, జెనరేటివ్ ఏఐ, కంటెంట్ టెక్నాలజీలు వంటి రంగాల్లోని అంకుర పరిశ్రమలకు ప్రతిష్ఠాత్మక ప్రవేశావకాశాలను కల్పిస్తుంది.  

ఎంపికైన అంకుర పరిశ్రమ బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటైన సమావేశాల్లో ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, అగ్రస్థాయి ఏంజెల్ ఇన్వెస్టర్ల ఎదుట తమ ప్రతిపాదనలను ఉంచుతారు. ఈ విధంగా ప్రముఖుల దృష్టిలో గుర్తింపు దక్కించుకోవడమే కాక, పరిశ్రమ నేతల వద్ద నుంచి మెంటార్షిప్ అవకాశాలను పొందుతారు. ప్రపంచస్థాయి భాగస్వాములు ఎదుట తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం, పేరొందిన టెక్నాలజీ, మీడియా సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను సొంతం చేసుకుంటారు.  

కొత్త ఆలోచనల ప్రదర్శన వేదికగానే కాక,  డిజిటల్ యుగంలో కంటెంట్ సృష్టి మార్గాలు, పంపిణీ, ఆదాయ మార్గాలకు ఊతమిచ్చే వేదికగా వేవెక్స్ ను రూపుదిద్దారు.  

అధికారిక వేవెక్స్ పోర్టల్  https://wavex.wavesbazaar.com   ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు.

 

వేవ్స్ నేపథ్యం

మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి  4వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు.

మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా..  ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, నిపుణులతో అనుసంధానమై మరింత తోడ్పాటును అందించే అవకాశాలని  సదస్సు కల్పిస్తుంది.

కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ, సంగీత రంగం, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.
 
మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు  ఇక్కడ

 పీఐబీ టీం వేవ్స్  అందించే తాజా సమాచారంతో అప్డేట్ అవ్వండి.

 

మాతో ప్రయాణించేందుకు సన్నద్ధమవండి

ఇప్పుడే మీ పేర్లను  నమోదు చేసుకోండి. 

 

***


Release ID: (Release ID: 2122410)   |   Visitor Counter: 18