WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్-2025 ‘క్రియేట్ ఇన్ ఇండియా’ యాంటీ పైరసీ చాలెంజ్‌లో తుదిపోటీలకు ఏడుగురి ఎంపిక


యాంటీ పైరసీ ఛాలెంజ్‌కు పరిశ్రమ, అభ్యర్థుల నుంచి అద్భుత స్పందన

దేశ వ్యాప్తంగా అంకుర సంస్థలు, సాంకేతిక, పరిశోధన సంస్థలు,

విద్యార్థుల నుంచి 132 సూచనలు.. 1,600కు పైగా నమోదులు

 నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2025 6:21PM |   Location: PIB Hyderabad

 వేవ్స్ (ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు)-2025 ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యాంటీ-పైరసీ చాలెంజ్‌లో తుది పోటీలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మే 1నుంచి 4 వరకు ముంబయిలో వేవ్స్ సదస్సు నిర్వహిస్తోంది.

వేలిముద్రలు, ప్రామాణిక చిహ్నల (వాటర్ మార్కులు) వినియోగంలో సాంకేతిక పురోగతి లక్ష్యంగా ప్రారంభించిన యాంటీ పైరసీ చాలెంజ్‌కు పరిశ్రమ, అభ్యర్థుల నుంచి అద్భుత స్పందన లభించింది. గతేడాది సెప్టెంబరు 12న ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రధాన లక్ష్యం - డిజిటల్ పైరసీపై పోరాటంలో ‘మేక్ ఇన్ ఇండియా’ సాంకేతికతలను ప్రోత్సహించడం. ఈ పోటీలో 1,600 మందికి పైగా నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు, సాంకేతిక, పరిశోధన సంస్థలు, విద్యార్థుల నుంచి 132 సూచనలు అందాయి. వివిధ దశల్లో నిశిత పరిశీలనలు, మూల్యాంకనం అనంతరం 15 సూచనలను ఎంపిక చేశారు. ప్రస్తుతం గౌరవ న్యాయ నిర్ణేతల బృందం క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం.. డిజిటల్ కంటెంట్ భద్రతపై ఉత్తమ ఆవిష్కరణలకు గాను తుదిపోటీలకు ఏడుగురు ఎంపికయ్యారు.

ముంబయిలోని జియో సెంటర్‌లో మే 1 నుంచి 4 వరకు జరగనున్న ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)- 2025 సందర్భంగా ఈ ఏడుగురు తుది పోటీదారులు తమ ఆవిష్కరణలను న్యాయ నిర్ణేతల బృందం, ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సదస్సు గ్రాండ్ ఫినాలెలో విజేతలను సత్కరిస్తారు.

తుది పోటీదారులు, వారి ఆవిష్కరణలు:

బృందం పేరు

ప్రతిపాదిత ఆవిష్కరణ

క్లుప్తంగా వివరాలు

అజోవీ ఇన్ఫోటెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

స్టెల్త్‌గార్డ్

మీడియా ఫైళ్లలో బలమైన, గోప్యంగా ఉన్న వాటర్ మార్క్‌లను పొందుపరిచే ఆఫ్‌లైన్ సాధనం. కుదించినా లేదా నమూనా మార్పుల అనంతరం కూడా గుర్తించవచ్చు.

అటామ్‌స్టేట్

మాంక్ డీబీ

వాస్తవిక సమాచారాన్ని పరిశీలించడం, పైరసీని గుర్తించడం కోసం వేలిముద్రలు, వాటర్ మార్కింగును ఉపయోగించుకునే ఏఐ-నేటివ్ వెక్టార్ డేటాబేస్.

న్యూరోనిక్స్

న్యూరోట్రేస్

ఇది వీడియో సంరక్షణకు సంబంధించిన సమగ్ర వ్యవస్థ. ఎన్‌క్రిప్షన్, లైసెన్సింగ్ ధ్రువీకరణ పత్రాలు, సమాచార నియంత్రణ, ఎప్పటికప్పుడు వాటర్ మార్కింగ్, పైరసీ గుర్తింపులను కలుపుతుంది.

గార్డియన్స్ ఆఫ్ ఒరిజినాలిటీ

పైరేట్ ఎక్స్

అనధీకృతంగా సమాచార సేకరణ, అక్రమంగా దానిని సరఫరా చేయడం నుంచి మల్టీమీడియా కంటెంట్‌ను సురక్షితంగా ఉంచడానికి రూపొందించిన అధునాతన డీఆర్ఎం, యాంటీ-పైరసీ వ్యవస్థ.

హమ్మింగ్‌బర్డ్

త్రయంబక

తారుమారు కాకుండా కంటెంట్ సంరక్షణ కోసం సునిశితమైన వాటర్ మార్కింగ్, గూఢలిపితో విభజనలను కలిపే బ్లాక్ చైన్ ఆధారిత వ్యవస్థ.

సైఫర్‌ కోర్

వేలిముద్రతో కూడిన రక్షిత రహస్య లిపి వ్యవస్థ (సెక్యూర్ ఫింగర్ ప్రింట్ స్టెగనోగ్రపీ సిస్టమ్- ఎస్ఎఫ్ఎస్ఎస్)

స్టెగనోగ్రఫీ, క్రిప్టోగ్రాఫిక్ పద్ధతులను ఉపయోగించి డిజిటల్ మీడియాలో సురక్షితమైన వేలిముద్రలను పొందుపరిచే వ్యవస్థ. ఇది పైరసీని మరింత సమర్థవంతంగా నివారించడానికి అవకాశం కల్పిస్తుంది.

వైట్ హాట్ లవర్స్

షాడో స్టాంప్

అదృశ్య, ప్రత్యేకంగా గుర్తించగలిగిన సూచకాలను ఉపయోగించి డిజిటల్ కంటెంటును వాస్తవికంగా పర్యవేక్షించి, గుర్తించగల సూచక ఆధారిత శోధన వ్యవస్థ.

 

పోటీలోని ముఖ్యాంశాలు:

·         వేలి ముద్రలు, ప్రామాణిక చిహ్నాలు, బ్లాక్ చైన్, రహస్య లిపి (స్టెగానోగ్రఫీ) వంటి అధునాతన సాంకేతికతలపై దృష్టి సారించారు.

·         అంకుర సంస్థలు, విద్యార్థులు, సాంకేతిక ఆవిష్కర్తల భాగస్వామ్యం.

·         సంబంధిత రంగంలో నిష్ణాతులు, సాంకేతిక నిపుణులతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం విజేతలను నిర్ణయిస్తుంది.

·         విజయం సాధించిన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. వారికి విశేషమైన మార్గనిర్దేశం, సంబంధిత రంగంలో భాగస్వామ్య/ సహకార అవకాశాలు లభిస్తాయి.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగంలో డిజిటల్ కంటెంట్ భద్రత, సమగ్రత, ప్రామాణికతను రక్షించడం మునుపెన్నడూ లేనంత అత్యావశ్యకం. డిజిటల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పైరసీ, అనధికారిక పంపిణీ, కంటెంట్‌ను తారుమారు చేయడం వంటి ప్రమాదాలు పెరిగాయి. కంటెంట్ సృజనకారులు, పంపిణీదారులు, హక్కుదారులకు ఇది సవాలు విసురుతోంది.

2024లో భారత్‌లో 9 కోట్ల మంది వినియోగదారులు ఆన్‌లైన్ వీడియో పైరసీని వినియోగించారని మీడియా పార్టనర్స్ ఆసియా నివేదిక అంచనా వేసింద. ఇది దాదాపు 1.2 బిలియన్ డాలర్ల మేర నష్టాలకు కలిగించగలదు. బలమైన పైరసీ నివారణ చర్యలను ప్రభావవంతంగా అమలు చేయకపోతే, 2029 నాటికి ఈ సంఖ్య 15.8 కోట్ల వినియోగదారులకు పెరగవచ్చు.

పైరసీని గుర్తించి, నివారించి, తమ మేధో సంపత్తి హక్కుల అమలు కోసం హక్కుదారుల, ప్రసారకులు సాంకేతిక ఆవిష్కరణలపై ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ప్రధాన పైరసీ సైట్లు, సర్వీసుల వెనుక ఉన్న నేరస్తుల ముఠాలు ఆ సాంకేతికతల మౌలిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటిని గందరగోళపరుస్తున్నాయి. దాంతో పైరసీ గుర్తింపు గతంలో కన్నా మరింత క్లిష్టతరమవుతోంది.

ఫింగర్ ప్రింటింగ్, వాటర్ మార్కింగ్ సాధనాల్లో సాంకేతిక ఆవిష్కరణలను పెంపొందించేలా రూపొందించిన ఈ పోటీ.. దేశ డిజిటల్ వ్యవస్థలో భద్రత ఆవశ్యకత పెరుగుతున్నదనేందుకు నిదర్శనం.

భారత్ తన డిజిటల్ భవితను భద్రపరచుకోవడంలో, కీలకమైన సాంకేతిక రంగంలో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో యాంటీ పైరసీ చాలెంజ్ కీలకమైన కార్యక్రమం.

వేవ్స్‌లో భాగంగా సీఐఐ నిర్వహిస్తున్న ఈ పోటీకి ఐపీహౌజ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హాక్ 2 స్కిల్ సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ పోటీల మూల్యాంకన ప్రక్రియలో, సంబంధిత రంగాన్ని కార్యక్రమంలో నిమగ్నం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషించాయి.

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమం తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా...  అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియా, వినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.

భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోంది. కంటెంట్ సృజన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నది. సమాచార ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక కృత్రిమ మేధ, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై దృష్టి సారించారు.

ఇంకా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ చూడండి.

వేవ్స్ పీఐబీ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.

రండి, మాతో కలసి  ప్రయాణించండి! ఇప్పుడే  వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి.  

***


రిలీజ్ ఐడి: 2122332   |   Visitor Counter: 69

ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Nepali , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam