రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో రాష్ట్రపతి సమావేశం


ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మీరు చేపట్టే అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే దేశ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడతాయి: ఐఏఎస్ అధికారులతో ముర్ము

Posted On: 15 APR 2025 1:49PM by PIB Hyderabad

 వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు రాష్ట్రపతి కల్చరల్ సెంటర్లో సమావేశమయ్యారు.

యువ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అసాధారణ సంకల్పం, కృషి ద్వారానే ఐఏఎస్‌లుగా ఎదిగారని ప్రశంసించారు. ఇది వారి వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడు మరింత పట్టుదల, అంకితభావంతో లెక్కలేనంత మంది ప్రజల జీవితాలను మార్చే అవకాశం వారికి ఉందని పేర్కొన్నారు. వారికి లభించిన సేవ, అధికారాల పరిధి విస్తృతమైనదని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ మొదటి పోస్టింగు నుంచే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేయాలని రాష్ట్రపతి వారికి పిలుపునిచ్చారు. ఉద్యోగ జీవితంలో తరచూ క్షేత్ర స్థాయి సందర్శనలు చేపట్టాలని, వారు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంత మేర ప్రజలకు అందుతున్నాయో చూడాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు, విధులను ఎల్లప్పుడూ అధికారులు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ సేవకులు విధులను బాధ్యతగా తీసుకోవాలని ఆ బాధ్యతలను హక్కుగా భావించాలని తెలిపారు.

నిజమైన కెరీర్ సామాజిక మాధ్యమాల్లో తమను అనుసరించే వారి సంఖ్య ద్వారా కాదు, వాస్తవ జీవితంలో పని తీరు ద్వారానే రూపుదిద్దుకుంటుందని అన్నారు. సమాజంలో తమకు దక్కే గౌరవాన్ని సైతం వారి పనితీరే నిర్దారిస్తుందని తెలిపారు.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయతీతో పనిచేయాలని రాష్ట్రపతి అన్నారు. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పుల సవాళ్లను అందరూ ఎదుర్కొంటున్నామని అన్నారు. అనైతికత, విలువల క్షీణతను కూడా తీవ్రమైన సవాళ్లుగానే రాష్ట్రపతి పరిగణించారు. అంకితభావం, నిజాయతీ గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. నిజాయతీ, సత్యం, నిరాడంబరత అనే విలువలను పాటించే ప్రజల జీవితాలు సంతోషంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజాసేవలో నిజాయతీని కచ్చితంగా అనుసరించాలని అన్నారు. ప్రభుత్వోద్యోగులు తమ జీవితంలో ప్రతి అంశంలోనూ సమగ్రత, సున్నితత్వానికి ఉదాహరణగా నిలవాలని ఆశిస్తారని రాష్ట్రపతి పేర్కొన్నారు.

 

డిజిటల్ యుగంలో ప్రజల ప్రాధాన్యతలు మారుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. పరిపాలకుల జవాబుదారీతనం గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రజలతో మమేకమై వారిని స్థానికంగా చేపడుతున్న కార్యక్రమాలను భాగస్వామ్యం చేసేందుకు ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. అలాగే ప్రజా ప్రతినిధులు లేవెనెత్తే ప్రజాప్రయోజన అంశాలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో వారు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జాతీయ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడతాయని అన్నారు.

రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

***


(Release ID: 2121994) Visitor Counter : 10