సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025: ‘మేక్ ద వరల్డ్ వేర్ ఖాది’ పోటీల్లో ఫైనలిస్టుల ప్రకటన
750 రిజిస్ట్రేషన్ల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ ప్రకటనలు: విజేతలకు వేవ్స్ సత్కారం
Posted On:
09 APR 2025 5:00PM by PIB Hyderabad
మే 1 నుంచి 4 వరకు ముంబయిలో నిర్వహించే వేవ్స్ సదస్సు 2025లో భాగంగా 32 విభాగాల్లో నిర్వహిస్తున్న క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో ‘‘మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ’’ ఒకటి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలో ఫైనల్‌కు చేరుకున్న వారి వివరాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
షార్ట్‌లిస్టయిన వారి వివరాలు:
· ఇమన్ సేన్‌గుప్తా, సోహం ఘోష్ – హవాస్ వరల్డ్ వైడ్ ఇండియా
· కార్తీక్ శంకర్, మధుమిత బసు – 22ఫీట్ ట్రైబల్
· కాజల్ తిర్లోత్కర్ – ఇంటరాక్టివ్ అవెన్యూస్
· తన్మయ్ రౌల్, మందార్ మహాదిక్ – డీడీబీ ముద్ర గ్రూప్
· ఆకాశ్ మేజరీ, కాజోల్ జశ్వానీ – డీడీబీ ముద్ర గ్రూప్
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నం దగ్గర నుంచి ఫ్యాషన్లో సుస్థిర పరిష్కారాల వరకు ఖాదీ గుర్తింపులో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ.. తాము రూపొందించిన డిజైన్ల ఇతివృత్తాన్ని పోటీల్లో పాల్గొన్నవారు పంచుకున్నారు.
‘కాలానికి నిదర్శనం.. నెమ్మదిగా, మనోహరంగా, జాగ్రత్తగా నేసిన వస్త్రం’ గా కాజల్ తిర్లోత్కర్ ఖాదీని వర్ణించారు. అలాగే ఖాదీని ‘భవిష్యత్తు వస్త్రం’గా పేర్కొంటూ వేగంగా మారుతున్న ఫ్యాషన్ ధోరణుల వల్ల కలుగుతున్న పర్యావరణ నష్టాన్ని పరిష్కరించే అంశంలో దాని సామర్థ్యాన్ని తన్మయ్ రౌల్, మందార్ మహాదిక్ తెలిపారు. వాతావరణ చైతన్యాన్ని పెంపొందించి, పర్యావరణ నష్టాన్ని తగ్గించే పరిష్కార మార్గంగా ఆకాశ్ మేజరీ, కాజోల్ జశ్వానీ సూచించారు. అలాగే ఖాదీకున్న ఆర్థిక, సాంస్కృతిక విలువను ఇమన్ సేన్‌గుప్తా, సోహం ఘోష్ తెలియజేశారు. గ్లోబల్ ఫ్యాషన్‌లో ఉత్తమమైన, ప్రయోజన ఆధారిత ఎంపిక అని తెలిపారు.
సుస్థిరత, గుర్తింపునకు అంతర్జాతీయ చిహ్నంగా ఖాదీని పునర్నిర్వచించే విధంగా నిర్వహిస్తున్న ఈ పోటీకి దేశవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక నిపుణులు, సంస్థల నుంచి 750కి పైగా రిజిష్ట్రేషన్లు వచ్చాయి. ఈ పోటీల్లో పాల్గొనేవారికి ఖాదీని కేవలం వస్త్రానికే పరిమితం చేయకుండా, ఆవిష్కరణ, చైతన్యంతో సాగించే జీవిన విధానానికి చిహ్నంగా ప్రదర్శిస్తూ ప్రకటనలు రూపొందించాలని నిర్దేశించారు.
ఈ ఎంట్రీలను ప్రకటనల రంగానికి చెందిన ప్రముఖులతో ఏర్పాటు చేసిన జ్యూరీ మూల్యాంకనం చేసింది. ఈ ప్రక్రియలో సహజత్వం, సాంస్కృతికత, అంతర్జాతీయంగా ఆకర్షించే సామర్థ్యం, పోటీ ఇతివృత్తం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. తుదిపోటీలకు చేరుకున్న ప్రకటనల్లో ప్రదర్శించిన వ్యూహాత్మక ఆలోచన, ఆకట్టుకొనే కథనాలు, ప్రపంచ వ్యాప్తంగా ఖాదీ ఉద్యమాన్ని తీసుకురావడంలో వాటి సామర్థ్యాన్ని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు.
తుదిపోటీల్లో గెలిచిన వారి వివరాలను వేవ్స్ సదస్సు 2025లో ప్రకటించి సత్కరిస్తారు. వారి ప్రకటనలను విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, పాత్రికేయ ప్రతినిధులు, పరిశ్రమ దిగ్గజాల ముందు ప్రదర్శిస్తారు.
వేవ్స్ గురించి:
పాత్రికేయ, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోయే ఈ మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులు, పెట్టుబడిదారు, రూపకర్త, ఆవిష్కర్త, ఇలా ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే.. ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. పాత్రికేయ, వినోద పరిశ్రమతో అనుసంధానమయ్యేందుకు, సహకారం పెంపొందించుకొనేందుకు, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మీ వంతు తోడ్పాటు అందించేందుకు అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.
ఇండియాలో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించి, కంటెట్ రూపకల్పన, మేధోహక్కులు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దేశాన్ని తయారు చేయడమే వేవ్స్ లక్ష్యం. ప్రసార రంగం, పత్రికా మాధ్యమం, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం - సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్) తదితర రంగాలు, పరిశ్రమలపై దృష్టి సారించింది.
ఇంకా సందేహాలున్నాయా? వాటికి సమాధానాలు ఈ లింక్‌లో దొరుకుతాయి.
తాజా సమాచారం కోసం పీఐబీ టీమ్ వేవ్స్ సందర్శించండి.
రండి, మాతో కలసి ప్రయాణించండి! వేవ్స్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి
(Release ID: 2120781)
Visitor Counter : 16
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam