సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వామ్!: భారత్‌లో మాంగా, యానిమీ బూమ్…
Posted On:
07 APR 2025 9:54AM by PIB Hyderabad
తన స్వరశక్తిని రేషమ్ తల్వార్ ఎల్లప్పుడూ విశ్వసించేవారు. తన గొంతు పదాలను పలకడానికి మాత్రమే పరిమితం కాదని, దానిలో భావాలు, భావోద్వేగాలు, పాత్రలకు ప్రాణం పోసే శక్తి ఉందని దివ్యాంగురాలైన ఆమెకు తెలుసు. అంధత్వం తన ఎదుగుదలకు అడ్డంకిగా మారకూడదని నిర్ణయించుకున్న రేషమ్.. పోటీ ఎక్కువగా ఉన్న వాయిస్ యాక్టింగ్ (డబ్బింగ్) రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఢిల్లీలో జరిగిన వేవ్స్ యానిమీ, మాంగా పోటీ (వామ్!)లో వాయిస్ యాక్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి మరింత ఉన్నత స్థానానికి ఆమె చేరుకున్నారు. ఎలాంటి అవరోధాన్నైనా తన కళాప్రతిభతో అధిగమించగలనని నిరూపించారు. రేడీయో జాకీ, వాయిస్ ఓవర్, ఆడియో ఎడిటింగ్‌లో తన నైపుణ్యాన్ని ఇప్పటికే ఆమె నిరూపించుకున్నప్పటికీ, తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప వేదికను వామ్!! అందించింది. ఆమె ప్రతిభ గురించి ఈ రంగంలోని దిగ్గజాలకు తెలియడంతో పాటు కొత్త అవకాశాల తలుపులు ఆమె కోసం ఇప్పుడు తెరుచుకున్నాయి. వామ్!! కేవలం పోటీగా మాత్రమే పరిమితం కాలేదని, సృజనాత్మక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే ఉద్యమమని ఇలాంటి విజయ గాథలు నిరూపిస్తున్నాయి.
మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) సహకారంతో భారత్‌లో యానిమీ, మాంగా పట్ల విస్తరిస్తున్న ఆసక్తిని ప్రోత్సహించడానికి, క్రియేటర్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రఖ్యాత జపనీస్ శైలులను ప్రాంతీయంగా అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకొనేలా కళాకారులను ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ రంగంలో తమ ప్రయాణం ప్రారంభించిన ప్రతిభావంతులకు ప్రచురణ, పంపిణీ అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రాల స్థాయిలో ఈ పోటీలు 11 నగరాల్లో జరుగుతాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాండ్ ఫినాలే ముంబయిలో జరిగే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్) - 2025లో జరుగుతుంది.
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో మే 1 నుంచి 4 వరకు జరిగే వేవ్స్ 2025లో వామ్!! ముఖ్యమైన కార్యక్రమం. పాత్రికేయం, వినోద రంగాల్లో భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా మార్చడమే వేవ్స్ లక్ష్యం. దావోస్, కేన్స్ తరహా కార్యక్రమాల స్ఫూర్తితో దీన్ని నిర్వహిస్తున్నారు. చలనచిత్రాలు, ఓటీటీ వేదికలు, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఏఐ, అభివృద్ధి చెందుతున్న ఏవీజీసీ - ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాల్టీ) రంగాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన మొట్టమొదటి కార్యక్రమం ఇది. పాత్రికేయ, వినోద రంగంలో 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను చేరుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రయాణాన్ని వేగవంతం చేసే ఉత్ప్రేరకంగా వేవ్స్ పనిచేస్తుంది.
వేవ్స్‌లో ప్రధాన కార్యక్రమమైన క్రియేట్ ఇన్ ఇండియా (సీఐసీ) ఛాలెంజ్‌లో భాగంగా వివిధ సృజనాత్మక రంగాల్లో దాగున్న ప్రతిభను వెలికితీసి, ప్రోత్సహించేందుకు వరుస పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సాహంగా ప్రారంభించిన సీఐసీ మొదటి సీజన్‌కు 77,000కు పైగా ఎంట్రీలు వచ్చాయి. వారిలో 35 దేశాలకు చెందిన 500 మంది పోటీదారులు సైతం ఉన్నారు. పెద్దమొత్తంలో వచ్చిన ఈ దరఖాస్తుల నుంచి ఎంపికైన 725 మంది ఉత్తమ క్రియేటర్లు వేవ్స్ గ్రాండ్ ఫినాలేలో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. భారత్‌లో విస్తృతమైన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కథనాలను ఈ పోటీలు ప్రదర్శిస్తాయి. సీఐసీలో నిర్వహించే కార్యక్రమాల్లో వామ్!! ప్రత్యేకమైనది. యానిమీ, మాంగా డొమైన్లపై దృష్టి సారించి తమ ప్రతిభను నిరూపించుకొనే అవకాశాన్ని ఔత్సాహికులకు, నిపుణులకు అందిస్తుంది. ప్రతిభావంతులను వెలికితీయడంతో పాటు ప్రతిభకు, పరిశ్రమలో అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి వారి కలలను కెరీర్‌గా మలిచేందుకు తోడ్పడుతుంది.
భారత ప్రజలకు మాంగా, యానిమీ గురించి తెలుసుకోవడంలో సహకరిస్తున్న వామ్!!ను ప్రశంసించాల్సిందే. మాంగా గురించి సరళంగా చెప్పాలంటే జపాన్‌లో ప్రారంభమైన ఒక తరహా కామిక్ పుస్తకం లేదా గ్రాఫిక్ నవల. ఉత్తేజపరిచే సాహసయాత్రలు, మధురమైన ప్రేమకథలు, భయపెట్టే హారర్ కథలు, కల్పనాత్మక కథలు ఇలా ఏవైనా సరే కామిక్స్ తరహాలోనే ఉంటాయి. మాంగాను ప్రత్యేకంగా మార్చింది అందులోని పాత్రల రూపమే. సాధారణంగా మాంగా పాత్రలకు జీవం నిండిన పెద్ద కళ్లు ఉంటాయి. అలాగే ఈ బొమ్మలు కథను బట్టి చాలా సాధారణంగా లేదా ప్రతి అంశం ప్రస్ఫుటంగా కనిపించేలా ఉంటాయి. సాధారణ పుస్తకాల మాదిరిగా కాకుండా మాంగా పుస్తకాలను కుడి నుంచి ఎడమకు చదువుతాం. మొదట ఇవి మ్యాగజైన్లలో ధారావాహికలుగా ప్రచురితమవుతాయి. తర్వాత ‘టాంకోబోన్’ అని పిలిచే పుస్తకంగా ప్రచురిస్తారు. మాంగా కథలకు స్వరాలు, కదలికలు జోడించి తెర మీద కార్టూన్ రూపంలో ప్రాణం పోయడమే యానిమీ. దీనిలో అందరి ఆసక్తులకు తగిన కథలుంటాయి - బాలుర కోసం యాక్షన్, స్నేహం నిండిన ‘షోనెన్’, బాలికల కోసం ప్రేమకథలపై దృష్టి సారించిన ‘షోజో’, పురుషుల కోసం గాఢమైన ఆలోచనలతో నిండిన ‘సీనెన్’, మహిళల కోసం వాస్తవంగా అనిపించే రోజువారీ జీవితం, ప్రేమకథలు అందించే ‘జోసీ’ లాంటివి ఉన్నాయి.
గత పదేళ్లుగా భారత్‌లో మాంగా, యానిమీ విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. సులభంగా లభ్యమవుతున్న వాటిని ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. దేశంలో యానిమీని ఇష్టపడుతున్నవారు దాదాపుగా 180 మిలియన్ల మంది ఉన్నారు. తద్వారా ప్రపంచంలో చైనా తర్వాత యానిమీకి డిమాండ్ ఎక్కువగా ఉన్న రెండో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచింది. ఈ అభిమానులు అంతర్జాతీయంగా యానిమీ రంగాన్ని మరింత ప్రాచుర్యం పొందేలా ప్రధాన పాత్ర పోషించి, 60 శాతం వృద్ధి రేటుతో ముందుకు నడిపిస్తారని అంచనా వేస్తున్నారు. నారుటో, డ్రాగన్ బాల్, ఒన్ పీస్, అటాక్ ఆన్ టైటాన్, మై హీరో అకాడమియా లాంటి హిట్ షోలు, భారత్ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి. అలాగే ఈ కథలను ఇక్కడి ప్రజలు ఎంతా ఇష్టపడతారో చూపించాయి.
భారత్‌లోని యానిమీ మార్కెట్ విలువ 2023లో 1,642.5 మిలియన్ డాలర్లు. 2032 నాటికి 5,036.0 మిలియన్ డాలర్లను చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, క్రంచీరోల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి వేదికలు యానిమీను సబ్ టైటిళ్లతో ప్రసారం చేస్తుండటం వల్ల భారత ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లతో పాటు కొన్ని ప్రత్యేక దుకాణాల్లో మాంగా కామిక్ పుస్తకాలు సులభంగా లభిస్తున్నాయి. యానిమీ, మాంగా రంగం ఇంతగా విస్తరిస్తున్నప్పటికీ భారత్ నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీనిని భర్తీ చేయడానికే దేశీయంగా ఉన్న క్రియేటర్లను వామ్!! ప్రోత్సహిస్తుంది.
వామ్! ద్వారా ప్రపంచానికి తెలిసిన వాటిలో రేషమ్ కథ ఒక ఉదాహరణ మాత్రమే. వారణాసిలో జరిగిన మాంగా (విద్యార్థి విభాగం) పోటీల్లో సన్‌బీమ్ వరుణకు చెందిన ఉన్నతపాఠశాల విద్యార్థిని ఏంజెల్ యాదవ్.. న్యాయనిర్ణేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన కోల్‌కతాలోని వైభవీ స్టూడియో ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఈ రంగంలో చిన్న వయసులో కూడా గొప్ప ప్రభావాన్ని చూపగలరని ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. వామ్! భువనేశ్వర్‌లో పాల్గొన్న మాంగా ఆర్టిస్ట్ రణదీప్ సింగ్‌ది మరో విజయ గాథ. ఆయన రూపొందించిన మాంగా ముద్రణకు సిద్ధంగా ఉందని జడ్జిలు మెచ్చుకున్నారు. ఓ వైపు తన మాంగాపై పని చేస్తూనే మరో వైపు వైభవీ స్టూడియోస్ నుంచి పెయిడ్ ప్రాజెక్టులను రణదీప్ అందుకుంటున్నారు. ఈ ఉదాహరణలు వామ్! ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో చూపిస్తుంది. అలాగే వారి ఆసక్తులను వాస్తవ కెరియర్‌గా మార్చుకొని, ఈ రంగంలో ప్రముఖ నిపుణుల సాయాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది.
పెద్ద వ్యాపార సంస్థల నుంచి వామ్! కు మద్ధతు లభిస్తోంది. భవిష్యత్తులో జరిగే ప్రతి వామ్! కార్యక్రమానికి కచ్చితంగా హాజరవుతానని బీఓబీ పిక్చర్స్ డైరెక్టర్ శ్రీకాంత్ కొణతం హామీ ఇచ్చారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిభావంతులను అన్వేషించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టూన్సూత్రకు చెందిన నవీన్ మిరండా విజేతలకు వెబ్ టూన్ రంగంలో పంపిణీ అవకాశాలను అందిస్తున్నారు. ఈటీవీ బాల భారత్‌కు చెందిన రాజేశ్వరీ రాయ్ యానిమీ రంగంలో అవకాశాలను కల్పిస్తున్నారు. మధ్య భారత్‌లో అతి పెద్ద యానిమేషన్ స్టూడియోను ప్రారంభించిన నీలేష్ పటేల్ మరో అడుగు ముందుకు వేసి విజేతలకు ఉద్యోగాలు, ఫైనలిస్టులకు ఇంటర్న్‌షిప్పులు అందిస్తున్నారు. ఇవన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యే హామీలు కాదు. ఈ పోటీల్లో పాల్గొన్న వారు అంతర్జాతీయ మార్కెట్లో రాణించేలా వామ్ ! తోడ్పడుతుంది.
అన్ని వర్గాలకు చెందిన వారి సృజనాత్మకత సామర్థ్యాన్ని ప్రోత్సహించడమే వామ్!ను ప్రత్యేకంగా నిలిపింది. అంధురాలైన వాయిస్ యాక్టర్ రేషమ్, టీనేజీ మాంగా కళాకారిణి ఏంజెల్ లేదా అనుభవజ్ఞుడైన నిపుణుడు రణదీప్ లాంటి వారంతా ఒకే వేదికపై నిలబడే అవకాశాన్ని ఇది కల్పిస్తోంది. వేవ్స్ - 2025లో భాగంగా నిర్వహిస్తున్న వామ్! తన పరిధిని కేవలం పోటీలకే పరిమితం చేయకుండా, భారత్‌లోని సృజనాత్మక ప్రతిభను ఎలా వెలికితీసి, ప్రోత్సహించాలో చూపిస్తుంది. ఈ సదస్సులో జానపద వారసత్వంతో పాటు ఆధునిక పద్ధతులైన యానిమీ, మాంగా లాంటి వాటిని కూడా అనుసరిస్తున్న భారతీయ కథకుల నైపుణ్యాన్ని ప్రపంచం వీక్షించనుంది. రేషమ్తో సహా ఇతరులకు విజయాన్ని మాత్రమే కాకుండా కాలం గడిచే కొద్దీ మరింతగా ప్రకాశించే అద్భుతమైన భవిష్యత్తును వామ్! అందించింది.
మూలం: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వామ్!: భారత్‌లో మాంగా, యానిమీ బూమ్
***
(Release ID: 2119918)
Visitor Counter : 7