ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన
Posted On:
04 APR 2025 6:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా “బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక-ఆర్థిక సహకార కూటమి” (బిమ్‌స్టెక్) 6వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ పైటోన్‌టాన్ షినవత్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లోని ప్రధాన పరిపాలన భవనంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
రెండు దేశాల మధ్య నాగరికత, సంస్కృతి, ఆధ్యాత్మికత, భాషలపరంగా కొనసాగుతున్న ప్రగాఢ బంధంతోపాటు 78 ఏళ్ల దౌత్య సంబంధాలను ప్రధానమంత్రులిద్దరూ సౌహార్దపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రజల మధ్య ఆదానప్రదానాలు సహా రక్షణ-భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, అనుసంధానం, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాలు, ఆవిష్కరణలు, అంతరిక్షం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, పర్యాటకం వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ, బహుపాక్షిక అంశాలపైనా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. సహకారం సంబంధిత వివిధ రంగాలపై అనేక అవగాహన ఒప్పందాలను ఇచ్చిపుచ్చుకున్నారు. భారత్-థాయ్‌లాండ్ దౌత్య ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభించే అంశంపై హర్షం వ్యక్తం చేశారు.
చారిత్రక శయన బుద్ధునికి నివాళి అర్పించడం కోసం ఇద్దరు ప్రధానమంత్రులూ ‘వాట్ ఫ్రా చెటుఫోన్ విమోన్ మంగ్‌ఖలారం రాజ్వరమహావిహాన్’ను సందర్శించారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ స్థాయులలో కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలను వారిద్దరూ గుర్తించారు. వేగంగా మారుతున్న ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిణామాల దృష్ట్యా అంతర్జాతీయ అంశాల నేపథ్యంలోనూ ఇది మరింత అవసరమని అంగీకారానికి వచ్చారు.
తదనుగుణంగా ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుత సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే దిశగా కృషి రెండు దేశాల భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి సూచిక.
రెండు దేశాలు సహా ఇరుగుపొరుగున కూడా నిరంతర శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో పరస్పర నిబద్ధత ప్రాతిపదికగా వ్యూహాత్మక భాగస్వామ్యం రూపుదిద్దుకుంటుంది. అంతేకాకుండా అవకాశాల పెంపు, సన్నిహిత సహకారం, ఉమ్మడి సవాళ్లపై సంయుక్త స్పందన దిశగా భవిష్యత్తు ఆధారిత, పరస్పర ప్రయోజనకర మార్గాన్వేషణలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఓ కీలక పునాది కాగలదు.
రాజకీయ, రక్షణ-భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, అనుసంధానం, విద్య, సామాజిక-సాంస్కృతిక ప్రగతి, ప్రజల మధ్య ఆదానప్రదానం, పరస్పర ఆసక్తిగల ఇతర రంగాలలో సహకార ఒప్పందాలు-విధానాల యంత్రాంగాలపై వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక రూపం ఏర్పడుతుంది.
వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రకటన సందర్భంగా- స్వేచ్ఛాయుత, సార్వత్రిక, పారదర్శక, నియమాధారిత, సమ్మిళిత, సంపన్న, పునరుత్థాన ఇండో-పసిఫిక్
ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలను వారు పునరుద్ఘాటించారు. దీంతోపాటు ఆసియాన్‌కు ప్రాధాన్యంపై తమ బలమైన మద్దతును కూడా స్పష్టం చేశారు. ‘ఆసియాన్ అవుట్‌లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్’ (ఎఒఐపి), ‘ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్’ (ఐపిఒఐ) మధ్య మరింత సమన్వయంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాలకు సహకారంపై ‘ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటనను అమలుకు వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన నిర్దిష్ట కార్యకలాపాల అన్వేషణపై ప్రధానమంత్రులిద్దరూ తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. అలాగే ‘ఐపిఒఐ’ పరిధిలోని సముద్ర జీవావరణ సంబంధిత కీలక కార్యక్రమాన్ని ఆస్ట్రేలియాతో సంయుక్తంగా అమలు చేయడంలో థాయ్‌లాండ్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది.
రెండు దేశాల మధ్య సంబంధాల విస్తరణ, పటిష్ఠత నిమిత్తం కింది అంశాలపై నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు:
రాజకీయ సహకారం
బహుళపక్ష సమావేశాల సమయంలో ఉమ్మడి ప్రాంతీయ ప్రయోజనాలపై చర్చ, ప్రాంతీయ-అంతర్జాతీయ భద్రత సవాళ్ల పరిష్కారం సహా నాయకత్వ స్థాయిలో క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి ఆదానప్రదానం ప్రాతిపదికన రాజకీయ సంప్రదింపుల బలోపేతం చేయండి.
ద్వైపాక్షిక సహకారంపై సంయుక్త కమిటీ, సీనియర్ అధికారుల స్థాయిలో విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల సంబంధిత ప్రస్తుత విధానాల కింద విదేశాంగ మంత్రుల స్థాయిలోనూ, విదేశీ వ్యవహారాల/మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారుల మధ్య క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ.
రెండు దేశాల క్రమం తప్పకుండా పార్లమెంటరీ ఆదానప్రదానాలకు ప్రోత్సాహం.
రక్షణ - భద్రత సహకారం
రక్షణ సాంకేతికత, పరిశ్రమ, పరిశోధన, శిక్షణ, ఆదానప్రదానాలు, సైనిక కసరత్తులు, సామర్థ్య వికాసం తదితరాలకు ప్రత్యేక ప్రాధాన్యంతో సముచిత వ్యవస్థల ఏర్పాటు ద్వారా రెండు దేశాల రక్షణ రంగాల మధ్య సహకార విస్తృతికి ప్రోత్సాహం సహా రక్షణ సహకారంపై ప్రస్తుత విధానాల బలోపేతం.
రెండు దేశాల్లోని చట్టాల అమలు వ్యవస్థలు/సంస్థ మధ్య క్రమం తప్పకుండా చర్చలు, ఆదానప్రదానాలతో భద్రత సహకారం పెంపు. థాయ్-భారత్ జాతీయ భద్రత మండళ్ల సచివాలయాల మధ్య మధ్య డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు/ప్రధాన కార్యదర్శి స్థాయిలో వ్యూహాత్మక సంప్రదింపులను కూడా ఇందులో భాగం చేయాలి. తద్వారా అంతర్జాతీయంగా పెరుగుతున్న సమస్యల పరిష్కారం, ప్రపంచ-ప్రాంతీయ భద్రత వాతావరణ సంరక్షణ-రక్షణ, సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, చట్టాల అమలు సమస్యలు, సైబర్ నేరాలు, అంతర్జాతీయ ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ నిరోధం, మానవ-మాదకద్రవ్యాలతోపాటు ఆయుధాలు, వన్యప్రాణుల అక్రమ రవాణా వంటి వ్యవస్థీకృత నేరాల నిరోధం సులువవుతుంది. ఈ దిశగా సంప్రదాయ, సంప్రదాయేతర భద్రత సమస్యలపై సహకారం, సమాచార మార్పిడి, నిఘా సంబంధిత ఉత్తమ విధానాల ఆదానప్రదానం.
ఆర్థిక-వాణిజ్య-పెట్టుబడి రంగాల్లో సహకారం
భారత్-థాయ్‌లాండ్ సంయుక్త వాణిజ్య కమిటీ వ్యవస్థ కింద సంబంధిత వాణిజ్య/వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖల మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు, ఆదానప్రదానాలు. నిర్వహణ. ద్వైపాక్షిక వాణిజ్యం-పెట్టుబడుల ప్రోత్సాహక వ్యవస్థల నడుమ వార్షిక సమావేశాల నిర్వహణ. ప్రపంచ సరఫరా వ్యవస్థతో ఉభయపక్ష సంబంధాల బలోపేతం దిశగా ప్రైవేట్ రంగాల మధ్య విశ్వాసం పెంపొందించి, వాణిజ్య-మార్కెట్ సౌలభ్యంలో సమస్యల పరిష్కారం. పరస్పర అంగీకార రంగాల్లో ప్రమాణాల సమన్వయం, సమానత్వం, గుర్తింపులో సహకారం. వాణిజ్యం- పెట్టుబడుల సంబంధిత కొత్త రంగాలకు సంసిద్ధత... ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, డిజిటల్ సాంకేతికత, రోబోటిక్స్, ఐసిటి, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ, సృజనాత్మక పరిశ్రమలు, అంకుర సంస్థలు తదితర భవిష్యత్తు ఆధారిత పరిశ్రమల స్థాయిలోనూ సహకారంపై అంగీకారం.
ద్వైపాక్షిక వాణిజ్యం ఇనుమడిస్తూ 2023-24లో దాదాపు 15 బిలియన్ డాలర్ల స్థాయికి చేరడంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే వీలైన రంగాల్లో ఆర్థిక సంబంధాల విస్తరణ సుస్థిర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, దాని సంపూర్ణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. విలువ ఆధారిత సముద్ర ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, విద్యుత్ వాహనాలు, ఆహార తయారీ, పెట్రోలియం ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, సేవలు, ఔషధాలు వంటి రంగాల్లో సుస్థిర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రోత్సాహం, భారత్-థాయ్‌లాండ్ మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య మండలం ఏర్పాటు చట్రంపై ఒప్పందం, ఆసియాన్-భారత్ వస్తు వాణిజ్య ఒప్పందం సహా ప్రస్తుత ఒప్పందాలు-చట్రాల క్రింద సహకారం పెంపు తదితరాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. స్థానిక కరెన్సీ ఆధారిత లావాదేవీల పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు మార్గాన్వేషణ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించాలని నిశ్చయించారు.
భారత్-ఆసియాన్ దేశాల మధ్య సరఫరా వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా ఆసియాన్-భారత్ వస్తు వాణిజ్య ఒప్పందానికి మద్దతుతోపాటు దానిపై సమీక్షను వేగిరపరచి, 2025లో ఒక ముగింపు నివ్వడం ద్వారా దాన్ని వాణిజ్య వినియోగ హితం, సరళం చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఉన్న పెట్టుబడి విధానాలు, పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటాన్ని ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా యాక్ట్ ఈస్ట్ విధానం, భారత్‌లో తయారీ ద్వారా ఇగ్నైట్ థాయ్‌లాండ్ దార్శనికతను ముందుకు నడిపించడానికి, అలాగే ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచడానికి రెండు దేశాలలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక కారిడార్లను ప్రోత్సహించడానికి థాయ్‌లాండ్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్వెస్ట్ ఇండియాతో సహా రెండు దేశాల పెట్టుబడి ప్రోత్సాహక సంస్థల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించటం.
రెండు దేశాల ప్రైవేట్ రంగాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు, సహకారాన్ని ప్రోత్సహించడానికి, కార్యకలాపాలు పెంచేందుకు ప్రధాన యంత్రాంగంగా పనిచేసేలా భారత్-థాయ్‌లాండ్ సంయుక్త బిజినెస్ ఫోరం(ఐటీజెబీఎఫ్) వార్షిక ప్రాతిపదికన క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించటం
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా పరిశ్రమలు, అంకురాల మధ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి తగిన యంత్రాంగాలను అన్వేషించనుంది. భారత్, థాయ్‌లాండ్ అంకురాల వ్యవస్థల్లో సామర్థ్యాన్ని పెంచటం, మార్కెట్ మరింత అందుబాటులోకి తీసుకురావటం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పరస్పరం ప్రాముఖ్యత కలిగిన రంగాలపై మార్గదర్శక కార్యక్రమాలు, నిపుణుల సెషన్లు, పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక పిచింగ్.. వాణిజ్య, వ్యాపారసంఘాలతో సంబంధాల కోసం చర్యలు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు, రెండు దేశాల్లోని విద్యా సంస్థల ఏకీకరణ, దేశాంతర ఇంక్యుబేషన్ నమూనాలకు మద్దతు ఇవ్వడంతో సహా అంకురాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
రెండు దేశాల మధ్య ఆర్థిక, ద్రవ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వాణిజ్యం, పెట్టుబడులు, సీమాంతర చెల్లింపులను సులభతరం చేయడానికి భారత్, థాయ్‌లాండ్‌లోని ఆర్థిక సేవల సంస్థళ మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించటం.
పర్యావరణ మార్పుల విషయంలో ఇరు పక్షాలకు ఉన్న లక్ష్యాలను సాధించేందుకు జీవ వలయాకార హరిత ఆర్థిక వ్యవస్థ(బయో సర్క్యులర్- గ్రీన్ ఎకానమీ), పర్యావరణ అనుకూల జీవనశైలి, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్య సాంకేతికలు సహా సుస్థిర ఆర్థిక వృద్ధి కోసం సహకారాన్ని పెంచుకోవటాన్ని ప్రోత్సహించటం.
అనుసంధానం
ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయడం, భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి, తూర్పు వైపు దాని విస్తరణను వేగవంతం చేయడం.. అలాగే భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ మోటారు వాహనాల ఒప్పందం, తీరప్రాంత సరకు రవాణా ద్వారా ప్రాంతీయ సముద్ర అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఓడరేవు నుంచి ఓడరేవుకు మధ్య అనుసంధానాన్ని పెంచటం, రెండు దేశాల మధ్య వైమానిక అనుసంధానాన్ని పెంచేందుకు ఇరుదేశాల పౌర విమానయాన అధికారుల మధ్య చర్చలను కొనసాగించటం ద్వారా భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య భౌతిక, డిజిటల్, ఆర్థిక విషయాలు వంటి అన్ని రకాల అనుసంధానాన్ని పెంపొందించటం.
సామాజిక-సాంస్కృతిక, విద్యా, ప్రజా సంబంధాలు
ప్రజల మధ్య పరస్పర సంబంధాలు పెంపొందించటంతో పాటు రెండు దేశాల మధ్య పర్యాటక రంగాలను ప్రోత్సహించటం ద్వారా సానుకూలతను ఏర్పాటు చేయటం.
విద్యార్హతలను పరస్పరం గుర్తించడం.. భారత్, థాయ్‌లాండ్‌లలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలను పెంచడం, విద్యార్థుల మార్పిడి.. ఉమ్మడి పరిశోధన, ఫెలోషిప్‌లను సులభతరం చేయడం వంటి విద్యా సహకారాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాలలో విద్యకు సంబంధించి బాధ్యతలు నిర్వహించే మంత్రిత్వ శాఖల మధ్య సహకార యంత్రాంగాలను బలోపేతం చేయడం. నైపుణ్యాభివృద్ధి, ఆంగ్ళ భాష పరిజ్ఞానంలో శిక్షణ.. సాంకేతిక, ఒకేషనల్ విద్య, శిక్షణ (టీవీఈటీ)... థాయ్, హిందీ విద్యకు సంబంధించి రెండు దేశాల్లోని శిక్షణ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం.
సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (సీఈపీ- కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం)లో గుర్తించిన పండుగలతో పాటు ప్రదర్శన కళలు, ప్రదర్శనలు, సెమినార్లు, సమావేశాలు, పురావస్తు శాస్త్రం, ఆర్కైవ్స్, మ్యూజియంలు, పరిశోధన, డాక్యుమెంటేషన్‌తో సహా సాంస్కృతిక సంబంధాలు, సహకారాన్ని పెంచటం చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయటం.
క్రీడల్లో సహకారం కోసం స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ, క్రీడల నియంత్రించే వ్యవస్థలు.. స్పోర్ట్స్ సైన్స్, పరిశోధన… క్రీడా పరిశ్రమ, క్రీడా పర్యాటకం వంటి విభాగాలను గుర్తించటం. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో నిపుణులు, అభ్యాసకుల మార్పిడి.
భారత ఈశాన్య ప్రాంతం(ఎన్ఈఆర్) తో సన్నిహిత సహకారాన్ని పెంపొందించటంలో భారత్, థాయ్‌లాండ్ మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడం… ముఖ్యంగా పర్యాటకం, సంస్కృతి, విద్య, వృత్తి, సాంకేతిక సహకారం రంగాలలో పరిస్పర మార్పిడిని పెంచడం.
వ్యవసాయం, జీవ సాంకేతికత, ఐసీటీ, అంతరిక్ష సాంకేతికత వంటి ప్రాధాన్యతా రంగాలలో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లు, ఎక్స్ఛేంజీల ద్వారా కొత్త సవాళ్లను పరిష్కరించడానికి.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో పెరిగిన ఎక్స్ఛేంజీ, సన్నిహిత సహకారంతో అవకాశాలను సృష్టించడానికి శాస్త్ర, సాంకేతిక కార్యకలాపాలు చూసుకునే మంత్రిత్వ శాఖల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం.
ఆరోగ్యం, వైద్య ఉత్పత్తులు, అలాగే సంప్రదాయ వైద్యం, సమాచార మార్పిడి, పరిశోధన, అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందించడం.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెంపొందించడానికి నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి నైపుణ్యాలతో సహా మహిళల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఎక్స్ఛేంజీ, సహకారాన్ని ఏర్పాటు చేసుకోవటం.
ప్రాంతీయ, బహుళపక్ష, అంతర్జాతీయ సహకారం
ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సహకారాన్ని పెంపొందించడం.. ఉమ్మడి ఆందోళనలు, ఆసక్తి ఉన్న అంతర్జాతీయ అంశాలపై ఇరుపక్షాల నిర్మాణాత్మక పాత్రను పెంపొందించడం.
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్), అయ్యవాడి-చావో ఫ్రాయా-మెకాంగ్ ఆర్థిక సహాకార వ్యూహం, (ఎఏసీఎంఈసీఎస్), మెకాంగ్-గంగా సహాకారం (ఎంజీసీ),బిమ్‌స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్), ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్‌ఏ), ఆసియా కోఆపరేషన్ డైలాగ్ (ఏసీడీ), ఇండోనేషియా-మలేషియా-థాయ్‌లాండ్ గ్రోత్ ట్రయాంగిల్ (ఐఎంటీ-జీటీ)లతో సహా ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ ఫ్రేమ్‌వర్క్‌లలో భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం. ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ సవాళ్లను సమగ్రంగా, సమర్థవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌ల మధ్య అనుబంధాలను, ఒకే తరహా అంశాల్లో సమన్వయాన్ని ప్రోత్సహించడం.
అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని ఉమ్మడిగా వినిపించేందుకు జీ77, దక్షిణ-దక్షిణ సహకారం వంటి బహుళపక్ష కూటముల్లో థాయ్‌లాండ్, భారత్‌ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం.
ఆసియాన్-ఇండియా డైలాగ్ సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2022లో ఫ్నోమ్ పెన్హ్‌లో జరిగిన 19వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ఏర్పడిన ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సంయుక్తంగా బలోపేతం చేయటం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న ప్రాంతీయ నిర్మాణంలో ఆసియాన్ కేంద్రీకరణకు భారత్ నిరంతర మద్దతు, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలలో క్రియాశీల సహకారాన్ని స్వాగతించటం.
మెకాంగ్-గంగా కోఆపరేషన్ (ఎంజీసీ) ఫ్రేమ్‌వర్క్ కింద సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధి, అనుసంధానాన్ని పెంచటం.. శతాబ్దాల పురాతన నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం.
ఇటీవల ఆమోదించిన బిమ్‌స్టెక్ చార్టర్‌ను.. అలాగే దక్షిణ, ఆగ్నేయాసియా మధ్య వారధిగా బిమ్‌స్టెక్‌కు ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మూలధనంగా మార్చుకుంటూ సుసంపన్నమైన, ధృడమైన, బహిరంగ బంగాళాఖాతం ప్రజల కోసం పనిచేయడంలో బిమ్‌స్టెక్ వ్యవస్థాపక సభ్యులుగా, రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా భారత్, థాయ్‌లాండ్‌ల ప్రముఖ, క్రియాశీల పాత్రను ప్రోత్సహించడం. రవాణా విషయంలో అనుసంధానం కోసం బిమ్‌స్టెక్ మాస్టర్ ప్లాన్, మారిటైమ్ రవాణా సహాకార ఒప్పందంతో సహా సంబంధిత ఒప్పందాలను అమలు చేయడం ద్వారా బిమ్ స్టెక్ రవాణా అనుసంధానాన్ని పెంపొందించటం.
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి థాయ్‌లాండ్, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు.
(Release ID: 2119700)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam