ప్రధాన మంత్రి కార్యాలయం
థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్‌టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని
Posted On:
04 APR 2025 2:29PM by PIB Hyderabad
థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్‌టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్‌టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్‌టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఈ సదస్సును విజయవంతంగా నడిపించిన థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్రకు ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాల మధ్య ప్రధాన వారధిగా బిమ్స్‌టెక్‌ను ఆయన వర్ణించారు. ప్రాంతీయ సహకారం, సమన్వయం, ప్రగతి సాధించడంలో ఇది ప్రభావవంతమైన వేదికగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిమ్స్‌టెక్ అజెండాను, సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బిమ్స్‌టెక్ సంస్థాగత, సామర్థ్య నిర్మాణానికి భారత్ తరఫున కొన్ని కార్యక్రమాలను శ్రీ మోదీ ప్రకటించారు. వాటిలో విపత్తు నిర్వహణ, సుస్థిర నౌకా రవాణా, సంప్రదాయ ఔషధాలు, వ్యవసాయంలో పరిశోధన, శిక్షణ తదితర అంశాల్లో బిమ్స్‌టెక్ ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు ఉన్నాయి. అలాగే యువతలో నైపుణ్యాలు పెంచేందుకు బోధి (బిమ్స్‌టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు, ఇతరులకు శిక్షణ, ఉపకారవేతనాలు అందిస్తారు. అలాగే డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల్లో ప్రాంతీయ అవసరాలను అంచనా వేయడానికి ప్రయోగాత్మక అధ్యయనాన్ని, క్యాన్సర్ చికిత్సను అందించడంలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. ప్రాంతీయ ఆర్థిక సమైక్యతను మరింత పెంపొందించాలని పిలుపునిస్తూ బిమ్స్‌టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుతో పాటు ప్రతి ఏటా భారత్‌లో బిమ్స్‌టెక్ వ్యాపార సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ ప్రాంతాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఈ సందర్భంలో ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రకటించారు. ఈ ఏడాది బిమ్స్ టెక్ అథ్లెటిక్స్ మీట్‌ను, 2027లో ఈ సమితి 30వ వార్షికోత్సవం జరిపే సమయంలో నిర్వహించే మొదటి బిమ్స్‌టెక్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిస్తుంది. బిమ్స్ టెక్ సంప్రదాయ సంగీత ఉత్సవాలకు సైతం నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో యువత మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యంగ్ లీడర్స్ సదస్సు, హ్యాకథాన్, యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ కార్యక్రమాలను ప్రకటించారు. ప్రధానమంత్రి ప్రకటించిన కార్యక్రమాల పూర్తి జాబితా ఇక్కడ చూడవచ్చు.
సదస్సులో ఆమోదించిన అంశాలు:
i. శిఖరాగ్ర సమావేశ ప్రకటన
ii. ఈ ప్రాంత సమగ్ర సంక్షేమానికి మార్గం చూపించే బిమ్స్‌టెక్ బ్యాంకాక్ విజన్ 2030 పత్రం
iii. బిమ్స్ టెక్ నౌకా రవాణా ఒప్పందంపై సంతకం - దీని ద్వారా ఓడలు, సిబ్బంది, కార్గోసేవలకు సభ్యదేశాల సహకారం లభిస్తుంది. అలాగే సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లకు పరస్పర గుర్తింపు, జాయింట్ షిప్పింగ్ కోఆర్డినేషన్ కమిటీ, వివాద పరిష్కార యంత్రాంగం ఉంటాయి.
ⅳ. బిమ్స్ టెక్ భవిష్యత్తు కోసం సిఫార్సులను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విశిష్ట వ్యక్తుల బృందం సమర్పించిన నివేదిక
***
(Release ID: 2119122)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam