ప్రధాన మంత్రి కార్యాలయం
థాయిలాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
Posted On:
03 APR 2025 6:27PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధికారిక థాయిలాండ్ పర్యటనలో భాగంగా ఈరోజు బ్యాంకాక్‌లో థాయిలాండ్ ప్రధాని శ్రీ పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి షినవత్రా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వీరిరువురి మధ్య ఇది రెండో సమావేశం. 2024 అక్టోబర్‌లో వియంటియాన్‌లో జరిగిన ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఇరువురు నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు.
భారత్, థాయిలాండ్ మధ్య ద్వైపాక్షిక సహకారం గురించి ఇరువురు నేతలు సమీక్షించారు. రాజకీయ సహకారం, రక్షణ - భద్రత భాగస్వామ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం - పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలను గురించి వారు చర్చించారు. కనెక్టివిటీ, ఆరోగ్యం, శాస్త్ర-సాంకేతికత, అంకురసంస్థలు, ఆవిష్కరణలు, డిజిటల్, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ మోసాల వంటి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని మరింతగా బలోపేతం చేసే మార్గాలను కూడా వారు చర్చించారు. ఇరువురు ప్రధానులు ప్రపంచ సమస్యలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు, బిమ్స్టెక్, ఏషియాన్, మెకాంగ్ గంగా సహకారం సహా ఉప-ప్రాంతీయ, ప్రాంతీయ, బహుపాక్షిక వేదికల్లో సన్నిహిత సహకారాన్ని పెంపొందించే మార్గాలను చర్చించారు.
భారత్-థాయిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపన కోసం జరిగిన ఒప్పందంపై ఇరువురు ప్రధానుల సమక్షంలో ఆయా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. చేనేత, హస్తకళలు, డిజిటల్ టెక్నాలజీలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎమ్ఎస్ఎమ్ఈలు), సముద్ర వారసత్వం వంటి రంగాల్లో కుదిరిన అవగాహన ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత్-థాయిలాండ్ కాన్సులర్ స్థాయిలో చర్చల నిర్వహణను ఇరువురు ప్రధానులు స్వాగతించారు. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.
ప్రధానమంత్రి పర్యటనకు గుర్తుగా, థాయ్ ప్రభుత్వం 18వ శతాబ్దం నాటి రామాయణ కుడ్య చిత్రాలు గల ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని షినవత్రా, పాళీ భాషలో గల బౌద్ధ పవిత్ర గ్రంథం త్రిపిటకాలు ప్రత్యేక సంచికను ప్రధానమంత్రికి అందజేశారు. భారత్-థాయిలాండ్ మధ్య సన్నిహిత నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని అవశేషాలను ప్రజల సందర్శన కోసం గుజరాత్ నుంచి థాయిలాండ్‌కు పంపనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గత సంవత్సరం, బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలతో పాటు, ఆయన శిష్యులు ఇరువురు భారత్ నుంచి థాయిలాండ్‌కు వచ్చారని, 4 మిలియన్లకు పైగా ప్రజలు వాటిని సందర్శించి నివాళులర్పించారన్నారు.
భారత్ – థాయిలాండ్ రామాయణం, బౌద్ధమతం సహా సాంస్కృతిక, భాషాపరమైన, ఆధ్యాత్మిక సంబంధాలతో కూడిన ఉమ్మడి నాగరికత సంబంధాలు గల సముద్రతీర పొరుగు దేశాలు. భారత్ 'యాక్ట్ ఈస్ట్' విధానంలో, ఏషియాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, విజన్ మహాసాగర్, ఇండో-పసిఫిక్ విజన్‌లలో థాయిలాండ్ పాత్ర కీలకమైనది. నిరంతర చర్చలు, యుగాల నాటి సంబంధాలు, ఉమ్మడి ఆసక్తుల ఆధారంగా బలమైన, బహుముఖమైన సంబంధాలు ఇరు దేశాల మధ్య నెలకొన్నాయి.
***
(Release ID: 2118644)
Visitor Counter : 29
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam