ప్రధాన మంత్రి కార్యాలయం
థాయ్ లాండ్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
Posted On:
03 APR 2025 5:53PM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి శ్రీ షినావత్రా,
ఇరు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులకు,
నమస్కారం!
సవాది క్రాప్!
ప్రధానమంత్రి షినావత్రా అందించిన సాదర స్వాగతానికి, అతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మార్చి 28న ఇక్కడ సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
మిత్రులారా,
భారత్, థాయ్ లాండ్ దేశాల మధ్య శతాబ్దాల నాటి చారిత్రక సంబంధాలు మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలలో వేళ్లూనుకుని ఉన్నాయి. బౌద్ధమత వ్యాప్తి మన ప్రజలను మరింత దగ్గర చేసింది.
అయోథయ నుంచి నలందా వరకు పండితుల పరస్పర మార్పిడి కొనసాగింది. రామాయణ కథ థాయ్ జానపద గాథల్లో లోతుగా కలసిపోయింది. అలాగే, సంస్కృతం, పాళీ భాషల ప్రభావం ఇప్పటికీ మన భాషలు, సంప్రదాయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
నా ఈ పర్యటన సందర్భంగా 18వ శతాబ్దానికి చెందిన ‘రామాయణ’ కుడ్య చిత్రాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసిన థాయ్ లాండ్ ప్రభుత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ప్రధాని షినావత్రా నాకు ఇప్పుడే త్రిపీటకాల్ని బహుమతిగా ఇచ్చారు. బుద్ధభూమి అయిన భారతదేశం తరఫున నేను వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. గత సంవత్సరం భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుంచి థాయ్ లాండ్ కు పంపించాం. నివాళులు అర్పించే అవకాశం 40 లక్షల మందికి పైగా భక్తులు పొందడం ఎంతో ఆనందదాయకమైన విషయం. 1960లో గుజరాత్‌లోని అరావళిలో కనుగొన్న బుద్ధుని పవిత్ర అవశేషాలను కూడా ప్రదర్శన కోసం థాయ్ లాండ్ కు పంపించనున్నామని ప్రకటించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఈ సంవత్సరం భారతదేశంలోని మహాకుంభ మేళా కూడా మన అనుబంధాన్ని చాటింది. థాయ్ లాండ్ సహా విదేశాలకు చెందిన 600 మందికి పైగా బౌద్ధ భక్తులు ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ శాంతి, సామరస్య సందేశాన్ని అందించింది.
మిత్రులారా,
భారత దేశ ‘ యాక్ట్ ఈస్ట్’ విధానం, ఇండో-పసిఫిక్ దృష్టి కోణంలో థాయ్ లాండ్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. మన సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత బలపరచాలని ఈరోజు మనం నిర్ణయించాం. అలాగే, మన భద్రతా సంస్థల మధ్య ‘వ్యూహాత్మక అనుబంధం’ ఏర్పాటు చేయడంపై కూడా చర్చించాం.
సైబర్ నేరాల బారిన పడిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహకరించిన థాయ్ లాండ్ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. మానవ అక్రమ రవాణాను, అక్రమ వలసలను ఎదుర్కోవడానికి మన ఏజెన్సీలు కలిసి పని చేయాలని మేము తీర్మానించాం.
భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు- థాయ్ లాండ్ మధ్య పర్యాటకం, సంస్కృతి, విద్యా రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం.
పెరుగుతున్న పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార మార్పిడులపై కూడా చర్చించాం. ఎంఎస్ఎంఇ, చేనేత, హస్తకళల రంగాల్లో సహకారాన్ని పెంపొందించేలా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం.
పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, రోబోటిక్స్, అంతరిక్షం, బయో టెక్నాలజీ, స్టార్టప్ లలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం. భౌతిక అనుసంధానాన్ని పెంచడంతో పాటు, రెండు దేశాలు ఫిన్‌టెక్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయనున్నాయి.
ప్రజల మధ్య రాకపోకలను ప్రోత్సహించే లక్ష్యంతో, థాయ్ పర్యాటకులకు భారతదేశం ఉచిత ఇ-వీసా సౌకర్యాన్ని అందిస్తోంది.
మిత్రులారా,
ఆసియాన్ భారతదేశానికి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి.ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యంలో ఇరుగు- పొరుగు సముద్ర దేశాలుగా మేం పరస్పర ప్రయోజనాలను కలిగివున్నాం.
ఆసియాన్ ఐక్యతకు, ఆసియాన్ కేంద్రీకరణకు భారత్ గట్టి మద్దతు ఇస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, నియమ ఆధారిత వ్యవస్థను ఇరు దేశాలు సమర్థిస్తున్నాయి.
మేం అభివృద్ధిని నమ్ముతాం కానీ, విస్తరణవాదాన్ని కాదు. 'ఇండో-పసిఫిక్ మహాసముద్రాల' చొరవలో 'మారిటైమ్ ఎకాలజీ' విభాగానికి సహ నాయకత్వం వహించాలని థాయ్ లాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం.
మిత్రులారా,
రేపు జరిగే బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. థాయ్ లాండ్ అధ్యక్షతన ఈ వేదిక ప్రాంతీయ సహకారం దిశగా కొత్త ఊపును సంతరించుకుంది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానిని, వారి బృందాన్ని అభినందిస్తున్నాం.
గౌరవనీయులారా,
ఈ ఆత్మీయ స్వాగతానికి, గౌరవానికి మరోసారి ధన్యవాదాలు. త్రిపీటకాల బహుమతికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఖోప్ ఖున్ ఖాప్!
గమనిక-ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు అనువాదం.
***
(Release ID: 2118639)
Visitor Counter : 7
Read this release in:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam