వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్టార్టప్ మహాకుంభ్‌ను ప్రారంభించనున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్
ఈ నెల 3 నుంచి 5 వరకు భారత్ మండపంలో స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్
పాల్గొననున్న 45 మందికి పైగా గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు
Posted On:
02 APR 2025 7:47PM by PIB Hyderabad
ఈ నెల 3 నుంచి 5 వరకు భారత్ మండపంలో జరగనున్న స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించనున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి మరింతగా దోహదపడడంతోపాటు భారత వికాసాన్ని ప్రపంచానికి చాటడం ఈ కార్యక్రమ లక్ష్యం. వాణిజ్యం- పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్- సమాచార సాంకేతిక శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకోపన్యాసం చేస్తారు.
అద్వితీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ఆలోచనాపరులంతా ఒక్క వేదికపైకి వచ్చి తమ భావాలను పంచుకోవడానికి, చిరస్థాయిలో నిలిచేలా అనుబంధాలను ఏర్పరచుకోవడానికి అమూల్యమైన వేదికగా ఇది నిలుస్తుంది. సృజనాత్మకత, సహకారాన్ని పెంపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. స్టార్టప్ మహాకుంభ్ భవిష్యత్ పారిశ్రామికవేత్తల విజయానికి పునాదులు వేస్తుంది. ఈ ఏడాది ఎడిషన్ సందర్భంగా.. కలకత్తా ఐఐఎం, కాశీపూర్ ఐఐఎం, భిలాయ్ ఐఐటీల నుంచి వచ్చినవి సహా 45కు పైగా అంకుర సంస్థల నుంచి గిరిజన వ్యవస్థాపకులు కూడా వేదికను పంచుకోనున్నారు.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కార్యక్రమ ఇతివృత్తాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. “దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా (జిలే సే జగత్ తక్) ఉన్న అంకుర సంస్థలు, పారిశ్రామిక ‘మహారథుల’ నిజమైన సంగమం ఇది. దేశంలోని అనేక జిల్లాలతోపాటు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్న ఈ కార్యక్రమం.. వారి మధ్య అనుసంధానానికి, సహకారానికి గొప్ప అవకాశంగా నిలుస్తుంది. ఓవైపు భారత్ లో తయారైన ఫ్లయింగ్ టాక్సీని ప్రదర్శిస్తుండగా, మరోవైపు కొరియా వంటి దేశాలు 11 స్టార్టప్‌లతో ప్రదర్శన వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. నేపాల్ అతిపెద్ద ప్రదర్శన వేదికను ఏర్పాటు చేస్తోంది. నేపాల్ లోని ఓ అంకుర సంస్థ పర్యావరణ హిత ఇంధనంతో నడిచే రెండు దశల రాకెట్ ను ప్రదర్శిస్తోంది. వచ్చే మూడు రోజుల్లో మరిన్ని కొత్త ఆలోచనలు, మేధోసంపన్నమైన చర్చల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక సార్టప్ కార్యక్రమ తొలి ఎడిషన్ ను 48,581 మంది సందర్శించారు. 26కు పైగా రాష్ట్రాలు, 14కు పైగా దేశాల నుంచి అత్యుత్తమ స్టార్టప్ లు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలు, యూనికార్న్ సంస్థలు సహా 1306 ప్రదర్శనలను అందులో నిర్వహించారు. 300కు పైగా ఇంక్యుబేటర్లు, సత్వర వృద్ధి చోదక సంస్థలు, ఫ్యామిలీ ఆఫీసులతోపాటు 200కు పైగా ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు ఇందులో పాల్గొన్నారు.
వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, పారిశ్రామిక ప్రముఖులు సహా దేశంలోని అంకుర సంస్థల వ్యవస్థనంతటినీ ఈ స్టార్టప్ మహాకుంభ్ ఒక్కచోట చేరుస్తుంది. ఫిక్కి, అసోచామ్, ఐవీసీఏ, బూట్స్ట్రాప్ అడ్వైజరీ- ఫౌండేషన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. సిడ్బి, జీఈఎం, ఈసీజీసీ, ఎలక్ట్రానిక్స్- సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ, డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా సహకరిస్తున్నాయి.
మరింత సమాచారం కోసం www.startupmahakumbh.org ను సందర్శించండి.
***
(Release ID: 2118091)
Visitor Counter : 14