ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ - చిలీ సంయుక్త ప్రకటన (ఏప్రిల్ 01, 2025)
Posted On:
01 APR 2025 6:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయ గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకూ భారత్‌లో తొలిసారి అధికారిక పర్యటనకు వచ్చారు. రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు 76 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన మన దేశాన్ని సందర్శించడం విశేషం. అధ్యక్షుడు బోరిక్‌తోపాటు విదేశీ వ్యవహారాలు, వ్యవసాయం, గనులు, మహిళలు-లింగ సమానత్వం-సంస్కృతులు, కళలు-వారసత్వం శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. భారత్ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఆగ్రా, ముంబయి, బెంగళూరు నగరాలను కూడా బోరిక్ సందర్శిస్తారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో 2024 నవంబరు నాటి జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు బోరిక్, ప్రధాని మోదీ మొదటిసారి కలుసుకున్నారు.
భారత పర్యటన కోసం వచ్చిన అధ్యక్షుడు బోరిక్ వైమానిక దళ స్థావరం పరిధిలోని పాలం విమానాశ్రయం చేరుకోగానే అధికార సంప్రదాయాలతో ఆయనకు సాదర స్వాగతం లభించింది. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి మోడీ ఈ రోజు ఆయనతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బోరిక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వెంట వచ్చిన ప్రతినిధి బృందానికి ఆమె ప్రత్యేక విందు ఇచ్చారు. అటుపైన అధ్యక్షుడు బోరిక్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రెండు దేశాల మధ్య 1949లో మొదలైన చారిత్రక దౌత్య బంధంలో భాగంగా వాణిజ్య, ప్రజా, సాంస్కృతిక సంబంధాలు నిరంతరం విస్తరించడాన్ని, భారత్-చిలీ సౌహార్ద, స్నేహపూర్వక సంబంధాల ప్రాశస్త్యాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు బోరిక్ గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాల సంబంధిత రంగాలన్నిటాగల బహుముఖ బంధాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు.
ఈ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగమైన వాణిజ్యం-పెట్టుబడులు, ఆరోగ్యం-ఔషధాలు, రక్షణ-భద్రత, మౌలిక సదుపాయాలు, మైనింగ్, ఖనిజ వనరులు, వ్యవసాయం-ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, ఐసిటి, డిజిటలీకరణ, ఆవిష్కరణ, విపత్తు నిర్వహణ, శాస్త్ర-సాంకేతిక రంగంలో సహకారం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు సహా వివిధ రంగాలలో ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు. ద్వైపాక్షిక బంధానికి మరింత ఉత్తేజం దిశగా వివిధ స్థాయులలో క్రమం తప్పకుండా ఆదానప్రదానాలు కొనసాగించాలని ఉభయ పక్షాలు అంగీకరించాయి.
ద్వైపాక్షిక సంబంధాలకు మూలస్తంభం వ్యాపార-వాణిజ్యాలేనని నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. భారత్—ిలీ మధ్య 2017 మే నెలనాటి ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం విస్తరణతో ఒనగూడిన సానుకూల ప్రభావాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయ విస్తృతి నేపథ్యంలో మరింతగా విస్తృతం చేసుకోగల కొత్త అవకాశాల దిశగా విధానాలను బలోపేతం చేయాల్సి ఉందని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రతినిధుల రాకపోకలు ఇటీవల పెరుగుతుండం, తద్వారా వాణిజ్య-ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య పరస్పర ఆదానప్రదానాలను ముమ్మరం చేసే లక్ష్యంతో భారీ ప్రతినిధి బృందాన్ని వెంట తీసుకురావడంపై అధ్యక్షుడు బోరిక్‌కు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకునే దిశగా చర్చలు కొనసాగించేందుకు ఇద్దరూ అంగీకరించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చిలీకి భారత్ ప్రాధాన్య భాగస్వామిగా ఉందని బోరిక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య మెరుగైన, వైవిధ్యభరిత వాణిజ్యం లక్ష్యంగా వ్యూహ రచన చేయాల్సిన అవసరాన్ని వారిద్దరూ అంగీకరించారు. చర్చనీయాంశాలకు సంబంధించి పరస్పరం ఆమోదంతో అంగీకరించిన నిబంధనలపై సంతకం చేసినట్లు ప్రకటించారు. లోతైన ఆర్థిక ఏకీకరణ సాధన కోసం సమతుల, ప్రతిష్ఠాత్మక, సమగ్ర, పరస్పర ప్రయోజనకర ఒడంబడిక లక్ష్యంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ-సెపా)పై చర్చలు ప్రారంభం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. భారత్-చిలీ వ్యాపార-వాణిజ్య సంబంధాల సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం, ఉపాధి సహా ద్వైపాక్షిక వాణిజ్యం-ఆర్థిక వృద్ధి పెంపు ‘సెపా’ ప్రధాన ధ్యేయం.
వాణిజ్య సంబంధాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు బోరిక్ ప్రకటించారు. ఇందులో భాగంగా వీసా ప్రక్రియను క్రమబద్ధీకరించి, భారతీయ వాణిజ్యవేత్తలకు బహుళ ప్రవేశానుమతి ఇస్తామని వివరించారు. వాణిజ్యం-పెట్టుబడుల సౌలభ్యం దిశగా ఉభయపక్షాల సంసిద్ధతతోపాటు ద్వైపాక్షిక సంబంధాల విస్తృతిపై ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించే ఈ నిర్ణయాన్ని అమూల్యమైనదిగా అభివర్ణిస్తూ ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రజల మధ్య సంబంధాలు పునాదిగా నిలుస్తాయని వారు అంగీకరించారు. అలాగే వాణిజ్యం, పర్యాటకం, విద్య-విద్యార్థి ఆదానప్రదానాల సౌలభ్యం లక్ష్యంగా భారత్ ఇ-వీసా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా చిలీ ప్రయాణికులకు ఇప్పటికే సరళ వీసా మంజూరు పద్ధతి అమలులో ఉంది.
సరికొత్త సాంకేతికతలు, అధునాతన తయారీ, కాలుష్య రహిత ఇంధన రూపాంతరీకరణ కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యం తదితరాలను నాయకులిద్దరూ గుర్తించారు. ఉమ్మడి ప్రయోజనం లక్ష్యంగా కీలక ఖనిజాల విలువ వ్యవస్థ అంతటా పెట్టుబడులకు ప్రోత్సాహం, పరిశోధన-ఆవిష్కరణతోపాటు అన్వేషణ-మైనింగ్-ప్రాసెసింగ్‌లలో సహకార విస్తృతికి అంగీకరించారు. కీలక ఖనిజాలు, అధునాతన సామగ్రి సహా విశ్వసనీయ, పునరుత్థాన సరఫరా వ్యవస్థల రూపకల్పన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. చిలీ నుంచి భారత్‌కు ఖనిజాలు, సామగ్రి దీర్ఘకాలిక సరఫరా అవకాశంసహా మైనింగ్, ఖనిజ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలు-ఒప్పందాల పెంపు ద్వారా సరఫరా వ్యవస్థలు, స్థానిక విలువ వ్యవస్థలను బలోపేతం చేసే కార్యక్రమాలపై సంయుక్త కృషికి ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
ఆరోగ్యం-ఔషధాలు, అంతరిక్షం, ఐసిటి, వ్యవసాయం, కాలుష్యరహిత ఇంధనం, సంప్రదాయ వైద్యం, అంటార్కిటికా, శాస్త్ర-సాంకేతికతలు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, క్రీడలు, అంకుర సంస్థలు, సహకార సంస్థలు, దృశ్య-శ్రవణాంశాల సహోత్పత్తి వగైరాలలో సహకారానికి కొత్త మార్గాన్వేషణ చేపట్టేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. ఈ మేరకు ఆయా రంగాల సంబంధిత వ్యవస్థలు, సంస్థల మధ్య అనుభవాలు, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం కొనసాగాలని నిర్ణయించారు.
ప్రపంచ అగ్రగాములలో ఒకటిగా, సరస-అధిక నాణ్యతగల ఉత్పత్తుల సరఫరాలో భారత ఔషధ పరిశ్రమ చిలీకి కీలక భాగస్వామి పాత్ర పోషిస్తున్నదని అధ్యక్షుడు బోరిక్ ప్రశంసించారు. ఔషధాలు, టీకాలు, వైద్య పరికరాల వాణిజ్యం పెంపు దిశగా రెండు దేశాల ప్రైవేట్ రంగాలకు సౌలభ్యం కల్పించేందుకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి. ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో సహకార విస్తృతికి, భారతీయ ఔషధ విపణి సౌలభ్య సమస్యల పరిష్కారంతోపాటు చిలీ-భారత్ ఫార్మకోపియా గుర్తింపును ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఆమోదం తెలిపారు.
ప్రజారోగ్యం, శ్రేయస్సు పరిరక్షణలో సంప్రదాయ ఔషధాలు, యోగా ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ గుర్తించారు. సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా సంప్రదాయ ఔషధాలపై అవగాహన ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా రెండు దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అధ్యయనాధారిత, సమగ్ర, సంప్రదాయ వైద్యం-హోమియోపతి, యోగా కార్యక్రమాల ప్రచారం, వినియోగంలో సహకారం, విస్తృతికి అంగీకరించాయి.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పరస్పర పెట్టుబడులను రెండువైపులా ప్రోత్సహించాలని నిర్ణయించాయి. రైల్వేలు సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాలు పంచుకోవడానికి భారత కంపెనీలకు చిలీ ప్రతినిధి బృందం ఆహ్వానం పలికింది.
ద్వైపాక్షిక రక్షణ సహకారం దిశగా కీలక రంగాల అన్వేషణ, సామర్థ్య వికాసం, రక్షణ పారిశ్రామిక సహకారంసహా అన్నింటా సంయుక్తంగా కృషి చేయాలని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులోగల అధికారిక రక్షణ సహకార ఒప్పందం ప్రకారం పరస్పర సామర్థ్య వికాసం-విస్తృతిలో విజ్ఞాన ఆదానప్రదానానికి ఇద్దరూ అంగీకరించారు. పర్వత యుద్ధం, శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ప్రత్యేక కోర్సుల స్లాట్లతోపాటు, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, ఎన్డిసి, ఎన్డిఎ, హెచ్డిఎంసిలలో శిక్షణ అవకాశాలను ఎప్పటిలాగానే చిలీకి ప్రాధాన్య సహితంగా అందిస్తామని భారత ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. పరస్పర ప్రయోజన రంగాల్లో చిలీ సైనిక బృందాలను చేర్చుకుని, శిక్షణ ఇవ్వడంపై భారత్ తన ఆకాంక్షను తెలిపింది.
అంటార్కిటిక్ సముద్ర జీవ వనరుల పరిరక్షణ కార్యక్రమాలు, ద్వైపాక్షిక చర్చలు, సంయుక్త కార్యకలాపాలు, అంటార్కిటికా-అంటార్కిటిక్ విధాన సంబంధిత విద్య ఆదానప్రదానంలో భాగస్వామ్యానికి మరింత సౌలభ్యం దిశగా ప్రస్తుత అంటార్కిటిక్ ఒప్పంద బలోపేతంపై ఆసక్తి వ్యక్తీకరణ లేఖమీద సంతకాలపై నాయకులిద్దరూ హర్షం ప్రకటించారు. భారత్-చిలీ రెండూ అంటార్కిటిక్ ఒప్పందంలో సంప్రదింపు పక్షాలుగా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ సమాజం ప్రయోజనం లక్ష్యంగా అంటార్కిటిక్పై శాస్త్రీయ అవగాహన విస్తృతిపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
జాతీయ అధికార పరిధికి ఆవలగల ప్రాంతాల్లో సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం దిశగా కీలక చట్టబద్ధ చట్రానికి ఆమోదం, సంతకాలకు సంసిద్ధతను ఉభయ పక్షాలూ హర్షం వ్యక్తం చేశాయి. భూతలం నుంచి సముద్రం దాకా జీవవైవిధ్య సంరక్షణకు, ప్రోత్సాహానికి, రక్షణకు సంబంధిత దేశాల సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. ఈ సమస్యల పరిష్కారంపై కృషిచేసే అంతర్జాతీయ వేదికలలో ఉమ్మడిగా వ్యవహరించడానికి, పరస్పర మద్దతుకు అంగీకరించాయి. సార్వత్రిక, విభిన్న బాధ్యతలు-ప్రగతి హక్కు సూత్రం ప్రాతిపదికన సహకారం-సంయుక్త కృషి ద్వారా బహుపాక్షికతలో వర్ధమాన దేశాల దృక్కోణ బలోపేతంపై రెండు దేశాలు తమ ఆసక్తిని పునరుద్ఘాటించాయి.
అంతరిక్ష రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని నాయకులిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా సహ-వాణిజ్య ఒప్పందం కింద చిలీ ఉపగ్రహాన్ని (ఎస్‌యుసిహెచ్‌ఎఐ-1) 2017లో భారత్ ప్రయోగించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షం, ఖగోళ భౌతిక శాస్త్రంలో శిక్షణ-సామర్థ్య వికాసం, పరిశోధనలకు ప్రోత్సాహంలో మరింత సహకారం ప్రాధాన్యాన్ని వారు అంగీకరించారు. దీనికి సంబంధించి అంతరిక్ష రంగంలో అన్వేషణ, పరిశోధన-అభివృద్ధి, శిక్షణ, ఉపగ్రహ రూపకల్పన-ప్రయోగం-నిర్వహణ సహా “ఇస్రో ఇన్-స్పేస్” (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) సహా అంకుర సంస్థలద్వారా ఉమ్మడిగా బాహ్య అంతరిక్ష శాంతియుత వినియోగం వంటి రంగాల్లో సంయుక్త కృషి లక్ష్యంగా చిలీ స్పేస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటును అధినేతలిద్దరూ స్వాగతించారు.
ID: 2117396 Part-02 /Final: GSR
Part-02
ఎప్పటికప్పుడు మారే సమాచార, డిజిటల్ టెక్నాలజీ రంగాలను ప్రస్తావించి, ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించేందుకు అన్వేషణ చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు అంగీకరించారు. పెట్టుబడుల వృద్ధి, సంయుక్త భాగస్వామ్యాలు, సాంకేతికపరమైన అభివృద్ధి, ఐటీ, డిజిటల్ రంగాల్లో మార్కెట్ల పురోగతిపై వారు పరస్పర ఆసక్తిని వ్యక్తపరిచారు. అంతేకాక, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (డీపీఐ) లో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు ప్రజాస్వామ్యయుతంగా డిజిటల్ సేవలను అందించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో సహకారాన్ని తొందరగా అమలు చేయడానికి ఇరు వైపుల నుంచి జరుగుతున్న ప్రయత్నాలను వారు గుర్తించారు. అలాగే, రెండు దేశాల ఉత్సాహభరిత స్టార్టప్ వ్యవస్థల మధ్య మరింత సన్నిహిత సహకారం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. రెండు దేశాల సాంకేతిక సమాజాల మధ్య మరింత లోతైన అనుసంధానానికి వీలుగా డిజిటల్ మార్పు రంగంలో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకం జరిగేలా ముందుకు సాగాలనే ఆకాంక్షను ఇరువురు నాయకులు వ్యక్తం చేశారు.
సంస్కరణలు చేసిన బహుపాక్షిక వ్యవస్థకు, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా శాశ్వత, శాశ్వతం కాని సభ్యత్వ విభాగాలలో సమగ్ర సంస్కరణల ద్వారా దానిని మరింత ప్రాతినిధ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, సమ్మిళితం, ప్రభావవంతంగా మార్చేందుకు ఇద్దరు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సంస్కరణలు చేసిన, విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి చిలీ తన మద్దతును పునరుద్ఘాటించింది. శాంతియుత చర్చల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ, ప్రపంచ సుస్థిర శాంతి కోసం ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కులను పెంపొందించడానికి కలిసి పనిచేయాలని ఇరు దేశాలూ అంగీకరించాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమష్టి పోరాటంలో కలిసి నిలబడాలన్న సంకల్పాన్ని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి చర్యల అవసరాన్ని వారు అంగీకరించారు.
యుఎన్ఎస్సి తీర్మానం - 1267 ను అమలు చేయాలని, ఉగ్రవాద సురక్షిత స్థావరాలను, మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మూలించడానికి, ఉగ్రవాద వ్యవస్థలను, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందే అన్ని మార్గాలను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్), నో మనీ ఫర్ టెర్రర్ (ఎన్ఎంఎఫ్టీ), ఇతర బహుళపక్ష వేదికల్లో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాల్సిన ఆవశ్యకతను కూడా వారు స్పష్టం చేశారు.
దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించే, నౌకాయాన, గగనయాన స్వేచ్ఛను అలాగే అంతరాయంలేని చట్టబద్ధమైన వాణిజ్యానికి సంబంధించిన నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ లక్ష్యాన్ని కొనసాగించడానికి తమ కట్టుబాటును నేతలు ప్రకటించారు. అంతేకాక, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన న్యాయసూత్రాలు, ముఖ్యంగా యూఎన్సీఎల్ఓఎస్ మేరకు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు.
“వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్” సమ్మేళనాల మూడు ఎడిషన్లలోనూ చిలీ పాల్గొన్నందుకు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది గ్లోబల్ సౌత్ దేశాలను ఒకచోటకు చేర్చి, వారి అభివృద్ధి ఆలోచనలను, ప్రాధాన్యతలను పంచుకునే దిశగా చిలీ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
2024 ఆగస్టులో జరిగిన మూడో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ లో అధ్యక్షుడు బోరిక్ తన విలువైన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. సమర్థవంతమైన అంతర్జాతీయ పాలనా సంస్కరణలు, గ్లోబల్ సౌత్ దేశాలకు స్వచ్ఛమైన, హరిత సాంకేతిక పరిజ్ఞానాలను సమానంగా అందించడంతో సహా అనేక ప్రస్తుత అంతర్జాతీయ అంశాలపై భారత్, చిలీ మధ్య బలమైన అనుసంధానం ఉందని ఆయన అన్నారు..గ్లోబల్ సౌత్ దేశాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో భారత నాయకత్వాన్ని అధ్యక్షుడు బోరిక్ స్వాగతించారు.
భారత జి 20 నాయకత్వం అభివృద్ధి అజెండాను కేంద్రబిందువుగా మార్చిందని అధ్యక్షుడు బోరిక్ ప్రశంసించారు. అంతేకాక, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే దిశగా, సాంకేతికత పరిజ్ఞానం మార్పు, సమ్మిళిత పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారత జి 20 నాయకత్వం గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను ముందుకు తీసుకువచ్చిందని రెండు దేశాల నేతలు గుర్తించారు. ముఖ్యంగా, ఆఫ్రికన్ యూనియన్‌ను జి20లో చేర్చడం, సుస్థిర అభివృద్ధికి అనుకూలమైన జీవనశైలుల (ఎల్ఐఎఫ్ఇ ) కు ప్రోత్సాహం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) లో పురోగతి, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (ఎండీబీ) సంస్కరణలు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వంటి కీలక కార్యక్రమాలు, ఫలితాలను తెరపైకి తీసుకురావడం ద్వారా భారత జి 20 నాయకత్వం గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను ముందుకు తెచ్చిందని రెండు దేశాల నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో జి 20 లో మరింత అనుసంధానం, , ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, చిలీ, లాటిన్ అమెరికన్ దేశాలను జి 20 అతిథి దేశాలుగా చర్చలలో చేర్చడానికి భారతదేశం మద్దతు ప్రకటించింది.
వాతావరణ మార్పు, తక్కువ ఉద్గారాల వాతావరణ ఆర్థిక వ్యవస్థలకు మారడం వల్ల తమ ఆర్థిక వ్యవస్థలకు ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు గుర్తించాయి. తదనుగుణంగా, మరింత సమర్థవంతమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్వచ్ఛమైన ఇంధనాన్ని, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించాలని వారు ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తం చేశారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వినియోగం, నిల్వ సాంకేతికతలు, ఇంధన సామర్థ్యం, ఇతర తక్కువ కార్బన్ పరిష్కారాలలో ఉమ్మడిగా పెట్టుబడులను పెంచాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు, ఇవి స్థిరమైన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో భారత్ నాయకత్వాన్ని అధ్యక్షుడు బోరిక్ స్వాగతించారు. చ 2023 నవంబరు నుండి చిలీ సభ్య దేశంగా ఉన్న నేపథ్యంలో తన దృఢమైన మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.సుస్థిర అభివృద్ధి (ఎస్ డీజీ) లక్ష్యాలను సాధించడానికి వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను సుస్థిరంగా మార్చే లక్ష్యంతో 2021 జనవరిలో విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)లో చేరిన చిలీని ప్రధానమంత్రి మోదీ అభినందించారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల ఐఎస్ఏ ప్రాంతీయ కమిటీ ఏడో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి చిలీ చేసిన ప్రతిపాదనను నాయకులు స్వాగతించారు.
సాంకేతికత ఆధారిత అభ్యాస పరిష్కారాలు, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత సామర్థ్య పెంపు అంశాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఈ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు తమ కట్టుబాటును భారత్, చిలీ పునరుద్ఘాటించాయి. ఇడిసిఐఎల్ (ఇండియా) లిమిటెడ్, చిలీ విశ్వవిద్యాలయాల రెక్టర్స్ కౌన్సిల్ (సిఆర్యుసి), చిలీ విద్యా మంత్రిత్వ శాఖ, సాంకేతిక శిక్షణా కేంద్రాలు (సిఎఫ్టి) తో సహా చిలీ లోని కీలక సంస్థల మధ్య భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా డిజిటల్ లెర్నింగ్, పరిశోధనా మార్పిడి, స్మార్ట్ విద్యా మౌలిక సదుపాయాలు, వృత్తి శిక్షణ కార్యక్రమాలు వంటి రంగాలపై దృష్టి సారిస్తారు. అలాగే, ఇరు దేశాల శక్తి సామర్ధ్యాలను సమన్వయం చేసుకుని, విద్యలో వినూత్నతను, విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా కలిసి పని చేయాలని నిర్ణయించాయి.
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 ద్వారా భారతదేశంలో విద్యారంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన మార్పులను ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. ప్రముఖ చిలీ విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్థలతో విద్యా, పరిశోధన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని, ఉమ్మడి / ద్వంద్వ డిగ్రీ, ట్విన్నింగ్ ఏర్పాట్ల ద్వారా సంస్థాగత అనుసంధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో రెండు దేశాల పరస్పర బలాల దృష్ట్యా, ఈ రంగాల్లో సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. చిలీలోని ఒక విశ్వవిద్యాలయంలో భారత అధ్యయనాల కోసం ఐసీసీఆర్ ఛైర్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఇరువురు నాయకులు స్వాగతిస్తూ, దీనిని త్వరితగతిన అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
దౌత్య రంగంలో శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలకు , దౌత్యాన్ని మరింత సమర్థంగా మారుస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలను వారు ప్రస్తావించారు.
ఇరు దేశాల ప్రజలను దగ్గర చేయడంలో సాంస్కృతిక సంబంధాల పాత్రను కూడా ఇరువురు నేతలు గుర్తించారు. రెండు దేశాల సుసంపన్నమైన, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సాంస్కృతిక మార్పిడిని ప్రశంసించారు. భారతదేశంలో ప్రజాదరణ పొందిన విదేశీ భాషలలో స్పానిష్ ఒకటిగా ఉన్నందున రెండు దేశాల సంస్కృతులు, భాషల అధ్యయనంపై పెరుగుతున్న ఆసక్తిని నాయకులు ప్రశంసించారు. భారత్ - చిలీ సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల సాంస్కృతిక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి పరస్పర ఆసక్తిని వారు వ్యక్తం చేశారు. సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, మ్యూజియంలు, పండుగలలో ద్వైపాక్షిక వినిమయాన్ని ప్రోత్సహించడానికి కొత్త సాంస్కృతిక కార్యక్రమంపై సంతకం చేయడాన్ని కూడా వారు స్వాగతించారు.
మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణాను నిరోధించడానికి సంబంధిత ఏజెన్సీల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దారితీసే కస్టమ్స్ వ్యవహారాలలో సహకారం, పరస్పర సహాయంపై ఒప్పందాన్ని ఖరారు చేయడంలో సాధించిన పురోగతిపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఒప్పందం కస్టమ్స్ చట్టాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి, నిరోధించడానికి, అరికట్టడానికి, అలాగే ఉత్తమ పద్ధతులను, సామర్థ్యాన్ని పెంపొందించడానికి దారితీస్తుంది. వికలాంగుల రంగంలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు పక్షాలు చేసిన ప్రయత్నాలను వారు స్వాగతించారు, ఇది ఎవరూ వెనుకబడని మరింత మానవీయ, న్యాయమైన సమాజానికి దోహదం చేస్తుంది. ఈ డాక్యుమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరువురు నేతలు తమ అధికారులను ఆదేశించారు.
పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు ఏకీభవించారు. ద్వైపాక్షిక సంబంధాలకు మూలమైన సహకారం, అవగాహన బంధాలను పెంపొందించడానికి, విస్తరించడానికి, అవకాశాలను పెంపొందించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
ఈ పర్యటనలో తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఆతిథ్యానికి, స్నేహపూర్వక స్వాగతానికి అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సౌకర్యవంతమైన సమయంలో అధికారికంగా చిలీ పర్యటనకు రావాలని ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారు.
***
(Release ID: 2117643)
Visitor Counter : 21
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam