భారత ఎన్నికల సంఘం
ఒక లక్ష మందికి పైగా బూత్ స్థాయి అధికారులకు ఐఐఐడీఈఎమ్‌లో మొదటిసారిగా దశలవారీ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈసీ
• రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం బీఎల్ఓల మొదటి బ్యాచ్
• క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు నిరంతర ప్రాతిపదికన, ఆచరణయోగ్య, పరిస్థితుల ఆధారిత శిక్షణ
• బీఎల్‌ఓల దేశవ్యాప్త నెట్‌వర్క్ పటిష్టీకరణకు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లుగా మారనున్న సుశిక్షిత బీఎల్ఓలు
Posted On:
26 MAR 2025 11:51AM by PIB Hyderabad
బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓస్)కు శిక్షణనివ్వడానికి ఉద్దేశించిన మొట్టమొదటి కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) శ్రీ జ్ఞానేశ్ కుమార్. ఎలక్షన్ కమిషనర్ (ఈసీ) డాక్టర్ వివేక్ జోషీతో కలిసి ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఎం)లో ఈ రోజు ప్రారంభించారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు సగటున ఒక్కొక్క బీఎల్ఓ వంతున ఒక లక్ష మందికి పైగా బీఎల్ఓలకు రానున్న కొన్ని సంవత్సరాల్లో ఇదే తరహా శిక్షణనివ్వనున్నారు. సుశిక్షితులయ్యే బీఎల్ఓలు దేశమంతటా బీఎల్ఓల నెట్‌వర్కును బలోపేతం చేయడానికి ఒక అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ (ఏఎల్ఎంటీస్) దళంగా ఏర్పడతారు. ఎన్నికల సంఘానికీ, 100 కోట్ల మంది ఓటర్లకు మధ్య బూత్ స్థాయి అధికారులే అనుసంధానంగా ఉంటారు.
ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిని సారించి, ఈ విశిష్ట సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించనున్నారు. ప్రస్తుతం బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళ నాడులకు చెందిన 24 మంది ఈఆర్ఓలు, 13 మంది డీఈఓలతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాంలకు చెందిన 109 బీఎల్ఓలు ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నారు.
బీఎల్ఓలు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్-1960 ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వారు పోషించాల్సిన పాత్రతోపాటు నెరవేర్చాల్సిన బాధ్యతలను గురించి వారికి తెలియజేయడానికీ, ఓటర్ల జాబితాలలో తప్పులకు తావివ్వకుండా తాజావివరాలను పొందుపరచడానికీ అవసరమయ్యే ఫారాల్ని నింపడం గురించి వివరించడానికీ బీఎల్ఓలకు శిక్షణనిస్తున్నారు. బీఎల్ఓలకు వారి పనిలో సాయపడే ఐటీ అప్లికేషన్లను సైతం పరిచయం చేయనున్నారు.
బీఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. వీరిని జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓస్) ఆమోదం తీసుకొని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓస్)గా నియమిస్తారు. ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా సరైనవిగా తీర్చిదిద్దడంలో ఈఆర్ఓ, బీఎల్ఓలదే ముఖ్యపాత్ర అని సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ మరోసారి గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌డీఎం స్థాయి లేదా తత్సమానమైన స్థాయి గల అధికారులను ఈఆర్ఓలుగా నామినేట్ చేయాలనీ, వారు బీఎల్ఓలను నియమించాలనీ తెలిపారు. బీఎల్ఓల నియామకంలో వారి సీనియారిటీతోపాటు వారు పదవీబాధ్యతలు తీసుకొనే పోలింగ్ కేంద్రం పరిధిలో నివసిస్తున్నవారేనా అన్న విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
రాజ్యాంగ 326వ అధికరణంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం 18 ఏళ్ల వయస్సు మించిన, నియోజకవర్గ సాధారణ నివాసిని మాత్రమే ఓటర్లుగా నమోదు చేయవచ్చని సీఈసీ స్పష్టం చేశారు. సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు వారి వారి స్థాయిలలో అఖిలపక్ష సమావేశాల్ని నిర్వహించి, ఓటర్ల జాబితాలను సరైన విధంగా తాజా సమాచారంతో తయారు చేయడం సహా తమ తమ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను మరోసారి గుర్తు చేశారు. ఈఆర్ఓ లేదా బీఎల్ఓపై అందే ఎలాంటి ఫిర్యాదుపైన అయినా ఖచ్చితంగా చర్య తీసుకొంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఓటర్ల జాబితాలను తాజాపరిచే క్రమంలో ఇంటింటికీ తిరిగి తనిఖీ చేసే క్రమంలో ఓటర్లతో బీఎల్ఓలు అందరూ మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. దాదాపు 100 కోట్ల సంఖ్యలో ఉన్న ఓటర్ల పక్షాన్నే ఎన్నికల సంఘం ఇదివరకు, ఇప్పుడే కాక ఎప్పటికీ కూడా నిలుస్తూ ఉంటుందని ఆయన అన్నారు
***
(Release ID: 2115278)