జాతీయ మానవ హక్కుల కమిషన్
మానవ హక్కుల అంశంపై చిన్న చిత్రాలకు పదో వార్షిక పోటీ.. రికార్డు స్థాయిలో 303 ఎంట్రీల రాక విజేతలుగా 7 చిత్రాలు: ప్రకటించిన ఎన్‌హెచ్ఆర్‌సీ
• నది జలాల కాలుష్యంపై జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చిన వార్తాచిత్రం
‘దూధ్ గంగ- వేలీస్ డయింగ్ లైఫ్‌లైన్’కు రూ.2 లక్షల ప్రథమ బహుమతి
• బాల్య వివాహం, విద్య అంశంపై ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన ‘ఫైట్ ఫర్ రైట్స్’కు రూ.1.5 లక్షల రెండో బహుమతి
• తాగునీటి ప్రాముఖ్యంపై తమిళనాడు నుంచి వచ్చిన
‘గాడ్’ చిత్రానికి రూ.1 లక్ష విలువైన మూడో బహుమతి
•‘ప్రత్యేక ప్రస్తావన ధ్రువపత్రం’తోపాటు రూ.50 వేల చొప్పున 4 చిత్రాలకు పురస్కారం
Posted On:
27 FEB 2025 1:50PM by PIB Hyderabad
మానవ హక్కులు అంశంపై తీసిన చిన్న చిత్రాలకు 2024 సంవత్సరానికి పదో ప్రతిష్ఠాత్మక పదో వార్షిక పోటీని భారతదేశ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) నిర్వహించింది. దీనిలో రూ.2 లక్షల మొదటి బహుమతికి ‘దూధ్ గంగా- వేలీస్ డయింగ్ లైఫ్‌లైన్’ను ఎంపిక చేశారు. ఈ డాక్యుమెంటరీని (వార్తాచిత్రం) జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇంజినీరు శ్రీ అబ్దుల్ రశీద్ భట్ తీశారు. దూధ్ గంగ నదిలోని స్వచ్ఛ జలాల్లోకి అనేక రకాలైన వ్యర్థాలను యథేచ్ఛగా వదిలివేయడంతో నది నీరు ఎలా కలుషితమైపోతోందన్న ఆవేదనకు చిత్రరూపాన్ని కల్పిస్తూ, లోయలోని ప్రజల మేలు కోసం నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా చాటింది ఈ చిన్న వార్తాచిత్రం. ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషలలో రూపొందించిన ఈ చిత్రానికి సబ్ టైటిల్స్‌ను ఆంగ్లంలో కూర్చారు.
‘ఫైట్ ఫర్ రైట్స్’ను రూ.1.5 లక్షల రెండో బహుమతి కోసం ఎంపిక చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శ్రీ కడారప్ప రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం.. చిన్నతనంలోనే పెళ్లి చేయడం, విద్య అనే అంశాన్ని చర్చిస్తుంది. ఇది తెలుగు భాషలో ఉన్న ఈ చిత్రానికి ఆంగ్లంలో సబ్ టైటిల్స్‌ను సమకూర్చారు.
‘గాడ్’ చిత్రాన్ని లక్ష రూపాయల మూడో బహుమతి కోసం ఎంపిక చేశారు. దీనిని తమిళ నాడుకు చెందిన శ్రీ ఆర్. రవిచంద్రన్ రూపొందించారు. తాగడానికి అనువైన నీటికి ఉండే ప్రాధాన్యాన్ని గురించి ఒక వయోవృద్ధ నాయకుడు వివరించడం ఈ మూకీ చిత్రం ఇతివృత్తం.
రూ.50,000 నగదు చొప్పున నాలుగు చిత్రాలకు బహుమతులు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. ‘ప్రత్యేక ప్రస్తావనతో ధ్రువపత్రం’ కేటగిరీలో ఎంపిక చేసిన ఆ నాలుగు చిన్న చిత్రాలూ ఏవేవంటే:
1. ‘అక్షరాభ్యాసం’ - దీనిని తెలంగాణకు చెందిన శ్రీ హనీశ్ ఉండ్రమాట్ల రూపొందించారు. ఈ మూకీ చిత్రం బాలల విద్య ప్రాముఖ్యాన్ని చెబుతుంది.
2. ‘విలయిల్ల పట్టధారి’ - విలువ లేని గ్రాడ్యుయేట్ అని దీనికి అర్థం. దీనిని తమిళనాడుకు చెందిన శ్రీ ఆర్. సెల్వమ్ తీశారు. ఇంగ్లిషు సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఈ చిత్రం వయోవృద్ధుల కలిగే ఆందోళనలను, వారి హక్కులను గురించి చర్చిస్తుంది.
3. ‘లైఫ్ ఆఫ్ సీత’ - ఈ ఇంగ్లిషు పదాలకు సీత జీవనం అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శ్రీ మడక వెంకట సత్యనారాయణ రూపొందించారు. ఇది తెలుగు చిత్రం. దీనికి ఇంగ్లిషు సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో ధార్మిక సంప్రదాయాల కారణాన బాలలు వారి హక్కులను కోల్పోతున్న తీరు, ఈ స్థితిలో సంస్కరణను తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రధానంగా చూపెట్టారు.
4. ‘బి ఎ హ్యూమన్’ - దీనిని ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శ్రీ లోట్ల నవీన్ రూపొందించారు. హిందీలో ఉంది ఈ చిత్రం. దీనికి ఇంగ్లిషులో సబ్‌టైటిల్స్‌ను ఇచ్చారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ శ్రీ వి. రామసుబ్రమణియన్ అధ్యక్షత వహించిన పూర్తి కమిషన్ జ్యూరీలో సభ్యులుగా జస్టిస్ (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగి, శ్రీమతి విజయ భారతి సయానీ, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డీజీ (ఐ) శ్రీ ఆర్. ప్రసాద్ మీనాలతో పాటు రిజిస్ట్రార్ (లా) శ్రీ జోగిందర్ సింగ్ సేవలందించారు.
మానవ హక్కులను పరిరక్షించడంతోపాటు మానవ హక్కులకు సంబంధించిన చైతన్యాన్ని వ్యాప్తి చేసే దిశగా పౌరులు సినిమా మాధ్యమం ద్వారా సృజనాత్మక దిశగా వారిని ప్రోత్సహించడం ఎన్‌హెచ్ఆర్‌సీ 2015 నుంచి ప్రవేశపెట్టిన షార్ట్ ఫిలిం పోటీల లక్ష్యం. 2024లో ఈ పోటీ పదో సంచిక కోసం పెట్టిన గడువు లోపల వచ్చిన భారతీయ భాషలకు చెందిన 303 చిన్న చిత్రాలను పరిశీలించిన తరువాత 243 ఎంట్రీలు పురస్కారాల కోసం బరిలో నిలిచాయి. పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నారు.
***
(Release ID: 2106666)
Visitor Counter : 21