ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం
Posted On:
11 FEB 2025 11:59PM by PIB Hyderabad
గౌరవనీయులైన అధ్యక్షుడు మాక్రాన్ గారికి,
ఇక్కడికొచ్చిన భారత్, ఫ్రాన్స్ నాయకులకు,
నమస్కారాలు, బాంజూర్!
ఉప్పొంగే ఉత్సాహం... ఉద్వేగం, చైతన్యం ఈ సమావేశ మందిరంలో కనిపిస్తున్నాయి. ఇదో మామూలు వాణిజ్య కార్యక్రమం కాదు.
భారత్, ఫ్రాన్సుల్లోని అత్యుత్తమ వాణిజ్యవేత్తల సమావేశమిది. కొద్దిసేపటి కిందట అందించిన సీఈవో ఫోరం నివేదిక స్వాగతించదగినది.
‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.
మిత్రులారా,
నా మిత్రుడు, అధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి ఈ ఫోరమ్ లో భాగస్వామినవడం సంతోషదాయకం. గత రెండేళ్లలో ఇది మన ఆరో సమావేశం. గతేడాది భారత గణతంత్ర దినోత్సవానికి అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథి.
ఈ ఉదయం మేం సంయుక్తంగా ఏఐ కార్యాచరణ సదస్సుకు సహాధ్యక్షత వహించాం. ఈ సదస్సు విజయవంతమైన సందర్భంగా అధ్యక్షుడు మాక్రాన్ కు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
కేవలం ప్రజాస్వామిక విలువలు మాత్రమే కాదు.. దృఢమైన విశ్వాసం, ఆవిష్కరణ, ప్రజా సంక్షేమాల స్ఫూర్తి మన స్నేహానికి పునాదిగా నిలిచి భారత్, ఫ్రాన్సులను అనుసంధానించాయి.
మన భాగస్వామ్యం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లను పరిష్కరించే దిశగా మనం కలిసి పనిచేస్తున్నాం. నేను చివరిసారి పర్యటించిన సమయంలో మన భాగస్వామ్యం కోసం 2047 ప్రణాళికను రూపొందించాం. అప్పటినుంచి ప్రతి రంగంలోనూ సమగ్రంగా మన సహకారాన్ని కొనసాగిస్తున్నాం.
మిత్రులారా,
మీ కంపెనీలు చాలా వరకు ఇప్పటికే భారతదేశంలో ఉన్నాయి. ఏరోస్పేస్, నౌకాశ్రయాలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్, డెయిరీ, రసాయన, వినియోగదారీ వస్తువుల వంటి వివిధ రంగాల్లో మీరు క్రియాశీలకంగా ఉన్నారు.
భారత్ లో కూడా చాలా మంది సీఈవోలను కలిసే అవకాశం నాకు కలిగింది. గత దశాబ్ద కాలంలో భారత్ లో జరిగిన మార్పుల గురించి మీకు బాగా తెలుసు. స్థిరమైన రాజకీయ విధానాన్నీ, అనువైన విధాన నిర్ణాయక వ్యవస్థలనూ మేం నెలకొల్పాం.
‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’ పథంలో పయనిస్తున్న నేటి భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ- భారత్.
త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. నైపుణ్యం కలిగిన యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దే కర్మాగారంగా నిలవడం, ఆవిష్కరణల స్ఫూర్తి అంతర్జాతీయ వేదికపై మాకు గుర్తింపునిస్తున్నాయి.
అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ నేడు ఎదుగుతోంది.
భారత్ లో ఏఐ, సెమీ కండక్టర్, క్వాంటంలపై భారీ ప్రాజెక్టులను మేం ప్రారంభించాం. రక్షణలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌ను మేం ప్రోత్సహిస్తున్నాం. మీలో చాలా మందికి దీనితో అనుబంధం ఉంది. అంతరిక్ష సాంకేతికతలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాం. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అవకాశం కల్పించాం. భారత్ ను అంతర్జాతీయ బయోటెక్ శక్తి కేంద్రంగా శరవేగంగా తీర్చిదిద్దుతున్నాం.
మౌలిక సదుపాయాల అభివృద్ధి మాకు ప్రాధాన్య అంశం. వీటిపై ప్రభుత్వ వ్యయం ఏటా 114 బిలియన్ డాలర్లకు పైమాటే. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున రైల్వే లైన్లను నిర్మించడం ద్వారా.. రైల్వేలను ఆధునికీకరించి, ఉన్నతీకరించాం.
2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం దిశగా మనం వేగంగా దూసుకుపోతున్నాం. ఇందుకోసం సోలార్ సెల్ తయారీని ప్రోత్సహించాం. కీలక ఖనిజాల మిషన్ ను కూడా మేం ప్రారంభించాం. హైడ్రోజన్ మిషన్ ను కూడా చేపట్టాం. ఇందుకోసం ఎలక్ట్రోలైజర్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎస్ఎంఆర్, ఏఎంఆర్ సాంకేతికతలపై మేం దృష్టి సారిస్తున్నాం.
మిత్రులారా,
వైవిధ్యంలో, సంకటాలను పరిష్కరించడంలో అతిపెద్ద కేంద్రంగా నేడు భారత్ ఎదుగుతోంది. కొన్ని రోజుల కిందట కొత్త తరం సంస్కరణలను బడ్జెట్టులో పొందుపరిచాం.
సులభతర వాణిజ్యం కోసం సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. గత కొన్నేళ్లలో 40,000కు పైగా అనుమతులను హేతుబద్ధీకరించాం. విశ్వసనీయత ఆధారంగా ఆర్థిక విధానాలను ప్రోత్సహించేందుకు నియంత్రణపరమైన సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. అలాగే, సుంకాల విధింపు రేటును హేతుబద్ధీకరించాం.
అంతర్జాతీయ వాణిజ్యానికి సౌలభ్యం కలిగించడం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల సహాయంతో ‘ఇండియా ట్రేడ్ నెట్’ను ప్రవేశపెడుతున్నాం. జీవన సౌలభ్యాన్ని కల్పించడం కోసం సరికొత్త సరళీకృత ఆదాయపు పన్ను నియమావళిని తీసుకొస్తున్నాం.
జాతీయ తయారీ మిషన్ ను ప్రకటించాం. తయారీ వంటి నూతన రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించాం. మీరు ఈ కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
భారతదేశానికి రావడానికి ఇదే సరైన సమయమని మీ అందరికీ నేను చెబుతున్నాను. అందరి పురోగతీ భారత పురోగతితో ముడిపడి ఉంది. భారతీయ కంపెనీలు విమానాల కోసం విస్తృతంగా ఆర్డర్లు ఇచ్చి.. విమానయాన రంగాన్ని ఇందుకు ఉదాహరణగా నిలిపాయి. ఇప్పుడు మేం 120 కొత్త విమానాశ్రయాలను ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో మీకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయో మీరే ఊహించుకోవచ్చు.
మిత్రులారా,
రక్షణ, అధునాతన సాంకేతికత, ఆర్థిక సాంకేతిక లేదా ఔషధ రంగాలు, సాంకేతిక లేదా వస్త్ర పరిశ్రమలు, వ్యవసాయం లేదా వైమానికం, ఆరోగ్య రక్షణ లేదా హైవేలు, అంతరిక్షం లేదా సుస్థిరాభివృద్ధి... ఏ రంగమైనా సరే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను సాకారం చేసుకోవాలన్నది 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం. ఈ రంగాలన్నింటిలో పెట్టుబడులు, సహకారం దిశగా మీ అందరికీ అనేక అవకాశాలున్నాయి.
భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను.
ఫ్రాన్స్ యుక్తి, భారత శక్తి కలిస్తే...
భారత్ వేగానికి ఫ్రాన్స్ ఖచ్చితత్వం తోడైతే...
ఫ్రాన్స్ సాంకేతికత, భారత ప్రతిభ ఒకటైతే...
వాణిజ్యమే కాదు – ప్రపంచమే మారిపోతుంది.
మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.
గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2106334)
Visitor Counter : 14