రక్షణ మంత్రిత్వ శాఖ
మొదలైన ఏరో ఇండియా 2025
రక్షణ మంత్రి చేతుల మీదుగా బెంగళూరులో ప్రారంభం..
ఆసియాలో అతి పెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగాల ప్రదర్శనల్లో 15వది ఇది
ఇప్పటి అనిశ్చితులను ఎదుర్కోవడానికి భావ సారూప్య దేశాల మధ్య సంబంధాల్ని మరింత పటిష్టపరచనున్న ఏరో ఇండియా 2025: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
‘‘భారతీయ భద్రత, భారతీయ శాంతి.. ఇవి రెండూ వేర్వేరు కావు..
భద్రత, స్థిరత్వం, శాంతి..ఇవి ఒక సమష్టి వ్యవస్థ..
ఇవి జాతీయ సరిహద్దుల కన్నా మించినవి’’
ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థలో
వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తున్న రక్షణ రంగం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
10 FEB 2025 11:57AM by PIB Hyderabad
కీలక, అగ్రగామి టెక్నాలజీల మేలుకలయికైన ఏరో ఇండియా 2025 పదిహేనో సంచికను కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులోని యెలహంక వైమానిక దళ కేంద్రంలో ఈ రోజు ప్రారంభించారు. ‘‘ప్రస్తుత అనిశ్చిత స్థితుల నడుమ భావ సారూప్య దేశాల సంబంధాల్ని పరస్పర గౌరవం, హితం, ప్రయోజనాలు పునాదులుగా మరింత బలపర్చచడానికి ఒక వేదికను ఏరో ఇండియా 2025 అందుబాటులోకి తీసుకు వస్తుంది’’అంటూ మంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు. భారత పారిశ్రామిక సామర్థ్యాన్ని, సాంకేతిక ప్రగతిని ఏరో ఇండియా ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు మిత్రదేశాలతో సహసంబంధాల్ని కూడా పటిష్టపరచ గలుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశాలు కలిసికట్టుగా బలోపేతం అవుతూ, మంచి ప్రపంచ వ్యవస్థను ఆవిష్కరించడానికి పాటుపడినప్పుడే చిరకాల శాంతిని సాధించవచ్చని ఆయన అన్నారు.
అయిదు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రభుత్వాల ప్రతినిధులు, పారిశ్రామిక రంగ నేతలు, వైమానిక దళ అధికారులు, శాస్త్రవేత్తలు, రక్షణ రంగ నిపుణులు, అంకుర సంస్థలు, విద్యా రంగ ప్రముఖులు, ఇతర ఆసక్తిదారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం దీనిలో పాల్గొనేవారందరిని పరస్పర హితం కోసం ఒక చోటుకు చేరుస్తుందని రక్షణ మంత్రి అన్నారు.
‘‘మనం తరచు కొనుగోలుదారులు, అమ్మకందారుల మాదిరిగా వ్యవహారాలు జరుపుతూ ఉంటాం, దీనిలో మన మధ్య సంబంధాలు లావాదేవీ స్థాయికి పరిమితమవుతాయి. ఏమైనా, మరో స్థాయిలో, మనం మన భాగస్వామ్యాన్ని క్రేత, విక్రేతల సంబంధానికన్నా మిన్నగా పారిశ్రామిక సహకారం స్థాయికి కూడా తీసుకుపోతాం. సమాన ఆలోచనల తీరు కలిగిన దేశాలతో కలిసి సహ- ఉత్పాదన, సహ-అభివృద్ధిలతో కూడిన అనేక సఫల ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి. మా దృష్టిలో భారతీయ భద్రత గాని, లేదా భారతీయ శాంతి గాని.. ఇవి వేరు వేరేమీ కావు. భద్రత, స్థిరత్వం, శాంతి.. ఇవి ఓ ఉమ్మడి వ్యవస్థలాంటివి. వీటికి జాతీయ సరిహద్దులతో సంబంధం లేదు. ఇవి జాతీయ సరిహద్దులకన్నా మించినవి. మా విదేశీ మిత్రులు ఇక్కడకు తరలిరావడమనేది మన భాగస్వామ్యం ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మా దృష్టికోణాన్ని పంచుకొంటోందనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రపంచంలో ప్రస్తుతం ఏర్పడ్డ అనిశ్చితి నిండిన వాతావరణంలో, శాంతి-స్థిరత్వం విలసిల్లుతున్న ఒక పెద్ద దేశం భారతదేశమేనని రక్షణ మంత్రి అన్నారు. ‘‘భారత్ ఎన్నడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఏ మహా శక్తితోనూ పోటీపడడంలో ప్రమేయం పెట్టుకోలేదు. మేం ఎప్పటికీ శాంతి, స్థిరత్వాలకు అనుకూలంగానే వాదిస్తూ వచ్చాం. ఇది మా ప్రధాన ఆదర్శాల్లో భాగంగా ఉంది’’ అని ఆయన అన్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి వచ్చిన రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులు, విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో శాంతి, సమృద్ధి, స్థిరత్వాలు మనగలగడానికి వారు భారత్‌కు సహకారం అందించడం కీలకమన్నారు.
భారతదేశం ఒక మార్పు దిశగా పయనిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది కాస్తా అభివృద్ది చెందిన దేశంగా శరవేగంగా కదులుతోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏకోన్ముఖ, సుస్థిర, పక్కా ఆలోచనలతో ఓ మార్గసూచీని రూపొందించిన కారణంగా దేశంలో చైతన్యభరిత, వృద్ధి ప్రధాన రక్షణ రంగ సంబంధిత పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థ ఏర్పడిందని ఆయన చెప్పారు. రక్షణ సంబంధిత పారిశ్రామిక రంగాన్ని ఇంతకు ముందు జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా చూడలేదు, ప్రస్తుతం ఇది మొత్తంమీద ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో అంతర్భాగమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగం ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక మోటరుగా ఉంటూ, వృద్ధి అనే ఇంజినుకు చోదకశక్తిగా ఉంటోందని ఆయన అభివర్ణించారు.
రక్షణ శాఖకు 2025-26 కేంద్ర బడ్జెటులో రూ. 6.81 లక్షల కోట్ల కేటాయింపులు జరపడం ఒక రికార్డు, ఇందులో మూలధన రూపేణా జరిపే కొనుగోళ్లకు రూ.1.80 లక్షల కోట్లు కూడా కలిసి ఉన్నాయని రక్షణ మంత్రి అన్నారు. ఇది రక్షణ రంగాన్ని ఒక అత్యంత ప్రాధాన్య రంగంగా ప్రభుత్వం పరిగణిస్తోందనడానికి ఒక రుజువు అని కూడా ఆయన చెప్పారు. ఇదివరకటి బడ్జెటులో మాదిరిగానే, ఆధునికీకరణకు కేటాయించిన బడ్జెటులో 75 శాతం వాటాను దేశీయ మార్గాల నుంచి కొనుగోళ్లు జరపడానికే ప్రత్యేకించారు. భారత డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ శక్తియుక్తుల్ని విస్తరించాలనేదే దీని వెనుక ఉన్న ఉద్దేశం అని ఆయన వివరించారు.
సమగ్ర వృద్ధి గాథలో ప్రైవేటు పాత్రధారుల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ‘‘ప్రధాన స్రవంతి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేటు రంగం ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. ఈ రంగానికి ఉన్న చొరవ, దృఢత్వం, ఔత్సాహిక పారిశ్రామికత్వ స్వభావాల కారణంగా దేశంలో ఒక కొత్త సమృద్ధి తరంగం పెల్లుబుకేటట్లుగా చేసే శక్తి ఈ రంగానికి ఉంది. అభివృద్ధి చెందిన అనేక రంగాల్లో ప్రైవేటు రంగమే రక్షణ ప్రధాన ఉత్పాదనలను సమకూరుస్తోంది. ఇక్కడ కూడా, ఈ రంగం రక్షణ పరిశ్రమలో సమాన భాగస్వామి అయ్యే కాలం ఆసన్నమైంది’’ అని ఆయన అన్నారు.
రక్షణ సంబంధిత తయారీదారు సంస్థలు ఈ రంగాన్ని బలపరచడానికి సహకారపూర్వక వైఖరితో పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి అన్నారు. గుజరాత్ లో సి-295 రకం రవాణా విమానాన్ని ఉత్పత్తి చేయడానికి సంయుక్త సంస్థను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఏర్‌బస్ సంస్థలు ఏర్పాటు చేయడం ఈ సహకారానికి ఒక ఉజ్వల ఉదాహరణగా ఉందని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం భారత్ ఏరోస్పేస్ కాంపొనంట్స్, కాంప్లెక్స్ సిస్టమ్ అసెంబ్లీలకు ప్రపంచ దేశాల అభిమానపాత్ర దేశంగా మారిందని, ఈ మార్పు చోటుచేసుకోవడంలో ప్రైవేటు రంగంతోపాటు ప్రైవేటు పరిశ్రమలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని ఆయన వివరించారు.
గత ఏరో ఇండియా లో సాధించిన ఫలితాల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, అస్త్ర క్షిపణి, కొత్త తరం ఆకాశ్ క్షిపణి, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, మానవరహిత ఉపరితల నౌక, పినాక గైడెడ్ రాకెట్ల వంటి అనేక ఉన్నత సాంకేతికత కలిగిన ఉత్పాదనలను దేశంలోనే తయారు చేస్తున్నారన్నారు. రాబోయే కాలంలో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పాదనలను, రూ.21,000 కోట్ల విలువైన రక్షణ ఎగుమతుల గణాంకాలను అధిగమించడంతోపాటు రక్షణ రంగాన్ని ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత వేగంతో ముందుకు తీసుకుపోవాలన్న ప్రభుత్వ అచంచల సంకల్పాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. నిన్న సాయంత్రం ఏరో ఇండియా విలేకరుల సమావేశం సందర్బంగా, 2025-26 చివరికల్లా రక్షణ సంబంధిత ఉత్పాదనలు రూ.1.60 లక్షల కోట్లను, రక్షణ సంబంధిత ఎగుమతులు రూ. 30,000 కోట్లకు మించగలవన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి వ్యక్తం చేశారు.
రక్షణ శాఖలో 2025ను ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించిన విషయంపై రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఇది ఒక్క ప్రభుత్వ నినాదమే కాదు, సంస్కరణల పట్ల ప్రభుత్వ నిబద్ధత కూడా అని స్పష్టంచేశారు. సంస్కరణలను ప్రవేశపెట్టే నిర్ణయాలు కేవలం మంత్రిత్వ శాఖ స్థాయిలో తీసుకోవడంలేదని, ఈ ప్రక్రియలో సాయుధ దళాలు, డీపీఎస్‌యూలు కూడా పాలుపంచుకొంటున్నాయన్నారు. ‘‘ఈ సంస్కరణల ఉద్యమాన్ని మరింత జోరుగా ముందుకు తీసుకుపోవడానికి, రక్షణ రంగంలో ఆసక్తిదారులందరూ భాగస్వాములు కావాలి. మంత్రిత్వ శాఖతో ముడిపడ్డ ఆసక్తిదారుల సూచనలను స్వాగతిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
అంతకు ముందు, శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. వారికి అతిథి దేవోభవ అనే భారతీయ సంప్రదాయాన్ని గురించి ఆయన వివరించారు. అతిథి దేవోభవ అంటే అతిథిగా వచ్చిన వ్యక్తి దైవ సమానులు అని అర్థమని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న మహా కుంభ్‌లో దీనిని స్పష్టంగా గమనించవచ్చని ఆయన చెప్పారు. ‘‘మహా కుంభ్ అంతర్దర్శనాన్ని చాటిచెప్పే కుంభ్. ఏరో ఇండియా పరిశోధన ప్రధాన కుంభ్. మహా కుంభ్ అంతర్గత శక్తిపై దృష్టిని సారిస్తుంది. ఏరో ఇండియా బాహ్య శక్తిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మహా కుంభ్ భారతదేశ సంస్కృతిని కళ్లకు కడుతుంది. ఏరో ఇండియా భారతదేశానికున్న శక్తిని ప్రదర్శిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రక్షణ మంత్రి ప్రారంభించిన ఆసియాలోని అతి పెద్ద ఏరోస్పేస్, రక్షణ ప్రదర్శనల శ్రేణిలో పదిహేనోది. ఇది రాబోయే అయిదు రోజుల్లో భారత్ వైమానిక సత్తాను, దేశీయంగా ఆవిష్కరించిన అత్యాధునిక నవకల్పనలతోపాటే ప్రపంచ వ్యాప్త ఏరోస్పేస్ కంపెనీల సరికొత్త ఉత్పాదనలను తెర ముందుకు తీసుకు వస్తుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ దార్శనికతలకు అనుగుణంగా, ఈ కార్యక్రమం దేశీయకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సహకారాలు కుదిరేటట్లు ఒక వేదికను సమకూరుస్తుంది. అదే జరిగితే, 2047కల్లా మన దేశాన్ని ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా అడుగులు వేయించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చెప్పుకొన్న సంకల్పానికి దన్ను లభిస్తుంది.
ఫిబ్రవరి 10, 11 లను వ్యాపార దినాలుగా ప్రత్యేకించారు. ఈ నెల 13, 14 లను ప్రజలు ఈ ప్రదర్శనను చూడడానికి కేటాయించారు. ఈ ఈవెంట్‌లో రక్షణ మంత్రుల సదస్సు, ముఖ్య కార్యనిర్వహణ అధికారుల రౌండ్‌టేబుల్, భారత్, ఐడీఈఎక్స్ (iDEX) మండపాలు, మంథన్ ఐడీఈఎక్స్ కార్యక్రమం, ‘సామర్థ్య దేశీయకరణ’ కార్యక్రమం, ముగింపు వేడుక, సెమినార్లు, ఊపిరి బిగబట్టి చూడదగ్గ విమాన విన్యాసాలతోపాటు ఏరోస్పేస్ కంపెనీల ప్రదర్శన.. ఇవన్నీ భాగంగా ఉంటాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నీఫియు రియొ, కర్నాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివ కుమార్, రక్షణ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, సైన్య ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది, కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజ్‌నీశ్, సెక్రటరీ (డిఫెన్స్ ప్రొడక్షన్) శ్రీ సంజీవ్ కుమార్, వైమానిక దళ ఉప ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఎస్.పి. ధార్‌ఖార్ ఉన్నారు.
***
(Release ID: 2101492)
Visitor Counter : 96