జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025-26 లో జౌళి శాఖకు రూ.5272 కోట్ల కేటాయింపులు


పత్తి ఉత్పత్తిని పెంచడానికి ఐదేళ్ల పత్తి ఉత్పాదకతా మిషన్‌కు బడ్జెట్లో చోటు

రెండు రకాల షటిల్ లెస్ మగ్గాలపై పన్ను మినహాయింపు, అల్లిక వస్త్రాలపై ప్రాథమిక కస్టమ్ సుంకం తగ్గింపు

ఉన్ని పాలిష్ వస్తువులు, సముద్ర గవ్వలు, ఆల్చిప్పలు, పశువుల కొమ్ములు తదితర తొమ్మిది రకాల వస్తువులకు పన్నురహిత జాబితాలో చోటు

Posted On: 04 FEB 2025 11:26AM by PIB Hyderabad

2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జౌళి మంత్రిత్వశాఖకు రూ.5272 కోట్ల (అంచనా) మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించారు. 2024-25 బడ్జెట్ అంచనాల (రూ.4417.03 కోట్లు)తో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ.

పత్తి దిగుబడిలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు, పొడవైన పత్తి పింజ రకాల సాగు ద్వారా పత్తి దిగుబడిని పెంచేందుకు ఐదేళ్ల కాల వ్యవధి ఉన్న పత్తి ఉత్పాదకతా మిషన్‌ను కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించారు. దీని ద్వారా రైతులకు సైన్సు, టెక్నాలజీ సాయం లభిస్తుంది. ఈ కార్యక్రమం 5 ఎఫ్ సూత్రాలకు అనుగుణంగా ఉండటంతో పాటు రైతుల ఆదాయాన్ని, నాణ్యమైన పత్తి సరఫరాను పెంచుతుంది. ఈ కార్యక్రమం దేశీయంగా పత్తి ఉత్పత్తిని పెంచడం ద్వారా ముడి సరుకు అందుబాటులో ఉండేలా చేసి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 80 శాతం ఎంఎస్ఎంఈలు ఉన్న భారతీయ జౌళిరంగంలో అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచుతుంది.

పూర్తిగా మినహాయింపు పొందిన జౌళి పరికరాల్లో మరో రెండు రకాల షటిల్ లెస్ నేత మగ్గాలను జోడించారు. తద్వారా ఆగ్రో టెక్స్‌టైల్స్, మెడికల్ టెక్స్‌టైల్స్, జియో టెక్స్‌టైల్స్ వంటి సాకేంతిక జౌళి ఉత్పత్తులను సరసమైన ధరలకు లభించేలా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు. జౌళి పరిశ్రమలో వినియోగించే షటిల్ లెస్ మగ్గాలైన రేపియర్ మగ్గం (నిమిషానికి 650 మీటర్ల కంటే తక్కువ), ఎయిర్ జెట్ మగ్గం (నిమిషానికి 1000 మీటర్ల కంటే తక్కువ)పై విధించే సుంకాన్ని పూర్తిగా తొలగించారు. గతంలో ఇది 7.5 శాతంగా ఉండేది. తద్వారా అధిక నాణ్యత ఉన్న మగ్గాలను తక్కువ ధరకే దిగుమతి చేసుకొని చేనేత రంగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆగ్రో, మెడికల్, జియో టెక్స్‌టైల్స్ వంటి సాంకేతిక జౌళి రంగంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తుంది.

తొమ్మిది నిర్ణీత ధరల పరిధిలోకి వచ్చే అల్లిన దుస్తులపై విధించే ప్రాథమిక కస్టమ్ సుంకం 10 లేదా 20 శాతం నుంచి 20 శాతానికి లేదా కేజీకి రూ.115 వరకు రెండింటిలో ఏది ఎక్కువ అయితే విధిస్తారు. ఇది దేశీయంగా అల్లిక వస్త్రాల ఉత్పత్తిదారుల్లో పోటీతత్వాన్ని పెంచి చౌక దిగుమతులను తగ్గిస్తుంది.

హస్తకళల ఎగుమతులను సులభతరం చేయడానికి, ఎగుమతుల కాల వ్యవధిని ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచారు. అవసరమైతే దీన్ని మరో మూడు నెలలు పొడిగించుకోవచ్చు. ఈ నిబంధన ప్రకారం హస్తకళల ఎగుమతులకు సంబందించిన వస్తువుల జాబితాను, కాలవ్యవధిని పెంచడానికి ఈ నిబంధన తోడ్పడుతుంది. అలాగే ఎగుమతికి తగిన ఉత్పత్తులను తయారుచేయడానికి అవసరమైన ముడి సరుకును ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఉన్ని పాలిష్ చేసే పదార్థాలు, నత్త గుల్లలు, ఆల్చిప్పలు, ఎద్దు కొమ్ములు తదితరమైన తొమ్మిది రకాల ఉత్పత్తులు పన్నురహిత జాబితాలో ఉన్నాయి.

భారతీయ వస్త్ర రంగంలో 80 శాతం ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో ఎగుమతులకు ప్రాధాన్యమిచ్చారు. విస్తరించిన క్రెడిట్, కవరేజీలు వస్త్రరంగంలోని ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తాయి. జాతీయ తయారీ మిషన్, ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమం, భారత్ ట్రేడ్ నెట్ తయారీ, అంకుర సంస్థలకు నిధులు (ఫండ్స్ ఆఫ్ ఫండ్స్), ఉద్యోగ, వ్యాపార అవకాశాలను పెంచేందుకు కార్మిక రంగాల్లో చేపట్టే చర్యలు, ఎంఎస్ఎంఈల వర్గీకరణను సవరించడం సహా ఇతర కార్యక్రమాలు టెక్స్‌టైల్ రంగంలో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాయి


 

***


(Release ID: 2099550) Visitor Counter : 13