సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ట్రైలర్ మేకింగ్ పోటీల ద్వారా సృజనాత్మక ప్రతిభకు ప్రోత్సాహం:
నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ లైబ్రరీ నుంచి ట్రైలర్లు తయారుచేసే అవకాశం
ఔత్సాహిక రూపకర్తలు, నిపుణుల నుంచి ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 3,200: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 31
ట్రైలర్ రూపకల్పన పోటీల్లో సృజనాత్మకతకు, ఔత్సాహిక దర్శకుల ఆకాంక్షలకు ఉత్సాహాన్ని జోడించిన ఢిల్లీ రోడ్ షో
Posted On:
03 FEB 2025 5:46PM by PIB Hyderabad
గురు తేగ్ బహదూర్ ఫోర్త్ సెంటినరీ ఇంజనీరింగ్ కాలేజీ (జీటీబీ4సీఈసీ)లో గత వారం జరిగిన ట్రైలర్ రూపకల్పన పోటీల్లో భాగంగా నిర్వహించిన ఢిల్లీ రోడ్ షో అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయి ట్రైలర్ రూపకల్పన పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న రోడ్ షోల్లో ఇది ప్రత్యేకంగా నిలిచింది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో కలసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), రీస్కిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి నెట్‌ఫ్లిక్స్ సృజనాత్మక భాగస్వామిగా, జీబీబీ4సీఈసీ విద్యా భాగస్వామిగా వ్యవహరించాయి. కథన రచన, వీడియో ఎడిటింగ్ కళల గురించి అధ్యయనం చేయడానికి అపూర్వమైన వేదికను ఈ కార్యక్రమం కల్పించింది.
సృజనాత్మకత, ఆవిష్కరణల వేదిక
సృజనాత్మకతను వెలికితీయడం: వేవ్స్ 2025లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఫండ్ పర్ క్రియేటివ్ ఈక్విటీ సమర్పిస్తున్న ట్రైలర్ రూపకల్పన పోటీ ఔత్సాహిక చిత్ర దర్శకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన విస్తృత లైబ్రరీ నుంచి అవసరమైన కంటెంట్ తీసుకుని ట్రైలర్లు రూపొందించే గొప్ప అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. వీడియో ఎడిటింగ్, కథనరచన, ట్రైలర్ రూపకల్పనలో పాల్గొనేవారికి మూడు నెలల పాటు శిక్షణ సైతం లభిస్తుంది.
ట్రైలర్ మేకింగ్ పోటీల్లో పాల్గొనేవారు తమ ప్రతిభ ఆధారంగా వివిధ అవార్డులు, బహుమతులు అందుకుంటారు. నిబంధనలకు లోబడి ట్రైలర్లను సమర్పించినవారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ధ్రువపత్రం ఇస్తారు. అగ్రస్థానంలో నిలిచిన 50 మంది పోటీదారులకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్‌తో పాటుగా ఫిక్కీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థల నుంచి ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రశంసాపత్రం అందుకుంటారు.
అలాగే మొదటి 20 స్థానాల్లో నిలిచిన పోటీదారులకు ట్రోఫీ, ప్రత్యేక బహుమతులు, వేవ్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుంది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలతో చర్చించి, తాము సాధించిన విజయాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31, 2025. ఇప్పటి వరకు ప్రపంచం నలుమూలల నుంచి 3,200 దరఖాస్తులు వచ్చాయి. కళాశాల విద్యార్థులు, ఔత్సాహిక కంటెంట్ సృష్టికర్తలు, వీడియో ఎడిటర్లు, వారి అభిరుచులను ప్రవృత్తిగా కొనసాగించే నిపుణులు ఎడిటర్లుగా, క్రియేటర్లుగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన లింక్ : https://reskilll.com/hack/wavesficci/signup
జీటీబీ4సీఈసీ వద్ద జరిగిన ఢిల్లీ రోడ్ షో
జీటీబీ4సీఈసీతో సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్ షో లు సృజనాత్మక ప్రతిభను ప్రేరేపించి, ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఢిల్లీ రోడ్ షోలో ప్రధానాంశాలు
· వర్కుషాపులు:
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్, కలర్ కరెక్షన్, అధునాతన వీడియో ఎడిటింగ్ పద్ధతుల్లో ఆచరణాత్మక శిక్షణ పొందారు.
· సృజనాత్మక పోటీ:
నిర్దేశించిన అంశాలపై ఆకట్టుకునే ట్రైలర్లను రూపొందించి వారి కథనశైలి, సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించారు
· పరిశ్రమపై అవగాహన:
ఔత్సాహికులు తయారుచేసిన ట్రైలర్లను మూల్యాంకనం చేసి వారి నైపుణ్యాలను మెరుగుపరచుకొనేలా నిపుణులు తమ సూచనలు అందించారు.
· ప్రతిభ ప్రదర్శన:
వర్థమాన దర్శకులు, ఎడిటర్ల సృజనాత్మకతను ఈ రోడ్ షో ప్రదర్శించింది. తుది పోరుకు సిద్ధమవుతున్నవారిలో ఉత్సాహాన్ని పెంచింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా రీస్కిల్ సంస్థలో సీనియర్ వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న ధ్రువ్ మాధుర్ పాల్గొన్నారు. వీడియో ఎడిటింగ్‌కు సంబంధించిన సూచనలను అందించడంతో పాటు కథనరచన మెలకువలను వివరించారు.
ముందుకు సాగుతున్న ప్రయాణం
తర్వాతి తరం దర్శకులు, కథా రచయితలను గుర్తించి ప్రోత్సహించడమే ఈ ట్రైలర్ రూపకల్పన పోటీలు, రోడ్ షోల ప్రధాన ఉద్దేశం. వేవ్స్ సమ్మేళనంలో భాగంగా జరిగే తుది పోరులో పాల్గొని ప్రతిష్ఠాత్మక పురస్కారాలను, సినీ పరిశ్రమ గుర్తింపును పొందేందుకు ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు.
కథ చెప్పడం, వీడియో ఎడిటింగ్‌కు ఉన్న సామర్థ్యానికి ఢిల్లీ రోడ్ షో నిదర్శనంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే తుది పోటీలకు ఉత్సాహవంతమైన వేదికను ఏర్పాటు చేసింది.
****
(Release ID: 2099427)
Visitor Counter : 38
Read this release in:
Odia
,
Telugu
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam