ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సక్షమ్ ఆంగన్‌వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాల ద్వారా ఇప్పటికన్నా మరింత ఎక్కువ పోషణపరమైన మద్దతు


అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లు

2025-26లో 200 కేంద్రాల ఏర్పాటు


ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో వైద్య ప్రధాన పర్యాటక రంగానికి, ‘హీల్ ఇన్ ఇండియా’కు దన్ను

బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి 36 ప్రాణరక్షక ఔషధాలు, మందులకు మినహాయింపు

Posted On: 01 FEB 2025 1:07PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ‌ను ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ పెట్టుబడిని అభివృద్ధికి మూడో చోదక శక్తిగా అభివర్ణించారు.  ఇక్కడ పెట్టుబడి అంటే -ప్రజలపైన, ఆర్థిక వ్యవస్థపైన, నవకల్పన (ఇన్నొవేషన్)పైన పెట్టే పెట్టుబడులు- దీని పరిధిలోకి వస్తాయన్నారు.

ప్రజలపై పెట్టుబడి పెట్టడంలో భాగంగా, ‘సక్షమ్ ఆంగన్‌వాడీ’, ‘పోషణ్ 2.0 కార్యక్రమం’.. ఈ రెండిటిలో పోషణపరంగా మద్దతివ్వడానికని పెడుతున్న ఖర్చును పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర బడ్జెటులో పొందుపరిచారు. ఈ రెండు కార్యక్రమాల రూపేణా దేశవ్యాప్తంగా 8 కోట్ల కన్నా ఎక్కువ మంది బాలలకు, ఒక కోటి మంది గర్భవతులు, పాలిచ్చే తల్లులకు, అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాల్లోని సుమారు 20 లక్షల మంది యవ్వనదశలో అడుగిడిన అమ్మాయిలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు పౌష్టికతా సంబంధిత సహాయాన్ని అందిస్తున్నారు.

రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 2025-26లో 200 సెంటర్లను ఏర్పాటు చేస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో 75,000 సీట్లను జోడించాలన్న  లక్ష్యాన్ని సాధించే దృష్టితో, వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో అదనంగా 10,000 సీట్లను వచ్చే ఏడాదిలో జతపరచనున్నట్లు కూడా బడ్జెటులో ప్రధానంగా ప్రస్తావించారు.

సామర్థ్యాలను పెంచడం, సులభతర వీసా నిబంధనలతో పాటు ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో మెడికల్ టూరిజాన్ని,‘ హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.



ఔషధాలు, మందుల దిగుమతులకు మినహాయింపు

రోగులకు, ముఖ్యంగా కేన్సర్‌, అసాధారణ రోగాలు, ఇతర తీవ్ర దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డ రోగులకు ఉపశమనాన్ని కలిగించడం కోసం 36 రకాల ప్రాణరక్షక ఔషధాలు, మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) నుంచి  పూర్తిగా మినహాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. 5 శాతం మాత్రమే కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న వస్తువుల జాబితాలో మరో 6 ప్రాణరక్షక మందులను చేర్చనున్నట్లు కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. పైన ప్రస్తావించిన ఔషధాలను పెద్ద ఎత్తున తయారు చేసే (బల్క్ డ్రగ్స్) సంస్థలకు కూడా ఇదే తరహా పూర్తి మినహాయింపుతోపాటు తగ్గించిన సుంకం రేటు ను వర్తింపచేయనున్నారు.

ఫార్మాస్యూటికల్ కంపెనీలు రోగులకు సహాయం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఉపయోగించే ఔషధాలు, మందులకు సైతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయింపును ఇస్తున్నట్లు బడ్జెట్‌లో స్పష్టంచేశారు. అయితే ఆ మందులను రోగులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. రోగులకు సహాయంగా అమలుచేస్తున్న 13 నూతన కార్యక్రమాలతో పాటే 37 ఇతర మందులనూ ఇందులో చేర్చాలని బడ్జెట్ ప్రతిపాదించింది.


 

***


(Release ID: 2098732) Visitor Counter : 37