ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ మహాకుంభ్‌లో ఆయుష్:


ఉచిత వైద్య సహాయం, ఔషధాలను వినియోగించుకున్న వారి సంఖ్య 1.21 లక్షలు
అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆయుష్ స్టాళ్లు

Posted On: 23 JAN 2025 4:56PM by PIB Hyderabad

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌లో ఆయుష్ ఏర్పాటు చేసిన ఓపీడీలు, క్లినిక్‌లు, ఇతర కార్యక్రమాలు భక్తులు, యాత్రికులు, సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఈ మహా ఉత్సవంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దేశవిదేశాల నుంచి కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1.21 లక్షలకు పైగా భక్తులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు.  

మహాకుంభ్‌లో 24x7 సేవలందించేందుకు ఏర్పాటైన 20 ఓపీడీల్లో 80 మంది వైద్యులతో కూడిన ఆయుష్ బృందం పని చేస్తోంది. సాధారణ, దీర్ఘకాలిక సమస్యలకు అవసరమైన చికిత్సను ఈ ఓపీడీలు అందిస్తున్నాయి. విదేశీ భక్తులు సైతం ఓపీడీ సంప్రదింపులతో సహా ఇతర ఆయుష్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అలాగే న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించే మొరార్జీ దేశాయ్ యోగ విద్యాలయం (ఎండీఎన్ఐవై)లోని శిక్షకులు సంగమ ప్రాంతం, సెక్టార్ -8లో ప్రత్యేకంగా కేటాయించిన శిబిరాల్లో రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు యోగ చికిత్సా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో విదేశీ భక్తులు పాల్గొనడం, స్థానికంగా, అంతర్జాతీయంగా ఆయుష్ సేవలకు పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తుంది.

ఆయుష్‌ వైద్యం, ఔషధ మొక్కలు మొదలైన వాటిలో వస్తున్న పురోగతులపై భక్తులకు అవగాహన కల్పించడంపైనే ఈ కార్యక్రమాలు ప్రధానంగా దృష్టి సారించాయి. జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపీబీ) ఔషధ మొక్కలతో సృజనాత్మక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. అలాగే ఈ మొక్కలకు సంబంధించిన సమాచారాన్ని, వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు నిపుణులను సైతం నియమించింది. ఈ మొక్కలను పెంచడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను భక్తులకు వివరించి వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

‘‘మా బృందం రోగులకు చికిత్సను అందిచడమే కాకుండా ఈ ఔషధ మొక్కల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను సైతం వివరిస్తోంది. వాటి సాగును ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించడమే మా లక్ష్యం’’ అని మహాకుంభ్‌లో ఆయుష్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న డా.అఖిలేష్ సింగ్ వెల్లడించారు.

వృద్ధుల సంరక్షణ, ఉచిత ఔషధాల పంపిణీ

రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు, క్యాల్షియం మాత్రలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఆయుష్ బృందం అవసరమైన ఏర్పాట్లు చేసింది. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా, మహాకుంభ్‌లో వారికి ప్రత్యేక సేవలను విస్తరించేందుకు ఆయుష్ బృందం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు లబ్ధిపొందిన వారిలో 45 శాతం  మంది వృద్ధులే ఉన్నారు. సాధారణ వ్యాధులు, వాటిని నివారించేందుకు ఆయుష్ చిట్కాల గురించి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు.  

చర్మ సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్న సుల్తాన్‌పూర్‌కు చెందిన భక్తుడు రఘునందన్ ప్రసాద్ తన అనుభవాన్ని పంచుకుంటూ  ‘‘ఆయుష్ శిబిరంలో ఇచ్చిన మందులు వాడిన తర్వాత నా పరిస్థితి మెరుగైంది. ప్రభుత్వం, ఆయుష్‌ చేస్తున్న కృషికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.

 

***


(Release ID: 2095840) Visitor Counter : 14