హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎన్‌డిఆర్‌ఎఫ్‌’ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం- సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


‘ఎన్‌ఐడిఎం’ దక్షిణాది కార్యాలయం.. ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ 10వ బెటాలియన్.. ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్రం సుపౌల్ ప్రాంగణం సహా దాదాపు రూ.220 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి;

“విపత్తు నిర్వహణ రంగంలో ‘విధానం-ప్రక్రియ-లక్ష్యం’ అనే మూడు అంశాల్లో ప్రధాని మోదీ విప్లవాత్మక మార్పులు తెచ్చారు”;

“విపత్తు నిర్వహణ రంగంలో భారత్‌ నేడు అగ్ర దేశంగా ఆవిర్భవించింది”;

“ఎన్‌డిఆర్ఎఫ్’ విశ్వసనీయత స్వల్ప కాలంలోనే జాతీయంగానేగాక అంతర్జాతీయంగానూ ఇనుమడించింది”;

“మోదీ ప్రభుత్వ నిర్దేశిత శూన్య ప్రాణనష్టం లక్ష్య సాధనలో ‘ఎన్‌డిఆర్ఎఫ్’.. ‘ఎన్‌డిఎంఎ’.. ‘ఎన్‌ఐడిఎం’లు సంపూర్ణ సమన్వయంతో కృషి చేస్తున్నాయి”;

“విపత్తుల వేళ ఎన్‌డిఆర్ఎఫ్‌ సిబ్బంది రాకతో ప్రజలకు ఇప్పుడు తాము సురక్షితమనే భరోసా లభిస్తోంది”;

“ప్రధాని మోదీ నేతృత్వాన ‘సిడిఆర్ఐ’ ఏర్పాటుతో విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల రీత్యా ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తోంది”;

“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు మోదీ ప్రభుత్వం పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తోంది”;

Posted On: 19 JAN 2025 6:01PM by PIB Hyderabad

   జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్ఎఫ్‌) 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు దాదాపు రూ.220 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం)  దక్షిణాది జాతీయ ప్రాంగణం, ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ 10వ బెటాలియన్, సుపాల్ ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రతిస్పందన కేంద్రం వంటివి అంతర్భాగంగా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో కొత్త ‘ఇంటిగ్రేటెడ్ షూటింగ్ రేంజ్’కి శంకుస్థాపన, తిరుపతిలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ భవన ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ డైరెక్టర్ జనరల్ శ్రీ పీయూష్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

   అనంతరం శ్రీ అమిత్‌ షా ప్రసంగిస్తూ- దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ తక్షణం ప్రతిస్పందిస్తుందని గుర్తుచేశారు. అలాగే మానవ తప్పిదాల వేళ ఆపన్న హస్తం అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో మానవ తప్పిదం ఫలితంగా తీవ్రస్థాయిలో ఎదురుదెబ్బలు తిన్నదని, రాష్ట్ర సామర్థ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు ఆ కాలంలో రాష్ట్ర ప్రగతికి వాటిల్లిన నష్టాలను పూరిస్తూ వృద్ధిని మూడు రెట్లు వేగంగా నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గడచిన ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ  రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు ఇతరత్రా సాయం అందించారని గుర్తుచేశారు. మరోవైపు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పటిష్ఠ పాలన, ఆర్థిక, అభివృద్ధి వ్యూహాలతో ముందంజ వేయిస్తున్నారని శ్రీ అమిత్ షా ప్రశంసించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రూ.11,000 కోట్లకుపైగా ప్యాకేజీ ఇచ్చేందుకు ఇటీవల కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన కర్మాగారాన్ని కాపాడుకోవడంతోపాటు దాని దీర్ఘకాలిక మనుగడకు భరోసా ఇస్తుందన్నారు. అలాగే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంలోని దూరదృష్టిని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు దీనికి రూపకల్పన చేయగా, ప్రధానమంత్రి మోదీ భూమిపూజతో ఇది శ్రీకారం చుట్టుకున్నదని తెలిపారు. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు.

   ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి గత ఆరు నెలల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.27,000 కోట్ల మేర నిధులు సమకూర్చారని చెప్పారు. తద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు తన స్వప్న సాకారం దిశగా కృషిని ముమ్మరం చేశారని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. ఇక కొత్త రైల్వే జోన్‌కు పునాది రాయి పడిందని, ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నుంచి 2028కల్లా రాష్ట్రం నలుమూలలా గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే రూ.1,600 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి ప్రాజెక్టు ప్రారంభం కావడాన్ని కూడా గుర్తుచేశారు. విశాఖపట్నం నగరాన్ని రూ.2 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ కూడలిగా మార్చే ప్రణాళికల గురించి వివరించారు. అంతేకాకుండా గత ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.1.2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించేలా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

   ప్రధాని మోదీ నాయకత్వాన గత దశాబ్దంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) ద్వారా విపత్తు నిర్వహణలో గణనీయ పురోగతి సాధించామని కేంద్ర హోంమంత్రి వివరించారు. క్షేత్రస్థాయిలో సమర్థ విపత్తు నిర్వహణకు భరోసా ఇస్తూ పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, ‘ఎన్‌సిసి’ స్కౌట్స్ క్యాడెట్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా అన్నీ సజావుగా, సమన్వయంతో సాగాంచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ విధానం, ప్రక్రియ, లక్ష్యాలలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత కాలంలో విధానం సహాయ-కేంద్రకం కాగా, ఇప్పుడది రక్షణ-కేంద్రక విధానంగా మారిందన్నారు. దేశ ప్రధానిగా 2014లో మోదీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వచ్చిన సమగ్ర మార్పులకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మార్పు ద్వారా ప్రతిస్పందన నుంచి చురుకైన వ్యూహాల అమలు ప్రక్రియ కూడా రూపాంతరం చెందిందన్నారు. ఈ మేరకు నష్టాల తగ్గింపు కాకుండా విపత్తుల వేళ శూన్య  ప్రాణనష్టానికి భరోసా అనే స్పష్టమైన లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ లక్ష్య సాధన కృషిలో ‘ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎన్‌డిఎంఎ, ఎన్‌ఐడిఎం’ మధ్య సామరస్యపూర్వక సహకారం అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. తద్వారా విపత్తుల నిర్వహణ, ప్రాణరక్షణ చర్యలు ప్రభావశీలం కాగలవని వివరించారు.

   ‘ఎన్‌డిఆర్ఎఫ్’ విశ్వసనీయత జాతీయంగానేగాక అంతర్జాతీయంగానూ స్వల్ప కాలంలోనే ఇనుమడించిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. విపత్తుల వేళ ఈ సంస్థ సిబ్బంది రాకతో తాము సురక్షితమేనన్న భావన ప్రజల్లో కనిపిస్తుందని ఆయన చెప్పారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు పెద్ద తుఫానులు సంభవించినా శూన్య ప్రాణనష్టం లక్ష్యాన్ని ‘ఎన్‌డిఆర్ఎఫ్’విజయవంతంగా సాధించిందని గుర్తుచేశారు. అలాగే నేపాల్, ఇండోనేషియా, తుర్కియే, మయన్మార్, వియత్నాం తదితర దేశాల్లో విపత్తుల సమయాన ‘ఎన్‌డిఆర్ఎఫ్’ సహాయ సహకారాలను ఆయా దేశాల అధిపతులు విస్తృత రీతిలో గుర్తించడంతోపాటు కొనియాడారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ‘ఎన్‌డిఎంఎ’ విధానాల అమలు వల్లనే విపత్తుల నిర్వహణలో భారత్‌ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన వివరించారు.

   దేశంలో విపత్తుల నిర్వహణకు 12వ ఆర్థిక సంఘం కేవలం రూ.12,500 కోట్లు కేటాయించిందని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా గుర్తు చేశారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం రూ.61,000 కోట్లకు పెంచినట్లు వివరించారు. అలాగే విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల రంగంలో ప్రధాని మోదీ మార్గదర్శకత్వాన మన దేశం అంతర్జాతీయ స్థాయిలో ముందంజ వేసిందని ఆయన చెప్పారు. దీంతోపాటు ‘సిడిఆర్‌ఐ’ (విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి) ఏర్పాటుకూ భారత్‌ నాయకత్వం వహించిందని తెలిపారు. ఈ కూటమిలో ఇప్పుడు 48 సభ్య దేశాలున్నాయని పేర్కొన్నారు.

   మరోవైపు విపత్తుల నిర్వహణ రంగంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా అనేక యాప్‌లు, వెబ్‌సైట్లు, పోర్టళ్లలను మోదీ ప్రభుత్వం రూపొందించినట్లు శ్రీ అమిత్‌ షా గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజానీకం వీటితో అనుసంధానం అయ్యారని, వీటికి అన్ని భాషల్లో పనిచేయగల సామర్థ్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ‘డయల్ 112’, ‘కామన్ అలర్ట్ ప్రోటోకాల్’ వంటి సేవల ద్వారా ప్రజలకు ఎంతో చేయూత లభిస్తున్నదని చెప్పారు. విపత్తు నిర్వహణ సేవల విస్తరణ దిశగా మరో రెండు సంస్థలు భాగస్వాములు కానున్నాయని తెలిపారు. వీటి ఏర్పాటు కోసం శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఉచితంగా భూమి కేటాయించారని చెప్పారు, తద్వారా ‘ఎన్‌డిఆర్ఎఫ్‌ ‘10వ బెటాలియన్ సహా ‘ఎన్‌ఐడిఎం’ దక్షిణ భారత ప్రాంగణం ఏర్పాటుకు తోడ్పడ్డారని వివరించారు.


(Release ID: 2094488) Visitor Counter : 27