సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల్లో కీలక సవరణలు ప్రవేశపెట్టిన సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ
సులభతర వాణిజ్యం: సవరించిన నిబంధనల ప్రకారం బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్ లైన్ లో స్థానిక కేబుల్ ఆపరేటర్ల నమోదు
స్థానిక కేబుల్ ఆపరేటర్లకు నమోదు అధీకృత సంస్థగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ.. స్థానిక ఆపరేటర్ల నమోదు చెల్లుబాటు ఐదేళ్లకు పెంపు, దేశవ్యాప్తంగా విస్తరించనున్న పరిధి
Posted On:
17 JAN 2025 4:21PM by PIB Hyderabad
స్థానిక కేబుల్ ఆపరేటర్ల (ఎల్ సీవో) నమోదు ప్రక్రియను క్రమద్ధీకరించడం కోసం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు, 1994కు సవరణలు చేస్తూ సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. జారీ చేసిన తేదీ నుంచే ఇవి అమలవుతుండగా.. స్థానిక కేబుల్ ఆపరేటర్ల నమోదు ఇకపై పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది. ఆ నమోదులకు సంబంధించి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖే అధీకృత సంస్థగా ఉంటుంది.
ఆధార్, పాన్, సీఐఎన్, డీఐఎన్ సహా దరఖాస్తుదారు వివరాలన్నింటినీ సక్రమంగా ధ్రువీకరించిన తర్వాత స్థానిక కేబుల్ ఆపరేటర్ల నమోదు ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి. నమోదు తిరస్కరణపై అప్పీలు చేసుకోవడానికీ లేదా ఎల్ సీవో నమోదు పునరుద్ధరణకూ సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు.
గతంలో, ఎల్ సీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలోని స్థానిక ప్రధాన పోస్టాఫీసులో ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ నమోదు ప్రక్రియ నిర్వహించేవారు. ప్రధాన పోస్టుమాస్టరు నమోదు అధికారిగా ఉండేవారు. ఈ తరహా నమోదు ప్రక్రియ అయోమయంతో కూడి ఉండడంతోపాటు ఎక్కువ సమయం తీసుకునేది. అలాగే, నమోదును పొందిన తర్వాత కార్యకలాపాలు నిర్వహించగల పరిధి నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితమై ఉండేది.
ఎల్ సీవో నమోదుకు సంబంధించి సవరించిన నిబంధనల్లోని ప్రత్యేకమైన అంశాలు:-
a. కొత్తగా నమోదు లేదా నమోదు పునరుద్ధరణ కోసం ఎల్ సీవోలు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్ (www.new.broadcastseva.gov.in) ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నమోదు ధ్రువీకరణ పత్రం ఆన్లైన్ లో జారీ అవుతుంది.
b. ఎల్ సీవో నమోదుల మంజూరు లేదా పునరుద్ధరణ ఐదేళ్ల కాలానికి జరుగుతాయి.
c. నమోదు లేదా పునరుద్ధరణ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. అయిదు వేలు.
d. దేశమంతటా కార్యకలాపాల నిర్వహణ కోసం ఎల్ సీవో నమోదు చెల్లుబాటు అవుతుంది.
e. నమోదు పునరుద్ధరణ దరఖాస్తులను గడువుకు కనీసం 90 రోజుల ముందు చేసుకోవాలి.
f. నమోదు లేదా పునరుద్ధరణలను నమోదు అధికారి (నియమిత సెక్షన్ ఆఫీసర్) తిరస్కరిస్తే, ఆ నిర్ణయంపై తిరస్కారం పొందిన 30 రోజుల్లోగా ఎల్ సీవోలు ఉప కార్యదర్శి (డీఏఎస్) ఎదుట అప్పీలు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న ఎల్ సీవో నమోదు ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఎల్ సీవో ప్రస్తుత నమోదు ఇంకా 90 రోజుల కన్నా తక్కువ కాలానికే చెల్లుబాటు అవుతూంటే.. పునరుద్ధరణ చేసుకోవాలనుకునే వారు వెంటనే పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నమోదు మంజూరు/ పునరుద్ధరణ కోసం పోస్టాఫీసుల్లో చేసుకున్న దరఖాస్తులు నేటికీ అపరిష్కృతంగా ఉంటే వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. పోర్టల్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా సహాయం అవసరమైతే పోర్టల్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ నంబరులో లేదా lco.das[at]gov[dot]in ను మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
దరఖాస్తుదారు వివరాలను ఆన్లైన్ లో విజయవంతంగా ధ్రువీకరించిన తర్వాత నమోదు/ పునరుద్ధరణ ధ్రువీకరణ పత్రాలను జాప్యం లేకుండా జారీ చేసేలా.. సులభతర వాణిజ్యంపై ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నమోదు, పునరుద్ధరణ ప్రక్రియను రూపొందించారు.
***
(Release ID: 2094120)
Visitor Counter : 76
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada