హోం మంత్రిత్వ శాఖ
పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం సమీక్షకు అధ్యక్షత వహించిన హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
నేర విధానాలను కార్యనిర్వాహక విభాగం, బీపీఆర్డీ, ఎన్‌సీఆర్‌బీ, జైలు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించాలని సూచన
క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల అంశంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించేందుకు బీపీఆర్డీ అధ్యయనం చేపట్టి పరిష్కరించాలి
Posted On:
09 JAN 2025 6:47PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన పోలీసు పరిశోధన, అభివృద్ధి విభాగం (బీపీఆర్డీ) సమీక్షా సమావేశానికి కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర హోం కార్యదర్శి, బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, బ్యూరో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బీపీఆర్డీకి చెందిన ఆరు విభాగాలతో పాటుగా ఇతర యూనిట్లు (సీఏపీటీ భోపాల్, సీడీటీఐలు), అవి సాధించిన విజయాలు, కొనసాగుతున్న పనులు, భవిష్యత్తు ప్రణాళికలను హోం మంత్రి సమీక్షించారు. నూతన నేర చట్టాలు (ఎన్‌సీఎల్) అమలు దిశగా బీపీఆర్డీ చేస్తున్న ప్రయత్నాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా సమీక్షించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత పోలీసు బలగాలను స్మార్ట్ బలగాలుగా మార్చేందుకు బీపీఆర్డీ కట్టుబడి ఉందని హోం మంత్రి తెలియజేశారు. దీనికి అవసరమైన మేధోపరమైన, భౌతికమైన సంస్థాగత వనరులను సమకూర్చుకోవడం ద్వారా శాంతిభద్రతలతో పాటుగా అంతర్గత భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని అన్నారు.
కార్యనిర్వాహక విభాగం, బీపీఆర్డీ, ఎన్‌సీఆర్‌బీ, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నేరాలు జరిగిన విధానాన్ని విశ్లేషించాలని సమావేశంలో చర్చ సందర్భంగా హోం మంత్రి అన్నారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించేందుకు బీపీఆర్డీ సర్వే చేపట్టి పరిష్కారాలు కనుగొనేందుకు కృషి చేయాలని అన్నారు.
పరిశోధనా అధ్యయనాలు, ప్రాజెక్టుల్లో వివిధ రంగాల నిపుణుల సహకారంతో పాటుగా అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల భాగస్వామ్య ప్రాధాన్యం గురించి శ్రీ అమిత్ షా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన పరిధి నేపథ్యంలో బీపీఆర్డీ ప్రాజెక్టులు, అధ్యయనాలు, ప్రచురణల ద్వారా పోలీసు బలగాలు ప్రయోజనం పొందడంతో పాటు ప్రజల మనస్సుల్లో వారి విలువ పెరిగేలా సూచనలు అందించారు.
ఎన్‌సీఎల్ శిక్షణ-అమలు, పాత పోలీసు, జైలు విధానాలు, పద్ధతులను మెరుగుపరచి పోలీసు బలగాలను ఆధునికీకరించడంతో పాటు కొత్త తరం సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్యూరో చేస్తున్న కృషిని హోం మంత్రి ప్రశంసించారు. మంత్రిత్వ శాఖను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనుసంధానించేందుకు నోడల్ ఏజెన్సీగా బీపీఆర్డీ పోషిస్తున్న పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన అని ప్రధాన విభాగాలకు వాటి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా సహాయం చేసే విధంగా బ్యూరో పనితీరును క్రమబద్ధీకరించాలని శ్రీ షా ఆదేశించారు. పోలీసింగ్ అవసరాలను తీర్చేందుకు గాను మేక్ ఇన్ ఇండియా పద్ధతి పాటించాల్సిన ఆవశ్యకతను హోం మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే సమస్యలను గుర్తించి ప్రభావవంతమైన పరిష్కారాలను కనుగొనేందుకు నేర న్యాయ నిపుణులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖ భాగస్వామ్య అవసరం గురించి సైతం చర్చించారు. బ్యూరో నిర్వహణ సజావుగా సాగేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.
***
(Release ID: 2091649)
Visitor Counter : 10