ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో శ్వాస సంబంధిత రోగాలపై ప్రస్తుత స్థితినీ, వాటి నియంత్రణకు తీసుకొంటున్న సార్వజనిక ఆరోగ్యసంరక్షణ చర్యల స్థితినీ సమీక్షించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి



మన దేశంలో శ్వాసక్రియ సంబంధిత రోగాలేమీ పెరగట్లేదు:

ఆ తరహా కేసులను గుర్తించడానికి నిఘా పటిష్టం

నివారణ ప్రధాన జాగ్రతచర్యల విషయంలో సామాన్య ప్రజానీకంలో చైతన్యాన్ని పెంచాల్సిందిగా రాష్ట్రాలకు సూచన

ఐఎల్ఎల్, ఎస్ఏఆర్ఐ తనిఖీ ప్రక్రియను బలోపేతం చేసి, సమీక్షిస్తూ ఉండాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు

Posted On: 07 JAN 2025 10:26AM by PIB Hyderabad

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు చైనాలో పెచ్చుపెరుగుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను దృష్టిలో పెట్టుకొని, భారత్‌లో ఆ తరహా కేసుల గురించే కాకుండా మన దేశ పౌరుల్లో శ్వాసక్రియ సంబంధిత అనారోగ్య స్థితిగతులు ప్రస్తుతం ఏ స్థాయిలలో ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అధ్యక్షతన ఒక సమీక్ష సమావేశాన్ని దృశ్య మాధ్యమం వేదికగా నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసర్చ్ (డీహెచ్ఆర్) కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్‌)కు చెందిన డాక్టర్ ప్రొఫెసర్ అతుల్ గోయల్, రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాజెక్టు (ఐడీఎస్‌పీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ), ఐడీఎస్‌పీకి చెందిన రాష్ట్ర నిఘా విభాగాల నిపుణులు పాల్గొన్నారు.

ఐడీఎస్‌పీ ఇస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే, దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా-లైక్ ఇల్‌నెస్ (ఐఎల్ఐ), సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ (ఎస్ఏఆర్ఐ)లలో ఎలాంటి అసాధారణ పెరుగుదల వివరాలు సూచితం కాలేదన్న సంగతిని ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు. ఐసీఎంఆర్ సెంటినెల్ సర్వేలెన్స్ డేటా కూడా ఇదే విషయాన్ని బలపరచింది.  

ప్రపంచంలో 2001 నుంచీ హెచ్ఎంపీవీ ఉనికి ఉందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టంచేశారు. ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ నిఘాను పటిష్టం చేయాల్సిందిగాను, సమీక్షలు నిర్వహిస్తూ ఉండాల్సిందిగాను రాష్ట్రాలకు ఆమె సూచన చేశారు. సాధారణంగా చలికాలంలో శ్వాస సంబంధిత రుగ్మతలు అధికంగా నమోదు అవుతూ ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు. శ్వాసక్రియ సంబంధిత రోగుల కేసులు పెరిగే పక్షంలో వాటిని దీటుగా ఎదుర్కొని పరిష్కరించడానికి దేశం సకల ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉందని కూడా ఆమె తెలిపారు.

హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) అనేక శ్వాసక్రియ సంబంధిత వైరస్‌లలో ఒకటి. ఇది ముఖ్యంగా శీతాకాలంలోనూ, చలికాలానికి ఎండకాలానికీ మధ్య వచ్చే వసంత రుతువు ఆరంభ సమయంలోనూ అన్ని వయోవర్గాల వారిలో అంటురోగాల్ని కలగజేస్తుంటుంది. ఈ వైరస్ సోకడం సాధారణంగా తేలికగా ఉండి, చాలావరకు కేసులు వాటంతట అవే చక్కబడతాయి. ఐసీఎంఆర్, వైరల్ రిసర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్)లలో చాలినంత రోగనిదాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

వైరస్ సంక్రమించకుండా చేపట్టతగిన నివారక చర్యల విషయంలో ఇన్ఫర్మేషన్-ఎడ్యుకేషన్-కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాల్ని విరివిగా చేపట్టి ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచనలు చేశారు. చేతులను తరచుగా సబ్బుతోనూ, నీళ్లతోనూ శుభ్రపరుచుకొంటూ ఉండడం, ప్రజలు వారి చేతులను కడుక్కోకుండానే వారి కళ్లను, ముక్కును, నోటిని తాకకుండా ఉండడం, రోగ లక్షణాలున్న వ్యక్తులకు చాలా దగ్గరగా మసలుకోకుండా జాగ్రత్తపడడం, దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోటిని, ముక్కును చేతితో కప్పి ఉంచడం వంటి సులభమైన పనులు చేయాల్సిందిగా ప్రచారం నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు.


 

***


(Release ID: 2090888) Visitor Counter : 140