ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
26 DEC 2024 9:54PM by PIB Hyderabad
మూడో వీర బాల దివస్ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ధైర్యసాహసాలు, ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతిక రంగం, క్రీడలు, కళా రంగాల్లో ఈ పురస్కారాలను అందిస్తారు.
ముఖాముఖి సందర్భంగా, పిల్లల నేపథ్యాలను విన్న ప్రధానమంత్రి.. జీవితంలో మరింత కృషిచేయాలంటూ వారిని ప్రోత్సహించారు. పుస్తకాలు రాసిన ఓ బాలికతో సంభాషించారు. తన పుస్తకాలకు ఎలాంటి స్పందన వచ్చిందో అడగగా.. మిగతా పిల్లలు కూడా సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారని ఆ బాలిక బదులిచ్చింది. ఇతర చిన్నారుల్లో కూడా ప్రేరణ కలిగించిన ఆ బాలికను శ్రీ మోదీ ప్రశంసించారు.
అనంతరం.. వివిధ భాషల్లో పాటలు పాడగల మరో పురస్కార గ్రహీతతో సంభాషించారు. బాలుడి శిక్షణ గురించి శ్రీ మోదీ ఆరా తీయగా.. తానెక్కడా శిక్షణ తీసుకోలేదనీ, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, కశ్మీరీ నాలుగు భాషలలో పాడగలననీ చెప్పాడు. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉందనీ, కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తున్నాననీ కూడా చెప్పాడు. ఆ బాలుడి ప్రతిభను శ్రీ మోదీ కొనియాడారు.
ఓ యువ చదరంగ క్రీడాకారుడితో ముచ్చటించిన శ్రీ మోదీ.. తనకు ఆట ఎవరు నేర్పించారని అడిగారు. తన తండ్రి నుంచీ, యూట్యూబ్ వీడియోలు చూడడం ద్వారా తాను ఆ ఆట నేర్చుకున్నానని ఆ బాలుడు బదులిచ్చాడు.
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. లద్దాఖ్ లోని కార్గిల్ యుద్ధ స్మారకం నుంచి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వరకు 1251 కిలోమీటర్ల దూరం 13 రోజుల్లో సైకిల్ పై ప్రయాణించిన మరో చిన్నారి విజయం గురించి ప్రధానమంత్రి తన మాటల్లోనే విన్నారు. రెండేళ్ల క్రితం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతుల సందర్భంగా మణిపూర్ లోని మొయిరాంగ్ లో ఉన్న ఐఎన్ఏ స్మారకం నుంచి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వరకు 2612 కిలోమీటర్ల దూరం 32 రోజుల్లో సైకిల్ పై ప్రయాణించినట్లు కూడా ఆ బాలుడు చెప్పాడు. ఒక్క రోజులో గరిష్టంగా 129.5 కిలోమీటర్ల దూరం తాను సైకిల్ తొక్కానని ఆ బాలుడు ప్రధానితో చెప్పాడు.
80 శాస్త్రీయ (సెమీ క్లాసికల్) నృత్య రీతులను ఒక్క నిమిషంలో పూర్తి చేయడంతోపాటు 13 సంస్కృత శ్లోకాలను ఒకే నిమిషంలో పఠించి రెండు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పినట్టు ఓ బాలిక శ్రీ మోదీతో చెప్పింది. ఈ రెండింటినీ తాను యూట్యూబ్ వీడియోలు చూసే నేర్చుకున్నానని చెప్పింది.
జూడోలో జాతీయ స్థాయి బంగారు పతకం గెలుచుకున్న ఓ బాలికతో ప్రధానమంత్రి ముచ్చటించారు. తాను ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలనుకుంటున్నానని ఆ బాలిక చెప్పింది. తనకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
పార్కిన్సన్ వ్యాధి గ్రస్తుల కోసం స్వీయ నియంత్రిత చెంచానూ, మెదడు వయస్సును అంచనా వేసే పరికరాన్నీ రూపొందించిన మరో బాలికతోనూ శ్రీ మోదీ ముచ్చటించారు. దీనికోసం తాను రెండేళ్ల పాటు కృషిచేశానని, ఈ అంశంపై మరింత పరిశోధన చేయాలనుకుంటున్నానని ఆ బాలిక ప్రధానితో చెప్పింది.
కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాల మేళవింపుతో దాదాపు 100 హరికథా పారాయణ ప్రదర్శనలు ఇచ్చిన ఓ కళాకారిణిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
గత రెండేళ్లలో 5 వేర్వేరు దేశాల్లో 5 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ఓ బాలికతో మాట్లాడిన ప్రధానమంత్రి.. వేరే దేశాలకు వెళ్లినప్పుడు భారతీయురాలిగా తన అనుభవాలెలా ఉన్నాయని ఆ బాలికను అడిగారు. ప్రజల నుంచి తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత లభించాయని ఆ చిన్నారి బదులిచ్చింది. బాలికా సాధికారత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడమే పర్వతారోహణ వెనుక తన ఉద్దేశమంటూ ఆ బాలిక ప్రధానమంత్రికి వివరించారు.
ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ లో ఓ బాలిక సాధించిన అనేక విజయాల గురించి ప్రధానమంత్రి విన్నారు. ఈ ఏడాది న్యూజిలాండ్ లో జరిగిన రోలర్ స్కేటింగ్ ఈవెంట్ లో అంతర్జాతీయ బంగారు పతకంతో పాటు 6 జాతీయ పతకాలను ఆ బాలిక గెలుచుకుంది. ఈ నెలలో థాయిలాండ్ లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ బాలిక విజయం గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించిన మరో బాలికా అథ్లెట్ అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అగ్నిప్రమాదానికి గురైన అపార్ట్‌మెంట్ భవనంలోనుంచి ధైర్యసాహసాలు ప్రదర్శించి అనేక మంది ప్రాణాలను రక్షించిన మరో పురస్కార గ్రహీతను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈత కొడుతున్న సమయంలో మిగతా పిల్లలు మునిగిపోకుండా కాపాడిన ఓ బాలుడిని కూడా ఆయన అభినందించారు.
వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ.. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
***
MJPS/SR
(Release ID: 2088374)
Visitor Counter : 10