ప్రధాన మంత్రి కార్యాలయం
సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)
Posted On:
22 DEC 2024 7:46PM by PIB Hyderabad
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా, గౌరవనీయ కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబా అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా ఈ నెల 22న బయాన్ ప్యాలెస్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు. కువైట్ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను తనకు అందించినందుకు అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూరక్వక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలున్న ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ, బహుపాక్షిక అంశాలపై ఇరువురు నేతలూ చర్చించారు.
సాంప్రదాయక, సన్నిహిత, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను, అన్ని రంగాల్లో సహకారాన్నీ పెంపొందించుకోవాలన్న ఆకాంక్షల నేపథ్యంలో.. భారత్, కువైట్ మధ్య సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చడానికి ఇరువురు నేతలూ అంగీకరించారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలకూ అనుగుణంగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంటుందని వారిద్దరూ స్పష్టంచేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వల్ల మన దీర్ఘకాలిక చారిత్రక సంబంధాలు మరింత విస్తృతమవుతాయి అని పేర్కొన్నారు.
గౌరవనీయ కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అబ్దుల్లా అల్ జబీర్ అల్ ముబారక్ అల్ సబాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో.. రాజకీయ, వాణిజ్య, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధనం, సంస్కృతి, విద్య, సాంకేతికత, ప్రజా సంబంధాలు సహా కీలక రంగాల్లో సమగ్ర, నిర్మాణాత్మక సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో నిబద్ధతను ఇరుపక్షాలూ పునరుద్ఘాటించాయి.
శతాబ్దాల నాటి ఉమ్మడి చారిత్రక సంబంధాలు, సాంస్కృతిక అనుబంధాలను ఇరుపక్షాలూ గుర్తుచేసుకున్నాయి. వివిధ స్థాయిలలో నిరంతర చర్చలపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. బహుముఖీన ద్వైపాక్షిక సహకారం వేగవంతం కావడంలో, నిరంతరాయంగా కొనసాగడంలో ఇవి దోహదం చేశాయి. మంత్రులు, సీనియర్ అధికారుల స్థాయిలో క్రమం తప్పకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా ఉన్నత స్థాయి చర్చల్లో ఇటీవలి వేగాన్ని కొనసాగించడంపై ఇరుపక్షాలూ స్పష్టతకు వచ్చాయి.
భారత్, కువైట్ మధ్య ఇటీవల ఉమ్మడి సహకార కమిషన్ (జేసీసీ) ఏర్పాటును ఇరుపక్షాలు స్వాగతించాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఒక సంస్థాగత యంత్రాంగంగా జేసీసీ ఉంటుంది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు దీనికి నేతృత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతికతలు, భద్రత, ఉగ్రవాద ప్రతిఘటన, వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో ఉమ్మడి కార్యాచరణ బృందాలను (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేయడం ద్వారా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యం, మానవ వనరులు, హైడ్రోకార్బన్లపై ప్రస్తుతమున్న జేడబ్ల్యూజీలకు ఇవి అదనం. జేసీసీ, దాని పరిధిలోని జేడబ్ల్యూజీల సమావేశాలను త్వరితగతిన నిర్వహించాలని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం శాశ్వత అనుసంధానంగా ఉందన్న ఇరుపక్షాలూ.. ద్వైపాక్షిక వాణిజ్యంలో మరింత వృద్ధి, వైవిధ్యాలకు అవకాశాలున్నాయని స్పష్టంచేశాయి. వాణిజ్య ప్రాతినిధ్య వినిమయాన్ని ప్రోత్సాహించాల్సిన, సంస్థాగత అనుసంధానాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతలపై కూడా వారు ప్రముఖంగా చర్చించారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత ఆర్థిక వ్యవస్థ, గణనీయమైన పెట్టుబడి సామర్థ్యం గల కువైట్ ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాలను గుర్తించిన ఇరుపక్షాలూ.. భారత్ లో పెట్టుబడుల కోసం వివిధ మార్గాలపై చర్చించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, విదేశీ సంస్థాగత పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో భారత్ తీసుకున్న చర్యలను కువైట్ స్వాగతించింది. సాంకేతికత, పర్యాటకం, ఆరోగ్య రక్షణ, ఆహార భద్రత, రవాణా తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ఆసక్తి చూపింది. భారతీయ సంస్థలు, కంపెనీలూ - కువైట్ లోని పెట్టుబడి సంస్థల సన్నిహిత భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను వారు గుర్తించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనీ, వాటిలో భాగస్వాములు కావాలనీ ఇరుదేశాల కంపెనీలనూ కోరారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై జరుగుతున్న చర్చలను వేగవంతం చేసి, పూర్తి చేయాలని ఇరు దేశాల సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.
ఇంధన రంగంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి. ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యంపై సంతృప్తి వ్యక్తంచేసిన వారు.. దానిని మరింత విస్తృతపరచడానికి అవకాశముందని అంగీకారానికి వచ్చారు. సరఫరా శ్రేణిలోని వివిధ దశల్లో మరింత సహకారం ద్వారా.. కొనుగోలుదారు- అమ్మకం దారు సంబంధాన్ని సమగ్ర భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకోవడానికి గల అవకాశాలపై వారు చర్చించారు. చమురు - గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి; శుద్ధి, ఇంజినీరింగ్ సేవలు, పెట్రోకెమికల్ పరిశ్రమలు, నవీన-పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల కంపెనీలకు చేయూతనివ్వడానికి ఇరుపక్షాలూ ఆసక్తి కనబరిచాయి. భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కార్యక్రమంలో కువైట్ భాగస్వామ్యంపై చర్చించడానికి కూడా ఇరుపక్షాలూ అంగీకరించాయి.
భారత్, కువైట్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో రక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఇరుపక్షాలు అంగీకరించాయి. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ సిబ్బందికి శిక్షణ, తీరప్రాంత రక్షణ, సముద్ర భద్రత, ఉమ్మడి అభివృద్ధి, రక్షణ పరికరాల ఉత్పత్తి సహా ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం యంత్రాంగాన్ని ఏర్పరిచేలా రక్షణ రంగంలో అవగాహన ఒప్పందాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాల ఉగ్రవాదాలనూ, ఉగ్ర చర్యలనూ ఇరు పక్షాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఉగ్రవాద ఆర్థిక ఆధారాలను, దాని రక్షిత స్థావరాలను భగ్నం చేయాలనీ.. ఉగ్రవాద మూలాలను నిర్మూలించాలని పిలుపునిచ్చాయి. భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారంపై సంతృప్తి చేసిన ఇరుపక్షాలూ.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సమాచార- మేధో భాగస్వామ్యంతోపాటు పరిశోధనలు, అత్యుత్తమ విధానాలు, సాంకేతికతల పరస్పర వినిమయం; సామర్థ్యాభివృద్ధి అంశాల్లో సహకారాన్ని మెరుగుపరచుకోవడంపై అంగీకారానికి వచ్చాయి. చట్టాల అమలు, మనీ లాండరింగ్ నివారణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర అంతర్జాతీయ నేరాల నివారణలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, అతివాదం, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే చర్యల కోసం సైబర్ రంగాన్ని ఉపయోగించకుండా నిరోధించడం సహా సైబర్ భద్రతలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ఇరుపక్షాలూ చర్చించాయి. ‘‘ఉగ్రవాద నిర్మూలనలో అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచడం, సరిహద్దు భద్రత కోసం రక్షణ యంత్రాంగాన్ని నిర్మించడం- దుషాంబె ప్రక్రియలో కువైట్ పాత్ర’’పై నవంబరు 4-5 తేదీల్లో కువైట్ లో జరిగిన నాలుగో ఉన్నత స్థాయి సదస్సు ఫలితాలను భారత పక్షం ప్రశంసించింది.
ద్వైపాక్షిక సంబంధాల్లో ఆరోగ్య సహకారం ఒక ముఖ్యమైన మూలాధారమని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ముఖ్యమైన రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించాయి. కొవిడ్-19 విపత్తు సమయంలో ద్వైపాక్షిక సహకారంపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తంచేశాయి. కువైట్ లో భారత ఔషధరంగ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వారు చర్చించారు. ఔషధ నియంత్రణ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలపై జరుగుతున్న చర్చల్లో.. వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకునే ఉద్దేశాన్ని వారు వ్యక్తంచేశారు.
అధునాతన సాంకేతికతలు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ సహా సాంకేతిక రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో ఇరుపక్షాలు ఆసక్తి వ్యక్తంచేశాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో బీ2బీ సహకారాన్ని పరిశీలించడం, ఈ-గవర్నెన్స్ ను అభివృద్ధి చేయడం, విధానాలు - నియంత్రణల పరంగా పరిశ్రమలు/ కంపెనీలకు సౌకర్యాలు కల్పించడం కోసం ఇరు దేశాలు అత్యుత్తమ పద్ధతులను అవలంబించడం కోసం ఉన్న అవకాశాలను వారు చర్చించారు.
ఆహార భద్రత విషయంలో భారత్ తో సహకారానికి కువైట్ ఆసక్తి చూపింది. భారత్ లోని ఫుడ్ పార్కుల్లో కువైట్ కంపెనీల పెట్టుబడులు సహా సహకారానికి గల వివిధ మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో సభ్యత్వం పొందాలన్న కువైట్ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తక్కువ కర్బనోద్గార విధానాలను అభివృద్ధి చేసి విస్తరించడం, సుస్థిర ఇంధన ప్రత్యామ్నాయాలను అందించే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఐఎస్ఏ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని పెంచే దిశగా కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఇరుదేశాల పౌర విమానయాన అధికారుల మధ్య ఇటీవల జరిగిన సమావేశాలను ఇరు పక్షాలు ప్రస్తావించాయి. ద్వైపాక్షికంగా విమాన సీట్ల సామర్థ్యాల పెంపు, సంబంధిత అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. వీలైనంత త్వరగా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని పొందడం కోసం చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు.
2025-29 సమయానికి.. కళలు, సంగీతం, సాహితీ ఉత్సవాల్లో సాంస్కృతిక వినిమయానికి విస్తృతమైన అవకాశాలను కల్పించే సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ) పునరుద్ధరణ చర్యలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించడం, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడంపై తమ అంకితభావాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
2025-2028 సంవత్సరానికి క్రీడా రంగంలో సహకారం కోసం ప్రత్యేక కార్యక్రమంపై అంగీకారం కుదరడం పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తంచేశాయి. పరస్పర వినిమయం, క్రీడాకారుల సందర్శనలు.. కార్యశాలలు, సెమినార్లు, సదస్సుల నిర్వహణ, ఇరుదేశాల మధ్య క్రీడా ప్రచురణల పరస్పర మార్పిడి సహా ఈ రంగంలో సహకారాన్ని ఈ నిర్ణయం బలోపేతం చేస్తుంది.
ఇరుదేశాల ఉన్నత విద్యాసంస్థల మధ్య సంస్థాగత సంబంధాలు, వినిమయాన్ని పెంపొందించడం సహా.. విద్య సహకారంలో ఒక ముఖ్యమైన అంశమని ఇరుపక్షాలు స్పష్టంచేశాయి. విద్యా సాంకేతికత, ఆన్లైన్ అభ్యసన వేదికల్లో అవకాశాలను పరిశీలించడం, డిజిటల్ గ్రంథాలయాల ద్వారా విద్యా మౌలిక సదుపాయాల ఆధునికీకరణలో ఇరుదేశాలూ ఆసక్తి వ్యక్తంచేశాయి.
షేక్ సౌద్ అల్ నజీర్ అల్ సబా కువైట్ దౌత్య సంస్థ – సుష్మా స్వరాజ్ విదేశీ సేవా సంస్థ (ఎస్ఎస్ఐఎఫ్ఎస్) మధ్య అవగాహన ఒప్పందంలో భాగంగా.. న్యూఢిల్లీలోని ఎస్ఎస్ఐఎఫ్ఎస్ లో దౌత్యవేత్తలు, కువైట్ అధికారుల కోసం ప్రత్యేక కోర్సును నిర్వహించాలన్న ప్రతిపాదనను ఇరు పక్షాలు స్వాగతించాయి.
చరిత్రాత్మక భారత్-కువైట్ సంబంధాలకు శతాబ్దాల నాటి ప్రజా సంబంధాలు మూలాధారమని ఇరుపక్షాలు అంగీకరించాయి. తమకు ఆతిథ్యమిచ్చిన దేశ పురోగతి, అభివృద్ధిలో కువైట్ లోని భారతీయ సమాజం పోషించిన పాత్ర, సహకారాన్ని కువైట్ నాయకత్వం మనస్ఫూర్తిగా ప్రశంసించింది. కువైట్ లోని భారతీయ పౌరులు శాంతియుత స్వభావం గలవారనీ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారనీ వారు వ్యాఖ్యానించారు. కువైట్ లోని విస్తృతమైన, పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ సమాజం సంక్షేమం, శ్రేయస్సులకు భరోసా కల్పించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
శ్రామిక శక్తి ప్రయాణం, మానవ వనరుల అంశాల్లో దీర్ఘకాలిక, చారిత్రక సహకారం ప్రాధాన్యాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. వాణిజ్య చర్చలూ, అలాగే కార్మికులు- శ్రామిక శక్తి సంబంధిత అంశాల్లో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తద్వారా ప్రవాసులు, అక్కడికి వెళ్లిన కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారంతోపాటు ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాలపై స్పష్టత వస్తుంది.
ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక కూటముల్లో ఇరుదేశాల అద్భుతమైన సమన్వయాన్ని ఇరుపక్షాలు ప్రశంసించాయి. 2023లో షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో)కు భారత్ అధ్యక్షత వహించిన సమయంలో షాంఘై సహకార సంస్థలో ‘చర్చల భాగస్వామి’గా కువైట్ ప్రవేశించడాన్ని భారత పక్షం స్వాగతించింది. ఆసియా సహకార చర్చల్లో (ఏసీడీ) కువైట్ క్రియాశీల పాత్రను కూడా భారత పక్షం అభినందించింది. ఏసీడీని ప్రాంతీయ సంస్థగా మార్చే అవకాశాల పరిశీలన దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను కువైట్ పక్షం ప్రముఖంగా ప్రస్తావించింది.
ఈ ఏడాది జీసీసీకి అధ్యక్షతను చేపట్టిన నేపథ్యంలో గౌరవనీయ కువైట్ అమీర్ కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ – జీసీసీ మధ్య పెరుగుతున్న సహకారం ఆయన దార్శనిక నాయకత్వంలో మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. వ్యూహాత్మక చర్చల కోసం విదేశాంగ మంత్రుల స్థాయిలో సెప్టెంబరు 9న రియాద్ లో జరిగిన తొలి భారత్-జీసీసీ సంయుక్త మంత్రుల స్థాయి సమావేశం ఫలితాలను ఇరుపక్షాలు స్వాగతించాయి. ఆరోగ్యం, వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, ఆహార భద్రత, రవాణా, ఇంధనం, సంస్కృతి తదితర రంగాల్లో ఇటీవల ఆమోదించిన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా భారత్-జీసీసీ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి జీసీసీ అధ్యక్ష స్థానంలో ఉన్న కువైట్ పక్షం హామీ ఇచ్చింది. భారత్-జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తిచేయాల్సిన ఆవశ్యకతను ఇరుపక్షాలు స్పష్టంచేశాయి.
ఐక్యరాజ్య సమితి సంస్కరణల నేపథ్యంలో.. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబిస్తూ, ఐక్యరాజ్యసమితి కేంద్రంగా ఉండేలా సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలూ ప్రధానంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అది కీలకమవుతుంది. రెండు కేటగిరీల సభ్యత్వాలను విస్తరించడం ద్వారా.. భద్రతా మండలి సహా ఐక్యరాజ్యసమితి సంస్కరణల ఆవశ్యకతను ఇరుపక్షాలు ప్రధానంగా పేర్కొన్నాయి. తద్వారా అది మరింత ప్రాతినిధ్య పూర్వకంగా, విశ్వసనీయంగా, ప్రభావవంతంగా మారుతుంది.
పర్యటన సందర్భంగా కింది పత్రాలపై సంతకాలు/ వినిమయం జరిగాయి. ఇది బహుముఖ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సహకార రంగంలో సరికొత్త అవకాశాలను అందిస్తాయి:
● రక్షణ రంగంలో సహకారంపై భారత్, కువైట్ మధ్య అవగాహన ఒప్పందం.
● 2025-2029 సమయానికి భారత్ - కువైట్ మధ్య సాంస్కృతిక వినిమయ కార్యక్రమం.
● 2025-2028 సమయానికి భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకూ - కువైట్ ప్రభుత్వ యువజన, క్రీడా ప్రాధికార సంస్థ మధ్య క్రీడా రంగంలో సహకారంపై ప్రత్యేక కార్యక్రమం.
● అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో కువైట్ సభ్యత్వం.
తనకూ, తన ప్రతినిధి బృందానికీ ఆత్మీయ ఆతిథ్యం అందించిన కువైట్ అమీర్ కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్, కువైట్ మధ్య బలమైన స్నేహ, సహకార సంబంధాలను ఈ పర్యటన పునరుద్ఘాటించింది. ఈ సరికొత్త భాగస్వామ్యం ముందుకు సాగుతుందనీ.. ఇరుదేశాల ప్రజలకూ ఇది లబ్ధి చేకూర్చడంతోపాటు, ప్రాంతీయ - అంతర్జాతీయ స్థిరత్వానికి దోహదపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా, గౌరవనీయ యువరాజు షేక్ సబా అల్-ఖలేద్ అల్-సబా అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబా, గౌరవనీయ కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-ముబారక్ అల్-సబాలను కూడా.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.
****
(Release ID: 2087310)
Visitor Counter : 6