ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2024లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 11 DEC 2024 11:00PM by PIB Hyderabad

మిత్రులారా...

ఎర్రకోట బురుజుల నుంచి ఒక విషయాన్ని నేను పలుమార్లు ప్రస్తావించిన సంగతి మీకు గుర్తుందా! ‘సబ్కా ప్రయాస్’ (అందరి కృషి) కీలకమని నేను చెప్పాను- అందరి సమష్టి కృషి వల్లనే ఈరోజు భారత్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ సూత్రానికి నేడు తార్కాణంగా నిలుస్తోంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ముగింపు వేడుకల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. మీలాంటి యువ ఆవిష్కర్తల మధ్య ఉండే అవకాశం దొరికినప్పుడల్లా నేర్చుకునేందుకు, అర్థం చేసుకునేందుకు, కొత్త దృక్కోణాలని పరిచయం చేసుకునేందుకు నాకు అవకాశం కలుగుతుంది. మీ అందరి పై నాకు పెద్ద అంచనాలున్నాయి. మీలాంటి యువ ఆవిష్కర్తలు 21వ శతాబ్దాన్ని చూసే తీరు విలక్షణంగా ఉంటుంది,  అందుకే కాబోలు, మీ పరిష్కారాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కొత్త సవాళ్ళు ఎదురైనప్పుడు, సృజనాత్మకమైన కొత్త తరహా పరిష్కారాలను మీరు కనుగొంటుంటారు! నేను ఇంతకు ముందు అనేక హ్యాకథాన్‌లలో పాల్గొన్నాను, మీరు నన్నెప్పుడూ నిరాశపరచలేదు, మీపై నాకున్న విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చారు. ఇంతకుముందు హ్యాకథాన్ లో  పాల్గొన్న బృందాలు వాటి ముందుంచిన సవాళ్ళకు చక్కటి పరిష్కారాలను అందించాయి, పైగా వాటిని ఇప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు సమర్థంగా వినియోగించుకుంటున్నాయి.

ఇక ఈ హ్యాకథాన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్‌లు ఏ పనిని చేపడుతున్నాయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది, మీ ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలని చాలా చాలా ఆసక్తిగా ఉంది. సరే! ఇక ప్రారంభిద్దాం! ముందుగా మాతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు?

ప్రధానమంత్రి: నమస్తే!  

ప్రతినిధి: నమస్తే సర్! నా పేరు సాహిదా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో ‘టీం బిగ్ బ్రెయిన్స్’ తరఫున పాల్గొంటున్నాను! కర్ణాటక బెంగళూరు వాసిని సర్, ప్రస్తుతం ఎన్ఐటీ శ్రీనగర్ నోడల్ సెంటర్ లో బస చేస్తున్నాను.  ఇక్కడ చాలా చలిగా ఉంది… నేను మాట్లాడేటప్పుడు పొరపాట్లు జరిగితే దయచేసి మన్నించండి సర్!  

ప్రధానమంత్రి: అదేమీ లేదమ్మా! మీరంతా ఎంతో ధైర్యం కలవారు.. చలి మిమ్మల్నేమీ చేయదు... ధైర్యంగా మాట్లాడండి.

ప్రతినిధి: ధన్యవాదాలు సర్! సామాజిక న్యాయం, సాధికారతల మంత్రిత్వశాఖ మాముందుంచిన  సమస్యకు పరిష్కారం కనుగొనే టీం లో పాల్గొంటున్నాం. ‘ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్’ సహా మేధోపరమైన వైకల్యాలున్న పిల్లల కోసం ‘వర్చువల్ రియాలిటీ ఫ్రెండ్’ అనే సాధనాన్ని మేము రూపొందిస్తున్నాం. ఈ సాధనం పరస్పర అనుసంధానానికి అవసరమయ్యే నైపుణ్యాలను (ఇంటరాక్టివ్ స్కిల్స్) మెరుగుపరుస్తుంది. మన దేశంలో సుమారు 80 మిలియన్ల మంది ఆటిజం స్పెక్ట్రమ్‌ (వివిధ దశలు, వేర్వేరు తరహాలు)లో ఉన్నారు. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు మేధోపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించడానికి, మేము 'దోస్త్' (స్నేహితుడు) లా  పని చేసే ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నాం – ఈ టూల్ ని వారు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉంచుకోవచ్చు.. అంటే వెంట తీసుకెళ్లగలిగే స్నేహితుడన్నమాట!  ఈ వర్చువల్ రియాలిటీ సొల్యూషన్‌ను ఉపయోగించడానికి వారికి ప్రత్యేక పరికరాలు ఏవీ అవసరం లేదు. దీన్ని వారి ఫోన్, ల్యాప్‌టాప్ లేదా వద్దనున్న ఏదైనా పరికరం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ స్నేహితుడు రోజువారీ పనుల్లో వారికి సహాయం చేస్తాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  పవర్డ్ వర్చువల్ రియాలిటీ సొల్యూషన్. ఉదాహరణకు, రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బంది, కొత్త భాష నేర్చుకోవడంలో ఇబ్బంది, ఇతరులతో సంభాషణ,  స్నేహం వంటి ఎన్నో పనుల్లో ఈ సాధనం వారికి సహాయం అందిస్తూ,  ప్రతి పనినీ  అనుసరించేందుకు వీలైన సులభమైన చిన్న చర్యలుగా విభజిస్తుంది...

ప్రధానమంత్రి: బాగుంది! మీరు చేస్తున్న పని ప్రశంసనీయమైంది. పిల్లల సామాజిక జీవనంపై ఈ సాధనం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పగలరా?

ప్రతినిధి: ఈ వర్చువల్ స్నేహితుని సహాయంతో, వారు సామాజికపరమైన చర్యల్లో ఏది సముచితమైందో ఏది కాదో నేర్చుకుంటారు.  పక్కవారిని ఎలా సంప్రదించవచ్చో తెలుసుకుంటారు. సురక్షితమైన వాతావరణంలో ఈ నైపుణ్యాలను నేర్చుకుని, తరువాత వాటిని నిజజీవిత పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వాస్తవ ప్రపంచంలో సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని సులభతరం చేయడం ద్వారా ఈ సాధనం వారి జీవితాలను మెరుగుపరుస్తుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు కొత్త విషయాలను  నేర్చుకునేందుకు ప్రత్యేక పద్ధతులు అవసరమవ్వచ్చు... సాధారణ బాలలు, ప్రత్యేక అవసరాలున్న వారికీ మధ్య గల అంతరాన్ని తగ్గించేందుకు ఈ సాధనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా, రోజువారీ విధులను నిర్వహణలో సాధారణ వ్యక్తులు,  ప్రత్యేక అవసరాలున్న పిల్లల మధ్య తేడా తగ్గిపోతుంది.

ప్రధానమంత్రి: ప్రస్తుతం మీ బృందంలో ఎంతమంది పని చేస్తున్నారు?  

ప్రతినిధి: సర్ ఆరుగురు సభ్యులున్న మా టీంలో  వివిధ సాంకేతిక నైపుణ్యాలు కలవారు, వివిధ ప్రాంతాల వారూ ఉన్నారు! అందులో ఒకరు విదేశీయులు సర్!

ప్రధానమంత్రి: ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో మీలో ఎవరైనా ఇంతకుముందు అనుసంధానమయ్యారా? వారి సమస్యలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేసి, అప్పుడు పరిష్కారాల కోసం ముందడుగు వేశారా?  

ప్రతినిధి: ఎస్ సర్! మా బృందంలో ఒకరి చుట్టాల్లో ఆటిజం బాధితులు ఉన్నారు. అంతే కాదు సర్, ఇక్కడికి వచ్చే ముందు ఈ పిల్లలు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటారో అవగాహన కలిగేందుకు  వివిధ కేంద్రాల వారితో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నాం. వారి ఇబ్బందులకు తగిన పరిష్కారాలను కనుక్కునేందుకు మాకు ఆ సంభాషణలు ఉపయోగపడ్డాయి.

ప్రధానమంత్రి: మీరేదో అంటున్నారు... మీ బృందసభ్యులు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు...

ప్రతినిధి: అవును సర్... విదేశాలకి చెందిన ఈ విద్యార్థి మన దేశంలో చదువుకుంటున్నాడు… మా బృంద సభ్యుడే ఇతను..

ప్రతినిధి (మహమ్మద్ ధాలీ): హలో ప్రధానమంత్రి గారూ.. నా పేరు మహమ్మద్ ధాలీ.. నేను యెమెన్ దేశానికి చెందిన అంతర్జాతీయ విద్యార్థిని. కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కోసం నేను ఇండియాకి వచ్చాను... ‘బిగ్ బ్రెయిన్స్ టీం’ లో సభ్యుడిని. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసమే మేం ఏఐ-ఆధారిత వర్చువల్ రియాలిటీ సాధనాన్ని తయారు చేస్తున్నాం.

ప్రధానమంత్రి: ఇటువంటి బృందంలో పనిచేయడం మీకిదే తొలిసారా?  

ప్రతినిధి (మహమ్మద్ ధాలీ): సర్, స్థానికంగా బెంగళూరులో ఏర్పాటైన కొన్ని హ్యాకథాన్ లలో ఇంతకుముందు పాల్గొన్నప్పటికీ, ఇంత పెద్దయెత్తున నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి! ఇంతటి భారీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు కృతజ్ఞుడిని... ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మీకూ, భారత ప్రభుత్వానికీ ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ!  చైతన్యభరితమైన భారత్ సృజనాత్మక ఆవిష్కరణల రంగంలో పాల్గొనమని, సృజనకారులుగా మారమనీ, ఈ వేదిక ద్వారా నా సాటి యెమెనీ విద్యార్థులనూ ఇతర అంతర్జాతీయ విద్యార్థులనూ ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు!  

ప్రధానమంత్రి: ప్రతి బాలుడూ, బాలికా ప్రత్యేకమేననే ముఖ్యమైన విషయాన్ని అవగాహన చేసుకున్న మీ అందరికీ అభినందనలు! ప్రగతి సాధించేందుకు,  ఎదిగేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశాలు దక్కాలి... ఏ ఒక్కరినీ అవకాశాల నుంచీ దూరం చేయకూడదు, తమని పట్టించుకోవడం లేదన్న భావం ఎవరికీ కలగరాదు. ఈ లక్ష్య సాధన దిశగా మనకి ఎప్పటికప్పుడు కొత్త పరిష్కారాలు అవసరమవుతాయి. సమస్య పరిష్కారం కోసం మీ బృందం చేస్తున్న కృషి లక్షలాది మంది పిల్లల జీవితాలను మెరుగుపరుస్తుంది. మీరు అభివృద్ధి పరుస్తున్న ఈ పరిష్కారాలు స్థానిక అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకంగా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి ఉండవచ్చు, అయితే వాటి ప్రయోజనం, ప్రభావం ప్రపంచస్థాయికి చెందినవే! భారతదేశానికి అనువైన పరిష్కారం ఏ ప్రపంచదేశానికైనా పనికి వచ్చేదే! మీకు, మీ బృందాసభ్యులకు అభినందనలు.  తరువాత మాట్లాడేది ఎవరు?

ధర్మేంద్ర ప్రధాన్ :  తరువాతి బృందం ఖరగ్ పూర్ కి చెందిన ‘డ్రీమర్స్’.. టీం ఖరగ్ పూర్....!

ప్రతినిధి (లావణ్య): గౌరవనీయ ప్రధానమంత్రి గారూ, ధన్యవాదాలు! నా పేరు లావణ్య, డ్రీమ్స్ బృంద సార థి ని సర్... పశ్చిమ బెంగాల్ లోని ఐఐటీ ఖరగ్ పూర్ లో మా నోడల్ కేంద్రం ఉంది.  మేము తమిళనాడు చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చాం. మేము ఎంచుకున్న సమస్యను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ) అందించింది. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతకు తోడు సైబర్ దాడుల బెడద కూడా పెరుగుతోంది. మా వద్దనున్న రికార్డుల ప్రకారం, భారతదేశంలో 73 మిలియన్ల సైబర్‌ దాడులు జరిగాయి, ఈ సంఖ్య ప్రపంచంలోనే 3వ అతిపెద్దది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి మేము వినూత్నమైన, విలక్షణమైన, సమర్థమైన పరిష్కారంతో మీ ముందుకు వచ్చాం. నా సహచరి కల్ ప్రియ పరిష్కారాన్ని వివరిస్తారు సర్...

ప్రతినిధి (కల్ ప్రియ): నమస్తే ప్రధానమంత్రి గారూ!  

ప్రధానమంత్రి: నమస్తే అమ్మా!  

ప్రతినిధి (కల్ ప్రియ): నమస్తే! ఇన్ఫెక్ట్ అయిన ఫైల్స్ ను గుర్తించేందుకు, సైబర్ దాడులకు నిలువరించే రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకూ మేము బహుళ యాంటీవైరస్ ఇంజిన్‌లను ఉపయోగిస్తున్నాం -  నిజానికి మూడు యాంటీవైరస్ ఇంజిన్‌లను ఉపయోగించాం... అవే మైక్రోసాఫ్ట్ డిఫెండర్, ఈసెట్ (ఈఎస్ఈటీ), ట్రెండ్ మైక్రో మాగ్జిమమ్ సెక్యూరిటీలు. డిజైన్ పరంగా, దాడుల గుర్తింపు పరంగా మా పరిష్కారం పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. ఏ ఒక్క యాంటీవైరస్ పరిపూర్ణ రక్షణ కల్పించలేదని, ప్రతి యాంటీవైరస్ ప్రోగ్రాం కి బలాలు, బలహీనతలు ఉంటాయని మనకి తెలుసు. ఈ సవాలును అధిగమించేందుకు మైక్రోసాఫ్ట్ డిఫెండర్, ఈసెట్, ట్రెండ్ మైక్రో మాగ్జిమమ్ సెక్యూరిటీని ఉపయోగిస్తున్నాం. మూడు యాంటీవైరస్ ఇంజిన్‌లను సమాంతరంగా స్కాన్ చేయడం ద్వారా ముప్పును సమర్థంగా గుర్తించగలుగుతాం. సిస్టమ్‌ను సురక్షిత మోడ్‌లో ఉంచుతూనే రాబోయే బెడదలను గుర్తించడంలో ఈ విధానం సహాయపడుతుంది.

ప్రధానమంత్రి: సైబర్ దాడుల వల్ల ఎంత మంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో నేను ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో విపులంగా తెలియజేశాను. సైబర్ నేరాల వల్ల ఎంత మంది డబ్బు పోగొట్టుకున్నారో మీకు తెలుసా?

ప్రతినిధి (కల్ ప్రియ): లేదు సర్!  

ప్రధానమంత్రి: మీరు తెలుసుకోవాలి.. మీరు పని చేస్తున్న సమస్య వాస్తవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజంలో అధిక సంఖ్యాకులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.. ఆ యువకుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు...  

ప్రతినిధి: అవును సర్.. నమస్తే!  

ప్రధానమంత్రి: నమస్తే!  

ప్రతినిధి: సర్, రోజురోజుకీ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మంచిదే..  అయితే ఇదే సమయంలో సైబర్‌ దాడుల సమస్యను కూడా మనం పరిష్కరించుకోవాలి. ఈ నేపథ్యంలో మరింత సమర్థమైన, మెరుగైన పరిష్కారాల కోసం మేం కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న పరిష్కారాన్ని మెరుగుపరచడం ద్వారా కొత్తగా మేం అభివృద్ధి చేస్తున్న పరిష్కారం, ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటి కంటే  ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నాం.

ప్రధానమంత్రి: సైబర్ భద్రతా పరిష్కారాల కాలపరిమితి చాలా తక్కువని మీకు తెలుసా? దీని గురించిన అవగాహన ఎంతమందికుంది?

ప్రతినిధి: ఉంది సర్..  

ప్రధానమంత్రి:  మీ అభిప్రాయం ఏమిటి? మాతో మీ ఆలోచనలు పంచుకోండి...

ప్రతినిధి: సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందు వల్ల పరిష్కారాలని కూడా ఎప్పటికప్పుడు నవీకరించాలి. శరవేగంగా జరిగే మార్పులకు అనుగుణంగా మనం అప్‌డేట్ అవ్వాలి...

ప్రధానమంత్రి: అవును, మీరు చెప్పింది నిజమే. సైబర్ దాడులకు పాల్పడే వారు ముందంజలో ఉంటూ వాళ్ళు విసిరిన సవాలుకి పరిష్కారాన్ని కనుక్కున్న  కొద్ది గంటల్లోనే మరో కొత్త ఎత్తుతో సిద్ధమవుతారు.. దాంతో గంటల వ్యవధిలోనే కొత్త పరిష్కారాలు అవసరం అవుతున్నాయి. అందువల్ల ఎప్పుడూ అప్‌డేట్ అయ్యి ఉండవలసి వస్తోంది. భారత్ ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని మీకు తెలుసు. మన దేశంలో డిజిటల్‌ పరమైన కనెక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు సైబర్ క్రైమ్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. అందుకనే మీరు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న పరిష్కారం దేశ భవిష్యత్తుకు ఎంతో  ముఖ్యమైనది. అయితే ఇది ఒక్కసారిగా పరిష్కృతమయ్యే సమస్య కాదు. వర్షం పడినప్పుడల్లా గొడుగు తెరవాల్సిందే! అదే విధంగా ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాల్సిందే. తప్పదు. మీకు శుభాకాంక్షలు!  మీరు చాలా కీలకమైన అంశంపై పని చేస్తున్నారు, మీరు కనుక్కోబోయే  పరిష్కారం కచ్చితంగా అందరిముందుకూ వస్తుంది. అది ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. మీ  టీమ్ నిండా ఉత్సాహం ఉరకలేస్తోంది, అందరూ తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు... ఇక ముందుకు వెళ్దాం. తదుపరి జట్టు ఎవరు?

ధర్మేంద్ర ప్రధాన్: అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నికల్ యూనివర్శిటీలో సిద్ధంగా ఉన్న ‘టీమ్ బ్రోకోడ్‌’తో సంభాషిద్దాం. అహ్మదాబాద్ వారిని ఆహ్వానిస్తున్నాం...

ప్రతినిధి: నమస్తే, ప్రధానమంత్రి గారూ!  

ప్రధానమంత్రి: నమస్తే!  

ప్రతినిధి (హర్షిత్): ఎస్ సర్… హాయ్! నా పేరు హర్షిత్, నేను టీమ్ బ్రోకోడ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇస్రో ఇచ్చిన సమస్యపై మేం పని చేస్తున్నాం. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న సోలార్ ప్యానల్స్,  సోలార్ సెల్స్ చిత్రాలను మరింత చిక్కటి రంగుల్లో చూపడం మాకిచ్చిన సమస్య... ఇందుకోసం మేం ‘చాంద్ వర్తని’ పేరిట ఒక పరిష్కారాన్ని అభివృద్ధి పరుస్తున్నాం. తక్కువ-నాణ్యత కలిగిన ముదురు చిత్రాలు చాంద్ వర్తని ద్రావణం వినియోగంతో  అధిక-నాణ్యత గల చిత్రాలుగా పరివర్తనం చెందుతాయి.  కానీ ఇది కేవలం చిత్ర నాణ్యతను పెంచే పరిష్కారం మాత్రమే కాదు.. మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతుంది. నిర్ణయ సామర్థ్య పరీక్ష నిమిత్తం భౌగోళిక చంద్రాన్వేషణను గుర్తించబోతున్నాం, రియల్ టైమ్  సైట్ ఎంపికలో కూడా సహకారాన్ని అందిస్తాం.  

ప్రధానమంత్రి: అతిపెద్ద అంతరిక్ష కేంద్రం ఉన్న అహ్మదాబాద్‌లో ఉన్నారు కదా… అంతరిక్ష రంగానికి చెందిన సవాళ్లను ఆ రంగానికి చెందిన వారితో చర్చించే అవకాశం మీకు ఎప్పుడైనా కలిగిందా? వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో కనుక్కున్నారా? ఫలితాల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఏమి చేయాలో ఆలోచనలు పంచుకున్నారా?

 

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (హర్షిత్): నేను సలహాదారులతోనూ, హైదరాబాద్‌లో శాస్త్రవేత్తలతోనూ మాట్లాడాను. ఏమైనా, అలాంటి మరే కేంద్రాలనూ నేను సందర్శించలేకపోయాను, ఎందుకంటే మేం ఆంధ్ర ప్రదేశ్ నుంచి చాలా దూరంగా ఉన్నాం, మరి మా జట్టు కూడా..

ప్రధానమంత్రి: ఓ, అలాగా.ఈ ప్రాజెక్టు కారణంగా చంద్ర గ్రహంపైనున్న భూవిజ్ఞాన, పర్యావరణ స్థితులను మనం మరింత చక్కగా అర్థం చేసుకోగలమని మీరు  అనుకుంటున్నారా?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (హర్షిత్): అవును, సర్. మేం చంద్రగ్రహ అన్వేషణలో భూవిజ్ఞాన అంశాలనూ, దాగి ఉన్న అంశాలనూ గుర్తించగలుగుతాం. ఉదాహరణకు, గడ్డకట్టిన జలం ఆనవాళ్లను కనిపెట్టొచ్చు అంతేకాక గండశిలలను, పెద్ద బండరాళ్లను, లేదా చంద్రుని ఉపరితలం మీద పెద్ద పెద్ద రేణువులను కూడా పసిగట్టొచ్చు. ఇది ఈ అవరోధాలను గుర్తించి, వాటిని తప్పిస్తూ రోవర్‌ను ఇబ్బంది లేకుండా దించడంలో మనకు సాయపడుతుంది.

ప్రధానమంత్రి: ఇప్పడు మీ జట్టులో ఎంతమంది పనిచేస్తున్నారు?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (హర్షిత్): మా జట్టులో ఆరుగురు సభ్యులు పనిచేస్తున్నారు.

ప్రధానమంత్రి: మీరంతా వేరు వేరు స్థలాల వారా, లేక ఒకే ప్రాంతానికి చెందిన వారూ, కలిసి చదువుకొంటున్న వారూనా?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (హర్షిత్): సమస్య వివరణలో, మేం చేయాల్సిన పనులను మా సభ్యులందరి మధ్య విభజన చేసి పెట్టుకొన్నాం. ముగ్గురు సభ్యులు మిషన్ ల్యాండింగ్ నమూనాలపైన పనిచేస్తున్నారు, మరో ఇద్దరు సభ్యులు ఇమేజ్ ఫిల్టర్‌లపైన, ఆ ప్రతిబింబాల నాణ్యతను పెంచడంపైన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు, సర్. ఇప్పుడు, నా జట్టు సహచరుడు సునీల్ ఈ సంభాషణను కొనసాగిస్తాడు, సర్.

ప్రధానమంత్రి: మీరు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఎంచుకొన్నారు. వేరే యువ సభ్యులు కూడా మాట్లాడుతున్నారా, లేక మైక్రోఫోన్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఏంటి?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (సునీల్ రెడ్డి): సర్, మేం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారం. హిందీ నాకంత పెద్దగా తెలియదు.

ప్రధానమంత్రి: ఆంధ్ర గారు.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (సునీల్ రెడ్డి): క్షమించాలి..

ప్రధానమంత్రి: ఊఁ, నాతో చెప్పండి.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (సునీల్ రెడ్డి): నమస్తే, ప్రధానమంత్రి గారూ, నేను ఆంధ్ర ప్రదేశ్ నుంచి సునీల్ రెడ్డిని. మేం ఒక మిషన్ లెర్నింగ్ నమూనాపై పనిచేస్తున్న జట్టు సభ్యులం. మిషన్ లెర్నింగ్ నమూనాను ఉపయోగించి ఈ ప్రతిబింబాల్లో అధిక స్పష్టతను తీసుకురావొచ్చు. దీనికోసం మేం రెండు ఆర్కిటెక్చర్‌లను ఉపయోగించకొంటున్నాం:  వాటిలో ఒకటి డార్క్‌నెట్, మరొకటి ఫోటోనెట్. ప్రతిబింబంలో నీడలను తొలగించడానికి డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తారు, ధ్వనిని తగ్గించడానికేమో ఫోటోనెట్‌ను ఉపయోగిస్తారు. చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి ప్రతిబింబాలను తక్కువ వెలుతురున్నప్పుడు తీసిన కారణంగా లో ప్రోటాన్స్ వల్ల అధిక ధ్వని వినవస్తుంటుంది. మేం న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఈ ప్రతిబింబాల నాణ్యతను పెంచుతున్నాం. ఈ నెట్‌వర్కులలో ఒక్కోదానిలో 1024 న్యూరాన్‌లుంటాయి. హర్షిత్ ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఉత్తమ ఫలితం వచ్చిన పక్షంలో, మేం ఘనీభవించిన జలాశయాల ఉనికిని కూడా కనిపెట్టేందుకూ అవకాశం ఉంటుంది. మీతో మాట్లాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, సర్. మీతో వివరంగా మాట్లాడాలని నేను ఎప్పటినుంచో కలగంటూ వచ్చాను. మీరు నెల్లూరుకు వచ్చినప్పుపడు, నేను గుంపులో దూరంగా ఉన్నప్పటికీ- నేను మీ అతి పెద్ద అభిమానిని కావడంతో- చప్పట్లు కొడుతూ, సంతోషంగా అరుస్తూనే ఉన్నాను. ఈ సంగతి నాకు గుర్తొస్తోంది. మాకు ఈ అవకాశాన్నిచ్చినందుకు మీకు ధన్యవాదాలు, సర్.

ప్రధానమంత్రి: చూడండి, మిత్రులారా, అంతరిక్ష టెక్నాలజీలో భారత్ ప్రయాణాన్ని ప్రపంచం ఎంతో ఆశతో చూస్తోంది. మీ వంటి యువ మేధావులు భాగం పంచుకొన్నారంటే, ఆ ఆశ మరింత పెరిగిపోతుంది. మీ వంటి యువ నూత్న ఆవిష్కర్తలను చూస్తూ ఉంటే, ఒక ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారత్ తన పాత్రను శరవేగంగా విస్తరించుకొంటోందని స్పష్టమవుతోంది. మీరు అత్యుత్తమ ఫలితాల్ని సాధించాలని కోరుకుంటున్నాను. రండి ఇక మరో జట్టును కలుసుకొందాం.

ధర్మేంద్ర ప్రధాన్: తరువాతి జట్టు ముంబయికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రిసర్చ్ నుంచి వచ్చిన మిస్టిక్ ఒరిజినల్స్. ముంబయి నుంచి వచ్చిన మా మిత్రులారా, దయచేసి గౌరవనీయ ప్రధానమంత్రితో మాట్లాడండి.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: నమస్తే, మాన్య ప్రధానమంత్రి గారు.

ప్రధానమంత్రి: నమస్తే అండీ.                    

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (మహక్ వర్మ): నా పేరు మహక్ వర్మ, నేను టీం మిస్టిక్ ఒరిజినల్స్ జట్టు లీడరును. మేం కోటా లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వచ్చాం. అద్భుతమైన నా జట్టుసభ్యులతో కలిసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగం పంచుకోవడమంటే అది పూర్తి గౌరవం. ఈ జట్టులో అక్షిత్ జాంగ్ర, కర్తాన్ అగ్రవాల్, సుమీత్ కుమార్, అవినాశ్ రాథోడ్, తుషార్ జైన్, ఇంకా మా సలహాదారు అనన్య శ్రీవాస్తవలు ఉన్నారు. మేం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇచ్చిన భద్రతా సవాలును పరిష్కరించే పనిలో ఉన్నాం. ఈ సవాలు మైక్రో డాప్లర్ ఆధారిత టార్గెట్ వర్గీకరణకు సంబంధించింది. ఇచ్చిన వస్తువు ఒక డ్రోనా లేక పక్షా అనేది వర్గీకరించడమే ఆ సవాలు. ఎందుకంటే డ్రోన్లు, పక్షులు తరచుగా రాడార్ లో ఒకే రూపంలో కనపడతాయి. ఇది తప్పుడు రకమైన ఆందోళనలకు, అసమర్థ నిర్ణయాలకు దారితీయవచ్చు, ప్రత్యేకించి సైన్య జోన్లు, విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాల వంటి అత్యంత సున్నిత ప్రాంతాల్లో భద్రతకు ముప్పును కలిగించవచ్చు. మాకిచ్చిన వస్తువు ఒక డ్రోనా, లేక పక్షా అనేది కచ్చితంగా వర్గీకరించడానికి మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌లను ఉపయోగించుకొంటూ అభివృద్ధిపరిచిన డేటాను ప్రాసెస్ చేసి ఒక సాధనాన్ని రూపొందించడమే మా లక్ష్యం. ఈ పరిష్కారాన్ని గురించి మీకు మరిన్ని వివరాలు చెప్పడానికి ముందుకు రావల్సిందిగా నేను నా జట్టు సభ్యుడు అక్షిత్‌ను కోరుతున్నాను.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (అక్షిత్): నమస్తే, ప్రధానమంత్రి గారు.

ప్రధానమంత్రి: నమస్తే జీ.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (అక్షిత్): నా పేరు అక్షిత్, నేను టీం మిస్టిక్ ఒరిజినల్స్‌లో ఓ సభ్యుడిని. మేం కనుగొన్న సాధనం మైక్రో డాప్లర్ సిగ్నేచర్స్‌ను ఉపయోగించుకొంటూ పనిచేస్తుంది. మైక్రో డాప్లర్ సిగ్నేచర్స్ వివిధ వస్తువులతో ఏర్పడ్డ అద్వితీయ ప్రతిరూపాలు. ఇవి పక్షుల రెక్కల చప్పుడు, లేదా డ్రోన్ల రోటార్ ప్లేట్ కదలికల కారణంగా ఏర్పడవచ్చు. మనం ఈ సిగ్నేచర్‌లను వేలి ముద్రలలాగా భావించవచ్చు. ప్రతి మనిషికీ తనదైన వేలి ముద్ర ఉండే విధంగానే, ప్రతి వస్తువూ దాని సొంత మైక్రో డాప్లర్ సిగ్నేచర్‌నంటూ వెలువరిస్తుంది. దీనిని ఉపయోగించుకోవడం ద్వారా, మనం ఆ వస్తువు ఒక డ్రోనా లేక ఒక పక్షా అనేది గుర్తించవచ్చు. విమానాశ్రయాలు, సరిహద్దులు, భద్రత ముఖ్యావసరంగా ఉండే మిలిటరీ జోన్లు వంటి ప్రాంతాల్లో విధ్వంసాల్ని నివారించడంలో ఈ వర్గీకరణ ఎంతో కీలకమవుతుంది.

ప్రధానమంత్రి: అది ఒక పక్షి కాదు అది ఒక డ్రోన్ అని మీరు భేదాన్ని గుర్తించగలుగుతారు. కానీ అది ఎంత దూరంలో ఉన్నదీ, ఏ దిశలో కదులుతోందీ, ఎంత వేగాన్ని కలిగి ఉందో కూడా మీరు నిర్ధరించగలరా? ఈ వివరాలన్నిటినీ మీరు మ్యాప్ చేయగలుగుతారా?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (అక్షిత్): అవును, సర్, మేం దీని మీదే పనిచేస్తున్నాం, త్వరలోనే మేం దీన్ని సాధించగలుగుతాం.

ప్రధానమంత్రి: మీరంతా డ్రోన్‌ను పసిగట్టే వ్యవస్థ గురించి పనిచేస్తున్నారు. డ్రోన్లకు అనేక సానుకూల ఉపయోగాలు ఉన్నట్లే, వాటిని కొన్ని శక్తులు దురుపయోగం చేయడం వల్ల భద్రతపరమైన సవాలు ఎదురవుతుంది. ఈ సవాలును మీ జట్టు ఎలా పరిష్కరిస్తుంది?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (అక్షిత్): సర్, మా వ్యవస్థ ఎలా పనిచేసేదీ నన్ను వివరించనివ్వండి. ముందుగా, మేం రాడార్ నుంచి డేటాను అందుకొని, స్పష్టమైన, కచ్చితమైన డేటాను పొందడానికి ధ్వనినంతటినీ వడగట్టేస్తాం. అప్పుడు, మేం మైక్రో-డాప్లర్ ఆకృతులను సిద్ధం చేయడానికి టైం-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌ఫామ్స్‌ను ఉపయోగించుకొంటాం.  ఆ ఆకృతులను ఒక మెషీన్ లెర్నింగ్ మాడల్‌లోకి ఫీడ్ చేస్తాం. అది ఆ వస్తువు డ్రోనా లేదా పక్షా అన్న సంగతిని మాకు తెలియచేస్తుంది. ఈ సిస్టమ్‌ని మనం కంపాక్ట్ డివైస్‌లలోనూ, తక్కువ ఖర్చుతో రూపొందించగలిగిన పరికరాల్లోనూ ఉపయోగించవచ్చు. ఇది సులభంగా విస్తరించడానికీ, డిమాండును బట్టి ఉన్నతీకరించిందే కాక వివిధ స్థితులకు అన్వయించడానికి వీలున్నది కూడా కావడంతో ఇది విమానాశ్రయాల్లోనూ, సరిహద్దు ప్రాంతాల్లోనూ ఉపయోగించడానికి అనువైంది.  ఈ సమస్యను మేం ఎందుకు ఎంపిక చేసుకొన్నామో వివరించాల్సిందిగా నేను మా జట్టు సభ్యుడు సుమీత్‌ను కోరుతున్నాను.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (సుమీత్): నమస్తే, ప్రధానమంత్రి గారు.

ప్రధానమంత్రి: ఆఁ, నమస్తే.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (సుమీత్): మేం ఈ సమస్యను ఎంచుకోవడానికి కారణం నేను సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన వాడిని కావడం.  డ్రోన్లు తరచుగా ఆ ప్రాంతంలోకి వస్తూపోతూ ఉంటాయి. పుల్వామా దాడి జరిగాక, డ్రోన్ల కదలికలు బాగా పెరిగిపోయాయి. తెల్లవారక మునుపే 4 గంటలకో, లేదంటే మధ్యరాత్రిలోనో, డ్రోన్ విధ్వంసక వ్యవస్థలు అప్రమత్తం అయిపోతాయి. కాల్పులు మొదలవుతాయా అని అనిపిస్తుంది.  ఆ వేళలో, ఆ ప్రాంతం నివాసులకు చదవడానికి గాని, నిద్రపోవడానిక గాని కుదరడం లేదు.  చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో ఈ విషయమై ఏదో ఒకటి చేయవచ్చన్న ఆలోచన నా మనసులో మెదిలింది. ఈ సంవత్సరంలో, ఎప్పుడైతే మా జట్టు సమస్యల కోసం వెతుకుతోందో, ఈ సమస్య మాదాకా వచ్చింది. నేను దీనిని మా జట్టుతో పంచుకొన్నాను. మేం దీనిపై కసరత్తు చేయాలని సూచించాను. ఈ సమస్యలను పరిష్కరించడంలో సాయపడాలనీ, ప్రజల జీవనాన్ని సులభతరం చేయాలనీ మేం కోరుకున్నాం. చివరికి, మా జట్టు దీనిపై పనిచేసింది, మేం గ్రాండ్ ఫినాలేలోకి ప్రవేశించాం. సర్, మీకు అనేకానేక ధన్యవాదాలు.

ప్రధానమంత్రి: మిత్రులారా, ప్రస్తుత కాలంలో, దేశంలో వివిధ రంగాలలో డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. మీరు నమో డ్రోన్ దీదీ యోజనను గురించి వినే ఉంటారు. డ్రోన్లను సుదూర ప్రాంతాలకు మందులను, అత్యవసర సరఫరాలను అందించడానికి ఉపయోగిస్తున్నారు.  అయితే మన శత్రువులు కూడా డ్రోన్లను భారత్‌లోకి ఆయుధాలను, మత్తుపదార్థాలను దొంగతనంగా చేరవేయడానికి వాడుతున్నారు. ఈ సందర్భంగా, ఇలాంటి సవాళ్లతో తలపడి వాటిని పరిష్కరించడానికి మీరంతా గంభీరంగా పనిచేస్తుండడం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతోంది. మీ ప్రయత్నాలు ఈ సమస్యలకు సమాధానాలను వెతకడం ఒక్కటే కాకుండా రక్షణ రంగ టెక్నాలజీని ఎగుమతి చేయడానికి కొత్త మార్గాలను కూడా చూపించగలుగుతాయి. ఈ కారణంగా, నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. మీ జట్టు సభ్యుల్లో ఒకరు సరిహద్దుకు సమీపంలో నివసిస్తున్నారు కాబట్టి ఆయనకు సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం ఎంత అత్యవసరమనే అంశాలపై లోతైన అవగాహన ఉంది. అయితే మీరు ముందుకు పోతున్న కొద్దీ, ఈ సమస్యకు ఎన్ని కోణాలున్నాయో గ్రహించగలుగుతారు. డ్రోన్లను విధ్వంసం కోసం దుర్వినియోగపరుస్తున్న వారు కొత్త కొత్త టెక్నాలజీలను కనిపెడుతూ ఉంటారు, ఏయే పద్ధతుల్ని అవలంబించవచ్చో  వెతుకుతూ ఉంటారు, అందుకని ఈ విషయంలో చాలా పెద్ద పనే చేయాల్సివస్తుంది. మనందరికీ కూడా కొత్త సవాళ్లు  నిరంతరంగా ఎదురుపడుతూనే ఉంటాయని దీనికి అర్థం. అయితే నేను మీ అందరి కృషినీ మనసారా అభినందిస్తున్నాను, మీరు మీ అత్యుత్తమ ఫలితాలను సాధించాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్త్తున్నాను. రండి చూద్దాం దేశంలో మరే భాగంతో ఇప్పుడు మనం ముడిపడుతున్నామో.

ధర్మేంద్ర ప్రధాన్: ఇప్పుడు, మనం నిర్వాణ వన్ ను కలుద్దాం. వీరు బెంగళూరుకు చెందిన న్యూ హొరైజన్ ఇంజనీరింగ్ కళాశాలలో కూర్చొని ఉన్నారు. మనం బెంగళూరుతో కనెక్టవుదాం. ఓవర్ టు బెంగళూరు.

ప్రధానమంత్రి: మీ స్వరం సరిగ్గా వినరావట్లేదు. నేను మీరు చెప్పేది వినలేకపోతున్నా.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: సర్, ఇప్పుడు నే చెప్పేది మీకు వినపడుతోందా?

ప్రధానమంత్రి: ఆఁ, ఇప్పుడు మీ మాటలు వినపడుతున్నాయి.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: నమస్తే, గౌరవనీయులైన ప్రధానమంత్రి.

ప్రధానమంత్రి: నమస్తే.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి (దేవ్ పూర్ణి):  నా పేరు దేవ్ పూర్ణి, నేను టీం నిర్వాణ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాను. నా జట్టులో ఆదిత్య చౌధరి, అశర్ ఐజాజ్, తన్వి బన్సల్, నమన్ జైన్, సానిధ్య మలూమియాలున్నారు. సర్, మేం జల శక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక చాలా ముఖ్య సమస్యపై పనిచేయడానికి జైపూర్ గ్రామీణం నుంచి బెంగళూరుకు వచ్చాం. దీనిపై మేం చేసిన పరిశోధనలో, నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికీ, నదులకు నూతన జవసత్వాలను కలిగించడానికీ (రివర్ రిజువినేషన్) భారత ప్రభుత్వం ఇటీవలి కొన్నేళ్లలో అనేక పురోగామి చర్యలను చేపట్టిందన్న విషయాన్ని గ్రహించాం. ఈ కారణంగా, నదుల్లో కాలుష్య పర్యవేక్షణ ప్రక్రియను మెరుగుపరచి, దానిని మరింత సమర్ధంగా తీర్చిదిద్ది, మొత్తంమీద నదులకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ (రివర్ ఇకోసిస్టమ్)ను సుదృఢపరచడానికి అనువైన ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనను మేం చేశాం.   ఇలా చేయడం ద్వారా, ఒక సార్ధక తోడ్పాటును అందించాలని మేం ధ్యేయంగా పెట్టుకొన్నాం.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి:  నమస్తే, సర్.

ప్రధానమంత్రి: నమస్తే.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: మన దేశంలో చాలా మంది ప్రజల ఆదాయం, బతుకులు నదులతో ముడిపడ్డాయని మేం గుర్తించాం. మేం వారి జీవితాలను చక్కదిద్దాలని, ఒక సానుకూల మార్పును తీసుకురావాలని ఆశించాం. ఈ ప్రాజెక్టు కోసం మేం గంగానదిని ఎంపిక చేసుకొన్నాం. దీనికి కారణం మన చరిత్రలో ఈ నది ఒక ముఖ్య సాంస్కృతిక భూమికను పోషిస్తోంది, అంతేకాదు ఇది  మన మాన్య ప్రధానమంత్రి హృదయానికి అత్యంత చేరువగా ఉంది కూడా. నమామి గంగే కార్యక్రమాన్ని గురించీ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసీజీ) గురించీ చదివీ, పరిశోధన చేసీ మా ప్రాజెక్టును మొదలుపెట్టాం. దీనితో, ఎన్ఎంసీజీకి రెండు చాలా స్పష్టమైన లక్ష్యాలున్నాయని మేం గుర్తించాం. వాటిలో ఒకటి, గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడమూ, రెండోది గంగానదికి పూర్వమున్న నాణ్యతను తిరిగి తీసుకురావడమూను.

దీనికి తోడు గంగతో సంబంధమున్న అధిక నాణ్యత కలిగిన డేటానంతటినీ అందరికీ అందుబాటులో ఉంచారని కూడా మేం తెలుసుకున్నాం. ఈ డేటాతో మేం చాలా ప్రేరణను పొందాం, ఈ డేటాను ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించే ఒక వ్యవస్థను రూపొందిస్తే గనక, అది గంగానది చుట్టుపక్కల నివసించే ప్రజలకు బాగా మెరుగైన నిర్ణయాలను తీసుకోవడంలో తోడ్పడగలుగుతుంది. దీంతో వారి జీవితంలో పెను ప్రభావం ప్రసరించడంతోపాటు వారిలో సానుకూల మార్పు కూడా చోటు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: సర్, గంగ ఎంతో పెద్ద నది కావడం వల్ల ఆ నదిని దృష్టిలో పెట్టుకొని ఏ వ్యవస్థను రూపొందించినా అది నిజంగానే విస్తరణకు వీలున్నదిగాను, డిమాండును బట్టి ఉన్నతీకరించుకొనేందుకు అనువైందిగాను ఉండడం అవసరం. దీనికోసం మేం   ఒక పురోగామి టెక్నాలజీని వినియోగించాం. దాని పేరు ఫెడరేటెడ్ లెర్నింగ్. మేం సమాచార అంశాలు (డేటా)ను విశ్లేషించి 38 కీలక స్థానాలను గుర్తించాం. ఫెడరేటెడ్ లెర్నింగ్‌ను ఉపయోగించి, మేం ఆయా స్థానాల్లో స్థానిక నమూనాలను రూపొందించాం. అవి ఆ స్థానిక డేటాను వాడుకొంటాయి. ఈ స్థానిక నమూనాలు వాటి డేటాను ఒక మూల మాడల్‌తో సందేశాల పద్ధతిలో  పంచుకొంటాయి. ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా, కొత్త మాడల్స్‌ను  జత పరుచుకోవడానికీ, అప్పటికే ఉన్న మాడల్స్‌ను తొలగించడానికి ఈ వ్యవస్థ అనుమతిస్తుంది. ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న మాడల్స్‌లో వాటి కచ్చితత్వం, సామర్థ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడుతుంది.  సాంకేతిక అంశాలను పక్కన పెడితే గంగానది సంరక్షణ,పున:పుష్టి, కాలుష్య నియంత్రణలకు ప్రధానంగా తోడ్పడాల్సింది ప్రజలేనని నమామి గంగే చాటిచెప్పింది.  ఆసక్తిదారులకూ, డేటాకూ మధ్య దూరాన్ని తగ్గించడానికి మేమొక అడ్వాన్స్‌డ్ డాష్‌బోర్డును తయారుచేశాం. ఈ డాష్‌బోర్డు వివిధ రకాలైన ఆసక్తిదారుల అవసరాలను తీర్చడాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించింది.

ప్రధానమంత్రి: గంగానది తీర ప్రాంతాల్లో 40-45 కోట్ల మంది ప్రజాసందోహంతో ఒక పెద్ద కుంభ మేలా జరగబోతోంది. మీరు ఆవిష్కరించిన నవకల్పన ఈ కార్యక్రమంలో ఎలాంటి ప్రయోజనాల్ని అందించగలుగుతుంది?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: సర్, నీటి నాణ్యత మూలాంశాల్ని మనం విశ్లేషిస్తే గనక మనం ప్రజలకు వారు అంటురోగాల బారిన పడకుండా వారిని వారు ఎలా కాపాడుకోవచ్చో, స్వయంగా ఎలా వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చో, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా రక్షించవచ్చో తెలియజెప్పవచ్చు. దీనికోసం, మేం ఒక పోర్టల్‌ను తయారుచేసి ఇస్తాం, ఈ పోర్టల్ ద్వారా వివిధ విషయాలపై మార్గదర్శనం చేయడానికి అవకాశాలు ఏర్పడుతాయి. ఉదాహరణగా చెప్పాలంటే, మేం పారిశ్రామిక వ్యర్థజలాల పర్యవేక్షణకు ఉపయోగపడే సేవలు, మురుగునీటి శుద్ధికి సాయపడే మౌలిక సదుపాయాలు, జీవవైవిధ్య నిర్వహణ వంటి వాటికి మార్గదర్శనం చేయడంలో తోడ్పడుతాం. మేం రైతులకు, చేపలుపట్టేవారికి, పర్యాటకులకు సైతం వారు యాత్రాకార్యక్రమాల్ని ఎలా రూపొందించుకోవాలో, ఏయే ముఖ్య ప్రదేశాలను చూడాలో, ఎక్కడికి వెళ్లడం మానుకోవాలో, ఫలానా చోట్ల కార్యకలాపాలు ఎలా పురోగమిస్తున్నాయో.. ఈ సమాచారాన్నంతా అందిస్తాం.

ప్రధానమంత్రి: అంటే, నగరాల్లో కూడా తాగునీటి సరఫరా వ్యవస్థలకు మీ పనిని తేలికగా సంధానించవచ్చన్నమాట.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: అవును సర్. మేం ఏం చేశామంటే, గంగకు, ఇతర నదులకు దారితీసే నగరాల అక్షాంశాలను, రేఖాంశాలను గుర్తించాం. మన స్లేషన్ల చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలను కూడా మేం చిత్రపటం గీసుకొన్నాం. రసాయనాలు, కాగితం, వస్త్రాల తయారీ, తోళ్లగోదాములు, కబేళాల వంటి కొన్ని పరిశ్రమల వివరాలు, ఫలానా రకాల వ్యర్థజలాల గురించీ మాకు తెలుసు కాబట్టి మేం మా అల్గోరిదమ్‌ను ఉపయోగించి అవి ఎక్కడినుంచి వస్తున్నదీ తెలుసుకోగలుగుతాం. నీటిలో కొన్ని విధాలైన కాలుష్యకారకాలు ప్రబలుతున్నట్లు మనం పసిగడితే, ఏ సెక్టర్ అందుకు కారణమవుతోందో నిర్దిష్టంగా కనుగొనవచ్చు. నదులను నిర్వహిస్తున్న సంస్థలకు గాని, లేదా అధికార యంత్రాంగానికి గాని విషయాన్ని తెలియజేసి, వారికొక తక్షణ ‘‘రిపోర్ట్’’ బటన్‌ను ఇవ్వవచ్చు. దాంతో వారు గ్రాస్‌లీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ (జీపీఐస్) తక్షణం తనిఖీని మొదలుపెట్టవచ్చు.  

ప్రధానమంత్రి: ఈ సమావేశం పూర్తయ్యాక, దీనిపై పనిచేయడానికి మీరు ఎన్ని గంటలు తీసుకుంటారు?

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: సర్, కనీసం మరో 20 గంటలు.

ప్రధానమంత్రి: మంచిది. అది గంగా మాత కావచ్చు, లేదా మన దేశంలో ఇతర నదులు కావచ్చు.. అవి ఒక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృక్పథంలోనే కాకుండా, పర్యావరణం పరంగా చూసినా చాలా ముఖ్యమైనవే. మీరీ విషయంపై పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు. జైపూర్ నుంచి వచ్చినవారు నీటికున్న విలువల గురించీ, నీటి ప్రాధాన్యాన్ని గురించీ చాలా చక్కగా అర్థం చేసుకోగలరు. మీకందరికీ అనేకానేక శుభాకాంక్షలు.

హ్యాకథాన్‌లో పాల్గొనే వ్యక్తి: మీకు అనేక ధన్యవాదాలు, సర్.

ప్రధానమంత్రి: మిత్రులారా, మీ అందరితో మాట్లాడడం నిజంగా సంతోషాన్ని కలిగించింది. నేను మిమ్మల్ని చూసినప్పుడు ఈ సమూహం ఎంత చక్కగా ఏర్పడిందో నేను గమనించగలిగాను. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ దార్శనికతకు ఈ సమూహం సిసలైన ప్రాతినిధ్యం వహిస్తోంది. ఉత్తరాది విద్యార్థులు దక్షిణాన, దక్షిణ ప్రాంత విద్యార్థులు ఉత్తరాన, తూర్పు ప్రాంత విద్యార్థులేమో పశ్చిమాన, పశ్చిమ ప్రాంతాల విద్యార్థులు తూర్పున ఉన్నారు. ఇది మీకందరికీ చాలా మంచి అనుభవాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇది మన దేశ సువిశాలత్వానికీ, భిన్నత్వానికీ అద్దంపడుతోంది. మీరు నేర్చుకోవడానికి హ్యాకథాన్ ఇతివృత్తానికి మించి సైతం మరెన్నో విషయాలున్నాయి.

మిత్రులారా,

భవిష్యత్తులో ప్రపంచం జ్ఞానం, నవకల్పనలే చోదకశక్తులుగా ముందుకు దూసుకుపోతుందన్న సంగతి మీకందరికీ తెలుసు. ఈ విషయంలో, మీరు భారత్‌కు ఆశగాను, ఆకాంక్షగాను ఉన్నారు. మీ దృక్పథాలు విశిష్టంగా, మీ ఆలోచనలు విభిన్నంగా, మీ శక్త స్థాయి సాటిలేనిదిగా ఉన్నాయి. అయితే అంతిమ లక్ష్యం ఒకటే: భారత్ ప్రపంచంలో అత్యంత అధిక నవకల్పనలతోనూ, ప్రగతిశీలమైందిగానూ, సమృద్ధ దేశంగానూ మారాలన్నదే. ఇవాళ, ప్రపంచం భారత్ బలాన్ని గుర్తిస్తోంది. మన దేశ బలం తన ‘యువ శక్తి’లోనూ, కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్న మేధల్లోనూ, సాంకేతిక పరాక్రమంలోనూ నిండి ఉంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పాల్గొంటున్న మీ అందరిలోనూ భారత్‌కున్న ఈ శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. భారత యువత ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేయడానికి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ ఒక ఉత్తమ వేదికను సృష్టించినందుకు నేను సంతోషిస్తున్నాను. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మొదలైనప్పటినుంచీ సుమారు 14 లక్షల మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులు 2 లక్షలకు పైగా జట్లుగా ఏర్పడి, దాదాపుగా 3,000 సమస్యలపై పనిచేశారు. 6,400కు పైగా సంస్థలు దీనితో ముడిపడ్డాయి. హ్యాకథాన్ చలవతో వందలాది కొత్త అంకుర సంస్థలు (స్టార్ట్-అప్స్) ఏర్పాటయ్యాయి. నేను మరొక విషయాన్నీ గమనించాను: 2017లో, విద్యార్థులు 7,000కు పైగా ఆలోచనలను సమర్పించారు. ఈసారి, ఆలోచనల సంఖ్య 57,000కన్నా మించిన స్థాయికి చేరుకొంది. 7,000 నుంచి 57,000 - ఈ సంఖ్య మన దేశ సవాళ్లను పరిష్కరించడానికి భారత్ యువత ఏ విధంగా నడుంబిగిస్తోందీ చాటిచెబుతోంది.

మిత్రులారా,

గడచిన 7 సంవత్సరాల్లో, హ్యాకథాన్లలో లభించిన అనేక పరిష్కారాలు ప్రస్తుతం దేశ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు రుజువైంది. అనేక ప్రధాన సమస్యలను ఈ హ్యాకథాన్లు పరిష్కరించాయి. ఉదాహరణకు, 2022 హ్యాకథాన్‌లో పాల్గొన్న ఒక యువ బృందం తుపానుల తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే వ్యవస్థపై పనిచేసింది. ఆ హ్యాకథాన్‌లో అభివృద్ధిపరిచిన వ్యవస్థను ఇస్రో అభివృద్ధిపరిచిన టెక్నాలజీతో ప్రస్తుతం కలిపారు. ఈ విషయం మీరు తప్పక గర్వపడే విషయం. నాలుగైదు సంవత్సరాల కిందట, హ్యాకథాన్‌లో  పాల్గొన్న మరో జట్టు ఒక వీడియో జియోట్యాగింగ్ యాప్‌ను రూపొందించింది. అది డేటా సేకరణను చాలా సులభతరం చేసింది. దీనిని ప్రస్తుతం అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలో వినియోగిస్తున్నారు. హ్యాకథాన్‌లో  పాల్గొన్న మరో జట్టు వాస్తవ కాల ప్రాతిపదికన రక్త నిర్వహణ వ్యవస్థను ఆవిష్కరించడంపై పనిచేసింది. ఈ వ్యవస్థ ప్రాకృతిక విపత్తు వాటిల్లిన కాలంలో, రక్తనిధుల (బ్లడ్‌బ్యాంకుల) వివరాలను అందించగలదు. ఇది ఎన్‌డీఆర్ఎఫ్ వంటి ఏజెన్సీలకు ఎంతో సాయపడింది. కొన్నేళ్ళ కిందట, మరో జట్టు దివ్యాంగజనుల కోసం ఒక వస్తువును తయారు చేసింది, ఆ సాధనం వారి జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడంలో సహాయకారిగా ఉంటోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ హ్యాకథాన్‌లో ఈ తరహా విజయవంతమైన అధ్యయనాంశాలు వందలకొద్దీ ఉన్నాయి. అవి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ ఒక ప్రేరణగా ఉంటాయి. ఈ ఉదాహరణలు భారత్ యువత ప్రభుత్వ సమన్వయంతో దేశాభివృద్ధి కోసం ఎలా పాటుపడుతోందీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో పనిచేస్తోందీ నిరూపిస్తున్నాయి. ఇది జాతీయ సమస్యలను పరిష్కరించడంలో దేశ ప్రగతికి తోడ్పాటునివ్వడంలో తమకు కూడా పాత్ర ఉందన్న భావనను పెంచుతుంది. ఈరోజు మీ అందరితోనూ మాట్లాడాక, భారత్ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)గా మారడానికి సరైన మార్గంలోనే పయనిస్తోందన్న నా నమ్మకం మరింత పెరిగింది. భారత్ సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొంటున్న మీ ఉత్సాహం, మీ నిబద్ధత నిజంగా ప్రశంసనీయం.

మిత్రులారా,

ప్రస్తుతం మన దేశంలో వ్యక్తమవుతున్న ఆకాంక్షలు, మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకూ మూస ధోరణికి భిన్నంగా ఆలోచనలను చేయాలంటూ డిమాండు చేస్తున్నాయి. మనం ఈ మూస ధోరణికన్నా విభిన్నమైన ఆలోచనలను చేయాల్సిన వైఖరిని అవలంబించి  తీరాలి. ఇదే ఈ హ్యాకథాన్ సారం. ప్రక్రియ, ప్రక్రియతో పాటు సాధించాల్సిన ఫలితం.. ఇవి రెండూ ముఖ్యమే. దేశ సమస్యలకు పరిష్కారాలు ఒక్క ప్రభుత్వం వద్దనే ఉన్నాయని చెప్పుకొన్న కాలమంటూ ఒకటి ఉండింది. అయితే ఇప్పుడు అలా ఎంతమాత్రమూ కాదిక. ప్రస్తుతం, ఇలాంటి హ్యాకథాన్ల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సలహాదారులు (మెంటార్స్) కూడా ఈ పరిష్కారాలతో సంధానమవుతున్నారు. ఇది భారత్ నవీన పరిపాలన నమూనా. ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) ఈ నమూనాకు ప్రాణశక్తి.

 


మిత్రులారా,  

రాబోయే 25 సంవత్సరాల తరం భారత్‌కు ‘అమృత్ తరం’. ఒక ‘వికసిత్ భారత్’ను నిర్మించాల్సిన బాధ్యత మీ అందరిదీ. మా ప్రభుత్వం ఈ తరానికి సరైన సమయంలో సాధ్యమైన అన్ని వనరులనూ అందించడానికి కంకణం కట్టుకొంది. మేం విభిన్న వయోవర్గాల వారికోసం వేరువేరు స్థాయిల్లో పనిచేస్తున్నాం. విద్యార్థుల్లో ఒక శాస్త్రవిజ్ఞాన ప్రధాన మనస్తత్వాన్ని పెంచి పోషించడానికి మేం నూతన విద్యావిధానాన్ని అమలుచేశాం. పాఠశాలల్లో నవకల్పనకు కావలసిన వనరులను రాబోయే తరానికి సమకూర్చడానికి, మేం 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం, ఈ ల్యాబులు 10 మిలియన్‌కు (ఒక కోటి) పైగా బాలలకు ప్రయోగాలను చేయడానికీ, పరిశోధనలు జరపడానికీ కూడళ్లు (హబ్స్)గా మారాయి. అదనంగా, 14,000కు పైగా పీఎం శ్రీ పాఠశాలలు విద్యార్థులకు 21వ శతాబ్ది నైపుణ్యాలను అలవరచే  పనిలో పడ్డాయి. విద్యార్థుల్లో వినూత్నంగా ఆలోచనలు చేసే పద్ధతులను పెంపొందింపచేయడానికి, మేం కళాశాల స్థాయిలో ఇన్‌క్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అభ్యాసపూర్వకంగా నేర్చుకోవడానికి, మేం అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) ల్యాబుల అండదండలను వినియోగిస్తున్నాం. యువత మేధస్సులో ఉదయించే ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడానికి మేం ‘జిజ్ఞాస’ వేదికను కూడా రూపొందించాం. ఈ వేదిక యువతకు శాస్త్రవేత్తలతో నేరుగా భేటీ అయ్యి వారి ఆలోచనలను శాస్త్రవేత్తలతో చర్చించడానికి తోడ్పడుతుంది.

మిత్రులారా,  

ప్రస్తుతం, శిక్షణకు అదనంగా, యువజనులకు స్టార్ట్-అప్ ఇండియా ప్రచారోద్యమం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వారికి పన్నులలో మినహాయింపును కూడా ఇస్తున్నారు. ముద్ర పథకంలో రూ.20 లక్షల వరకు రుణాలను యువ ఔత్సాహికపారిశ్రామికవేత్తలు అందుకొనేటట్టు తగిన ఏర్పాట్లు చేశారు. కొత్తగా వస్తున్న కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశం నలుమూలలా కొత్త టెక్నాలజీ పార్కులను, ఐటీ కూడళ్లను (హబ్స్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.1లక్ష కోట్లతో ఒక పరిశోధన నిధిని కూడా ఏర్పాటు చేసింది. దీనికి అర్థం యువజనులకు వారి కెరియర్లలో ప్రతి దశలోనూ ప్రభుత్వం వారికి వెన్నంటి నిలుస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందీ అని. ఆ తరహా హ్యాకథాన్లు కూడా మన యువతకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఇవి ఏవో లాంఛనప్రాయ కార్యక్రమాలేమీ కావు; అవి ఒక శాశ్వత వ్యవస్థను రూపొందించడానికి అనుసరిస్తున్న ప్రక్రియలో ఒక భాగం. ఇది మా ప్రజానుకూల పాలన నమూనాలో విడదీయరాని భాగం.

మిత్రులారా,  

మనం ఒక ఆర్థిక మహాశక్తిగా మారాలని కోరుకుంటూ ఉంటే, ఆర్థిక వ్యవస్థలో కొత్త రంగాలపైన మనం లోతుగా దృష్టి సారించాల్సిన అవసరముంది. డిజిటల్ కంటెంట్ రూపకల్పన, గేమింగ్ వంటి పదేళ్ల కిందట అంతగా వృద్ధిలోకి రాని వివిధ రంగాల్లో భారత్ ప్రస్తుతం పురోగమిస్తోంది. భారత్ ప్రస్తుతం కొత్త కెరియర్ మార్గాలకు బాటపరుస్తోంది, ఈ మార్గాలలో ప్రయోగాలు చేసి, నూతన విషయాలను ఆవిష్కారించడానికి యువతకు అవకాశాలను కల్పిస్తోంది. యువజనుల్లో కుతూహలాన్నీ, వారి నమ్మకాన్నీ గుర్తించి వారి ఆసక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కంటెంట్‌ను సృష్టిస్తున్న వారి శ్రమను, సృజనాత్మక శక్తినీ గుర్తించడానికి ఇటీవల మొదటిసారి జాతీయ సృజనకారుల పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలను ఒక లాభదాయకమైన కెరియర్ ఎంపికగా మలచడానికి కూడా మేం ప్రయత్నించాం. గ్రామ స్థాయి ఆటలపోటీల మొదలు ఒలింపిక్స్‌లో పాల్గొనే సత్తా ఉండే క్రీడాకారులనూ, క్రీడాకారిణులనూ తయారు చేయడం వరకు, ఖేలో ఇండియా, టీఓపీఎస్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) వంటి కార్యక్రమాల రూపంలో అండదండలను అందించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్‌స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ చూపుతున్న ప్రభావం కూడా స్పష్టమవుతోంది. ఫలితంగా, గేమింగ్ ఒక ఆశాజనక కెరియర్ ఎంపికగా మారుతోంది.

మిత్రులారా,  

ఇటీవలే, ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయాన్ని ప్రపంచమంతటా ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలు భారత్ యువత, పరిశోధకులు, నవకల్పనదారులకు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నదే ఈ నిర్ణయం. వన్ నేషన్ –వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం ప్రపంచంలో దీని తరహాలో ఏకైక పథకం. ఈ పథకంలో, ప్రతిష్టాత్మక పత్రికలకు ప్రభుత్వం చందా కడుతుంది, ఇలా చేయడం వల్ల భారత్‌ యువజనుల్లో ఏ ఒక్కరికీ సమాచార లోపం అనే సమస్య ఎదురవదు. ఈ కార్యక్రమం ఈ హ్యాకథాన్‌లో పాల్గొంటున్న మీకందరికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం వెనుకా ఉన్న లక్ష్యం మన యువతీయువకులు ప్రపంచంలో అత్యుత్తమ మేధావులతో పోటీపడేటట్టు చూడాలనేదే. మన యువతరం వారికి ఎలాంటి మద్దతూ, మౌలిక సదుపాయాలు లోపించాయని ఎన్నడూ భావించకూడదు. నా వరకు నాకు, యువత దార్శనికతే ప్రభుత్వ మిషన్. అందుకనే మేం ఒక ప్రభుత్వంగా మన యువజనుల ప్రతి అవసరాన్ని సాధ్యమైన అన్ని విధాలుగానూ నెరవేర్చడానికి పట్టువదలకుండా కృషి చేస్తోంది.

మిత్రులారా,

రాజకీయాల్లో ఇంతవరకు ఎన్నడూ పాల్గొనని కుటుంబాలకు చెందిన ఒక లక్ష మంది యువతను, పూర్తి కొత్త ముఖాలను, రాజకీయరంగంలోకి తీసుకురావాలని నేను లక్ష్యంగా పెట్టుకొంటానని ఎర్ర కోట మీది నుంచి నేను ప్రకటించానన్న విషయం మీకు తెలుసు. ఇది దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. దీనిని సాధించాలంటే వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాంటి ఒక ముఖ్య కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించబోతున్నారు. అదే వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్. ఈ కార్యక్రమంలో దేశమంతటి నుంచీ లక్షలాది యువత పాల్గొని, ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించడానికి వారి ఆలోచనలను పంచుకొంటారు. ఎంపిక చేసిన ఆలోచనలను, యువజనులను జనవరి 11, 12 తేదీల్లో స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యంగ్ లీడర్స్ డైలాగ్ లో పాల్గొనడానికి ఢిల్లీకి ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచీ, విదేశాల నుంచీ ప్రముఖ వ్యక్తులతో చర్చలుంటాయి. మీ అందరితో కలసి మీరు మాట్లాడే విషయాలను విని, మీతో మాటలు కలపడానికి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ హ్యాకథాన్‌లో పాల్గొంటున్న మీరంతా వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్‌లో భాగం పంచుకోవాలని మిమ్మల్నందరినీ నేను కోరుతున్నాను. దేశనిర్మాణానికి తోడ్పాటును అందించడానికి మీకు ఇది మరో గొప్ప అవకాశం.

మిత్రులారా,

రాబోయే కాలం మీకందరికీ ఒక అవకాశమూ, ఒక బాధ్యత కూడా.  

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో పాల్గొంటున్న బృందాలు ఒక్క భారత్ సవాళ్లపైనే కాక ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి కూడా మరింత మెరుగైన పద్ధతిలో పనిచేయాలని నేను కోరుకుంటాను. వచ్చే సంవత్సరంలో, మనం ఈ హ్యాకథాన్‌ కోసం భేటీ అయినప్పుడు ఏదైనా ప్రపంచ సంక్షోభ స్థితిని చక్కదిద్దడంలో సాయపడే ఒక పరిష్కారాన్ని ఓ నిదర్శనంగా చూపే అవకాశం దక్కేటట్టు చూడండి. నవకల్పనదారులుగా, సమస్యల సాధకులుగా మీ సామర్థ్యాల పట్ల దేశానికి నమ్మకమూ ఉంది, గౌరవ భావం కూడా ఉంది. మీకు విజయవంతమైన భవిష్యత్తు లభించాలని అభిలషిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్.

 

 

***

 


(Release ID: 2087096)