ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ‘ఏక్ వర్ష్-పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
Posted On:
17 DEC 2024 6:15PM by PIB Hyderabad
భారత్ మాతా కీ- జై.
భారత్ మాతా కీ- జై.
గోవిందుని నగరంలో గోవింద్ దేవ్ జీకి నేను వందన శతాలు సమర్పిస్తున్నాను. అందరికీ నా శుభాకాంక్షలు.
రాజస్థాన్ గవర్నరు శ్రీ హరిభావు బగాడే గారు, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ గారు, మధ్య ప్రదేశ్ నుంచి వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సి.ఆర్. పాటిల్ గారు, భగీరథ్ చౌదరి గారు, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు, ప్రేమ్ చంద్ బైర్‌వా గారు, ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాజస్థాన్ శాసన సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, రాజస్థాన్‌లో నా ప్రియ సోదరులు, సోదరీమణులారా. దృశ్య మాధ్యమం ద్వారా మనతో జతపడ్డ వారు, రాజస్థాన్‌లో వివిధ ప్రాంతాల పంచాయతీలలోని నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రాజస్థాన్ ప్రజలకు, ఒక ఏడాదిని విజయవంతంగా పూర్తిచేసుకొన్న రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వానికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఏడాది ప్రయాణం ముగిసిన తరువాత మీరు మీ ఆశీర్వాదాలు అందించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలిరావడం నేను చూస్తూ ఉంటే, ఒక ఓపెన్ జీపులో ఇక్కడి వస్తూ ఈ పందిరిలో ఉన్నవారి కన్నా బహుశా మూడింతల మంది దీని బయట ఉన్నారన్న విషయాన్ని నేను గమనించాను. మీ అందరి ఆశీస్సులూ ఈరోజు నేను అందుకోగలగడం నాకు దక్కిన సౌభాగ్యం. గత సంవత్సర కాలంలో రాజస్థాన్ అభివృద్ధికి ఒక కొత్త వేగాన్ని, దిశను అందించడానికి భజన్ లాల్ గారు, ఆయన జట్టులో సభ్యులందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ మొదటి సంవత్సరం ఒక రకంగా, రాబోయే చాలా సంవత్సరాలకు బలమైన పునాదిని వేసింది. ఈ కారణంగా ఈరోజున జరుపుకొన్న ఈ వేడుక ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడం ఒక్కదానికే పరిమితం కాలేదు. ఇది రాజస్థాన్ అభివృద్ధిని ఒక పండుగలా జరుపుకొనే సందర్భం కూడా.
కొద్ది రోజుల కిందటే, పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సులో పాల్గొడానికి నేను రాజస్థాన్‌కు వచ్చాను. దేశవ్యాప్తంగానేగాక ప్రపంచ దేశాల్లోని ప్రధాన పెట్టుబడిదారులు కూడా ఇక్కడకు వచ్చారు. ఈరోజు రూ. 45-55 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడమూ, వాటిలో కొన్నిటికి శంకుస్థాపనలు చేయడమూ పూర్తయింది. ఈ ప్రాజెక్టులు రాజస్థాన్‌లో నీటి సవాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులు రాజస్థాన్‌ను దేశంలో అత్యంత సంధానం కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టనున్నాయి. ఇది రాజస్థాన్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు అసంఖ్యాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాజస్థాన్‌లో పర్యాటక రంగం, రాజస్థాన్ రైతాంగం, నా యువ మిత్రులు ఎంతగానో లాభపడతారు.
మిత్రులారా,
ప్రస్తుతం బీజేపీ డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు సుపరిపాలనకు ప్రతీకగా నిలిచాయి. బీజేపీ ఏదైనా తీర్మానం చేసిందంటే దానిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. బీజేపీ అంటే సుపరిపాలనకు ఒక హామీ అన్నమాటేనని దేశం నలుమూలల ప్రజలు చెబుతున్నారు. ఈ కారణంగానే బీజేపీ ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రంలో ప్రజల తిరుగులేని మద్దతును అందుకొంటోంది. దేశప్రజానీకం లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్నిచ్చింది. గత 60 సంవత్సరాల్లో భారత్‌లో ఎన్నడూ ఇది జరగలేదు. 60 ఏళ్ళ తరువాత భారతదేశ ప్రజలు కేంద్రంలో ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఆశీర్వదించారు. వారు మాకు ఆశీస్సులు అందించి, దేశానికి సేవ చేయడానికి అవకాశాన్నిచ్చారు. కొద్ది రోజుల కిందటే బీజేపీ మహారాష్ట్రలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మీరు ఎన్నికల ఫలితాలను గమనిస్తే మహారాష్ట్రలో మాకు సంఖ్యాధిక్యం లభించడం ఇది వరుసగా మూడోసారన్న విషయాన్ని తెలుసుకొంటారు. బీజేపీ మహారాష్ట్రలో ఇదివరకటి కన్నా ఎక్కువ స్థానాలను కూడా గెలిచింది. అంతకన్నా వెనుకటి కాలంలో, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని- మరింత ఎక్కువ సంఖ్యా బలంతో- ఏర్పాటుచేసింది. ఇటీవల రాజస్థాన్ ఉప ఎన్నికలలో బీజేపీకి ప్రజలు ఎంత భారీ మద్దతిచ్చారో మేం చూశాం. ఇది బీజేపీ చేస్తున్న పనులన్నా, బీజేపీ కార్యకర్తల కృషన్నా ప్రజలలో ఎంతటి నమ్మకం ఉందో సూచిస్తోంది.
మిత్రులారా,
బీజేపీ చాలా కాలంపాటు సేవలు అందించే అదృష్టం లభించిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. భైరాన్ సింగ్ షెఖావత్ గారు రాజస్థాన్‌లో అభివృద్ధికి ఒక బలమైన పునాది వేశారు. ఆయన తరువాత వసుంధర రాజే గారు పగ్గాలు చేపట్టి, సుపరిపాలన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయారు. ప్రస్తుతం ఈ సుపరిపాలన వారసత్వాన్ని మరింత సంపన్నం చేయడానికి భజన్ లాల్ గారి ప్రభుత్వం శ్రద్ధగా పాటుపడుతోంది. గత ఏడాది పాలనలో చేసిన పనులలో ఈ చిత్తశుద్ధి ప్రభావం ఎంతన్నది స్పష్టంగా కనపడుతున్నది.
మిత్రులారా,
పోయిన ఏడాదిలో చేసిన పనుల వివరాలను ఇక్కడ చర్చించారు. పేద కుటుంబాల కోసం, తల్లుల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం, కుమార్తెల కోసం, కార్మికుల కోసం, విశ్వకర్మ వృత్తిదారుల కోసం, సంచారశీల కుటుంబాల కోసం అనేక నిర్ణయాల్ని తీసుకొన్నారు. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామక కుంభకోణాలు రాజస్థాన్ అంటే ఇవే అనేటట్లుగా తయారుచేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దర్యాప్తులను మొదలుపెట్టడంతో చాలా అరెస్టులు చోటుచేసుకొన్నాయి. ఇదొక్కటే కాదు, ఒక సంవత్సర కాలంలో వేలాది ఉద్యోగ నియామకాలను బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలను పూర్తి పారదర్శకత్వంతో నిర్వహించారు. ఉద్యోగ నియామకాలు న్యాయంగా జరుగుతున్నాయి. ఇదివరకటి ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ ప్రజలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలును, డీజిలును అధిక ధరలు పెట్టి కొనవలసి వచ్చింది. అయితే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్‌లో నా సోదరులకు, సోదరీమణులు ఊరట చెందారు. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును నేరుగా బదలాయించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో బీజేపీ డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవడానికి అదనపు నిధులను అందిస్తోంది. డబల్ ఇంజిన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాజెక్టులను శరవేగంగా అమలు చేస్తోంది. బీజేపీ తాను చేసిన వాగ్దానాలను ఎంతో వేగంగా నెరవేర్చుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో ఈరోజు నిర్వహించుకొంటున్న కార్యక్రమం ఒక ప్రధాన మజిలీ.
మిత్రులారా,
రాజస్థాన్ ప్రజల దీవెనలతో బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ పదేళ్ళలో మేం ప్రజలకు సౌకర్యాల్ని సమకూర్చడం పైనా, వారి జీవితాలలో ఇబ్బందులను తగ్గించడం పైనా శ్రద్ధ తీసుకొన్నాం. స్వాతంత్య్రం వచ్చాక అయిదారు దశాబ్దాలలో కాంగ్రెస్ చేసిన పనుల కన్నా ఎక్కువ పనులను కేవలం పదేళ్ళలో మేం పూర్తి చేశాం. రాజస్థాన్‌నే ఉదాహరణగా తీసుకొంటే, నీటికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకన్నా మరెవరు అర్ధం చేసుకోగలుగుతారు? ఇక్కడ చాలా ప్రాంతాలు తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయి. కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నీరు మన నదులలో నుంచి –ఉపయోగించకుండానే- సముద్రంలో కలిసిపోతోంది. ఈ కారణంగానే అటల్ బిహారీ వాజ్‌పేయీ గారి ప్రభుత్వ హయాంలో నదులను కలపుదామని ఆయన ఆలోచన చేశారు. దీనికోసం ఆయన ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశారు. దీని లక్ష్యం చాలా సులభమైంది. నదులలో మిగులు జలాలను సముద్రంలో కలవకుండా, దుర్భిక్ష బాధిత ప్రాంతాలకు బదలాయించాలనేదే. ఇలా చేస్తే అటు వరదల సమస్యలను, ఇటు కరవు సమస్యను ఒకేసారి పరిష్కరించవచ్చు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో మద్దతు తెలిపింది. అయితే, మీ జీవనంలో జల సంబంధిత సమస్యలను తగ్గించాలని కాంగ్రెస్ ఎన్నడూ కోరుకోలేదు. మన నదులలోని నీరంతా గట్లుదాటి పారుతూండేది, మన రైతులకేమో ఎలాంటి ప్రయోజనమూ అందేదికాదు. పరిష్కారాలను కనుగొనడానికి బదులు కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను రాజేసేది. ఈ దారితప్పిన విధానం కారణంగా రాజస్థాన్ ఎంతో నష్టపోయింది. ఈ రాష్ట్రంలో తల్లులు, అక్కచెల్లెళ్ళు అవస్థలు పడ్డారు, దీనివల్ల రైతులు దెబ్బతిన్నారు.
గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్న కాలంలో సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంగతి నాకు జ్ఞాపకముంది. నర్మద నదీమతల్లి జలాలను గుజరాత్‌లోని వేరు వేరు ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఒక ప్రధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మేం ఈ జలాల్ని కచ్ఛ్‌లో సరిహద్దు ప్రాంతాల వరకు కూడా చేర్చాం. అయితే ఆ కాలంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, మరికొన్ని ఎన్‌జీఓలు అన్నిరకాల ఎత్తుగడలకూ పాల్పడ్డాయి. కానీ, మేం నీటికి ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించాం. నా విషయానికి వస్తే నేను ఎప్పుడూ చెబుతాను ‘‘నీరు పరుసవేది విద్యలో ‘తత్త్వవేత్త రాయి’ వంటిది’’ అని. అది ఇనుమును తాకిందంటే ఇనుమును బంగారంగా మార్చివేసేటట్లే, జలం కూడా దానిని తాగినవారికి బలాన్నీ, నూతన శక్తినీ అందిస్తుంది. అంటే నీరు పురోగతికీ, మార్పునకూ కీలకమన్నమాట.
మిత్రులారా,
నీటికున్న ప్రాముఖ్యాన్ని నేను అర్థం చేసుకొన్నాను కాబట్టే, వ్యతిరేకతలను, విమర్శలను భరించి నీటిని అందించడానికి నేను పట్టువిడువక కృషి చేస్తూ వచ్చాను. నర్మద జలాలతో ఒక్క గుజరాత్‌కే ప్రయోజనం కలుగలేదు. రాజస్థాన్‌కు కూడా మేలు చేయాలనుకొన్నాం. ఎలాంటి ఉద్రిక్తత, విఘ్నాలు, విజ్ఞాపనపత్రాలు, ఆందోళనలు తలెత్తలేదు. ఆనకట్ట పని పూర్తయిన వెంటనే ‘‘ముందుగా నీటిని గుజరాత్ అందుకోనివ్వండి, ఆ తరువాత రాజస్థాన్‌కు అందిద్దాం’’ అని నేను అనలేదు. ఉహూ.. మేం ఇటు గుజరాత్‌కూ, అటు రాజస్థాన్‌కూ ఒకేసారి నీటిని సరఫరా చేయడం మొదలుపెట్టాం. మేం దీన్ని చేశాం. నాకు ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. నర్మద మాత జలాలు రాజస్థాన్‌కు ఆరోజు చేరుకొన్నాయి. రాజస్థాన్ ప్రజల్లో ఎక్కడలేని ఆనందోత్సాహాలు. కొద్దిరోజుల తరువాత నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండగా, భైరాన్ సింగ్ జీ షెఖావత్ తోపాటు జస్వంత్ సింగ్ జీ గుజరాత్‌కు వచ్చారని, వారు నన్ను కలుసుకోవాలనుకొన్నారన్న సందేశం నాకు అందింది. వారు ఎందుకు వచ్చారనిగానీ, విషయం ఏమిటనేదిగానీ నాకు ఏమీ తెలియదు. వారు నా కార్యాలయానికి వచ్చేశారు. వారు ఎందుకు వచ్చారోనని నేను ఎంతో మర్యాదగా వారిని అడిగాను. దానికి వారన్నారు కదా.. ‘‘ప్రత్యేకంగా ఏ పనీలేదండీ - ఊరికే మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాం.’’ వారిద్దరూ నా కన్నా సీనియర్ నేతలు. మాలో చాలా మందిమి భైరాన్ సింగ్ జీ మార్గదర్శనంలో ఎదిగాం. వారు నా ముందు కూర్చొని ఉన్నారు. వారు నన్ను ఏమీ అడగలేదు. కానీ వారు వారి మర్యాదను, కృతజ్ఞతను తెలియజేయడానికే వచ్చారు. నేను ఒకింత ఆశ్చర్యపోయాను, ఇంతలో వారు మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వారి కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళు అన్నారు కదా.. ‘‘మోదీగారూ, నీళ్ళను అందించడమంటే ఏమిటో మీరు ఎరుగుదురా? మీరు ఎంతో సీదాసాదాగా, ఎంతో సులభంగా నర్మద జలాలు రాజస్థాన్‌కు చేరేటట్టు చూశారు. ఇది మా మనసును కదిలించింది. మేం స్వయంగా ఇక్కడికి వచ్చి, రాజస్థాన్‌లోని కోట్లాది ప్రజల అంతరంగ భావాలను మీకు తెలియజేయాలనుకున్నాం’’.
మిత్రులారా,
జలానికున్న అపార శక్తి ఏమిటో నేను తెలుసుకున్నాను. మరి ఇవాళ నర్మద మాత జలం జాలౌర్, బాడ్‌మేర్, చురూ, ఝుంఝునూ, జోధ్‌పూర్, నాగౌర్, హనుమాన్‌గఢ్ ఇంకా అనేక ఇతర జిల్లాలకు చేరుతోందని తెలిసి నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
నర్మద నదిలో స్నానమాచరించి, ఒక ‘ప్రదక్షిణ’ (పరిక్రమ)ను చేస్తే.. అది అనేక తరాల పాపాలను శుద్ధిచేసి, ఆశీర్వాదాల్ని అందిస్తుందని ఒకప్పుడు చెప్పారు. అయితే, విజ్ఞానశాస్త్రం సాధించిన అద్భుత కార్యాలను గమనించండి.. ఒకప్పుడు మనం నర్మద మాతకు ‘పరిక్రమ’ ఆచరించేవారం. ఇప్పుడు మాత నర్మద తనంత తాను ఒక ‘పరిక్రమ’ను పూర్తి చేసి హనుమాన్‌గఢ్ వరకు చేరుకుంటున్నది.
మిత్రులారా,
ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు (ఈఆర్‌సీపీ)ని కాంగ్రెస్ చాలా కాలం ఆపేసింది. ఇది వారి ఉద్దేశాలను స్పష్టంగా చాటుతోంది. వారు రైతులను గురించి చాలా చెబుతారు. కానీ, వారు రైతుల కోసం ఏమీ చేయరు. అంతేకాదు, వేరెవ్వరినీ ఆ పనిని చేయనివ్వరు కూడా. బీజేపీ విధానం గొడవపెట్టుకోవడం కాదు. కూర్చొని మాట్లాడుకోవడం. మేం సహకారాన్ని నమ్ముతాం, ప్రతిఘటించడాన్ని కాదు. మేం పరిష్కారాలను నమ్ముతాం, అడ్డంకులను సృష్టించడాన్ని కాదు. ఈ కారణంగానే మా ప్రభుత్వం ఈఆర్‌సీపీని ఆమోదించడం ఒక్కటే కాకుండా దాని పరిధిని కూడా విస్తరించింది. మధ్య ప్రదేశ్‌లో, రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటైన వెంటనే పార్వతీ– కాలీసింధ్ - చంబల్ ప్రాజెక్టు, ఎమ్‌పీకేసీ లింక్ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల ఒప్పంద పత్రాలపై సంతకాలయ్యాయి.
మీరు ఇక్కడ చూస్తున్న దృశ్యం.. కేంద్ర ప్రభుత్వ జల శాఖ మంత్రి, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడ ఉండడం.. ఇది సాధారణ దృశ్యం ఏమీ కాదు. రాబోయే దశాబ్దాల్లో ఈ ఛాయాచిత్రం భారత్‌లో మూలమూలనా రాజకీయవాదులకు ఎన్నో ప్రశ్నలను వేయనుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రశ్నను అడుగుతారు.. అది: ‘‘మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లు నీటి సంకటాన్ని అధిగమించడానికి ఒకదానికొకటి సహకరించుకొని నదీ జలాల ఒప్పందాలతో ముందడుగు వేసినప్పుడు, సముద్రంలో కలుస్తున్న నీటి విషయంలో ఒక సీదాసాదా ఒప్పంద పత్రంపైన మీరు ఎందుకని సంతకం పెట్టలేరు?’’ అనేదే. ఈ ఛాయాచిత్రాన్ని రాబోయే దశాబ్దాలలో యావత్తు దేశం చూస్తుంది. మీరు ఈ రోజున చూసిన ‘జలాభిషేకం’ కూడా ఏ సాధారణ దృశ్యమో కాదు. దేశ ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించే వ్యక్తులు వారికి ప్రజాసేవ చేసే అవకాశం లభించిందా అంటే, వారిలో ఒకరు మధ్య ప్రదేశ్ నుంచి నీటిని తీసుకువస్తారు, మరొకరు రాజస్థాన్ నుంచి తీసుకువస్తారు, ఈ జలాలను అన్నింటినీ సేకరించి ‘సుజలాం సుఫలాం’ ద్వారా రాజస్థాన్‌ను సమృద్ధ ప్రాంతంగా తీర్చిదిద్దే యజ్ఞాన్ని మొదలుపెడతారు. ఇది అసాధారణంగా అనిపించవచ్చుగాక, కానీ ఈ రోజు మనం ఒక పనికి ఏడాది కాలం పూర్తయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకొంటున్న తరుణంలో ఈ వేదిక మీద నుంచి రాబోయే శతాబ్దాలలో ఒక ఉజ్వల భవిష్యత్తు అధ్యాయాన్ని కూడా మనం రాస్తున్నామన్నమాట. ఈ ప్రాజెక్టులో చంబల్, దాని ఉప నదులైన.. పార్వతీ, కాలీసింధ్, కూనో, బనాస్, బాణ్‌గంగ, రూపరేల్, గంభీరీ, మేజ్..ల జలాలను కలుపుతారు.
మిత్రులారా,
నదులను కలపడంలో ఉన్న శక్తి ఏమిటనేది నేను గుజరాత్‌లో మొట్టమొదటగా తెలుసుకున్నాను. నర్మదలోని జలాన్ని గుజరాత్‌లో వివిధ నదులతో కలిపారు. మీరు అహ్మదాబాద్‌కు వెళ్ళారంటే, సబర్మతీ నదిని చూడవచ్చు. ఇరవై సంవత్సరాల కిందట ఒక చిన్నపిల్లవాడిని సబర్మతీని గురించి ఒక వ్యాసాన్ని రాయాలని అడిగితే, ఆ బాలుడు ఆ నది తీరంలో ఏర్పాటుచేసిన సర్కస్ గుడారాల గురించీ, అక్కడ నిర్వహించే పెద్ద సర్కస్ ఆటల గురించీ రాసేవాడు. అక్కడి బీడు భూమిలో క్రికెట్ ఆడటం ఎంత సరదాగా ఉండిందీ కూడా చిన్నపిల్లలు చెప్పేవారు. ఇలా ఎందుకు అనంటే.. ఆ కాలంలో సబర్మతీలో నీరే లేదు, కానీ ఇవాళ నర్మద జలాలు సబర్మతీకి జవజీవాల్ని అందించాయి. అహ్మదాబాద్‌లో మీరు ఒక సుందర దృశ్యాన్ని చూడవచ్చు. నదులను కలిపితే ఏర్పడే శక్తి ఇది. రాజస్థాన్ విషయంలోనూ ఇలాంటి సుందర దృశ్యాన్నే నేను నా మనోఫలకంపై చూడగలుగుతున్నాను.
మిత్రులారా,
రాజస్థాన్ ఇక ఎంత మాత్రం నీటిఎద్దడిని ఎదుర్కోని, రాష్ట్రంలో అభివృద్ధికి చాలినంత జలం లభించే కాలం వస్తుందని నేను ఊహిస్తున్నాను. పార్వతీ- కాలీసింధ్- చంబల్ ప్రాజెక్టు రాజస్థాన్‌లో 21 జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందించనుంది. ఇది రాజస్థాన్‌లోనూ, మధ్యప్రదేశ్‌లోనూ అభివృద్ధిని ఉరకలేయించనుంది.
మిత్రులారా,
ఈ రోజు ఈసర్దా లింక్ ప్రాజెక్టును కూడా ప్రారంభించుకొన్నాం. తాజేవాలా నుంచి షెఖావతీకి నీటిని పారించడానికి కూడా ఈ రోజు ఒక ఒప్పందం కుదరింది. ఈ జల ఒప్పందంతో హర్యానాకూ, రాజస్థాన్‌కూ ప్రయోజనం కలుగుతుంది. త్వరలోనే రాజస్థాన్‌లో అన్ని కుటుంబాలకు నల్లాల ద్వారా నీరు అందుతుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
సి.ఆర్. పాటిల్ గారి నాయకత్వంలో ఒక భారీ కార్యక్రమం అమలవుతోంది. దీనిపై ప్రసార మాధ్యమాల దృష్టి పడకపోయినప్పటికీ, దీనికున్న బలాన్ని నేను పూర్తిగా గ్రహించాను. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో మొదలుపెట్టారు. వాననీటిని నిలవ చేయడానికి రీఛార్జ్ బావుల్ని నిర్మిస్తున్నారు. ప్రజల ప్రమేయంతో రాజస్థాన్‌లో రోజూ వాననీటి ఇంకుడుగుంతలను నిర్మిస్తున్న విషయాన్ని నాతో చెప్పారన్న సంగతి మీకు తెలియకపోవచ్చు. మన దేశంలో నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలలో గత కొన్ని నెలల్లో సుమారు మూడు లక్షల వాననీటి నిలవ వ్యవస్థలను సిద్ధం చేశారు. వాననీటిని సంరక్షించాలనే ఈ ప్రయత్నం రాబోయే కాలంలో మన ధరణి మాత దాహాన్ని తీర్చుతుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న దేశ పౌరులు ఎవ్వరూ భరతమాత దాహార్తితో అలమటించాలని ఎప్పటికీ కోరుకోరు. మన గొంతు ఎండుకుపోయిందా అంటే, అదే కష్టం ధరణి మాతకు కూడా ఎదురవుతుంది. ఈ కారణంగానే ఈ భూమి సంతానంగా మన ధరణి మాత దాహాన్ని తీర్చడం మనందరి కర్తవ్యం. ప్రతి ఒక్క వాననీటి చుక్కనూ మన ధరణి మాత దాహాన్ని తీర్చడానికుపయోగించాలి. మనకు ధరణి మాత ఆశీర్వాదం అందిందా అంటే ప్రపంచంలో ఏ శక్తీ మనను ఆపలేదు.
సుమారు వందేళ్ళ కిందట గుజరాత్‌లో ఓ జైన సాధువు ఉండేవారని నాకు జ్ఞాపకముంది. ఆయన పేరు బుద్ధి సాగర్ జీ మహరాజ్. ఆయన అప్పట్లో కొన్ని రచనలు చేశారు. ఆ కాలంలో ఎవరైనా ఆయన రాసిన మాటలను చదివి ఉంటే, వాటిని వారు నమ్మి ఉండేవారు కాదు. వందేళ్ళ కిందట ఆయన - ‘‘తాగేనీటిని కిరాణా దుకాణాల్లో అమ్మే రోజంటూ ఒకటి వస్తుంది’’ అన్నారు. ఈ మాటలను ఆయన వందేళ్ళ కిందట రాశారు. ఈ రోజు మనం నీటిని తాగడానికి పచారీ కొట్లో బిస్లరీ సీసాలు కొనక తప్పని స్థితిలో ఉన్నాం. ఈ మాటల్ని 100 ఏళ్ళ కిందటే చెప్పారు.
మిత్రులారా,
ఇదొక వేదన నిండిన కథ. మన పూర్వికులు మనకు గొప్ప వారసత్వాన్నిచ్చారు. మన భావితరాలు నీటి సమస్య కారణంగా ప్రాణాలు వదిలేయాల్సివచ్చే స్థితి రాకుండా చూడడం మన బాధ్యత. మనం వారికి ‘సుజలాం, సుఫలాం’ స్ఫూర్తిని అందించే నేలనూ, సమృద్ధమైన భూమినీ అప్పగించి తీరాలి. మరి ఈ రోజు నేను ఈ పవిత్రమైన పనిని నెరవేర్చే దిశలో పయనించిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్నీ, మధ్య ప్రదేశ్ ప్రజలనూ అభినందిస్తున్నాను. రాజస్థాన్ ప్రభుత్వానికీ, రాజస్థాన్ ప్రజలకూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఎలాంటి అంతరాయానికి తావు ఇవ్వకుండా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనదే. ఎక్కడ అవసరం వచ్చినా, ప్రణాళిక అనేది ఎక్కడ సిద్ధమైనా, దానిని సమర్థించడానికి ప్రజలు ముందుకు వచ్చి తీరాలి. అది జరిగినప్పుడే మనం ఈ ప్రణాళికలను అనుకున్న కాలానికన్నా ముందుగానే పూర్తిచేయగలం, అది పూర్తి రాజస్థాన్ భాగ్యాన్ని మార్చివేయగలుగుతుంది.
మిత్రులారా,
భారత్ విషయంలో 21వ శతాబ్దంలో మహిళలకు సాధికారత కల్పన విషయంలో చూసినప్పుడు చాలా ముఖ్యమైన శతాబ్దం. ఓయ్.. కేమెరామెన్.. అతడిలో ఉత్సాహం కట్టలు తెంచుకొన్నట్లుంది. దయచేసి ఆయనను ఒక్క క్షణం పక్కకు వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఆయన అలసిపోతారు మరి.
మిత్రులారా,
మీరు చూపుతున్న ప్రేమకు, మీరు అందిస్తున్న మద్దతుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఈ ఉత్సాహాన్ని, ఈ శక్తిని నేను మెచ్చుకొంటున్నాను. మిత్రులారా, మహిళల స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) ఉద్యమంలో ‘నారీ శక్తి’ (మహిళా శక్తి) బలం ఎంతటిదో చూశాం. గడచిన పదేళ్ళలో దేశమంతటా 10 కోట్ల మంది అక్కచెల్లెళ్ళు స్వయం సహాయ బృందాలలో చేరారు. రాజస్థాన్‌కు చెందిన లక్షలాది సోదరీమణులు కూడా వారిలో భాగమయ్యారు. ఈ బృందాలను బలపరచడానికి బీజేపీ ప్రభుత్వం అలుపెరుగక కృషి చేసింది. మా ప్రభుత్వం మొదట ఈ బృందాలను బ్యాంకులతో జోడించింది. ఆ తరువాత బ్యాంకుల నుంచి అందిస్తున్న సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. మేం దాదాపు రూ.8 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని వారికి అందించాం. మేం వారి శిక్షణకు ఏర్పాట్లుచేసి, మహిళా స్వయం సహాయక బృందాలు తయారుచేసే వస్తువులను విక్రయించడానికి కొత్త కొత్త విపణులను చూపెట్టాం.
ప్రస్తుతం, ఈ ప్రయత్నం ఫలితంగా ఈ స్వయం సహాయక బృందాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దన్నుగా మారాయి. నేను ఇక్కడికి వస్తూ ఉంటే దారిలో జాగాలన్నీ తల్లులు, అక్కచెల్లెళ్ళతో నిండిపోవడంతోపాటు వారిలో ఎంతో ఉద్వేగం, ఉత్సాహం ఉప్పొంగడాన్ని గమనిస్తే నాకు సంతోషమేసింది. ప్రస్తుతం, మా ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు చెందిన సోదరీమణులలో నుంచి 3 కోట్ల మందిని లఖ్‌పతి దీదీ (లక్షాధికారి సోదరీమణులు)లుగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తోంది. ఇప్పటికే ఇంచుమించు 1.25 కోట్ల మంది అక్కచెల్లెళ్ళు ‘లఖ్‌పతి దీదీలు’ అయ్యారని మీకు తెలియజేడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ మాటకు అర్థం.. వారు ప్రస్తుతం ప్రతి ఏటా ఒక లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని.
మిత్రులారా,
‘మహిళా శక్తి’ని బలపరచడానికి మేం చాలా కొత్త పథకాలను రూపొందిస్తున్నాం. ఉదాహరణకు ‘నమో డ్రోన్ దీదీ’ల పథకాన్నే తీసుకోండి, దీనిలో వేలాది సోదరీమణులకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే వేలాది గ్రూపులు డ్రోన్లను అందుకొన్నాయి. ఈ మహిళలు సాగుకు డ్రోన్లను ఉపయోగిస్తూ, ఆదాయాన్ని అందుకొంటున్నారు. మరింత మందిని ఈ పథకం పరిధిలోకి చేర్చాలని కూడా రాజస్థాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
మిత్రులారా,
ఇటీవల మన సోదరీమణులకోసం, కుమార్తెలకోసం మరో ప్రధాన పథకాన్ని మేం ప్రారంభించాం. దీని పేరు ‘బీమా సఖి’ పథకం. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల మహిళలు, యువతులు, బీమా రంగంలోకి ప్రవేశించి శిక్షణను అందుకొంటారు. మొదట కొన్నేళ్ళపాటు వారు వారి పనిలో ఆనుపానులను తెలుసుకొనేవరకు వారికి కొంత మొత్తంలో స్టయిపండును అందిస్తారు. ఈ పథకంలో వారు ఆర్థికంగా మద్దతును అందుకోవడంతోపాటు దేశ ప్రజలకు సేవచేసే అవకాశాన్ని కూడా పొందుతారు. మన ‘బ్యాంకు సఖి’ మహిళలు బ్యాంకింగ్ సేవలను దేశంలో మూలమూలకూ తీసుకుపోయి చేసిన అసాధారణ కృషిని మనమంతా చూశాం. వారు బ్యాంకు ఖాతాలను తెరిపించి, ప్రజలకు రుణ సదుపాయం లభించేటట్లు చేశారు. ఇక ‘బీమా సఖి’లు భారత్‌లో ప్రతి ఒక్క కుటుంబం బీమా సేవలను అందుకోవడంలో సహాయపడతారు. అయ్యా, కెమెరామెన్, మీరు మీ కెమెరాను అవతలివైపు తిప్పండని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అటుపక్క లక్షల మంది కూర్చుని ఉన్నారు కదా.
మిత్రులారా,
పల్లె ప్రాంతాలలో ఆర్థిక స్థితిని మెరుగు పరచడానికి బీజేపీ ప్రభుత్వం అదేపనిగా కృషి చేస్తోంది. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను ఆవిష్కరించాలంటే, ఇది కీలకం. అందుకని మేం పల్లెటూళ్ళలో సంపాదన, ఉపాధికి ఉన్న అన్ని మార్గాలపై దృష్టిని సారిస్తున్నాం. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల వల్ల ప్రధానంగా లాభపడేది మన రైతులే. రైతులకు పగటిపూట కూడా విద్యుత్తు అందిస్తూ ఉండేటట్లు చూడాలనేది రాజస్థాన్ ప్రభుత్వం ప్రణాళిక. ఇదే జరిగితే రాత్రిపూట సేద్యపు నీరును అందించే అగత్యం తప్పుతుంది.
మిత్రులారా,
సౌర ఇంధన సామర్థ్యం రాజస్థాన్‌లో ఎంతో ఉంది. ఈ రంగంలో ఈ రాష్ట్రం దేశంలోనే ఒక నాయకత్వ స్థానానికి చేరుకోగలుగుతుంది. మీరు మీ విద్యుత్తు బిల్లును సున్నా స్థాయికి తెచ్చుకోవడానికి సౌర ఇంధనాన్ని ఒక సాధనంగా మా ప్రభుత్వం మలచింది. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇళ్ళ పైకప్పులపైన సౌర ఫలకాలను అమర్చడానికి సుమారుగా రూ.75,000 నుంచి రూ.80,000 వరకు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు మీ అవసరాలకన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తే, ఆ మిగులు విద్యుత్తును మీరు అమ్ముకోవచ్చు. ఆ విద్యుత్తును ప్రభుత్వం కొంటుంది. ఈ పథకంలో ఇంతవరకు దేశంలో 1.4 కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలు నమోదయ్యాయన్న సంగతిని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. స్వల్పకాలంలో సుమారుగా 7 లక్షల ఇళ్ళకు సోలార్ ప్యానల్ సిస్టమ్స్‌ను అమర్చారు. వీటిలో 20,000కు పైగా ఇళ్ళు రాజస్థాన్‌లోవే. ఈ ఇళ్ళలో ఇప్పటికే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ప్రజలు వారి డబ్బును ఆదా చేసుకోవడం మొదలుపెట్టారు.
మిత్రులారా,
ఇంటి పైకప్పుల మీద మాత్రమే కాకుండా, పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంటులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పిఎమ్ కుసుమ్ (PM KUSUM) పథకంలో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం రాబోయే కాలంలో వందల సంఖ్యలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేయబోతోంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క రైతు ఇంధన నిర్మాతగా మారారంటే, విద్యుత్తు నుంచి ఆదాయం లభిస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఆదాయం పెరుగుతుంది.
మిత్రులారా,
రహదారి, రైలు మార్గం, ఇంకా విమానయానాల పరంగా అత్యంత అధికస్థాయిలో సంధాన సదుపాయాలున్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం. ఢిల్లీ, వడోదరా, ముంబయి వంటి ప్రధాన పారిశ్రామిక కూడళ్ళ వద్ద ఉన్న రాజస్థాన్‌లో ఇక్కడి ప్రజలకు, ప్రత్యేకించి యువతకు ఒక గొప్ప అవకాశం అందిరానుంది. ఈ మూడు నగరాలను రాజస్థాన్‌తో కలిపే కొత్త ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి. మేజా నది మీద ఒక పెద్ద వంతెన నిర్మాణం చేపట్టడంవల్ల సవాయీ మాధోపూర్, బూందీ, టోంక్, కోట వంటి జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీ, ముంబయి, వడోదరాలలోని పెద్ద అంగళ్ళకు చేరుకోవడం సులభతరం కానుంది. దీనికి అదనంగా జైపూర్ నుంచి రణథంబోర్ పులుల అభయారణ్యానికి పర్యాటకులు సులభంగా ప్రయాణించేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. వర్తమాన యుగంలో, కాలం అమూల్యమైందన్న సంగతి మనకందరికీ తెలుసు. ప్రజల కాలాన్ని ఆదా చేసి, వారికి లభిస్తున్న సౌకర్యాల్ని ఇప్పటికన్నా పెంచడం మా ధ్యేయం.
మిత్రులారా,
జాంనగర్-అమృత్‌సర్ ఎకనామిక్ కారిడార్‌ను ఢిల్లీ-అమృత్‌సర్-కట్‌రా ఎక్స్‌ప్రెస్‌వేతో కలిపితే అది రాజస్థాన్‌ను మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సంధానిస్తుంది. దీనితో ఉత్తర భారతదేశంలోని పరిశ్రమలకు కాండ్లా ఓడరేవు, ముంద్‌డా ఓడరేవులకు సంధానం అందివస్తుంది. రాజస్థాన్‌లో రవాణా రంగం దీని ప్రయోజనాన్ని పొందుతుంది. అంతేకాకుండా, రాజస్థాన్‌లో పెద్ద గోదాముల నిర్మాణానికి అవకాశం కూడా లభిస్తుంది. ఇది రాజస్థాన్‌లో యువతీయువకులకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
మిత్రులారా,
జోధ్‌పూర్ రింగ్ రోడ్ నుంచి జైపూర్, పాలీ, బాడ్‌మేర్, జైసల్మేర్, నాగౌర్‌కు.. అలాగే అంతర్జాతీయ సరిహద్దుకు సంధానాన్ని మెరుగుపరచడం, నగరంలో అనవసర ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా నివారిస్తుంది. ఇది జోధ్‌పూర్‌ను సందర్శించే పర్యాటకులకు, వ్యాపారస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ రోజు ఈ కార్యక్రమంలో వేల కొద్దీ బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. వారి శ్రమ ఫలితంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొంటున్నాం. బీజేపీ కార్యకర్తలను నేనొకటి కోరదలచాను.. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, అంతేకాదు అది ఒక విశాలమైన సామాజిక ఉద్యమంగా కూడా ఉంది. బీజేపీ విషయంలో దేశమే పార్టీకన్నా ప్రధానమైంది. ప్రతిఒక్క బీజేపీ కార్యకర్త ఈ అవగాహనతో దేశంకోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఒక బీజేపీ కార్యకర్తకు రాజకీయాలలోనే కాకుండా, సామాజిక సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రమేయముంది. ఈరోజు, మనం జలసంరక్షణతో ముడిపడ్డ ఒక కార్యక్రమంలో భాగం పంచుకొంటున్నాం. జలవనరుల సంరక్షణ, ప్రతి నీటి బిందువునూ అర్ధవంతంగా ఉపయోగించుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలాగే అది సమాజం బాధ్యతా, దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యతానూ. ఈ కారణంగా నేను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, ప్రతి సభ్యుడు వారి దైనందిన చర్యలలో ఒక భాగాన్ని జలసంరక్షణకు అంకితం చేయాల్సిందిగా- అదీనూ చాలా భక్తి భావంతో అంకితం చేయాల్సిందిగా- విజ్ఞప్తి చేస్తున్నాను. సూక్ష్మ సేద్యంతో, బిందు సేద్యంతో ప్రమేయం పెట్టుకోండి. ‘అమృత సరోవరాల’ బాగోగులు చూడడంలో సాయపడండి. జల నిర్వహణ వ్యవస్థల్ని నిర్మించండి. ప్రజల్లో అవగాహనను పెంచండి. అలాగే రైతులకు ప్రాకృతిక వ్యవసాయ పద్ధతుల పట్ల చైతన్యాన్ని కలిగించండి.
చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే నీటిని నిలవ చేయడంలో ధరణికి అంత ఎక్కువ సాయం అందుతుందన్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ కారణంగానే ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) వంటి ఒక ప్రచార ఉద్యమం చాలా ప్రయోజనకరం కాగలదు. ఇది మన మాతృమూర్తులను గౌరవించుకోవడం ఒక్కటే కాకుండా, ధరణిమాత పట్ల ఆదరణను పెంచేది కూడా. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి అనేక కార్యక్రమాలను మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు.. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పీఎం సూర్య ఘర్ యోజన. ఈ పథకం గురించి, ఈ పథకం ప్రయోజనాలను గురించి ప్రజలకు బీజేపీ కార్యకర్తలు వివరించి, సౌర ఇంధనం ఉపయోగాల పట్ల అవగాహనను పెంపొందించవచ్చు. మన దేశంలో ప్రజలకు ఒక స్వభావమంటూ ఉంది. ఏదైనా ఒక ప్రచార ఉద్యమానికి సరైన ఉద్దేశం, ఒక సరైన విధానం ఉన్నాయని దేశ ప్రజలు గమనిస్తే, వారు తమంతట తాము చొరవ తీసుకుని, ఆ ఉద్యమంలో చేరి ఆ లక్ష్య సాధనకు తమను తాము అంకితం చేసుకొంటారు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచార ఉద్యమాల విషయంలో ఇలా జరగడాన్ని మనం చూశాం. ఇదే విధమైన విజయం పర్యావరణ పరిరక్షణలో, జల సంరక్షణలో కూడా మనం సాధించవచ్చని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఆధునిక అభివృద్ధి పనులు, రూపుదాల్చుతున్న మౌలిక సదుపాయాలు ప్రస్తుత తరంతోపాటు, భావి తరాలవారికి ప్రయోజనాలను అందించనున్నాయి. ఇది ఒక ‘వికసిత్ రాజస్థాన్’ (అభివృద్ధి చెందిన రాజస్థాన్) నిర్మాణానికి తోడ్పాటును అందిస్తుంది. రాజస్థాన్ అభివృద్ధి చెందిందా అంటే, భారత్ కూడా శరవేగంగా పురోగమిస్తుంది. రాబోయే కాలంలో డబల్ ఇంజిన్ ప్రభుత్వం మరింత త్వరితగతిన పని చేయనుంది. రాజస్థాన్‌ను అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టదు. మీకు నేను హామీని ఇస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ గుమిగూడిన మీ అందరికీ ప్రత్యేకించి తల్లులకు, అక్కచెల్లెళ్ళకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కృతజ్ఞతతో నా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతోందంటే దానికి కారణం మీరే. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది మీకోసమే. మీకందరికీ నా శుభాకాంక్షలు. పూర్తి శక్తితో రెండు చేతులను పైకెత్తి నాతో కలిసి ఇలా చెప్పండి -
భారత్ మాతా కీ- జై.
భారత్ మాతా కీ- జై.
భారత్ మాతా కీ- జై.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దగ్గరి అనువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.
***
(Release ID: 2086695)
Visitor Counter : 10
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada