ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

Posted On: 19 NOV 2024 6:02AM by PIB Hyderabad

బ్రెజిల్‌లోని రియో డి జెనీరో లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాదిలో ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇది మూడోసారి. జనవరిలో భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అధ్యక్షుడు మాక్రోన్ హాజరయ్యారు. అనంతరం జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంలోనూ ఇద్దరూ సమావేశమయ్యారు.

2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.

డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ తదితర విభాగాలు, భారత్-ఫ్రాన్స్ డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ సంబంధాలు బలోపేతమవడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఫ్రాన్స్‌లో జరగబోయే ఏఐ యాక్షన్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధ్యక్షుడు మాక్రోన్ చూపిన చొరవను ప్రధానమంత్రి స్వాగతించారు.

ఇండో-పసిఫిక్‌తో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారు. అంతర్జాతీయంగా స్థిరత్వాన్ని నిర్మించేందుకు అవసరమైన సాయం అందించడంతో పాటు బహుపాక్షిక సంబంధాలను సంస్కరించడానికి కలసి పనిచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

***


(Release ID: 2074587) Visitor Counter : 19