ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని కచ్ లో భద్రతా సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి

140 కోట్ల మంది భారతీయుల తరఫున ధన్యవాదాలు: సవాళ్లను అధిగమిస్తూ దేశ సేవలో భద్రతా సిబ్బంది అంకితభావం, త్యాగ నిరతిని కొనియాడిన ప్రధానమంత్రి

భారత శక్తి సామర్థ్యాలకు ప్రతీక సైన్యం: శతృ భీకరులుగా భద్రతకు భరోసా కల్పిస్తున్నారంటూ కీర్తించిన ప్రధానమంత్రి

సరిహద్దుల విషయంలో అంగుళం కూడా రాజీపడని ప్రభుత్వం మాది: ప్రధానమంత్రి

ఒకప్పుడు దిగుమతి దేశం.. నేడు రక్షణ పరికరాల ఎగుమతి దేశం... పదేళ్లలో 30 రెట్లు పెరిగిన ఎగుమతులు: ప్రధానమంత్రి

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా తొలి ప్రాధాన్యం: ప్రధానమంత్రి

సరిహద్దు గ్రామాలు మారుమూల ప్రాంతాలు కావు.. అవి దేశంలో ‘తొలి గ్రామాలు’: ప్రధానమంత్రి

సరిహద్దు పర్యాటకం, ఆర్థిక వృద్ధికి ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు; శక్తిమంతమైన గ్రామాల పథకం ద్వారా వాటిని అభివృద్ధి చేయడం భారత చేతనను ప్రతిబింబిస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 31 OCT 2024 7:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి పండుగ చేసుకున్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), సైన్యం, నావిక, వైమానిక దళాల సిబ్బందితో కలిసి గుజరాత్ లోని సర్ క్రీక్ లో ఉన్న లక్కీ నాలా వద్ద ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. భారత సాయుధ దళాలతో కలిసి పండుగ చేసుకునే సంప్రదాయాన్ని ప్రధాని కొనసాగించారు. క్రీక్ లోని ఓ సైనిక స్థావరాన్ని సందర్శించి ధీరులైన భద్రతా సిబ్బందికి మిఠాయిలు అందించారు.

సర్ క్రీక్ వద్ద భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకోవడం తన అదృష్టమన్న ప్రధాని.. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని మహా మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠ నేపథ్యంలో ఈసారి వేడుకలు విశేషమైనవని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అక్కడున్న వారికే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న సైనికులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశసేవలో భద్రతా సిబ్బంది అంకితభావం, త్యాగనిరతిపై 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సైనికుల త్యాగాలు అమూల్యమైనవన్న ప్రధాని, దేశానికి వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. సైనికులు భారత శక్తికి సంకేతమని, దేశ భద్రతకుభరోసా అని కొనియాడారు.శతృభీకరమైనదంటూ మన సైన్యం ధైర్యసాహసాలను కీర్తించారు. “మిమ్మల్ని చూస్తే ప్రపంచానికి భారత శక్తియుక్తులు తెలుస్తాయి. శతృవులు మిమ్మల్ని చూస్తే వారి దుష్టతలంపులు పటాపంచలవుతాయి. ఉత్సాహంగా గర్జిస్తే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతుంది. ఇది నా సైన్యం, నా భద్రతా దళాల పరాక్రమం. అన్ని సంక్లిష్ట పరిస్థితుల్లోనూ మన సైనికులు సత్తా చాటారని గర్వంగా చెప్తాను’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

కచ్ ను వ్యూహాత్మక ప్రాంతంగా పేర్కొన్న ప్రధాని... దేశవ్యతిరేక శక్తుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆ తీర ప్రాంతాన్ని నావికా దళం సమర్థవంతంగా రక్షిస్తోందని ప్రశంసించారు. భారత సమగ్రతకు ప్రతీక అయిన సర్ క్రీక్ గతంలో ఘర్షణలను ఊతమిస్తూ శతృవుల కవ్వింపు చర్యలకు కేంద్రంగా ఉండేది. అయితే నావికదళం సహా సాయుధ బలగాల అప్రమత్తత దేశానికి భరోసా కల్పిస్తోందని శ్రీ మోదీ అన్నారు. 1971 నాటి యుద్ధంలో శతృవును తిప్పికొట్టిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశ సరిహద్దుల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల విషయంలో అంగుళం కూడా ప్రస్తుత ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు.‘‘దౌత్యం పేరిట వంచనతో సర్ క్రీక్ ను దక్కించుకునేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దేశం తరఫున గొంతు వినిపించాను. నేనిక్కడికి రావడం ఇది మొదటిసారేమీ కాదు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు సాయుధ బలగాల దృఢ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. శతృవు మాటలను తాము నమ్మడం లేదని, భారత సాయుధ బలగాల అచంచలమైన సంకల్పాన్నే  తాము విశ్వసిస్తున్నామని అన్నారు.

రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా భారత సాయుధ దళాల ఆధునికీకరణ కోసం ప్రభుత్వ కృషిని ప్రముఖంగా పేర్కొన్నారు. వడోదరలో సి295 ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ప్రారంభం, ఎయిర్ క్రాఫ్టులను మోసుకెళ్లే విక్రాంత్, జలాంతర్గాములు, తేజస్ యుద్ధ విమానాల వంటి దేశీయ మిలిటరీ ఆస్తుల అభివృద్ధి సహా ఇటీవల ఆ రంగంలో విశేషమైన పురోగతిని గమనించవచ్చు. గతంలో ప్రధానంగా దిగుమతిదారుగా ఉన్న భారత్ ప్రస్తుతం రక్షణ ఉపకరణాలను గణనీయంగా  ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, గత దశాబ్దంలో రక్షణ పరమైన ఎగుమతులు 30 రెట్లు పెరిగాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

స్వావలంబన దిశగా ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సాయుధ బలగాలది కీలక పాత్రగా పేర్కొంటూ, “5000 కన్నా ఎక్కువ మిలిటరీ పరికరాలను రూపొందించిన భద్రతా దళాలకు నా అభినందనలు. వాటిని ఇకపై విదేశాల నుంచి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. సైనిక రంగంలో ఆత్మనిర్భర భారత సంకల్పానికి ఇది సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ సాంకేతికత ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సంప్రదాయక వాయు రక్షణ వ్యవస్థలకు డ్రోన్లు కొత్త సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రిడేటర్ డ్రోన్లను సమకూర్చుకోవడంతోపాటు డ్రోన్ సాంకేతికత ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటోందన్నారు. డ్రోన్ వినియోగం కోసం వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేస్తున్నామని, దేశీయంగా డ్రోన్లను రూపొందించడంలో భారతీయ కంపెనీలు, అంకుర సంస్థల భాగస్వామ్యం పట్ల గర్వంగా ఉందని కూడా ఆయన అన్నారు.

యుద్ధతంత్రాల్లో మార్పులు, కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో భారత సాయుధ బలగాల మూడు విభాగాల మధ్య మరింత మెరుగైన సమన్వయం అవశ్యమని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏకీకరణ వారి సమష్టి శక్తిని గణనీయంగా పెంచుతుందని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటు సాయుధ దళాలను శక్తిమంతం చేయడం, ఆధునికీకరణలో కీలక పరిణామమని పేర్కొన్నారు. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ దిశగా మళ్లడం మూడు సేనల మధ్య సమన్వయ సహకారాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

‘‘దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మన సంకల్పం. సరిహద్దుల నుంచే దేశం మొదలవుతుంది. అందువల్ల, సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ప్రాధాన్య అంశాల్లో ఒకటి’’ అని ప్రధానమంత్రి అన్నారు. సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్ వో)ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్గాలు సహా 80,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించినట్టు పేర్కొన్నారు. గత దశాబ్దంలో అటల్, సేల వంటి ప్రధాన సొరంగాలతోపాటు దాదాపు 400 వంతెనలు నిర్మించినట్టు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానతకు అవి కీలకంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా మరిన్ని సొరంగ మార్గాలను నిర్మించి వ్యూహాత్మకంగా ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సదుపాయాలను మెరుగుపరచడం కోసం, సాయుధ బలగాలకు ఉపయోగపడేలా బీఆర్ వో చురుగ్గా పనిచేస్తోందని శ్రీ మోదీ అన్నారు.

సరిహద్దు గ్రామాలను మారుమూల ప్రాంతాలుగా భావించే దృక్పథం మారాలని, వాటిని దేశానికి ‘తొలి గ్రామాలు’గా గుర్తించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. శక్తిమంతమైన గ్రామాల పథకం (వైబ్రంట్ విలేజ్ స్కీమ్) ద్వారా, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, అవి శక్తిశీలమైన, చేతనాత్మకమైన భారత్ ను ప్రతిబింబిస్తాయని అన్నారు. సరిహద్దు ప్రాంతాలకు సహజంగా ఉన్న అనేక ప్రత్యేక ప్రయోజనాలను ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. సరిహద్దు పర్యాటకం, ఆర్థిక వృద్ధిలో ఆ ప్రాంతాలకు గల అనేక అవకాశాలున్నాయన్నారు. సముద్ర శైవలాల సాగు, మడ అడవుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు జీవనోపాధిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఏర్పరచవచ్చన్నారు. దేశ పర్యావరణానికి ఇది గొప్ప సువర్ణావకాశం. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధోర్డోలోని రణ్ ఉత్సవ్ తరహాలో కచ్ సరిహద్దు గ్రామాల వెంబడి ఏర్పడే మడ అడవులు పర్యాటకులను ఆకర్షిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.

ఆ గ్రామాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా సరిహద్దు పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించడానికి, తద్వారా ప్రజల్లో ఆ ప్రాంతాలపై ఆసక్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. కచ్ ప్రాంత ఘనమైన వారసత్వం, ఆకర్షణీయత, ప్రకృతి సౌందర్యం దృష్ట్యా పర్యాటక గమ్యస్థానంగా కచ్ కు గల అవకాశాలను ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. గుజరాత్ లోని కచ్, ఖంబాట్ సింధుశాఖ వెంబడి ఉన్న మడ అడవులు, సముద్ర వ్యవస్థలు ఇక్కడ ముఖ్యమైన భాగాలు. మిష్టి యోజన వంటి కార్యక్రమాల ద్వారా ఈ మడ అడవులను విస్తరించేందుకు ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని శ్రీ మోదీ తెలిపారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ధోలవీర ప్రాశస్త్యాన్ని పేర్కొంటూ.. ఇది ప్రాచీన భారతదేశ శక్తియుక్తులకు, సింధూ లోయ నాగరికతలో వ్యవస్థీకృత నివాసాలకు నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు. కచ్‌లోని గొప్ప సాంస్కృతిక, చారిత్రక ఆకర్షణలను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఇక్కడ సముద్రానికి కూతవేటు దూరంలో లోథాల్ వంటి వాణిజ్య కేంద్రాలు కూడా ఓ సమయంలో భారత చరిత్రను సుసంపన్నం చేశాయి. లఖ్‌పథ్ లో గురునానక్ దేవ్‌ అడుగుజాడలున్నాయి. కచ్‌లో కోటేశ్వర మహాదేవ ఆలయం ఉంది. మాతా ఆశాపురా దేవాలయమైనా, కాలా దుంగార్ కొండపై ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనమైనా, కచ్‌లోని రణ్ ఉత్సవ్ అయినా, ఉత్సాహంగా సర్ క్రీక్‌ని సందర్శించడమైనా.. ఒక్క కచ్‌ జిల్లాలోనే పర్యాటక అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయి. అందుకోసం పర్యాటకులకు వారం మొత్తం కూడా సరిపోదు” అని ప్రధానమంత్రి అన్నారు. నాడబెట్ వంటి ప్రదేశాలలో సరిహద్దు పర్యాటకం విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ.. అలాంటి కార్యక్రమాలు జాతీయ ఐక్యతను ఎలా పెంపొందిస్తాయో చెప్పారు. అదేవిధంగా కచ్, ఇతర సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి స్థానికులు, సైనికుల జీవితాలను మెరుగుపరచడంతోపాటు.. అంతిమంగా జాతీయ భద్రతను బలోపేతం చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది.

భారతమాతగా కొలుస్తూ దేశాన్ని మనం సజీవ చేతనగా భావిస్తామని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రగతికి అత్యావశ్యకమైన భద్రతకు భరోసా కల్పించడంలో సైనికుల త్యాగాలు, కృషిని ప్రశంసించారు. “ఇవాళ దేశంలోని ప్రతి పౌరుడూ దేశాభివృద్ధి కోసం వంద శాతం కృషి చేస్తున్నాడంటే, అందుకు మీపై ఉన్న విశ్వాసమే కారణం. మీ ధైర్యసాహసాలు భారతదేశ అభివృద్ధిని ఇలానే బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను” అంటూ కచ్ లో భద్రతా దళాలనుద్దేశించి ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

 

***

MJPS/VJ


(Release ID: 2074202) Visitor Counter : 32