సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫీ 2024లో మెరుగైన నైపుణ్యాలతో మెరిసే భవిష్యత్తు సృజనశీలురు
‘యువ దర్శకులు – భవిష్యత్తు ఇప్పుడే’ అనే ఇతివృత్తంపైనే ఇఫీ ప్రధాన దృష్టి
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ద్వారా అందించే తోడ్పాటు 75 మంది నుంచి 100 మందికి పెంపు
అసాధారణ విజయాలు సాధించిన అయిదుగురు సీఎంవోటీ ఛాంపియన్లకు సత్కారం
ట్రాన్సఫార్మేటివ్ క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంవోటీ) కార్యక్రమం ద్వారా భారతీయ సినిమా భవిష్యత్తు ప్రధానాంశంగా ఈ నెల 18 నుంచి 26 వరకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) జరగనుంది. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ వేడుకల్లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చలనచిత్ర నిర్మాణంలో దేశంలో యువ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు సీఎంవోటీ వెలుగురేఖగా మారనుంది.
సినిమా రూపకల్పనలో అన్ని రకాలుగా తోడ్పాటు అందించే అతి పెద్ద వేదికగా, ఔత్సాహిక సినిమా దర్శకులు, ఈ రంగంలో అనుభవజ్ఞుల మధ్య చర్చలు, నైపుణ్య శిక్షణ జరిగేలా సీఎంవోటీ ప్రోత్సాహాక వాతావరణం కల్పిస్తుంది.
ఈ ఏడాది 13 ఫిలిం మేకింగ్ విభాగాల్లో 100 మంది యువ ప్రతిభావంతులను సీఎంవోటీ కార్యక్రమానికి ఆహ్వానించారు. గతంలో 10 విభాగాల్లో 75 మందిని మాత్రమే పాల్గొనేవారు.
పరిశ్రమ ప్రభావం
చిన్న స్థాయిలో తమ ప్రయాణం ప్రారంభించి అంతర్జాతీయ ప్రశంసల దాకా ఎదిగి, సరిహద్దులకు అతీతమైన విజయగాథలను సీఎంవోటీ పూర్వ విద్యార్థులు లిఖించారు. డూన్, నిమోనా, మెగ్ 2 తదితర మిలియన్ల డాలర్ల హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లకు పనిచేయడం లేదా కేన్స్, టొరంటో, బెర్లినాలే, ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల్లో ప్రశంసలు పొందడం కావచ్చు, వారు అంతర్జాతీయ వేదికలపై తమ ఉనికిని చాటుతూ సృజనాత్మక రంగంలో చెరగని ముద్ర వేశారు.
సంకల్పం, సృజనాత్మకత, ప్రతిభతో ఆదర్శంగా నిలిచిన ఐదుగురు సీఎంవోటీ ఛాంపియన్లను ఇఫీ ఈ ఏడాది సత్కరించనుంది:
· చిదానంద ఎస్. నాయక్ – కేన్స్ లో అవార్డు స్వీకరించారు.
· సుబర్ణాదాస్ – టీఐఎఫ్ఎఫ్, ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూ, బెర్లి [నాలే లో ప్రాజెక్టులు ప్రదర్శితమయ్యాయి.
· అక్షిత వోహ్రా – పురస్కారాలు గెలుచుకున్న ప్రాజెక్టులతో ప్రశంసలు అందుకున్నారు.
· అఖిల్ దామోదర్ లోట్లికర్ – వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికయ్యారు.
· కృష్ణా దుసానే – అంతర్జాతీయంగా విజయం సాధించిన చిత్రాలకు పనిచేశారు
వీరంతా ఇఫీ షార్ట్ ఫిలిం మేకింగ్ ఛాలెంజ్‌లో ఐదు సీఎంవోటీ బృందాలకు వారి స్ఫూర్తిదాయక ప్రయాణాల్లోని విషయాలను పంచుకుంటూ మార్గదర్శకత్వం వహిస్తారు.
సృజన కలిగిన ఔత్సాహికులకు వేదిక
ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌తో సహా భారతదేశంలోని ప్రతి మూల నుంచి 225 మంది సృజనాత్మకత కలిగిన యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దింది. ఈవిధంగా పూర్తి స్థాయి మద్దతు అందించే అంతర్జాతీయ వేదికల్లో ఒకటిగా, తరువాతి తరం సినిమా కథకులను ప్రోత్సహించే విషయంలో భారత్ సంకల్పానికి నిదర్శనంగా ఇది నిలుస్తుంది.
100 మంది ప్రతిభావంతుల ఎంపిక
ఈ ఏడాది సీఎంవోటీకి విశేష స్పందన లభించింది. 13 విభిన్న సినిమా క్రాఫ్టు విభాగాల్లో 1,070 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం వంటి రాష్ట్రాలు, పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారతదేశం నలుమూలల నుంచి ఎంట్రీలు వచ్చాయి. ఎక్కువ శాతం దరఖాస్తులు దర్శకత్వం, హెయిర్ అండ్ మేకప్, సినిమాటోగ్రఫీ విభాగాల్లోనే వచ్చాయి.
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది:
1. ఎంపిక జ్యూరీ: లఘుచిత్రాలు, షో రీల్స్, ఫోర్ట్ ఫోలియోలు, మ్యూజిక్ ఫైల్స్ తో సహా అన్ని దరఖాస్తులను సమీక్షించి, అన్ని విభాగాల్లోనూ కలిపి ప్రతిభావంతులైన 300 మందిని పురస్కార గ్రహీతలైన చలనచిత్ర నిపుణులు ఎంపికచేశారు.
2.గ్రాండ్ జ్యూరీ: సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, అనుభవజ్ఞులతో కూడిన ఈ గ్రాండ్ జ్యూరీ, అన్ని చిత్ర నిర్మాణ విభాగాల్లోనూ షార్ట్ లిస్ట్ చేసిన దరఖాస్తుల నుంచి చివరి 100 మందిని ఎంపిక చేసింది.
విస్తరించిన చిత్ర నిర్మాణ విభాగాలు
సీఎంఓటీ 2024 కొత్త విధానానికి నాంది పలుకుతూ వాయిస్ ఓవర్ లేదా డబ్బింగ్, హెయిర్ అండ్ మేకప్ విభాగాలతో కలసి 13 చిత్ర నిర్మాణ విభాగాలపై దృష్టి సారించి, దాని పరిధిని విస్తరించింది.
· దర్శకత్వం
· నటన
· సినిమాటోగ్రఫీ
· ఎడిటింగ్, సబ్ టైట్లింగ్
· కథారచన
· నేపథ్య సంగీతం
· స్వర కల్పన
· కాస్ట్యూమ్ డిజైన్
· కళా దర్శకత్వం
· యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్), ఆగ్మంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్)
· హెయిర్ అండ్ మేకప్
· సౌండ్ రికార్డింగ్
· వాయిస్ ఓవర్ లేదా డబ్బింగ్
ఆకర్షణీయమైన కార్యక్రమాలు, అవకాశాలు
సీఎంవోటీ 2024లో పాల్గొనేవారికి వేడుకల్లో లీనమయ్యేలా, హుషారైన అనుభవాలను అందిస్తుంది. సీఎంవోటీలో పాల్గొనే 100 మంది గోవాలో ఈ నెల 18 నుంచి 26 వరకు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ సమగ్ర కార్యక్రమంలో పొందుపరిచిన విభాగాలు:
స్ఫూర్తిప్రదాతలతో ప్రత్యేక శిక్షణా తరగతులు
ఈ ఏడాది సీఎంవోటీ కార్యక్రమంలో చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. వీటిలో నటన, స్వర ఉచ్ఛారణ, రచన, పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా చలనచిత్ర నిర్మాణానికి సంబందించిన అన్ని విభాగాలపై మెలకువలు నేర్పిస్తారు. ఇందులో పొందుపరిచిన అంశాలు:
· నటనలో ప్రావీణ్యం సంపాదించడం: భారత్ లోని ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ద్వారా ప్రామాణికమైన ప్రదర్శనలను రూపొందించేందుకు మార్గదర్శకాలు
- ఉత్తమ కథను రూపొందించే కళ: ది స్టోరీ ఇంక్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ జైన్ ద్వారా నిర్మాతలు, పంపిణీదారులు, పెట్టుబడిదారుల కోసం ఉత్తమ కథను రూపొందించడం.
- తెరపై సినిమాను అందంగా చూపించడం: బ్రిడ్జి పోస్ట్ వర్క్స్ లో ప్రఖ్యాత కలరిస్ట్ పృథ్వీ బుద్ధవరపుతో సినింమాల్లో డీఐ, కలర్ గ్రేడింగ్ కళలో నైపుణ్యం (ఆన్లైన్)
- రచనా విధానం: ప్రఖ్యాత కథా రచయిత చారుదత్ ఆచార్యతో పరిశోధన నుంచి తెరపై దృశ్యంగా మారేంత వరకు పాటించాల్సిన మెలకువలు
- అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు మార్గాలు: ఎ లిటిల్ అనార్కీ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు కోవల్ భాటియాచే స్వతంత్ర చిత్రనిర్మాతల కోసం అంతర్జాతీయ మార్కెట్‌లు, ల్యాబ్ లను చేరుకోవడం.
- వాస్తవం నుంచి వెండి తెర వరకు: వైఆర్ఎఫ్ స్టూడియోస్ నిర్మాత సైఫ్ అక్తర్ తో డాక్యుమెంటరీ నిర్మాణంలో ఉన్న అవకాశాలపై అవగాహన
48-గంటల వ్యవధిలో ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్: 20 మంది సభ్యులతో కూడిన ఐదు బృందాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. వీరంతా ‘‘సాంకేతిక యుగంలో అనుబంధాలు’’ అనే అంశంపై 48 గంటల వ్యవధిలో లఘు చిత్రాలను రూపొందిస్తారు. ఈ ఛాలెంజ్ ఈ నెల 21 నుంచి 23 వరకు పాంజిమ్‌కు 4-కిలోమీటర్ల పరిధిలో ఉన్న 12 ప్రదేశాలలో జరుగుతుంది.
ఉత్తమ చిత్రాలను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తారు. గ్రేట్ గ్రాండ్ జ్యూరీ న్యాయనిర్ణేతగా వ్యవహరించి వివిధ విభాగాలలో అవార్డులు అందజేస్తుంది.
యూకేకు చెందిన షార్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో ఈ ఫిలిం మేకింగ్ ఛాలెంజ్ నిర్వహిస్తారు. సృజనాత్మకత, సమష్టిగా పనిచేయడం,ఇచ్చిన గడువులో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయడం తదితర అంశాలను పరీక్షిస్తారు.
టాలెంట్ క్యాంప్: రాయ్ కపూర్ ఫిల్మ్స్, బ్రిడ్జ్ పోస్ట్‌వర్క్స్, వుయ్ ఆర్ యువా, ముఖేష్ ఛబ్రా కాస్టింగ్ కో., ది స్టోరీ ఇంక్ సహా 11 కంటే ఎక్కువ ప్రముఖ మీడియా, వినోద సంస్థల ప్రతినిధుల సమక్షంలో తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదో గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి అర్ధవంతమైన చర్చలు, సహకారాలతో పరిశ్రమలో భాగమయ్యే అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, 100 మంది సృజనశీలురతో పాటు, 225 మంది ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థులు, కళాకారులు, చిత్ర దర్శకులకు, సినీరంగానికి చెందిన ప్రతిభావంతులతో అనుసంధానమయ్యే వీలు కల్పిస్తుంది.
ఇఫీ, ఫిల్మ్ బజార్ పర్యటనలు: 55వ ఇఫీ ప్రారంభ వేడుకలకు హాజరవడంతో పాటు, భారతదేశంలోని ప్రముఖ సినీ మార్కెట్ ప్లేస్ ఫిల్మ్ బజార్‌ను సందర్శిస్తారు. ఈ నెల 24న, ఫిల్మ్ బజార్‌లో చేపట్టే సందర్శన ద్వారా సినిమా వ్యాపారం గురించి లోతైన అవవగాహన ఏర్పడుతుంది. ఈ వేడుకల్లో వివిధ చలనచిత్రాలను ప్రదర్శిస్తారు.
ముగింపు:
యువ కళాకారులు, చిత్రదర్శకులు, రూపకర్తల ప్రతిభను, ఆశయాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా సీఎంవోటీ నాలుగో ఎడిషన్ దాని ప్రతిష్ఠను కొనసాగిస్తుంది. భారతీయ, అంతర్జాతీయ సినిమాల్లోని ప్రముఖ దిగ్గజాల నుంచి మెలకువలు నేర్చుకొనే అపూర్వమైన అవకాశాలను అందించడం ద్వారా, వారి నైపుణ్యాలను పెంచి, వారి పరిధిని విస్తరించి, అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమతో దీర్ఘకాలిక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్యక్రమం వారి సామర్థ్యాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా, తమ కలలను సంచలనాత్మక విజయాలుగా మార్చేందుకు అవసరమైన నైపుణ్యాలు, మార్గదర్శకత్వం అందించి వారిని సన్నద్ధం చేస్తుంది, ప్రపంచ స్థాయిలో కథలు చెప్పే భవిష్యత్తును రూపొందిస్తుంది.
***
(Release ID: 2074141)
Visitor Counter : 17
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Konkani
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam