సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆస్కార్ పురస్కారాల షార్ట్ ఫిల్మ్ విభాగానికి ఎంపికైన ఎఫ్టీఐఐ విద్యార్థి సినిమా- “సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో”


97వ అకాడమీ అవార్డుల బరిలో కేన్స్ పురస్కారం దక్కించుకున్న ఎఫ్టీటీఐ స్టూడెంట్ ఫిలిం

Posted On: 04 NOV 2024 5:55PM by PIB Hyderabad

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థి దర్శకత్వం వహించిన “సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో” సినిమా... 2025 ఆస్కార్ పురస్కారాల ‘లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ విభాగానికి ఎంపికయ్యింది. 

ఎఫ్టీఐఐ విద్యార్థి చిదానంద ఎస్ నాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ ఏడాది మొదట్లో జరిగిన కేన్స్ చిత్రోత్సవ విద్యార్థి విభాగంలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ జానపద గాథలూ, సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ కన్నడ సినిమా.. కేన్స్ పురస్కారాన్ని గెలుపొందడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

చిదానంద ఎస్ నాయక్ ఎఫ్టీఐఐ విద్యార్థిగా ఉన్న సమయంలో దర్శకత్వం వహించిన “సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ టు నో” కి, సూరజ్ ఠాకూర్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ వీ (ఎడిటర్), అభిషేక్ కదమ్ (సౌండ్ డిజైన్) తమ నైపుణ్యాలను జోడించారు. ఇక కథ విషయానికి వస్తే, ఊర్లోని కోడిపుంజుని ఒక ముసలవ్వ దొంగిలించడంతో ఊరిని చీకటి కమ్మేస్తుంది. సూర్యకాంతి దక్కని పరిస్థితి గ్రామంలో రేపిన అలజడిని విషాదం నేపథ్యంలో అత్యంత ప్రతిభావంతంగా చూపుతుందీ చిత్రం. తిరిగి మామూలు పరిస్థితులను రప్పించేందుకు భవిష్యవాణి సహాయాన్ని తీసుకుంటారు గ్రామస్తులు. జోస్యం వల్ల గ్రామ బహిష్కరణకు గురైన ముసలవ్వ కుటుంబ సభ్యులు కోడిపుంజుని వెతికి అప్పజెప్పేందుకు అనేక పాట్లు పడతారు. చిత్రాన్ని వీక్షించిన విద్యార్ధి విభాగం జ్యూరీ సభ్యులు దర్శకుడి ప్రతిభను ప్రశంసిస్తూ “చిమ్మచీకట్లో సైతం చిదానంద్ ఎస్ నాయక్ దర్శకత్వ ప్రతిభ వెలుగులీనింది. మిరుమిట్లు గొలిపే కథన శైలిలో హాస్యాన్నీ, నైపుణ్యాన్నీ రంగరించినందుకు సన్ ఫ్లవర్స్ ర్ ద ఫస్ట్ టు నో’ సినిమాకు మొదటి బహుమతిని అందిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

దర్శకుడు చిదానంద్ ఎస్ నాయక్ స్పందిస్తూ, “ఈ కథను చెప్పాలని ఎంతో కాలం ఉవ్విళ్లూరాను. ఎప్పుడో విన్న కథను మామూలుగా చెప్పడం కాక, విన్న తొలిసారి మాకు కలిగిన అద్భుతమైన అనుభూతి ప్రేక్షకులకు చేరాలని ఆశించాం. మా ఈ ప్రయత్నం ప్రపంచ ప్రేక్షకులకు అద్వితీయమైన అనుభవంగా మిగలగలదని ఆశిస్తున్నాం” అని అన్నారు.

మొత్తంగా రాత్రి పూట మాత్రమే చిత్రీకరించిన ఈ సినిమా.. ప్రేక్షకులను భారతీయ జీవన విధానంలో లీనం చేస్తూ, వారికి విలక్షణమైన భారతదేశ సంస్కృతినీ వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. సాంప్రదాయిక కథన పద్ధతుల ద్వారా చెప్పిన కథలో.. గ్రామీణ ప్రాంతాల రమణీయతను, కథలతో ప్రజలకున్న బలమైన అనుబంధాన్నీ దర్శకుడు  దృశ్యమానం చేసిన విధానం అనేకుల మెప్పు పొందింది. ‘బెంగళూరు అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం’ లో బెస్ట్ ఇండియన్ కాంపిటీషన్ అవార్డు’ దక్కించుకున్న ‘సన్ ఫ్లవర్స్..’ సినిమా, అనేక ఇతర చిత్రోత్సవాల్లో గుర్తింపు పొందుతూ, ప్రపంచ అత్యుత్తమ లఘు చిత్రాలతో పోటీ పడుతోంది. ఇక పోటీలో గెలుపొందేందుకు, ప్రత్యేక ప్రదర్శనలు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా అటు ఆస్కార్ అకాడమీ సభ్యులకే కాక, ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ కథా సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తారు. సినిమాకు దక్కుతున్న ప్రశంసల మాట అటుంచితే, ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించే భారతీయ సంస్కృతి, ప్రభావవంతమైన కథా సంప్రదాయాల్లోని విశ్వజనీనతను ఎత్తి చూపడంలో  సన్ ఫ్లవర్స్ చిత్రం తనదైన ముద్ర వేస్తోంది.

 

 

***


(Release ID: 2070769) Visitor Counter : 31