రాష్ట్రపతి సచివాలయం
భారత వైమానిక రంగానికి చెందిన మహిళా విజేతలతో ముచ్చటించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Posted On:
04 NOV 2024 1:36PM by PIB Hyderabad
ఈ రోజు (నవంబర్ 4న) రాష్ట్రపతి భవన్ లో “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమంలో భాగంగా భారత వైమానిక రంగానికి చెందిన మహిళా విజేతల బృందంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముచ్చటించారు. పౌరులను నేరుగా కలుసుకుని, జాతి పురోభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ... వైమానిక రంగ నిర్వహణ, సాంకేతిక విభాగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు - ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విధుల్లో 15 శాతం, ఫ్లైట్ డిస్పాచర్లుగా 11 శాతం, ఏరోస్పేస్ ఇంజనీర్లుగా 9 శాతం మంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని శ్రీమతి ముర్ము తెలిపారు. గత సంవత్సరం 18 శాతం మంది మహిళలు కమర్షియల్ పైలట్లుగా లైసెన్సులు సాధించారని అన్నారు. సృజనాత్మకంగా ఆలోచిస్తూ, కొత్త పంథాను ఎంచుకున్న మహిళలకు రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వైమానిక రంగంలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తోందని, ఈనాడు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారని రాష్ట్రపతి తెలిపారు. వైమానిక రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం సహా, వారి పురోగతికి అవసరమైన సమాన అవకాశాలను కల్పించడం ఎంతో అవసరమని శ్రీమతి ముర్ము అన్నారు.
మహిళలు ముందంజ వేసేందుకు విద్య, శిక్షణావకాశాలు సహా, కుటుంబ సహకారం తప్పనిసరి అనీ, సరిగ్గా ఇటువంటి సహకారం లేనందువల్లే అనేకమంది మహిళలు ఉన్నత విద్యావంతులైనప్పటికీ తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్నారనీ శ్రీమతి ముర్ము అభిప్రాయపడ్డారు. వృత్తిలో విజయం సాధించిన మహిళలు, తోటి స్త్రీలకు మార్గనిర్దేశం చేస్తూ, వారు కూడా తమ కలల్ని సాకారం చేసుకునేలా ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు.
***
(Release ID: 2070604)