ప్రధాన మంత్రి కార్యాలయం
ఏఐఐఏలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి అనువాదం
Posted On:
29 OCT 2024 5:28PM by PIB Hyderabad
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రివర్గ సహచరులు, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, మన్సుఖ్ మాండవీయ, ప్రతాప్ రావ్ జాదవ్, శ్రీమతి అనుప్రియా పటేల్, శోభా కరంద్లాజే, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తోన్న శ్రీ రామ్‌వీర్ సింగ్ బిధూరీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, గౌరవ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆయుర్వేదాన్ని, ఆయుష్‌ను ప్రాక్టీస్ చేస్తున్నవారు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికి, అఖిల భారత ఆయుర్వేద సంస్థకు చెందిన వైద్యులు, ఇతర సిబ్బందికి, సోదరసోదరీమణులారా!
దేశం మొత్తం ధంతేరాస్ పర్వదినాన్నీ, ధన్వంతరి భగవానుని జయంతినీ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ గృహాల కోసం ఏదో ఒక కొత్త వస్తువు కొంటారు. ముఖ్యంగా వ్యాపార సమూహాలకు లాభం చేకూరాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. మనం ఎన్నో దీపావళి పండుగలు జరుపుకున్నాం. కానీ ఈ ఏడాది జరుపుకునే దీపావళి చాలా ప్రత్యేకం. ఎన్నో దీపావళిలు చూసి మా తలలు నెరిసిపోయాయని, ఈ చరిత్రాత్మక దీపావళిని మోదీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. 500 ఏళ్ల తర్వాత లభించిన అవకాశమిది. అయోధ్యలోని రామ్ లల్లా జన్మస్థలంలో నిర్మించిన మందిరంలో వేలాది దీపాలు వెలిగించి అద్భుతమైన రీతిలో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. మన రాముడు తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భంగా జరుపుకుంటున్న దీపావళి ఇది. దీని కోసం14 ఏళ్లు కాదు 500 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.
స్నేహితులారా,
ధంతేరాస్ పర్వదినాన ఐశ్వర్యం, ఆరోగ్యాలను ఉత్సవంగా జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇది భారత సంస్కృతిలోని జీవనతత్వానికి సూచిక. ‘ఆరోగ్యం పరమం భాగ్యం’ అని మన రుషులు అన్నారు. ఆరోగ్యమే గొప్ప అదృష్టం, సంపద అని దాని అర్థం. క్లుప్తంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారు. ఈ ప్రాచీన భావన ఇప్పుడు ఆయుర్వేద దినోత్సవ రూపంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాదాపుగా 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం మనం గర్వించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం! తన ప్రాచీన అనుభవాలతో సరికొత్త భారత్ ఈ ప్రపంచానికి ఎలా సహాయపడనుందో ఇది తెలియజేస్తుంది.
మిత్రులారా,
గడచిన పదేళ్లలో, ఆయుర్వేద పరిజ్ఞానాన్ని, ఆధునిక వైద్యంతో మేళవించడం ద్వారా దేశ ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయాన్ని రూపొందించాం. అఖిల భారత ఆయుర్వేద సంస్థ దీనికి ప్రధాన కేంద్రంగా మారింది. ఏడేళ్ల క్రితం, ఇదే రోజు ఈ సంస్థ మొదటి దశను జాతికి అంకితం చేసే అపూర్వ అవకాశం నాకు దక్కింది. ధన్వంతరి జయంతి సందర్భంగా రెండో దశను సైతం ప్రారంభించడాన్ని అదృష్టంగా పరిగణిస్తున్నాను. ఇక్కడ ఆధునిక టెక్నాలజీతో, ప్రాచీన ఆయుర్వేద పంచకర్మ విధానాలను మేళవించి చికిత్సను అందిస్తారు. ఆయుర్వేదం, వైద్యశాస్త్రాల్లో అధునాతన పరిశోధనలు సైతం ఇక్కడ జరుగుతాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
దేశ ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి, అయిదు ప్రధానాంశాలతో ఆరోగ్యవిధానాన్ని తీసుకొచ్చింది. మొదటిది ప్రివెంటివ్ హెల్త్ కేర్, అంటే వ్యాధుల బారిన పడక ముందే నివారించడం. రెండోది సకాలంలో వ్యాధి నిర్దారణ చేయడం. మూడోది ఉచితమైన, సరసమైన ధరల్లో వైద్యం, అందుబాటు ధరల్లో ఔషధాలు ఉంచడం. నాలుగోది చిన్న పట్టణాల్లో నాణ్యమైన చికిత్స, డాక్టర్ల కొరతను తగ్గించడం. అయిదవది ఆరోగ్య రంగంలో సాంకేతికతను విస్తరించడం. ప్రస్తుత కాలంలో ఈ రంగాన్ని సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోణంలో భారత్ వీక్షిస్తోంది. ఈ అయిదు ప్రధాన విధానాలను ఈ రోజు చేపట్టిన కార్యక్రమం తెలియజేస్తోంది. ఈరోజు 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. ఆయుర్ స్వాస్థ్య యోజన ద్వారా నాలుగు ఎక్సలెన్స్ కేంద్రాలు, డ్రోన్ల ద్వారా ఆరోగ్య సేవల విస్తరణ, రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో హెలికాప్టర్ సేవలు, ఢిల్లీ, బిలాస్ పూర్‌లోని ఎయిమ్స్‌ల్లో నూతన మౌలిక సదుపాయాల కల్పన, మరో అయిదు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో సేవల విస్తరణ, వైద్య కళాశాలల ఏర్పాటు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన, దేశంలో ఆరోగ్య సేవల్లో మార్పులకు నాంది పలికే కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించాం. వీటిలోని చాలా ఆసుపత్రులను కార్మిక సోదరులు, సోదరీమణులకు అవసరమైన చికిత్స అందించేందుకే ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాను. కార్మికులకు సేవా కేంద్రాలుగా ఈ ఆసుపత్రులు పనిచేస్తాయి. ఈ రోజు ప్రారంభించిన ఫార్మా యూనిట్లు దేశంలోని అధునాతనమైన ఔషధాలు, అత్యంత నాణ్యమైన స్టెంట్లు, ఇంప్లాట్లను అందిస్తాయి. ఇవి భారత ఫార్మా రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
స్నేహితులారా,
మనలో చాలామంది అనారోగ్యాన్ని అశనిపాతంలా భావించే కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చాం. పేదల ఇళ్లలో ఎవరికైనా అనారోగ్యం ఎదురైతే అది కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. చికిత్స కోసం తమ ఇళ్లు, భూములు, నగలు అమ్ముకోవాల్సిన రోజులుండేవి. చికిత్సయ్యే ఖర్చు గురించి వింటేనే పేదవాడి గుండె వణికిపోతుంది. తమ వైద్యం కోసం ఖర్చుపెట్టాలా? లేదా మనవళ్ల చదువు కోసం డబ్బు వెచ్చించాలా? అని వయోధికురాలైన తల్లులు తల్లడిల్లుతారు. అదే తండ్రులైతే తన ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలా? లేదా ఇంటి బాధ్యతలను నిర్వర్తించాలా? అని ఆలోచిస్తారు. చివరికి వారు ఒకే ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. అదే బాధలను నిశ్శబ్దంగా భరించడం, మరణం కోసం మౌనంగా వేచి ఉండటం. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయత పేదలను కుదిపేసింది.
ఇలాంటి నిస్సహాయతలో ఉన్న నా పేద సోదర సోదరీమణులను చూసి నేను భరించలేకపోయాను. ఈ బాధల నుంచి నా తోటి ప్రజలకు ఉపశమనం కల్పించడానికే ఆయుష్మాన్ భారత్ పథకం పుట్టింది. పేదల వైద్యం నిమిత్తం రూ. 5 లక్షల వరకు అయ్యే ఆసుపత్రి ఖర్చులను భరించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇప్పటి వరకు నాలుగు కోట్ల వరకు పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం నాకు సంతృప్తినిస్తోంది. వారిలో కొందరు వివిధ రకాల వ్యాధులతో అనేక పర్యాయాలు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స పొందారు. ఆయుష్మాన్ పథకం లేకపోతే వీరంతా దాదాపుగా రూ. 1.25 లక్షల కోట్లు తమ సొంత డబ్బులు వైద్య సేవలకు ఖర్చు చేయాల్సి వచ్చేది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులను నేను తరచూ కలుసుకుంటూ ఉంటాను. వారి బాధలు, ఆనందాలను, అనుభవాలను వింటాను. ఆ సమయంలో వారి కళ్ల నుంచి జాలువారే ఆనందభాష్పాలు ఆయుష్మాన్ పథకంతో అనుబంధంగా పనిచేసే ప్రతి వైద్యుడు, పారామెడికల్ సిబ్బందికి ఆశీర్వాదాలే. ఇంతకంటే గొప్ప వరం మరొకటి ఉండదు.
నన్ను నమ్మండి! ఇలాంటి కఠిన సమయాల్లో ప్రజలకు బాసటగా నిలిచే పథకాన్ని గతంలో ఎన్నడూ రూపొందించలేదు. ప్రస్తుతం ఆయుష్మాన్ పథకం అందిస్తున్న సేవలను విస్తరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి వయోధికుడు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానిగా నా మూడో పర్యాయంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పథకంలో చేరుస్తానని ఎన్నికల సమయంలో వాగ్ధానమిచ్చాను. ఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా ఆ హామీని నెరవేరుస్తున్నాను. ఇఫ్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. వీరందరికీ ఆయుష్మాన్ వయో వందన కార్డులను అందజేస్తారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వీలైనంత త్వరగా ఈ కార్డులు అందించాలనేది మా ప్రభుత్వ ప్రయత్నం. ఆదాయ పరిమితులేమీ లేకుండా, పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు.
వయోధికులు ఎలాంటి చింతలూ లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని హుందాగా గడపాలి. దాన్ని సాధించడంలో ఈ పథకం కీలకంగా వ్యవహరిస్తుంది. ఆయుష్మాన్ వయో వందన కార్డు ద్వారా చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు తగ్గుతాయి. చింతలు తీరుతాయి. ఈ పథకం లబ్ధి పొందే 70 ఏళ్ల దాటిన వారందరిని గౌరవిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో సాయం చేయలేకపోతున్నందుకు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వృద్ధులను క్షమాపణలు కోరుతున్నాను. మీ ఇబ్బందులు నాకు తెలుస్తున్నాయి. కానీ నేను మీకు ఏవిధమైన సాయం చేయలేను. రాజకీయ స్వలాభం కోసం ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం కాకపోవడమే దీనికి కారణం. తమ సొంత రాష్ట్రాల్లోని రోగులను బాధించే ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులను నేను క్షమాపణలు కోరుతున్నాను. నా తోటి ప్రజలందరికీ నేను సేవ చేయగలుగుతున్నాను కానీ, రాజకీయ ప్రయోజనాల గోడలు ఈ రెండు రాష్ట్రాల్లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అడ్డుకుంటున్నాయి. ఇది రాజకీయ సమస్య కానే కాదు. నేను ప్రస్తుతం ప్రసంగిస్తున్నా, ఢిల్లీలోని వృద్ధులు ఈ మాటను ప్రత్యక్షంగా వింటూ ఉండటం నాకు వేదన కలిగిస్తోంది. ఆ బాధ లోతును నేను మాటల్లో చెప్పలేను.
మిత్రులారా,
పేదవారైనా, మధ్యతరగతి వారైనా, ప్రతి ఒక్కరి చికిత్సకయ్యే ఖర్చును తగ్గించాలనేదే మా ప్రభుత్వ ప్రాధాన్యం. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 పీఎం జనఔషధి కేంద్రాలు ప్రభుత్వ పనితీరుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో మందులు 80 శాతం రాయితీపై లభిస్తాయి. ఈ జన్ ఔషధి కేంద్రాలు లేకుంటే పేద, మధ్యతరగతి ప్రజలు తమకు అవసరమైన ఔషధాల కోసం అదనం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చి ఉండేది. ఈ కేంద్రాల ద్వారా 80 శాతం రాయితీపై మందులు పొందడంతో ఆ మొత్తాన్ని ఆదా చేసుకోగలిగారు.
మనం స్టెంట్లు, మోకాలి ఇంప్లాట్లను చాలా తక్కువ ధరలోనే తయారు చేయగలిగాం. మనం ఈ తరహా నిర్ణయాలు తీసుకోకపోతే, ఈ ఆపరేషన్లు చేయించుకున్న వారు అదనంగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. మేం చేసిన కృషి ఫలితంగా ఆ మొత్తాన్ని ఆదా చేయగలిగాం. ఉచిత డయాలసిస్ పథకం వల్ల లక్షలాది మంది రోగులకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్రాణాంతక వ్యాధుల నివారణకు మా ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది గర్భిణీలు, నవజాత శిశువుల ప్రాణాలను రక్షించి, తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా వారిని కాపాడుతుంది. నా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన చికిత్సల భారం నుంచి ఉపశమనం పొందేలా అవసరమైన చర్యలు తీసుకుంటాను. ఈ దిశగానే దేశం ముందుకు సాగుతోంది.
స్నేహితులారా,
అనారోగ్యం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, నష్టాలను తగ్గించడానికి సకాలంలో రోగ నిర్ధారణ చేయడం అవసరమని మీకు తెలుసు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వారికి సత్వర వైద్య పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉండాలి. దీని కోసమే దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా కోట్లాది మంది ప్రజలు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను సులభంగా చేయించుకుంటున్నారు. తద్వారా సమయానికి చికిత్స లభించడంతో పాటు, ప్రజల సొమ్ము ఆదా అవుతుంది.
ఆరోగ్య రంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం ద్వారా మా ప్రభుత్వం పౌరుల డబ్బును ఆదా చేస్తోంది. ఈ సంజీవని పథకం ద్వారా 30 కోట్ల మంది ప్రజలు, ప్రముఖ వైద్యులను ఆన్ లైన్ సేవల ద్వారా సంప్రదించారు. ఇది తక్కువ సంఖ్యేమీ కాదు. వైద్యుల నుంచి ఉచితమైన, కచ్చితమైన సేవలను పొందడం ద్వారా వారికి చాలా ధనం ఆదా అయింది. ఈ రోజు, మేం యు-విన్ సేవలను కూడా ప్రారంభించాం. దీని ద్వారా భారత్ అధునాతమైన సాంకేతిక వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకుంటుంది. కొవిడ్ - 19 మహమ్మారి సమయంలో కొ-విన్ ప్లాట్‌ఫాం విజయాన్ని ప్రపంచమంతా వీక్షించింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ కూడా ప్రపంచ గాథగా మారింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ద్వారా ఆరోగ్యరంగంలో అదే విజయాన్ని భారత్ ఇప్పుడు పునరావృతం చేస్తోంది.
మిత్రులారా,
గడచిన పదేళ్లలో ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధి స్వాతంత్ర్యం సిద్ధించిన 6-7 దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్మించిన ఆసుపత్రులను ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారానే ప్రారంభిస్తున్నాం. కర్ణాటకలోని నర్సాపూర్, బొమ్మసంద్ర, మధ్యప్రదేశ్‌లోని పీఠంపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం, హర్యానాలోని ఫరీదాబాద్‌లో నిర్మించిన నూతన వైద్య కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొత్త ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇండోర్‌లో ఒక ఆసుపత్రి ప్రారంభమైంది. విస్తరిస్తున్న ఆసుపత్రులు మెడికల్ సీట్ల సంఖ్యలో పెరుగుదలను సూచిస్తున్నాయి.
డాక్టర్ కావాలన్న పేదవాడి కల చెదిరిపోకూడదని నేను కోరుకుంటున్నాను. ఏ యువకుడి కల కల్లలు కాకుండా చూడడంలోనే ప్రభుత్వ విజయం దాగి ఉందని నమ్ముతున్నాను. కలలకు శక్తి ఉంటుంది. కొన్నిసార్లు అవి మనలో స్ఫూర్తి నింపుతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యతరగతికి చెందినవారు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా ఆగిపోకూడదని నేను భావిస్తాను. అందుకే గత పదేళ్లుగా భారత్‌లో మెడికల్ సీట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. గత దశాబ్దంలో, దాదాపు లక్ష వరకు ఎంబీబీఎస్, ఎండీ సీట్లు పెరిగాయి. వచ్చే అయిదేళ్లలో వైద్య రంగంలో మరో 75,000 సీట్లను పెంచుతామని ఈ ఏడాది ఎర్రకోట నుంచి ప్రకటించాను. తద్వారా గ్రామాల్లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య ఎంత పెరుగుతుందో ఒక్కసారి ఊహించండి.
స్నేహితులారా,
మన దేశంలో సుమారుగా 7,50,000కు పైగా ఆయుష్ వైద్య విధానాన్ని ప్రాక్టీసు చేస్తున్నవారు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టే కసరత్తు జరుగుతోంది. వైద్యం, ఆరోగ్య పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా భారత్‌ను ప్రపంచం చూస్తోంది. యోగా, పంచకర్మ, ధ్యానం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశానికి వస్తున్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మన యువత, ఆయుష్ విధానాన్ని సాధన చేస్తున్నవారు దీనికి సిద్ధం కావాలి. ప్రివెంటివ్ కార్డియాలజీ, ఆయుర్వేద ఆర్థోపెడిక్స్, ఆయుర్వేద స్పోర్ట్స్ మెడిసిన్, ఆయుర్వేద పునరావాస కేంద్రాలు- ఇలా అనేక విభాగాల్లో ఆయుష్‌ను సాధన చేసేవారికి భారత్‌తో పాటు విదేశాల్లోనూ అపారమైన అవకాశాలున్నాయి. మన దేశ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే కాకుండా మానవాళికి గణనీయమైన సేవలు అందిస్తుంది.
స్నేహితులారా,
21 వ శతాబ్ధంలో వైద్య రంగం అపూర్వమైన పురోగతి సాధించింది. ఒకప్పుడు నయం కావని భావించిన రోగాలకు ఇప్పుడు చికిత్స అందుబాటులో ఉంది. ఆరోగ్య రక్షణ విషయంలో, భారత్‌కు వేల సంవత్సరాల అనుభవం ఉంది. ఆధునికశాస్త్రం ద్వారా మన ప్రాచీన జ్ఞానాన్ని ధ్రువీకరించాల్సిన సమయం ఇది. అందుకే నేను సాక్ష్యం ఆధారిత ఆయుర్వేదం గురించి పదే పదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను. వ్యక్తుల అవసరానికి తగినట్టుగా చికిత్సా పద్ధతులను అందించగల విస్తృత పరిజ్ఞానం ఆయుర్వేదానికి ఉంది. అయినప్పటికీ, ఈ రంగంలో ఆధునిక శాస్త్రీయ దృక్పథానికి తగినట్టుగా నిర్థిష్టమైన పని ఇంకా జరగడం లేదు. ఈ దిశగా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మన దేశం ప్రారంభిస్తోందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. అదే ‘ప్రకృతి పరీక్షా అభియాన్’ (ప్రకృతి పరీక్ష కార్యక్రమం)! ఎందుకంటే ఆయుర్వేదం వల్ల రోగి కోలుకుంటున్నప్పటికీ, దానికి తగిన ఆధారాలు ఇవ్వలేని పరిస్థితులను మనం చూస్తుంటాం. ఆరోగ్యాన్ని రక్షించే మూలికలు ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికి మాకు ఫలితాలు, సాక్ష్యాలు రెండూ అవసరమే. ఈ కార్యక్రమం ద్వారా, ఆయుర్వేద సూత్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి తగిన ఆదర్శవంతమైన జీవనశైలిని రూపొందించవచ్చు. వ్యాధులు రావడానికి ముందే ప్రమాద విశ్లేషణ చేయవచ్చు. ఈ దిశలో సాధిస్తున్న సానుకూల పురోగతి మన ఆరోగ్య రంగాన్ని పూర్తిగా పునర్నిర్వచించగలదని నేను విశ్వసిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణలో ఈ నూతన దృక్పథాన్ని ప్రనపంచానికి మనం అందించగలం.
స్నేహితులారా,
ప్రతి అంశానికి ప్రయోగ ఆధారిత నిర్ధారణ ఉండటమే ఆధునిక వైద్య శాస్త్ర విజయానికి ప్రధాన కారణం. మన సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సైతం ఈ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. అశ్వగంధ, పసుపు, మిరియాలు - తదితర మూలికలను మనం తరతరాలుగా వివిధ రకాల చికిత్సల కోసం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు, అత్యంత ప్రభావశీల అధ్యయనాలు వాటి ఉపయోగాలను రుజువు చేస్తున్నాయి. ఫలితంగా, అంతర్జాతీయంగా అశ్వగంధ లాంటి మూలికలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ దశాబ్దం చివరి నాటికి, అశ్వగంధ సారం మార్కెట్ దాదాపు 2.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రయోగ నిర్ధారణ ద్వారా ఈ మూలికల విలువను మనం ఎంత మేర పెంచగలమో మీరు ఊహించవచ్చు! విస్తారమైన మార్కెట్‌ను సృష్టించవచ్చు.!
కాబట్టి మిత్రులారా,
ఆయుష్ విజయాలు ఆరోగ్య రంగానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ క్షేమానికి చేపడుతున్న చర్యలకు తోడ్పాటునిస్తూనే భారత్ లో నూతన అవకాశాలను సైతం కల్పిస్తోంది. రానున్న పదేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా ఆయుష్ మారనుంది. ఆయుష్ కు చెందిన తయారీ రంగం విలువ 2014లో 3 బిలియన్ల డాలర్లు ఉంటే, ఇప్పుడు అది 24 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే పదేళ్లలో 8 రెట్లు వృద్ధిని సాధించింది. అందుకే దేశంలోని యువత ఆయుష్ అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 900కి పైగా ఆయుష్ అంకుర సంస్థలు ఉన్నాయి. ఇవి సంప్రదాయ ఉత్పత్తులు, టెక్నాలజీ సాయంతో నడిచే ఉత్పత్తులు, సేవలపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు భారత్ 150 దేశాలకు బిలియన్ డాలర్ల విలువైన ఆయుష్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇది ప్రత్యక్షంగా మన రైతులకు మేలు చేస్తుంది. ఒకప్పుడు స్థానిక మార్కెట్లకే పరిమితమైన మూలికలు, సూపర్ ఫుడ్స్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ కు చేరుతున్నాయి.
స్నేహితులారా,
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రైతులకు అందే ప్రయోజనాలను పెంచేందుకు ప్రభుత్వం మూలికల సాగును ప్రోత్సహిస్తోంది. నమామి గంగే ప్రాజెక్టు ద్వారా గంగా నది ఒడ్డున ప్రకృతి వ్యవసాయం, మూలికల సాగును ప్రోత్సహిస్తున్నాం.
మిత్రులారా,
మన జాతీయ స్వభావం, సామాజిక స్వరూప సారాంశాన్ని ‘సర్వే భవంతు సుఖినం, సర్వే సంతు నిరామయం’ నుంచి స్వీకరించారు. అందరూ సంతోషంగా ఉండాలి, అనారోగ్యం నుంచి విముక్తి పొందాలి అని దీని అర్థం. గత పదేళ్లలో, 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే మంత్రాన్ని అనుసరించడం ద్వారా ఈ భావనను దేశం అనుసరిస్తున్న విధానాలకు అనుసంధానించాం. రాబోయే 25 ఏళ్లలో, ఆరోగ్య రంగంలో మేం చేస్తున్న ప్రయత్నాలు 'వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)కు బలమైన పునాది వేస్తాయి. ధన్వంతరి భగవంతుని ఆశీస్సులతో మనం ‘నిరామయ్ భారత్’ (ఆరోగ్యకరమైన భారతదేశం)తో పాటు ‘వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.
స్నేహితులారా,
మనదేశానికి వారసత్వ సంపద అయిన ఆయుర్వేద గ్రంథాలను సంరక్షించేందుకు విశేష కృషి చేస్తున్నాం. ఇవి వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ సంపదను భద్రపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పనిచేస్తోంది. ఇవన్నీ రాళ్లపై, రాగి పలకలపై లేదా రాత ప్రతుల రూపంలో ఉండవచ్చు. వాటన్నింటినీ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కృత్రిమ మేధ యుగంలో వాటిని టెక్నాలజీతో అనుసంధానించి, వాటిలోని కొత్త విషయాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా గొప్ప ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం.
స్నేహితులారా
మరోసారి ఈ దేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
***
(Release ID: 2069717)
Visitor Counter : 6