సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
త్వరపడండి! దేశంలోని వర్ధమాన విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్) కళాకారులకు ఇదొక సువర్ణావకాశం
దేశీయ ప్రతిభకు ప్రోత్సాహంతోపాటు ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమ పురోగతిలో భాగంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ-‘ఎబిఎఐ’ల ఆధ్వర్యాన ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ వేవ్స్ విఎఫ్ఎక్స్’ ఛాలెంజ్ ప్రారంభం
భారతీయ యానిమేషన్.. విజువల్ ఎఫెక్ట్స్.. గేమింగ్.. కామిక్స్ రంగంలో
అవకాశాల అన్వేషణలోగల యువ కళాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం
అగ్రస్థానంలో నిలిచిన వారికి ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు
నిర్వహించే ‘వేవ్స్ సమ్మిట్’ సందర్భంగా ‘తుది సంగ్రామం’లో పోటీపడే అవకాశం
Posted On:
29 OCT 2024 8:35PM by PIB Hyderabad
మీలో సృజనాత్మకత ఉందా... ఆకట్టుకునేలా కథ చెప్పగలరా! ‘‘డైలీ లైఫ్ సూపర్ హీరో’’ ఇతివృత్తానికి 30 సెకన్ల ‘విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్) క్లిప్’తో జీవం పోయగల సామర్థ్యం ఉందా? అయితే, ఆకర్షణీయ బహుమతులతోపాటు రూ.5 లక్షల విలువైన వస్తువులు, ప్రత్యేక స్టూడియో ఇంటర్న్ షిప్ వంటివి గెలుచుకోండి. అంతేగాక వృత్తి నిపుణులుగా ఎదిగే అవకాశం మీకు దక్కుతుంది. ఇందులో భాగంగా తగిన శిక్షణ ఇవ్వడంతోపాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అంతర్జాతీయ ‘ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’లో నిపుణుల సమక్షాన మీ సృజనాత్మక ప్రతిభా ప్రదర్శనకు వీలు కల్పిస్తారు. దేశంలో ‘విఎఫ్ఎక్స్’ రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025’ (వేవ్స్) నేపథ్యంలో దేశంలోని ప్రసిద్ధ ‘ఎవిజిసి’ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) సంస్థ ‘ఎబిఎఐ’తో సంయుక్తంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ వేవ్స్ విఎఫ్ఎక్స్ ఛాలెంజ్ పేరిట పోటీ నిర్వహిస్తోంది. సృజనాత్మక వికాసంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణానికి అనుగుణంగా దేశీయ ప్రతిభకు సానబెట్టడంతోపాటు సారాంశ (కంటెంట్) సృష్టికి సకల సౌకర్యాల నిలయం (ఒన్-స్టాప్ డెస్టినేషన్)గా భారత్‌ను అగ్రస్థానంలో నిలపడం దీని లక్ష్యం.
ఉద్యమ భాగస్వాములు కండి: ఈ రోజే పేరు నమోదు చేసుకోండి!
దేశవ్యాప్తంగాగల వర్ధమాన విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్) కళాకారులు ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ వేవ్స్ విఎఫ్ఎక్స్ ఛాలెంజ్’లో భాగస్వాములు కావచ్చు. తద్వారా నేడు వేగంగా దూసుకెళ్తున్న ‘విఎఫ్ఎక్స్’ పరిశ్రమలో గుర్తింపు పొందగలుగుతారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం www.wafx.abai.avgc.in ను చూడండి. ఈ పోటీ మీ ప్రతిభానైపుణ్యాల ప్రదర్శనకు ఓ అవకాశంగా మాత్రమేగాక వృత్తిపరంగా ఎదగడంలో ఒక మెట్టుగానూ ఉపయోగపడుతుంది. దేశంలోని అగ్రశ్రేణి ‘విఎఫ్ఎక్స్’ స్టూడియోలు-మార్గదర్శకులతో కూడిన బలమైన వ్యవస్థలో చేరే అవకాశం కూడా లభిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం wafx@abai.avgc.in, generalsecretary@abai.avgc.in, www.wafx.abai.avgc.in లను చూడండి.
పోటీ స్వరూపం... బహుమతులు: మూడు దశలుగా ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్’
ఈ పోటీల తొలిదశ కింద ఆన్‌లైన్ అర్హత (క్వాలిఫయర్) దశలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ దశలో 2000 మందికిపైగా పోటీదారులు ఉంటారని అంచనా. వీరినుంచి ‘ప్రీ-సెలెక్షన్ జ్యూరీ’ రెండో దశకు 10 మంది విద్యార్థులను, మరో 10 మంది వృత్తి నిపుణులను ఎంపిక చేస్తుంది. వీరు జోనల్ స్థాయి వ్యక్తిగత పోటీలలో పాల్గొంటారు. ఈ దశలో విజేతలకు తుది సంగ్రామం (గ్రాండ్ ఫినాలే)లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది జాతీయ అవార్డు విజేతలైన ప్రసిద్ధ ‘విఎఫ్ఎక్స్’ సూపర్‌వైజర్లతో కూడిన ‘గ్రాండ్ జ్యూరీ’ సమక్షంలో 24 గంటల ‘విఎఫ్ఎక్స్’ మారథాన్ రూపంలో సాగుతుంది.
‘ఆన్‌లైన్ అర్హత దశ’లో భాగంగా ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్’ పోటీదారులు ‘‘డైలీ లైఫ్ సూపర్ హీరో’’ ఇతివృత్తానికి జీవం పోస్తూ 30 సెకన్ల నిడివితో ఒక ‘విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్) క్లిప్’ను రూపొందించి అప్‌లోడ్ చేయాలి. ఇందులో విజేతగా నిలిస్తే ఆకర్షణీయ బహుమతులతోపాటు రూ.5 లక్షల విలువైన వస్తువులు సహా ప్రత్యేక స్టూడియో ఇంటర్న్ షిప్ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇందులో అగ్రస్థానం సాధించినవారు చండీగఢ్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో నిర్వహించే జోనల్ స్థాయి ఫైనల్స్ దశకు చేరుకుంటారు. అనంతరం వీరు పరిశ్రమలోని ప్రసిద్ధ నిపుణుల సమక్షంలో తమ సృజనాత్మక కళాప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ దశలో అగ్రస్థానం సాధించిన పోటీదారులు 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఢిల్లీలో సాగే ‘వేవ్స్ సమ్మిట్’లో భాగంగా నిర్వహించే ‘తుది సంగ్రామం’లో తలపడతారు.
‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ ఛాలెంజ్’తో వర్ధమాన విఎఫ్ఎక్స్ కళాకారులకు
సాధికారత... ప్రపంచంలో భారత్ స్థానం మరింత బలోపేతం
భారత చలనచిత్ర-మీడియా పరిశ్రమ ‘విజువల్ ఎఫెక్ట్స్’ పరంగా అద్భుత ప్రగతి సాధించింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ అవసరాలు తీర్చగల ‘విఎఫ్ఎక్స్’ నిపుణులతో సరికొత్త తరాన్ని సృష్టించాలన్నది ప్రస్తుత జాతీయ పోటీల లక్ష్యం. అంతేగాక ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పోటీతత్వాన్ని, సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నది ధ్యేయం. ఆ మేరకు కర్ణాటకలోని ‘ఎవిజిసి-ఎక్స్ఆర్’ పరిశ్రమ సంబంధిత వాణిజ్య సంఘం ‘ఎబిఎఐ’ జాతీయ స్థాయిలో ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ ఛాలెంజ్’ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అత్యద్భుత ‘విఎఫ్ఎక్స్’ కళాఖండాలు సృష్టించాల్సిందిగా వర్ధమాన విజువల్ ఎఫెక్ట్స్ కళాకారులందరికీ పిలుపునిచ్చింది.
‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ వేవ్స్ విఎఫ్ఎక్స్’ ఛాలెంజ్:
ఉజ్వల భవిత దిశగా యువ ప్రతిభకు ఉత్తేజం
సృజనాత్మకత, ఉత్కంఠ భరిత కథాగమన రీతికి పెట్టింది పేరుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దీంతోపాటు ‘విఎఫ్ఎక్స్’ సామర్థ్యంలోనూ పురోగతిని సాధించినందువల్ల ప్రపంచ సినిమా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడుతోంది. ఈ రంగం ఎంతో పురోగమించినా డిమాండుకు తగిన సంఖ్యలో నిపుణులు లేకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ సుస్థిర వృద్ధికి ‘విఎఫ్ఎక్స్’లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కీలకంగా మారాయి. అందుకు అనుగుణంగా ‘ఎవిజిసి’ రంగంలో ఆకర్షణీయ అవకాశాల కల్పన దిశగా ప్రతిభాన్వేషణ ద్వారా యువతరం సామర్థ్యానికి పదునుపెట్టి, ప్రోత్సహించడం లక్ష్యంగా ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ వేవ్స్ విఎఫ్ఎక్స్ ఛాలెంజ్’ పేరిట ‘ఎబిఎఐ’ ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహిస్తోంది.
కొత్త నైపుణ్యాలతో భారత సృజనాత్మక పరిశ్రమ
ముందంజకు ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ ఛాలెంజ్’, ‘వేవ్స్’ తోడ్పాటు
ఈ రంగంలో ప్రగతిశీల మార్పుదిశగా వైతాళిక పాత్ర పోషించే ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్, ‘వేవ్స్’ ప్రాధాన్యం గురించి ‘ఎబిఎఐ’ ప్రెసిడెంట్, టెక్నికలర్ గ్రూప్ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బీరెన్ ఘోస్ తన ప్రసంగంలో వివరించారు. ‘‘ఈ సృజనాత్మక రంగంలో విశేష ప్రగతిశీల మార్పులు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికత, ఆకట్టుకునే సారాంశం తదితరాలు వీక్షకుల అనుభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి’’ అని అన్నారు. అలాగే ‘‘మనం ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో పాదం మోపిన నేపథ్యంలో కథాగమనం, భావనాత్మకత ప్రదర్శనకు టీవీలు, థియేటర్లకు మించి మ్యూజియంలు, విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు కూడా వేదికలుగా మారుతున్నాయి. ఈ పరిణామం ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు దేశీయంగానే కాకుండా భారత్ వెలుపల కూడా సారాంశ సృష్టిలో కొత్త నైపుణ్యాలు, విభిన్న ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. అందుకే ‘ఎవిజిసి-ఎక్స్ఆర్’ సంబంధిత ప్రతి అంశాన్నీ ప్రస్ఫుటం చేస్తూ, ముఖ్యంగా... దేశం నలుమూలల నుంచి వేలాది భారతీయుల దృష్టిని ఆకర్షించేలా ‘డబ్ల్యుఎఎఫ్ఎక్స్ ఛాలెంజ్’కి రూపమిచ్చాం. ప్రపంచ వేదికపై ‘వేవ్స్’ వేదికగా ‘తుది సంగ్రామం’ ద్వారా యువతరం ప్రతిభానైపుణ్య ప్రదర్శనకు ఇది తోడ్పడుతుంది’’ అని చెప్పారు.
***
(Release ID: 2069437)
Visitor Counter : 11