ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రపంచ విమాన ఉత్పత్తి రంగంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ కు గల హోదాను, వడోదర సీ-295 విమానాల తయారీ కేంద్రం చాటుతోందన్న ప్రధాని

“మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్” (ప్రపంచం కోసం భారత్ లో నిర్మాణం) అన్న ప్రధానమంత్రి

నవీన భారతదేశ నవీన కార్యశైలిని సీ-295 విమానాల తయారీ కేంద్రం ప్రతిబింబిస్తోందన్న శ్రీ మోదీ

భారతదేశ రక్షణ ఉత్పాదక వ్యవస్థ కొత్త శిఖరాలను అందుకుంటోందన్న ప్రధానమంత్రి

Posted On: 28 OCT 2024 11:37AM by PIB Hyderabad

గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)  ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను  స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, ఇది శ్రీ పెడ్రో శాంచెజ్ తొలి భారతీయ పర్యటన అని చెబుతూ, ఆయన రాక ఇరుదేశాల భాగస్వామ్యానికి కొత్త దారి చూపుతోందన్నారు. సీ-295 విమానాల తయారీ కోసం ఏర్పాటైన టాటా వైమానిక నిర్మాణ కేంద్రం ప్రారంభం, రెండు దేశాల బంధాన్ని బలపరచడమే కాక, ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ (ప్రపంచం కోసం భారత్ లో నిర్మాణం)  ఆశయానికి కూడా ఊతమిస్తుందన్నారు. ఎయిర్ బస్ బృందానికీ,  టాటా సంస్థలకూ శుభాకాంక్షలు తెలిపిన  శ్రీ మోదీ, ఇటీవల దివంగతులైన టాటా సంస్థల అధినేత శ్రీ రతన్ టాటా కు నివాళులర్పించారు.  

నవీన భారతదేశ నవీన కార్యశైలిని సీ-295 విమానాల తయారీ కేంద్రం ప్రతిబింబిస్తోందన్న శ్రీ మోదీ, కొత్తగా ప్రాణం పోసుకున్న ఏ  ఆలోచనైనా, ఎంత వేగంగా ఫలరూపం తీసుకోగలదో గమనించవచ్చని చెప్పారు. సీ-295 విమానాల తయారీ కేంద్రానికి అక్టోబర్ 2022 లో శంకుస్థాపన చేయగా, నేడు ఈ కేంద్రం విమానాల తయారీ కోసం సర్వ సన్నద్ధంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అమలులో  అనుకోని అవాంతరాలను అధిగమించేందుకు ప్రాధాన్యతను ఇస్తామన్న ప్రధాని, ఉదాహరణగా గుజరాత్ వడోదరలోని రైల్వే కోచ్ గురించి చెప్పారు.  గుజరాత్ వడోదరలో బొంబార్డియర్ రైల్వే కోచ్ ల ఉత్పత్తి కేంద్రన్ని ప్రారంభించామనీ, దాంతో రికార్డ్ సమయంలో ఉత్పాదన సాధ్యమైందని చెప్పారు. “ఇక్కడ తయారవుతున్న మెట్రో కోచ్ లు అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి” అని చెప్పారు. నేడు ప్రారంభించిన విమాన తయారీ కేంద్రం అతి త్వరలో ఎగుమతికి సిద్ధమవగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

లక్ష్యసాధన వైపు అడుగులు పడటం మొదలవగానే, మార్గం దానంతటదే సుగమమవడాన్ని గమనించవచ్చంటూ, ప్రముఖ స్పెయిన్ కవి  ఆంటోనియో మచాడో పలుకులని శ్రీ మోదీ స్మరించుకున్నారు.  పదేళ్ళ క్రితం పటిష్ఠమైన చర్యలు తీసుకుని ఉండకపోతే నేడు భారతదేశ ఉత్పాదన వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకోవడం సాధ్యపడేది కాదన్నారు. అప్పటి పరిస్థితుల గురించి వివరిస్తూ, ఆనాడు భారతదేశ రక్షణ రంగానికి  దిగుమతులే ప్రధానంగా ఉండేవనీ, ఇంత పెద్ద ఎత్తున తయారీ కేంద్రంగా దేశం అవతరించగలదని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరనీ అన్నారు. దేశానికి నూతన లక్ష్యాలను కల్పిస్తూ, కొత్త మార్గంలో ప్రవేశపెట్టామని ప్రధాన మంత్రి వెల్లడించారు.


సరైన ప్రణాళిక, భాగస్వామ్యాలతో అవకాశాలను సంపదగా మలుచుకోవడం సాధ్యమేనని దేశ రక్షణరంగ అభివృద్ధి రుజువు చేస్తోందన్నారు. గత దశాబ్దంలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల వల్ల రక్షణ రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యపడిందన్న శ్రీ మోదీ, “రక్షణ రంగ ఉత్పాదనలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాం, ప్రభుత్వరంగ యూనిట్లను బలోపేతం చేశాం, యుద్ధసామగ్రి తయారు కేంద్రాలని 7 పెద్ద కంపెనీలుగా పునర్వ్యవస్థీకరించి, డీఆర్డీఓ, హెచ్ఏఎల్ సంస్థలకు మరింత బలాన్ని అందించాం”, అని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో  డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఆ  రంగానికి నూతన జవజీవాలు కలిగాయన్నారు. ‘ఐ‌డెక్స్’ (ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్)  పథకాన్ని గురించి ప్రస్తావిస్తూ, గత 5-6 ఏళ్ళలో వెయ్యికి పైగా  రక్షణ రంగ అంకుర పరిశ్రమలకు  పథకం ఊతమిచ్చిందన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 30 శాతం మేర పెరిగాయనీ, సుమారు వంద దేశాలకు నేడు భారత్ రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయనీ చెప్పారు.

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యాన్ని ఇస్తామన్న మోదీ, ఎయిర్ బస్ -టాటా ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులు వేలాది మందికి ఉపాధిని కల్పించగలవన్నారు. నూతన ఫ్యాక్టరీకి అవసరమైన 18,000 విడిభాగాల ఉత్పత్తి దేశీయంగా జరిగే అవకాశం కలగడంతో, దేశ ఎంఎస్ఎంఈ రంగానికి (సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలు)  అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తాయని చెప్పారు. భారత్ ఇప్పటికే ప్రపంచ అగ్రగామి విమాన తయారీ కంపెనీలకు విడిభాగాలను అందించే పెద్ద పంపిణీదారుగా ఉందనీ, నూతన కేంద్రం కొత్త నైపుణ్యాలకూ, కొత్త పరిశ్రమలకూ ద్వారాలు తెలుస్తుందని చెప్పారు.

నేటి కార్యక్రమాన్ని కేవలం కొత్త విమాన తయారీ కేంద్ర ప్రారంభంగా మాత్రమే భావించడం లేదంటూ, గత దశాబ్ద కాలంలో భారత వైమానిక రంగంలో చోటుచేసుకున్న భారీ అభివృద్ధి, పెను మార్పులను ప్రస్తావించారు. దేశంలోని అనేక చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి తెచ్చామన్న ప్రధాని, దేశాన్ని విమాన తయారీలోనే కాక, మరమ్మత్తులు, నిర్వహణ సేవల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. ప్రస్తుత ప్రోత్సాహక వాతావరణం రానున్న రోజుల్లో మేకిన్ ఇండియా పౌర విమాన తయారీకి తోడ్పడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ విమానయాన సంస్థల నుంచీ 1200 విమానాలకు ఆర్డర్లు వచ్చాయని తెలిపిన శ్రీ మోదీ, అటు ప్రపంచ, ఇటు దేశ అవసరాలకు అనుగుణంగా పౌర విమానాల తయారీలో నూతన ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించగలదన్నారు.

ఎంఎస్ఎంఈలకు ఆలవాలమైన వడోదర నగరం, విమాన తయారీలో అగ్ర స్థాయికి చేరుకోవాలన్న దేశ ఆకాంక్షలకు మద్దతుగా నిలవగలదన్నారు. నగరంలోని ‘గతిశక్తి’ విశ్వవిద్యాలయం వివిధ రంగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే పనిలో ఉందన్నారు. ఫార్మా, ఇంజినీరింగ్, భారీ మిషన్లు, రసాయనాలూ, పెట్రో కెమికల్స్, విద్యుత్తు, ఇంధనం వంటి అనేక పెద్ద పరిశ్రమలకు వడోదర నగరం కేంద్రంగా ఉందనీ, కొత్తగా ప్రారంభించిన విమాన తయారీ కేంద్రం వల్ల, ఆ రంగానికి కూడా నగరం తలమానికంగా నిలువగలదన్నారు. ఆధునిక కాలానికి అవసరమైన నూతన విధానాలూ, నిర్ణయాలూ తీసుకుంటున్న గుజరాత్ ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు.  

భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ వంటి వడోదర నగరంలో స్పెయిన్ దేశ మిత్రులకు స్వాగతం పలికే అవకాశం కలగడం సంతోషాన్ని కలిగిస్తోందని, భారత్ – స్పెయిన్ దేశాల మధ్య గల సాంస్కృతిక అనుబంధం ఎంతో విలువైనదని శ్రీ మోదీ  చెప్పారు. స్పెయిన్ నుంచి వచ్చి గుజరాత్ లో నివాసమేర్పరుచుకున్న ఫాదర్ కార్లోస్ వాల్,  యాభై ఏళ్లపాటు భారత్ ను తన ఇల్లుగా చేసుకుని  తమ రాతలూ, సిద్ధాంతాలతో దేశ సంస్కృతిని సుసంపన్నం చేశారని అన్నారు. ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం తనకు దక్కిందన్న ప్రధాని, ఫాదర్ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందన్నారు.  

మన యోగాకు స్పెయిన్ దేశంలో పెద్ద ఎత్తున ఆదరణ ఉందనీ, స్పెయిన్ దేశ క్రీడ ఫుట్ బాల్ భారతీయులకు ఇష్టమైన ఆట అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నిన్నటి రోజున  రియల్ మాడ్రిడ్, బార్సిలోనా క్లబ్ ల మధ్య జరిగిన ఫుట్ బాల్ మాచ్ గురించి మాట్లాడుతూ, బార్సిలోనా విజయాన్ని భారతీయ అభిమానులు కూడా ఎంతో ఆస్వాదించారనీ, స్పెయిన్ అభిమానులకు ఎంత మాత్రం తగ్గని అభిమానాన్ని భారతీయ క్రీడాభిమాని కూడా చూపుతాడనీ అన్నారు.   భారత్ స్పెయిన్ మధ్యగల బహుముఖీన  భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, “ఆహారం, సినిమాలు, ఫుట్ బాల్ ఏదైనా కానివ్వండి, ఇరుదేశ ప్రజల మధ్య గల అనుబంధం దేశాల మధ్య బలమైన బంధంగా రూపుదిద్దుకుంటోంది”, అన్నారు. 2026వ సంవత్సరాన్ని సంస్కృతీ, పర్యాటకం, కృత్రిమ మేధ రంగాలపరంగా సంయుక్తంగా జరుపుకోవాలని భారత్-స్పెయిన్ లు నిర్ణయించుకోవడం పట్ల శ్రీ మోదీ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

పరస్పర సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు నేటి కార్యక్రమం నాందిగా నిలువగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు. భారత దేశ అభివృద్ధి కథలో భాగస్వాములు కావాలంటూ స్పెయిన్ పారిశ్రామిక వేత్తలకూ, సృజనకారులకూ మోదీ పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి  శ్రీ ఎస్ జయశంకర్ హాజరయ్యారు.

నేపథ్యం:

సీ-295 విమానాల ప్రాజెక్టులో భాగంగా 56 విమానాల కోసం భారత్ స్పెయిన్ దేశాల మధ్య ఒప్పందం కుదరగా, 16 విమానాలని ఎయిర్ బస్ నేరుగా మనకి అందిస్తోంది. మిగతా 40 విమానాలూ దేశంలో తయారవుతాయి, విమానాల తయారీ బాధ్యతను  టాటా అడ్వాన్స్డ్ సంస్థ దక్కించుకుంది. భారత సైన్యానికి చెందిన యుద్ధవిమానాల తయారీ తుది పనులను ( ఫైనల్ అసెంబ్లీ లైన్ –ఎఫ్ఏఎల్)  తొలిసారిగా ప్రైవేటు సంస్థ చేపట్టనుండటం విశేషం. విమాన భాగాల ఉత్పత్తి మొదలుకుని,  అమరిక, నాణ్యతా పరీక్షలూ, సరఫరా, సంపూర్ణ నిర్వహణ సహా,  విమాన తయారీ  మొత్తంలో సంస్థ భాగస్వామ్యం ఉంటుంది.

 

ఈ ప్రాజెక్టులో టాటా సంస్థతో పాటూ ప్రభుత్వరంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ పనులకు అక్టోబర్ 2022 లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

 

 

 

***

MJPS/SR/TS


(Release ID: 2068893) Visitor Counter : 66