ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)

Posted On: 22 OCT 2024 7:24PM by PIB Hyderabad

 

గౌరవనీయ,

 
మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.

 

గౌరవనీయ,


గడచిన మూడు నెలల్లో రష్యాలో నేను రెండోసారి పర్యటించడం మా మధ్య గల సన్నిహిత సమన్వయానికి, మంచి స్నేహానికి నిదర్శనం. జూలై నెలలో మాస్కోలో జరిగిన మా వార్షిక శిఖరాగ్ర సమావేశం ద్వారా ప్రతి రంగంలో మా పరస్పర సహకారం బలోపేతమైంది.


గౌరవనీయ,

గడచిన ఏడాది కాలంలో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన మీకు నా అభినందనలు. గత పదిహేనేళ్లలో, బ్రిక్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇందులో చేరాలని కోరుకుంటున్నాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


గౌరవనీయ,



రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించి నిరంతర సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, శాంతియుత మార్గాల ద్వారానే సమస్యల పరిష్కారాన్ని సాధించాలని మేం నమ్ముతున్నాం. శాంతి, సుస్థిరతలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు మేం పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మా ప్రయత్నాలన్నీ మానవత్వానికి ప్రాధాన్యమిస్తాయి. భవిష్యత్తులో కూడా సాధ్యమైన మేరకు అన్నివిధాలుగా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.


గౌరవనీయ,

ఈ విషయాలన్నింటిపై మన ఆలోచనలను పంచుకునేందుకు ఈరోజు మరో మంచి అవకాశం లభించింది. మరోసారి మీకు ధన్యవాదాలు.

 
గమనిక-  ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు సుమారు అనువాదం. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.

 

***




(Release ID: 2067220) Visitor Counter : 19