ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘కర్మయోగి శపథ్’-జాతీయ అభ్యాస వారాన్ని అక్టోబర్ 19న ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ప్రతి కర్మయోగి కనీసం నాలుగు గంటల అభ్యాస లక్ష్యాన్ని సాధించాలి

నిర్ణీత అంశాలపై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల వర్క్‌షాపులు, సెమినార్లు

Posted On: 18 OCT 2024 11:42AM by PIB Hyderabad

‘‘కర్మయోగి శపథ్’’ – జాతీయ అభ్యాస వారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (అక్టోబర్ 19) ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

కర్మయోగి కార్యక్రమం సెప్టెంబర్ 2020లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు గణనీయమైన పురోగతిని సాధించింది. భారతీయత నిండిన, అంతర్జాతీయ దృక్పథం కలిగిన, భవిష్యత్తు కోసం సిద్ధమైన ప్రభుత్వ ఉద్యోగులను ఇది తయారుచేస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యాలు మెరుగుపరుచుకొనేలా ప్రేరణ ఇచ్చే అతి పెద్ద కార్యక్రమమే ఈ జాతీయ అభ్యాస వారం(ఎన్ఎల్‌డబ్ల్యూ). ఈ కార్యక్రమం నిరంతర అభ్యాసం చేసేలా, సామర్థ్యాలను పెంపొందించుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది. ‘ఒకే ప్రభుత్వం’ అనే సందేశాన్ని, జాతీయ లక్ష్యాలను వారిలో నింపి నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని పెంపొందించడమే ఎన్‌ఎల్‌డబ్ల్యూ లక్ష్యం.

వ్యక్తులు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు వివిధ పద్ధతుల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఎన్ఎల్‌డబ్ల్యూ కల్పిస్తుంది. ఈ వారం రోజుల వ్యవధిలో ప్రతి కర్మయోగి కనీసం నాలుగు గంటల అభ్యాస లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. దీనిలో పాల్గొనేవారు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఐజీవోటీ, వెబినార్ (పబ్లిక్ లెక్చర్లు, పాలసీ మాస్టర్ క్లాసులు)లో పాల్గొనడం ద్వారా సాధించవచ్చు. ఈ వారంలో ప్రముఖ వక్తలు తాము ప్రావీణ్యం సాధించిన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు. ప్రభావవంతమైన పద్ధతిలో పౌరకేంద్రక సేవలను అందించేందుకు సహకరిస్తారు. అలాగే మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు, సంస్థలు నిర్దేశిత అంశాలపై సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహిస్తాయి.


(Release ID: 2066023) Visitor Counter : 103