సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లైట్స్, కెమెరా, అవార్డులు!


రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 70 వ ‘జాతీయ చలనచిత్ర పురస్కారాల’ ప్రదానం

భారతీయ చలనచిత్ర రంగంలో జీవనకాల సాఫల్యానికి గాను ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారా’న్ని అందుకొన్న శ్రీ మిథున్ చక్రవర్తి


సమాజంలో మార్పును తీసుకు రావడానికి అత్యంత శక్తిమంతమైన మాధ్యమంగా చలనచిత్రాలు, సామాజిక ప్రసార మాధ్యమాలు ఉంటున్నాయి: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

దేశంలో మొట్టమొదటి ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ని ముంబయిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

మూడు కీలక అంశాలు ప్రాతిపదికగా తీసుకొని, చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి పరచనున్న ప్రభుత్వం; ఆ మూడు అంశాలు ప్రతిభావంతుల గ్రూప్ ను తయారు చేయడం, కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం, చలనచిత్రాల రూపకల్పన సంబంధిత ప్రక్రియను సరళీకరించడం : మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్

Posted On: 08 OCT 2024 9:27PM by PIB Hyderabad

‘‘మీరు నిద్రపోతూ ఉన్నా సరే, మీరు కనే కలలను ఎన్నటికీ నిద్రపుచ్చకండి.’’  చలనచిత్రరంగ ప్రముఖుడు, అంతా ఆప్యాయంగా ‘మిథున్ దా’ అని పిలుచుకొనే శ్రీ మిథున్ చక్రవర్తి దేశ రాజధాని నగరంలో వివిధ కేటగిరీలకు చెందిన 70 వ  ‘జాతీయ చలనచిత్ర పురస్కారాల’ను స్వీకరించిన యువ పురస్కార గ్రహీతలకు చెప్పిన పసిడి పలుకులు ఇవి.

భారతీయ చలనచిత్ర రంగానికి శ్రీ మిథున్ చక్రవర్తి అందించిన ముఖ్య సేవలకుగాను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయనను ‘దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం’తో సత్కరించిన వేళలో విజ్ఞాన్ భవన్ సభాభవనంలోని వారందరు లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ వారి ఆదరాభిమానాలను వ్యక్తం చేశారు.  సభికులను ఉద్దేశించి శ్రీ మిథున్ చక్రవర్తి ప్రసంగిస్తూ, చలనచిత్ర పరిశ్రమలో తాను పడ్డ అవస్థలను గురించి వివరించారు.  తాను నల్లని మేని చాయ కలిగిన వాడు కావడం వల్ల అనేక విధాలైన వివక్షను ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తుకు తీసుకు వచ్చారు.  నృత్యం చేయడంలో తాను పాటించిన కొన్ని చిట్కాలు తనకు సాఫల్యాన్ని తెచ్చిపెట్టాయని సభాభవనంలో ఉన్న పురస్కార విజేతలకు, శ్రోతలకు ఆయన తెలియజేశారు.  చలనచిత్ర రంగంలో పేరు సంపాదించుకోవాలనుకొనే యువ ప్రతిభాన్విత కళాకారులు వారి కలలను పండించుకొనే క్రమంలో వారి లోని ప్రతిభ ఏమిటన్నది గుర్తించుకోవాలన్న సందేశాన్ని ఆయన వారికి అందించారు.

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 70 వ  జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ప్రసంగిస్తూ, చలనచిత్రాలు, సామాజిక ప్రసార మాధ్యమాలు సంఘంలో మార్పును తీసుకు రాగలిగిన అత్యంత శక్తిమంతమైన మాధ్యమం అన్నారు. వర్ధమాన ప్రతిభావంతులకు పురస్కారాలను ఇచ్చి, వారికి దేశంలోని ప్రముఖ కళాకారులతో, చిత్ర నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు వేదిక మీదకు వచ్చేందుకు సమానావకాశాన్ని కల్పించినందుకు సమాచార - ప్రసార శాఖను కూడా రాష్ట్రపతి ప్రశంసించారు.

పురస్కార విజేతలు శ్రీ మనోజ్ వాజ్‌పేయీ, శ్రీ విశాల్ భరద్వాజ్, శ్రీ కరణ్ జోహార్, శ్రీ రుషభ్ శెట్టి లతో పాటు నీనా గుప్తా తదితరులు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.  షర్మిలా టాగోర్, ప్రసూన్ జోషీ వంటి  చలనచిత్ర రంగ ప్రముఖులు మరికొందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని ఏడో సారి అందుకొన్న వారిలో శ్రీ ఏ.ఆర్. రహమాన్ తో పాటు శ్రీ మణి రత్నం వంటి ప్రసిద్ధ వ్యక్తులు పురస్కార విజేతలలో ఉండడం పరిశ్రమలో చాలా కాలంగా  వారు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలకు, పరిశ్రమ పై వారు వేస్తూ వస్తున్న ముద్ర కు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి.  ఎప్పటికప్పుడు సరికొత్తదనాన్ని సంతరించుకొంటూ వస్తున్న భారతీయ చలనచిత్ర రంగంలో వీరి కార్యసాధనలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న కళాకారులనే కాక వృద్ధి లోకి రావాలని బలంగా కోరుకొంటున్న కళాకారులకు కూడా ప్రేరణను అందిస్తూనే ఉంటాయని చెప్పాలి.

కేంద్ర సమాచార - ప్రసార శాఖ (ఐ&బి), రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, కేంద్ర సమాచార - ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార - ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు లతో పాటు న్యాయ నిర్ణేతల బృందం సభ్యులుగా శ్రీ రాహుల్ రవైల్,  నీల మాధబ్ పాండా, శ్రీ గంగాధర్ ముదలియార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
కార్యక్రమానికి హాజరైన వారందరికీ శ్రీ అశ్వనీ వైష్ణవ్ స్నేహపూర్వక స్వాగత వచనాలను పలికారు.   చలనచిత్ర కళారంగంలో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సంబంధిత వర్గాల వారి ప్రతిభకు పట్టం కట్టే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగం పంచుకోవడం తనకు దక్కిన గౌరవమని శ్రీ అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.  ప్రముఖ నటుడు శ్రీ మిథున్ చక్రవర్తి మన దేశ చలనచిత్ర రంగానికి, మన సమాజానికి అందించిన శ్రేష్ఠ సేవలకు గాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో ఆయనను గౌరవించుకొంటున్నాం అంటూ శ్రీ మిథున్ చక్రవర్తి పై మంత్రి ప్రశంసలను కురిపించారు.  సీనియర్ నటుడు శ్రీ మిథున్ చక్రవర్తి ఆదర్శప్రాయ వృత్తి జీవనాన్ని, ప్రజా సేవను మంత్రి అభినందిస్తూ, ‘‘మిథున్ దా, మీ జీవనమే మీరు అందించే సందేశంగా ఉన్నది.  మీరు వెండి తెర మీదనే కాకుండా, వెండి తెర బయట కూడా మన సమాజానికి ఒక ఆదర్శంగా  నిలుస్తున్నారు’’ అని మంత్రి అన్నారు.

మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన తొమ్మిది మంది సాధించిన విశేష విజయాలను శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. వారు కథను చెప్పిన తీరు గొప్ప ధైర్యంతో, సాహసంతో నిండి ఉందని ఆయన అభినందనలను తెలియజేశారు.  చలనచిత్ర పరిశ్రమలో గాని, లేదా అంకుర సంస్థలలో గాని యువ నూతన ఆవిష్కర్తలు పోషించిన పాత్ర సృజనశీల ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు నడిపిస్తోందని మంత్రి అన్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ)

 

సృజనాత్మక పరిశ్రమల వృద్ధిని మరింత ప్రోత్సహించడానికి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకొంటున్నట్లు శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ)  ల శ్రేణిలో మొదటి సంస్థను ముంబయి లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.  ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక, నిర్వహణ రంగ సంబంధిత ప్రతిభావంతులను (వారిలో కొందరు గూగల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు సారథులుగా ఉంటున్నారు)  తయారు చేసిన ఐఐటీలు, ఐఐఎమ్ ల  కోవ లోనే ఈ ఐఐసీటీ ని తీర్చిదిద్దుతారు.  సృజనశీల నైపుణ్యాలకు, జ్ఞానానికి సాన పట్టడంపైన ప్రత్యేకంగా దృష్టిని సారిస్తుందన్నారు.  ఈ కొత్త సంస్థ నూతన ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు, ప్రతిభావంతులను తీర్చిదిద్దడానికి ఒక కేంద్రంగా ఉంటూ, ప్రపంచంలో సృజన ప్రదాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని ముందువరుసలో నిలచేలా పాటుపడుతుందని ఆయన అన్నారు.

 
మూడు కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని చలన చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకుపోవాలన్న ప్రభుత్వం దార్శనికతను కూడా మంత్రి వివరించారు:

1. ప్రతిభావంతుల గ్రూప్ ను  తయారు చేయడం:  చలనచిత్రాల నిర్మాణంలో సాంకేతిక విజ్ఞానం పాత్ర అంతకంతకూ పెరిగిపోతున్నందువల్ల మెరికల్లాంటి ప్రతిభావంతులు మనకు కావాలి అని మంత్రి అన్నారు.  సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐటీ) రంగంలో, సెమి కండక్టర్ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను మంత్రి ప్రస్తావిస్తూ, సృజనాత్మక సాంకేతికత లలో ప్రతిభను పెంచి పోషించాలని, ఈ పనిలో ఐఐసీటీలది కీలక పాత్ర అన్నారు.

2. మౌలిక సదుపాయాలను పెంచడం:  చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తున్న అవసరాలను అంతే వేగంగా తీర్చ గలిగే ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పించవలసిన అవసరం ఉందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు.  భారతదేశ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ ప్రమాణాలు కలిగి ఉండేదిగా అభివృద్ధి చేసేందుకు ఒక పునాదిని నిర్మించడానికి తగిన ఆలోచనలను తెలియజేయండంటూ పరిశ్రమ ప్రముఖులను మంత్రి కోరారు.



3. ప్రక్రియలను సులభతరంగా మార్చడం:  చలనచిత్రాలను రూపొందించే వారికి కావలసిన అనుమతులను సులభంగా దొరికేటట్లు చూడడాన్ని గురించి మంత్రి ప్రస్తావించారు. అదే జరిగితే వారు వివిధ ప్రదేశాలను, ఉదాహరణకు రైల్వేలను, అడవులను, పురావస్తు ప్రాధాన్యం కలిగిన స్థలాలను ఇట్టే ఉపయోగించుకో గలుగుతారు.  ఈ ప్రక్రియలను సరళతరం చేసినప్పుడు సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది; అధికారి గణం ఇబ్బందుల పాల్జేయడం తగ్గుతుంది అని మంత్రి అన్నారు.

భారతదేశానికి ఉన్న ఘనమైన చలనచిత్ర సంబంధిత వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని కూడా శ్రీ అశ్వనీ వైష్ణవ్ స్పష్టంచేశారు.  కళాఖండాలు అనదగిన చిత్రాల మొదలుకొని పోస్టర్ లు, వార్తా పత్రికలలో ప్రకటనలు వంటి వాటిని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.  భావి తరాల వారి కోసం ఈ అమూల్య సంపదను  సంరక్షించే దిశ లో నిర్ణయాలను తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదే కార్యక్రమంలో, సమాచార - ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ప్రసంగిస్తూ డెబ్భయ్యో జాతీయ చలనచిత్ర పురస్కారాలకు కథ ప్రధాన చిత్రాల కేటగిరీలో 32 భాషలకు చెందిన 309 చలనచిత్రాలు, కథేతర చిత్రాల కేటగిరీలో 17 భాషలకు చెందిన 128 చలనచిత్రాలు పరిశీలనకు వచ్చాయన్నారు.   ఈ  అంశాన్ని బట్టి చూస్తే, మన దేశంలో సాంస్కృతిక రంగం ఎంత సమృద్ధంగా ఉన్నదీ, మరి మన కథ చెప్పే ప్రక్రియలో ఎన్ని వర్గాలు పాలుపంచుకొంటున్నదీ ఇట్టే అర్థం అవుతుందన్నారు. ప్రపంచాన్ని మహమ్మారి చుట్టుముట్టిన కాలంలో చలన చిత్ర పరిశ్రమ ఏటికి ఎదురీదిందని ఆయన చెబుతూ, చలన చిత్రాల రూపకర్తలు వారి కథలను చెప్పే వారి విశిష్ట ప్రజ్ఞతో ప్రేక్షక లోకాన్ని రంజింప చేశారని శ్రీ సంజయ్ జాజూ ప్రశంసించారు.

డెబ్భయ్యో ‘జాతీయ చలనచిత్ర పురస్కారాలు’, కొన్ని ముఖ్యాంశాలు:

 

వివిధ భాషలకు చెందిన చలన చిత్రాలలో ఉత్తమత్వాన్ని గుర్తించే సంప్రదాయాన్ని ఈ సంవత్సరం ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాలు కొనసాగించాయి.  2022 కు గాను ప్రకటించిన పురస్కారాలలో చాలా మంది వారివైన ప్రత్యేక శైలులలో ప్రతిభను కనబరచి, విజేతలుగా నిలిచారు:

 ఉత్తమ కథాచిత్రం: ‘‘ఆట్టమ్ (నాటకం)’’, శ్రీ ఆనంద్ ఏకరుషి దర్శకత్వం వహించిన ఈ మలయాళ చలనచిత్రం తన కళాత్మక ప్రజ్ఞకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకొంది.

ఉత్తమ కథేతర చిత్రం: ‘‘ఆయీనా (అద్దం)’’, ఈ పురస్కారాన్ని , ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ సిద్ధాంత్ సరీన్ చేజిక్కించుకున్నారు.
 

 ప్రధాన పాత్రధారణ కేటగిరీలో ఉత్తమ నటుడు: కన్నడ భాషా చలనచిత్రం ‘‘కాంతారా’’ లో చూపరుల హృదయాలను చూరగొన్న నటనకు గాను శ్రీ రుషభ్ శెట్టి ఈ పురస్కారాన్ని గెలుచుకొన్నారు.

 ఒక ప్రధాన పాత్ర ను పోషించడంలో ఉత్తమ నటనను కనబరచిన నటి:   ఉత్తమ నటి పురస్కారాన్ని నిత్యా మేనన్, మానసి పారేఖ్ లు సంయుక్తంగా గెలుచుకొన్నారు.  తమిళ చలనచిత్రం ‘‘తిరుచిత్రాంబళమ్’’ లో అభినయానికి గాను నిత్యా మేనన్, గుజరాతీ చలనచిత్రం ‘‘కచ్ఛ్ ఎక్స్‌ ప్రెస్’’ లో నటనకు గాను మానసి పారేఖ్ లు అవార్డును గెలుచుకొన్నారు.

 ఉత్తమ దర్శకత్వం: శ్రీ సూరజ్ ఆర్. బర్జాత్యా తాను దర్శకత్వం వహించిన హిందీ చలనచిత్రం ‘‘ఊంఛాయీ’’ కి ఈ పురస్కారాన్ని గెలుచుకొన్నారు.

ఇతర పురస్కారాలను గెలుచుకొన్న వారిలో ఏనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఇంకా కామిక్ (ఏవీజీసీ) కేటగిరీలో ఉత్తమ చిత్రం ‘‘బ్రహ్మాస్త్ర ఒకటో భాగం: శివ’’ కు లభించింది, సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ప్రజాదరణ పాత్రమైన చలనచిత్రం కేటగిరీలో ఇచ్చే పురస్కారాన్ని ‘‘కాంతారా’’ గెలుచుకొంది.  సినిమా రంగంపై వెలువడిన అత్యుత్తమ పుస్తకం కేటగిరీ లో ఇచ్చే పురస్కారాన్ని ‘‘కిషోర్ కుమార్: ది అల్టిమేట్ బయోగ్రఫీ’’ గ్రంథానికి ప్రకటించారు.

పురస్కారాల తాలూకు పూర్తి జాబితాను ఈ కింది ఇచ్చిన లింక్ లో చూడవచ్చు:

 

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2045960

 

 

***



(Release ID: 2065369) Visitor Counter : 5