ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 15న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ద్వారా

ఐటీయూ ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ప్రామాణీకరణ సభ’ ప్రారంభం

‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024’ 8వ సంచికను కూడా ప్రారంభించనున్న ప్రధానమంత్రి


తొలిసారిగా భారత్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘ఐటీయూ-డబ్ల్యూటీఎస్ఏ’ సమావేశాలు
190 దేశాల నుంచి రానున్న 3000 పరిశ్రమల ప్రముఖులు సహా విధానకర్తలు, సాంకేతిక నిపుణులు

“భవిష్యత్తు నేడే” - 8వ భారత మొబైల్ కాంగ్రెస్ ఇతివృత్తం

ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 120 దేశాల ప్రతినిధులు, 400 మంది ప్రదర్శనకారులు, 900 అంకుర పరిశ్రమలు

Posted On: 14 OCT 2024 5:31PM by PIB Hyderabad

న్యూఢిల్లీ భారత మండపంలో అక్టోబర్ 15, ఉదయం 10 గంటలకు ‘అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) - ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ప్రామాణీకరణ సభ (డబ్ల్యూటీఎస్ఏ)’ సమావేశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024’ 8వ సంచికను సైతం ప్రధాని ప్రారంభిస్తారు.

ఐక్యరాజ్య సమితి డిజిటల్ సాంకేతికతల సంస్థ అయిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ చేపట్టే ప్రామాణీకరణ పనులను నాలుగేళ్ళకు ఒకసారి జరిగే డబ్ల్యూటీఎస్ఏ సమావేశాలు పర్యవేక్షిస్తాయి. ‘ఐటీయూ-డబ్ల్యూటీఎస్ఏ’ సమావేశాలకు- ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తొలిసారిగా భారత్ ఈ సమావేశాలకు ఆతిధ్యం ఇస్తోంది.  

 

190 దేశాల నుంచి, టెలికాం, డిజిటల్, ఐసీటీ రంగాలకు ప్రాతినిధ్యం వహించే 3000 మంది పరిశ్రమ ప్రముఖులు సహా విధానకర్తలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యే ఉన్నతస్థాయి సమావేశాలివి.

బిగ్ డేటా, 6జి, ఏఐ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక కీలక సాంకేతికతలకు సంబంధించిన అంశాలను వివిధ దేశాలు చర్చించే వేదికగా, భవిష్యత్తులో ఆయా సాంకేతికతల ప్రమాణాలను నిర్ధారించే వేదికగా డబ్ల్యూటీఎస్ఏ-2024 నిలుస్తుంది. ఎంతో ప్రాధాన్యం కలిగిన ఇటువంటి సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల, ప్రపంచ టెలికాం రంగాన్ని మలిచే, భవిష్య సాంకేతికలను నిర్దేశించే అవకాశం భారత్ కు లభిస్తుంది. మేధోసంపత్తి హక్కులు, ప్రామాణిక కీలక పేటెంట్లను పొందడంలో మెళకువలను మన దేశ అంకుర పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు గ్రహించగలుగుతాయి.

 

ఇక ప్రముఖ టెలికాం కంపెనీలు, సృజనకారులు పాల్గొనే ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’, దేశ సృజనాత్మక వాతావరణాన్ని సమర్ధంగా ప్రదర్శిస్తుంది. క్వాంటం టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ (పునర్వినియోగ ఆర్ధిక వ్యవస్థ), 6జి, 5జి సాంకేతికత వినియోగ సందర్భాల ప్రదర్శన, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఓటీ, సెమీకండక్టర్లు, సైబర్ భద్రత, హరిత సాంకేతికత, శాట్ కాం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగాల్లో తాజా ప్రగతిని ప్రదర్శిస్తాయి.

 

ఆసియాలోనే అతి పెద్ద డిజిటల్ సాంకేతిక వేదిక అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్, పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా సంస్థలు, అంకుర పరిశ్రమలు, ఇతర కీలక భాగస్వాముల కోసం సృజనాత్మక పరిష్కారాలు, సేవలు, అత్యాధునిక సాంకేతికత టెలికాం వాతావరణ సందర్భాలను ప్రదర్శించే వేదికగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది.

 

ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 900 అంకుర పరిశ్రమలు సహా, 120 దేశాల ప్రతినిధులు, 400 మంది ప్రదర్శనకారులు పాల్గొంటారు. 900 కి పైగా సాంకేతికతల వినియోగ సందర్భాల ప్రదర్శన సహా 600 భారతీయ, విదేశీ ప్రతినిధులు ప్రసంగించే 100 సదస్సులకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదిక కానుంది.

 

***


(Release ID: 2064857) Visitor Counter : 69